పురాణ కథలు -1 - అచ్చంగా తెలుగు

 పురాణ కధలు -1 

 పి.యస్.యమ్. లక్ష్మిబసవ పురాణం

మా నాన్నగారు కీ.శే శ్రీ పులిగడ్డ జనార్దనరావుగారికి ఆధ్యాత్మిక పుస్తకాలు కొని చదివే అభిరుచి వుండేది.  ఆయన దాదావు నలభై సంవత్సరాల క్రితమే కొన్ని వేల రూపాయల పుస్తకాలు కొని స్వంత గ్రంధాలయం ఏర్పాటు చేసుకున్నారు.  పుస్తకాలని ప్రాణంగా చూసుకున్నారు.  ఆయన మాకొదిలిపోయిన ఈ ఖజానా మేమెవ్వరం సరిగా ఉపయోగించుకోలేక పోయాము.

ఈ కరోనా సమయంలో నా దగ్గర వున్న నాన్న పుస్తకాలలోంచి కొన్ని పుస్తకాలు చదువుదామని తీశాను.  చిన్న చిన్న కధలతో తేలిగ్గా చదవగలననిపించిన, ఆంధ్రులకి అంతగా పరిచయంలేని బసవ పురాణం నన్నాకర్షించింది.  యాత్రా దీపికల మూలంగా, చూసిన ప్రతి ఒక్కటీ అందరితో పంచుకోవటం అలవాటయి, ఈ పురాణాల్లో కధలు కూడా మీతో పంచుకోవాలనిపించింది.  దానికి సోదరి శ్రీమతి భావరాజు పద్మినీ ప్రియదర్శనిగారి సహకారం తోడయింది.  మరి మీరు కూడా చదివి మీ అభిప్రాయం చెబుతారుకదూ.

ప్రస్తుతం నేను చెబుతున్న కధలు బసవ పురాణంలోనివి.  బసవేశ్వరుణ్ణి కన్నడ దేశంలో వారు ఎక్కువగా పూజిస్తారు.  మహా శివుడు  భూలోకంలో అంతరించిపోతున్న ధార్మికతను పునరుధ్ధరించటానికి తన వాహనమైన నందిని తన అంశతో భూలోకంలో అవతరించమని చెబుతాడు.  ఆయనకీ తనకీ భేదం లేదని పార్వతీ దేవితో చెబుతాడు.  

నందీశ్వరుడు శివుని ఆజ్ఞ ప్రకారం కర్ణాటక రాష్ట్రంలోని హింగుళేశ్వరం అనే పట్టణంలో  మండంగి మాదిరాజు, మాదమాంబ అనే బ్రాహ్మణ దంపతులకు పుత్రుడుగా జన్మిస్తాడు.  ఆ బాలుడు జన్మించినప్పుడు శివుడు ముని వేషంలో వచ్చి అతనికి లింగధారణ చేస్తాడు.  బిడ్డ వలన తల్లి దండ్రులు చరితార్ధులవుతారని ఆశీర్వదిస్తాడు.  తల్లిదండ్రులు అతనికి బసవన్న అని పేరు పెడతారు.  బసవన్న చిన్నప్పటినుంచి శివ భక్తుడు.  శివ పూజలు చెయ్యటం, శివ భక్తులను ఆదరించటం అతని నిత్యకృత్యాలు. 

తర్వాత ఈయనకి బిజ్జల దేశపు రాజు దగ్గర మంత్రి, ఈయన మేనమామ అయిన బలదేవుని కుమార్తె గంగమాంబికను ఇచ్చి వివాహం చేస్తారు.  వివాహమైన తర్వాత ఆయన భార్యను, సోదరిని, ఇతర బంధువులను వెంటబెట్టుకుని కప్పడి సంగమేశ్వరాలయానికి వెళ్ళగా అందరూ చూస్తూ వుండగా సంగమేశ్వరుడు ముని ఆకారంతో గుడినుంచి బయటకు వచ్చి, బసవన్నని ఆదరించి, అనేక హితోక్తులు చెప్పి మళ్ళీ అందరూ చూస్తుండగా ఆలయమలోనికి వెళ్ళి అంతర్ధానమయ్యాడు.  (మేము తెలంగాణా రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో వున్న   కొలనుపాక లో సోమేశ్వరాలయానికి  వెళ్ళినప్పుడు అక్కడ విన్నాను బసవేశ్వరుని గురించి.  అక్కడికి మనవారితోబాటు కన్నడిగులుకూడా ఎక్కువగా వస్తారుట.  వారన్నారు ఇక్కడ శివుడు లింగంలోంచే వచ్చి మళ్ళీ లింగంలోనే అంతర్ధానమయ్యాడు అని.  ఎవరూ వివరంగా చెప్పలేక పోయారుగానీ ఇది చదివినప్పుడు ఆ ఆలయం గుర్తొచ్చింది.) 

బసవన్న వివాహమైన కొద్ది రోజులకు మామగారు చనిపోవటంతో బిజ్జలరాజు ఇతర మంత్రుల సలహాతో బసవన్నని పిలిపించి అతని మామగారైన బలదేవుని స్ధానంలో ప్రధాన మంత్రిగా నియమిస్తాడు.  మంత్రులు బసవన్నని పిలుచుకు వచ్చే సమయంలోనే ఆయన మహిమలు తెలిసినవారుగనుక ఆయనని బసవేశ్వరా అని సంబోధిస్తారు.  బిజ్జల రాజు దగ్గర ప్రధాన మంత్రి అయినా బసవన్న తన పూజలు, శివ భక్తులనాదరించటం, దాన ధర్మాలు ఏమీ మానలేదు.  వాటిని నిర్వహిస్తూనే రాచ కార్యాలు కూడా చక్కగా నెరవేర్చేవాడు.

బసవేశ్వరుని అక్కగారైన నాగమాంబ తమ్ముడి మీద ప్రేమ చేత ఎప్పుడూ అతనిని విడువక కనిపెట్టుకుని వుండేది.  బసవేశ్వరుని వివాహ సమయంలోనే వారి మేనమామయే మంచి వరుని చూసి ఆమెకూ వివాహం చేశాడు. వారూ బసవేశ్వరుని దగ్గరే వుండేవారు. వారికి ఒక మగ బిడ్డ కలిగాడు.  అతను అన్ని విషయాలలో మేమమామనే పోలి వున్నాడు.  ఆ పిల్లాడు సకల సద్గుణ సమేతుడై భక్తి, వైరాగ్యములలో మేనమామకే మాత్రం తీసిపోలేదు.  అందుకే తల్లిదండ్రులు లోకాభిప్రాయం ప్రకారం అతనికి చెన్న బసవేశ్వరుడు అని పేరు పెట్టారు.  ఇతను బసవేశ్వరునికి ముఖ్య శిష్యుడై ఆయన దగ్గరకొచ్చే భక్తులకు తగిన సదుపాయాలు సమకూర్చేవాడు.                                                                                                    బసవన్న శివుని అంశతో జన్మించినవాడు, ఆయనచేత అనేక వరములు పొందిన వాడు,  కారణ జన్ముడు గనుక అనేక మహిమలు చూపించి శైవ మతాన్ని పునరుధ్ధరించాడు.  అదే బసవ పురాణం.  మరి కధలు చెప్పుకుందామా?

 శివ సాక్షాత్కారం

ఒకసారి బసవేశ్వరుని చూడాలని సంగమేశ్వరస్వామి స్వయంగా కప్పడి సంగమేశ్వర పురాధిపతియగు నల్లమప్రభు రూపంలో జంగమ అంటే శివ భక్తుని వేషధారణలో వచ్చాడు.  బసవేశ్వరుడు ఆయనకి ఆతిధ్యమిచ్చి భోజనం పెడతాడు.  ఆయన మంత్రి, శివ భక్తాగ్రేసరుడు కావటంతో  రోజూ అనేకమంది శివ భక్తులు వారి ఇంట్లో ఆతిధ్యం పొందేవారు.  అందుకని వంట ప్రయత్నాలు భారీగానే వుండేవి.  ఆ రోజూ అలాగే వున్నాయి.  బసవేశ్వరుడు నల్లమ ప్రభు రూపంలో వచ్చిన ఆ అతిధిని సాక్షాత్తూ  సంగమేశ్వరస్వామిగా భావించి, అతిధి పూజ చేసి, భోజనం పెట్టి, తానే కలపి ముద్దలు అందించసాగాడు.  సంతోషంగా తింటున్న జంగమయ్యని చూసి ఇంకా సంతోష పరవశుడవుతున్న బసవేశ్వరుడు ఆయన తినటంతో వండిన పదార్ధాలన్నీ నిండుకున్నాయని గ్రహించి, వచ్చినది నిజంగా శివయ్యేనని సంతోషంతో ఆయన ఆకలి తీర్చటానికి తానే ఆహార పదార్ధముగా స్వామి పళ్ళెంలో సమర్పించుకుని స్వామి నోటికెగరాలని ప్రయత్నించగా స్వామి అది చూసి, అతని భక్తికి పరవశుడై అతని ఇల్లు ఎప్పుడూ సకల సంభారాలతో నిండి వుంటుంది అని ఇంకా అనేక వరాలిచ్చాడు.  ఎప్పుడూ శివయ్య కనుసన్నలలో వుండే నందీశ్వరుడికి అదే బసవేశ్వరుడికి శివయ్య ప్రత్యేకించి వరాలివ్వాలా!!?

 *** 

No comments:

Post a Comment

Pages