లక్ష్మీకళ - అచ్చంగా తెలుగు
 లక్ష్మీకళ
శ్రీ శేష కళ్యాణి గుండమరాజు


ఆ ఏడు, మండుటెండలతో చికాకు తెప్పించింది వేసవికాలం. శ్రావణమాసం ప్రారంభమై కొద్దిరోజులు గడిచినా, ఇంకా వర్షపు సూచనలు లేకపోయేసరికి తొలకరి జల్లుల కోసం రైతులతోపాటూ సాధారణ జనమంతా కూడా ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తూ ఉన్నారు. 
హోమ్ బెల్ మోగడంతో తన పుస్తకాల సంచి తీసుకుని, తన ప్రాణస్నేహితుడు రఘుతో కలిసి బడినుండి బయటికొచ్చాడు పదకొండేళ్ల అనంత.  వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉంది.
‘ఇవాళైనా వర్షం పడుతుందా?’, అని అనుకుంటూ ఆకాశం వైపు చూసిన అనంతకి ఆకాశమంతా నల్లటి మేఘాలతో కనిపించింది. 
"ఇక ఉంటాన్రా అనంత! రేపు ఆదివారం కదా! బడి లేదు కాబట్టి ఆడుకోవడానికి మా ఇంటికొచ్చెయ్!", అని అనంతతో అన్నాడు రఘు. 
"లేదురా! రేపు మేము మా మేనమామ ఇంటికి వెడుతున్నాము. సోమవారం కలుద్దాం!", అని అన్నాడు అనంత.
సరేనని వెళ్ళిపోయాడు రఘు.  అనంత కూడా చకచకా ఇంటి వైపు నడిచాడు. దారిలోనే సన్నటి చినుకులు పడటం మొదలవ్వడంతో త్వరగా ఇల్లు చేరుకునేందుకు వేగం పెంచి పరుగులాంటి నడకతో తమ ఇంటి ఆవరణలోకి అడుగు పెట్టాడు అనంత. ఎన్నో నెలల తరువాత ఆ వర్షాకాలపు మొదటి జల్లు సన్నగా పడుతూ ఉంటే, వేసవి ఎండలకు తేమను కోల్పోయిన భూమి, పైపైన తడిసి సుగంధపరిమళం వెదజల్లుతూ ఉంది. ఆ పరిమళమంటే అనంతకు ఎంతో ఇష్టం. చల్లటిగాలి తనకు తగలగానే ఇంటి గుమ్మం దగ్గర ఆగి వెనక్కు తిరిగి చూశాడు అనంత.  తమ  ఇంటి ఆవరణలో తీరుగా పెంచిన రకరకాల పచ్చటి మొక్కల ఆకులు చినుకులు పడటంవల్ల తడిసి మరింత పచ్చగా కనబడుతున్నాయి. ఆగి ఆగి వీస్తున్న చిరుగాలికి ఆ ఆకులు అటూ ఇటూ కదులుతూ, వర్షాకాలం మొదలయ్యిందన్న ఆనందంతో అవి నృత్యం చేస్తున్నాయా అన్నట్లు ఉన్నాయి.
అది చూసిన అనంత, ‘అరె! వాతావరణం చల్లగా మారేసరికి నాలాగే ఈ ప్రకృతికి కూడా సంతోషంగా ఉన్నట్లుంది!',  అనుకున్నాడు.
చూస్తూండగానే సన్నటి చినుకు భారీ వర్షంగా మారింది. అంతలో ఇంట్లోంచి పకోడీ ఘుమఘుమలు రావడంతో, 'అబ్బ!వర్షం పడుతూ ఉంటే వేడి వేడి పకోడీలు ఎంత రుచిగా ఉంటాయో!', అని వంటింట్లోకి పరిగెత్తాడు అనంత. 
"వచ్చావా అనంతా? నీకిష్టమని పకోడీ వేస్తున్నా! మొహం,కాళ్లు, చేతులు కడుక్కుని రా! తిందువుగాని! ", అంది అనంత తల్లి శాంతమ్మ. 
చిటికెలో తయారయ్యి వచ్చి పకోడీ తిని తన గదిలోని మంచం పైన పడుకుని, ఆ మంచానికి పక్కనే ఉన్న కిటికీలోంచి బయట పడుతున్న వర్షాన్ని చూస్తూ ఏదో తెలియని ఆనందంలో కొద్దీసేపు హాయిగా గడిపాడు అనంత.
***
శాంతమ్మ, చలం దంపతులకు అనంత ఒక్కడే సంతానం. ఊరి పొలిమేరల్లో, పెద్దగా అభివృద్ధి లేని ప్రాంతంలో, చవకగా స్థలం దొరకడంతో దాన్ని కొని తన స్థోమత కొద్దీ పెంకుటిల్లు నిర్మించుకున్నాడు చలం. అవ్వడానికి పెంకుటిల్లే అయినప్పటికీ ఎంతో మురిపెంగా దగ్గరుండి దాన్ని కట్టించి ఆ ఇంటి చుట్టూ రకరకాల మొక్కలు పెంచి ఆ మొక్కలను ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు చలం, శాంతమ్మలు. కానీ ఇల్లు కట్టిన అయిదేళ్లలోపే అనారోగ్యం కారణంగా చలం కన్నుమూయడంతో శాంతమ్మ తన కొడుకు అనంతను కంటికిరెప్పలా చూసుకుంటూ, చలం పేరుతో వచ్చే కొద్దిపాటి డబ్బుతో రోజులు గడుపుతూ, ఉన్నదాంట్లోనే తృప్తిగా బతుకుతూ ఉండేది. అనంతకు కూడా తన తల్లి అంటే ఎంతో ఇష్టం. తనకు చేతనైనంతలో ఆమెను సంతోషపెట్టాలని అనుకునేవాడు అనంత. రఘు తప్ప పెద్దగా స్నేహితులెవరూలేని అనంత తల్లితోనే ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడేవాడు. 
తల్లిదండ్రుల ప్రభావంవల్ల అనంతకు కూడా ప్రకృతి అంటే అమితమైన ప్రేమ ఉండేది. తన గదిలో మంచం పక్కనున్న కిటికీలోంచి కనబడే ప్రకృతిని చూస్తూ సమయం గడపడం అనంతకు అత్యంత ఇష్టమైన పనులలో ఒకటి. అందునా వర్షాకాలంలో అయితే భారీ వర్షం కురుస్తున్నప్పుడు ఆ కిటికీకి దగ్గరగా ఉన్న మామిడిచెట్టు కొమ్మల మధ్యనుండి ధారలుగా పడుతున్న నీళ్లు, ఆ చెట్టు కింద ఏర్పడిన మడుగులో లయబద్ధంగా  పడుతూ ఉంటే ఆ శబ్దం అనంతకు అద్భుతంగా తోచేది. ఇక వాన వెలిశాక మొక్కల పాదులలో గలగల మంటూ ప్రవహించే నీళ్లు చేసే చప్పుడూ, అప్పటిదాకా ఎక్కడో చెట్ల మాటున దాగి వాన వెలవగానే కిలకిలమంటూ కోలాహలంగా ఎగురుతూ వచ్చి గింజలు వెతుక్కుంటూ సందడి చేసే పిట్టలూ అక్కడి ప్రకృతికి మరింత అందం తీసుకునివచ్చేవి. ఆ మనోహర దృశ్యాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించేవాడు అనంత.
శాంతమ్మ తమ్ముడు ఈశ్వరరావు పట్నంలో పలుకుబడి ఉన్న పెద్ద వ్యాపారవేత్త. శాంతమ్మ ఒంటరిగా చిన్నపిల్లవాడైన కొడుకుతో సంసారబాధ్యతను మోస్తూ కష్టపడుతోందని తెలిసి,  ఆమెకు తోడుగా ఉండటం తన కర్తవ్యమని భావించాడు ఈశ్వరరావు. వెంటనే ఈశ్వరరావు తనుండే పట్నం విడిచిపెట్టి తన కుటుంబంతో సహా శాంతమ్మ ఉండే ఊరికి మారిపోయాడు. అతడికి అక్కపై ఉన్న ప్రేమను చూసి ఊరివారంతా ఆశ్చర్యపోయారు! తను కొత్తగా కొనుక్కున్న ఇంటిని చూసేందుకు శాంతమ్మను, అనంతను తమ ఇంటికి ఆ ఆదివారం రమ్మని సాదరంగా ఆహ్వానించాడు ఈశ్వరరావు.
***
మరుసటి రోజు అనంత శాంతమ్మతో కలిసి తన మేనమామ ఇంటికి వెళ్ళాడు. వ్యాపారంలో చాలా డబ్బు గడించిన ఈశ్వరరావు చాలా ఖరీదైన భవంతి ఊరి నడిబొడ్డులో, ఎప్పుడూ చాలా రద్దీగా ఉండే ప్రాంతంలో కొన్నాడు. అంతేకాకుండా రాజప్రాసాదాన్ని తలపించే ఆ భవనానికి మరిన్ని మెరుగులు దిద్దించి చూడగానే అద్భుతంగా తోచేటట్టు మలిచాడు. 
ఆ భవంతిలోకి అడుగు పెడుతూనే శాంతమ్మ "ఆహా ! ఎంత అందంగా ఉందో ఈ భవనం ! మీ ఇంట్లో లక్ష్మీకళ ఉట్టి పడుతోందిరా తమ్ముడూ!", అని మెచ్చుకుంది.  
పక్కనే ఉండి తల్లి సంభ్రమాశ్చర్యాలను గమనించాడు అనంత. తను కూడా బాగా చదివి పెద్దవాడై పెద్ద ఉద్యోగం సంపాదించి తన మేనమామలాగా పెద్ద భవంతి కొని తన తల్లిని అందులో మహారాణిలాగా చూసుకోవాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు అనంత. ఆ రోజంతా అక్కడే గడిపి సాయంత్రానికి ఈశ్వరరావు కారులో ఇల్లు చేరుకున్నారు అనంత, శాంతమ్మలు.  
అలా అనంతకు ఒక జీవిత లక్ష్యం ఏర్పడింది! తన తల్లిని ఆశ్చర్యపరచాలన్న ఉద్దేశ్యంతో తన లక్ష్యం గురించి శాంతమ్మకు చెప్పలేదు అనంత.  కానీ ప్రతిక్షణం తన లక్ష్యాన్ని తలుచుకుంటూ అనంత మరింత శ్రద్ధ పెట్టి చదవడం ప్రారంభించాడు. చూస్తూండగా అనంత పెద్దవాడై మంచి మార్కులతో తన చదువును పూర్తి చేశాడు. శాంతమ్మ చాలా సంతోషించింది. ఇక తన కొడుకు ఉద్యోగంలో చేరడమే ఆలస్యమని అనుకుంది.  
కానీ, అనంత తను కూడా తన మేనమామలాగా వ్యాపారం చేస్తానని చెప్పడంతో, "సరే నాయనా! చదువుకున్నవాడివి. తెలివైనవాడివి. ఏది చేస్తే నీ భవిష్యత్తుకు మంచిదో తెలుసుకునే అర్హత నీకుందని నా నమ్మకం! నీ మేనమామ దగ్గర కొన్ని వ్యాపారమెళకువలు తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం!", అంది శాంతమ్మ.
తల్లి ఇచ్చిన సలహా అనంతకు నచ్చింది. వెంటనే తన మేనమామ దగ్గరకు వెళ్లి విషయం చెప్పాడు అనంత. 
"చాలా సంతోషంరా అనంతా! జాగ్రత్తగా చేస్తే వ్యాపారంలో చాలా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు. నేను నేర్చుకున్న వ్యాపార కిటుకులు , మెళకువలు తప్పకుండా నీకు నేర్పుతాను. నా మేనల్లుడు పేరు తెచ్చుకుంటే నాక్కూడా గొప్పే కదా! ఇలాగైనా నా అక్కయ్య కుటుంబానికి ఏదో సహాయం చేశానన్న తృప్తి నాకు కలుగుతుంది!", అన్నాడు ఈశ్వరరావు.
తన మేనమామ మంచిమనసుతో అన్న ఆ మాటలు అనంతకు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. ఈశ్వరరావు సలహా ప్రకారం ఊరిపొలిమేరలనుండీ ఊళ్లోకి ఇల్లు మార్చి వ్యాపారం ప్రారంభించాడు అనంత. అలా మారడం శాంతమ్మకు ఇష్టం లేకపోయినా కొడుకు పైనున్న ప్రేమతో కాదనలేకపోయింది. వ్యాపారం కాస్త వృద్ధి చెందాక తిరిగి సొంతఇంటికి వెళ్లిపోవచ్చని శాంతమ్మకు నచ్చచెప్పాడు అనంత. కాలంతోపాటు అనంత పెట్టిన వ్యాపారంకూడా దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. అనంత స్నేహితుడు రఘుకు పట్నంలో ఉద్యోగం రావడంతో అతను అక్కడికి వెళ్ళిపోయాడు. తన మేనమామ సలహాలు తీసుకోవడంతోపాటూ, తన చదువును ఉపయోగించుకుంటూ అనంత చాలా కొద్ది కాలంలోనే బోలెడంత డబ్బును సంపాదించగలిగాడు. 
'ఇక నేననుకున్నట్టు ఖరీదైన భవంతి కట్టించే సమయం వచ్చింది! అది నాన్న కష్టపడి కొన్న స్థలంలో కడితే అమ్మకు మరింత ఆనందం కలుగుతుంది! ', అని అనుకున్నాడు అనంత. 
వెంటనే అనంత పాత ఇంటిని పడగొట్టి కొత్త ఇంటిని నిర్మించేందుకు కాంట్రాక్టర్ తో మాట్లాడి అందుకు తగిన సన్నాహాలన్నీ పూర్తి చేశాడు. పనులన్నీ చకచకా జరిగిపోయాయి. పెంకుటిల్లు ఉన్న చోట పెద్ద భవంతి వెలిసింది.అనంత సూచనల మేరకు ఇంటి చుట్టూ ఉన్న మొక్కలు తీసేసి ఆ మట్టినంతా చదును చేసి , ఖరీదైన పాలరాళ్లను  పరిచాడు  కాంట్రాక్టర్. ఇంటి ముఖద్వారం ఎదురుగా సిమెంట్ తో పెద్ద ఫౌంటెన్ నిర్మించి అందులో ఇరవైనాలుగు గంటలూ నీళ్లు పడుతూ ఉండేలా చేశారు. అనంత, తన విశాలమైన పడక గదికి ఒక కిటికీ పెట్టించి దాని నుండీ ఆ ఫౌంటెన్ కనబడేలా ఏర్పాటు చేసుకున్నాడు. ఫౌంటైన్ ఎల్లవేళలా ఉండటంవల్ల, నీళ్లు గల గల మని చేసే శబ్దం కేవలం వర్షం పడినప్పుడే కాకుండా, అన్ని సమయాల్లోనూ ఆస్వాదించొచ్చని అనంత ఉద్దేశం. 
అప్పుడప్పుడూ శాంతమ్మతో, "మన పాత ఇంటికి మరమ్మత్తులు చేయిస్తున్నా! త్వరలోనే అక్కడికి వెళ్ళిపోదాం!", అని చెప్తూ ఉండేవాడు అనంత. 
అనంత అనుకున్న విధంగా భవనం తయారై తన తల్లికి ఆ విషయం చెప్పే రోజు రానే వచ్చింది. 
ఆ రోజు తెల్లవారుతూనే అనంత, "అమ్మా! ఇవాళ నిన్నొకచోటికి తీసుకెడతాను. నువ్వు గుర్తు పట్టగలవేమో చూద్దాం!", అంటూ తన కారులో శాంతమ్మను ఎక్కించుకుని వాళ్ళ పాత ఇల్లు ఉన్న ప్రదేశానికి తీసుకొచ్చాడు. తమ పెంకుటింటి స్థానంలో ఉన్న భవనం చూసి ఆశ్చర్యపోయింది శాంతమ్మ. కానీ తన భర్త ఎంతో శ్రమకోర్చి కట్టిన ఇల్లు, పెంచిన తోట మాయం అవ్వడం చూసి శాంతమ్మ గుండె కలుక్కుమంది. 
అనంత సంతోషానికి ఆటంకం కలిగించకూడదని, "చాలా బాగుందిరా అనంతా!", అంది. 
తన తల్లి తను అనుకున్నంతగా స్పందించలేదని అనుకున్నాడు అనంత. కొద్దికాలం తరువాత అనంతకు పద్మజతో వివాహం జరిగి వారికి ముగ్గురు పిల్లలు కలిగారు. శాంతమ్మకు వయసు మీద పడటంతో ఎక్కువగా భగవధ్యానంలో గడుపుతూ ఉండేది. అనంత మధ్యవయస్కుడయ్యాడు. వారుండే ఊరి పొలిమేర బాగా అభివృద్ధి చెంది ఊరిలో కలిసిపోయింది. అనంత కట్టుకున్న భవనం చుట్టూ ఇంచు మించు అలాంటి భవనాలు అనేకం వెలిశాయి. అందరూ భవనం అందచందాలకు ప్రాధాన్యం ఇచ్చి రకరకాల కారణాలవల్ల చెట్లను, మొక్కలను నిర్మూలించడంతో ఆ ప్రాంతంలో పచ్చదనం కరువైపోయింది. మళ్ళీ వేసవికాలం వచ్చింది. ఎప్పటికన్నా ఆ ఏడు ఎండలు మండిపోయాయి. ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండి నీటి కరువు రావడంతో చాలా మంది ఆ ప్రాంతం  వీడి వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. ఈశ్వరరావు కూడా వృద్దుడైపోవడంతో శాంతమ్మను తీసుకుని తీర్థయాత్రల పేరు మీద కాస్త చల్లగా ఉండే ప్రదేశానికి వెళ్ళిపోయాడు. 
ఒక ఆదివారం నాడు మధ్యాహ్నం వేళ భోజనం ముగించుకుని, తన పడకగది లోని మంచంపై ఒరిగి  టీ.వీ. చూస్తున్నాడు అనంత. 
"మంచినీళ్లపంపు వదిలి అయిదు రోజులవుతోంది! గతవారం పట్టిన నీటితోనే గడుపుతూ వస్తున్నాను. ఇవాళ కూడా నీళ్లు వదలకపోతే ఏంచెయ్యాలో తెలియట్లేదు!", అంది వంటింట్లోంచి బయటికొస్తున్న పద్మజ. 
అది విని, “అవును నిజమే! నీళ్లు లేకపోతే ఎలా?", అంటూ ఏదో న్యూస్ ఛానల్ పెట్టాడు అనంత. వార్తలలో కూడా నీటి సమస్య గురించే అధికంగా చెబుతూ ఉన్నారు. 
‘ఏమిటో! దేశమంతటా నీళ్ల సమస్యే!', అనుకుంటూ యధాలాపంగా కిటికీనుండీ బయటికి చూసిన అనంతకు ఎండిపోయిన ఫౌంటెన్ కనిపించింది! ఇరవైనాలుగ్గంటలూ నీళ్లు పడుతూ ఉంటే ఆ ఫౌంటెన్ అందాన్ని చూస్తూ వేసవి గడిపెయ్యొచ్చు అని అనుకున్నాడు అనంత. కానీ ఆ ఆశ ఇప్పుడు తీరకుండా పోయింది సరికదా చుక్క నీరు లేని ఆ ఫౌంటెన్ ఎండకు రంగులు వెలిసి ఇంటి ముందు ఒక దిష్టిబొమ్మ పెట్టినట్లు ఉంది! అనంతకు తన చిన్నప్పటి ప్రకృతి సౌందర్యం గుర్తుకొచ్చి బాధ కలిగింది!  అంతలో కాలింగ్ బెల్ మోగింది. ఈవేళప్పుడు ఎవరో అని తలుపు తెరిచి చూసిన అనంతకు తన చిన్ననాటి  స్నేహితుడు రఘు నవ్వుతూ గుమ్మం దగ్గర నిలబడి కనిపించాడు!
"బాగున్నావా అనంతా? ఎన్ని రోజులయ్యిందోరా నిన్ను చూసి! ఎలా ఉంది నీ వ్యాపారం? ", అంటూ రఘు అనంతపై ప్రశ్నల వర్షం కురిపించాడు. 
అనంతకు కూడా రఘుని చూసి చాలా ఆనందం కలిగింది. ఇద్దరూ దగ్గరగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే వారికి వారి చిన్నప్పటి రోజులన్నీ గుర్తుకు వచ్చాయి. రఘు తను పట్నంలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఒక కార్యక్రమం మొదలుపెట్టినట్టు చెప్పి ఆ వివరాలన్నీ అనంతకు చెప్పాడు. 
"పర్యావరణంలో పచ్చదనం కనుమరుగైపోతోందిరా అనంతా! మనం దాన్ని ఎలాగైనా కాపాడే ప్రయత్నం చెయ్యాలి. లేకపోతే పోనుపోనూ మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కోవలసి రావచ్చు! మా అమ్మను, నాన్నను చూడడానికి మన ఊరికి వచ్చాను. నిన్ను కూడా ఓమారు చూడాలని అనిపించి ఇలా వచ్చాను. నీకు ఏదైనా మంచి కానుక ఇవ్వాలని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక ఉపాయం తట్టింది. అదే ఈ చిత్రం! నీకు నచ్చుతుందనుకుంటా! నేనే స్వయంగా వేశాను!", అంటూ రఘు తన చేతిసంచిలోంచీ ఒక పటాన్ని తీసి అనంతకు ఇచ్చాడు. అనంత ఆత్రంగా ఆ చిత్రాన్ని చూశాడు. అది అనంత చిన్ననాటి పెంకుటింటి ఆవరణ. వర్షం పడుతూ ఉంటే మామిడి చెట్టు కొమ్మల మధ్యలోంచి నీళ్లు పడటం, పాదులలో నీరు ప్రవహించడం, ఆ పక్కనే చెట్టుపై పక్షులు దాగి ఉండటం అన్నీ అద్భుతంగా ఆ చిత్రంలో వేశాడు రఘు. ఒక్కసారి తన చిన్ననాటి ఇల్లు జ్ఞాపకం వచ్చిన అనంతకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి!
వాతావరణంలో వస్తున్న అసాధారణమైన మార్పుకు, నీటి కరువుకు ముఖ్యకారణం పచ్చదనం తగ్గడమే అన్న సత్యాన్ని వెంటనే గ్రహించాడు అనంత. ఒకప్పుడు చెట్లు చేమలతో కళకళలాడుతూ ఉన్న తమ ఇంటి ప్రాంగణం ఇప్పుడు సిమెంట్ దిబ్బలతో కళావిహీనంగా ఉండటం చూసి అనంత మనసు కలత చెందింది. 
'ఇందుకే కాబోలు ఆ రోజు అమ్మ ఈ భవంతి చూసి నేననుకున్నంత ఆనందపడలేదు!', అని అనుకున్నాడు అనంత. 
ఇక ఆలస్యం చెయ్యకూడదని భావించిన అనంత వెంటనే కాంట్రాక్టర్ కి ఫోన్ కలిపి చెయ్యవలసిన పని చెప్పాడు. కొద్ది రోజులలోనే కాంట్రాక్టర్ పనివాళ్ళతో భవంతి చుట్టూ ఉన్న నేల పగలగొట్టించి, ఫౌంటెన్ కూడా తీయించేసి ఆ ప్రాంతమంతా మట్టి నేలగా మార్చేశాడు. ఆ తరువాత అనంత ఇంటి చుట్టూ తన చిన్నప్పుడున్నట్టు రకరకాల మొక్కలు నాటించి, ఇంకుడు గుంతను ఏర్పాటు చేయించాడు. అలా మార్పులు చేసే క్రమంలో ఆ భవంతిలోని కింది భాగంలో ఉన్న రెండు గదులు పై అంతస్తుకు మార్చెయ్యడంతో భవంతి వెనుక భాగంలో ఖాళీ వచ్చింది. అక్కడ తన తల్లి కోసం తులసి తోట ఏర్పాటు చేయించాడు అనంత. పనులన్నీ పూర్తయిన తరువాత ఆ ఇంటికి పూర్వపుశోభ కొంత వరకూ వచ్చిందని అనుకున్నాడు అనంత. కొద్దిరోజులు గడిచాక తీర్ధయాత్రలు పూర్తిచేసుకుని ఈశ్వరరావు కారులో శాంతమ్మ ఇంటికి వచ్చింది. 
ఇంటి ఆవరణలోకి అడుగు పెడుతూనే శాంతమ్మ సంభ్రమాశ్చర్యాలతో, "అబ్బ! ఒరేయ్ అనంతా! మన ఇంట్లో లక్ష్మీకళ ఉట్టిపడుతోంది! చాలా సంతోషం!", అంది. 
ఖరీదైన భవనం కట్టినప్పుడు తను ఆశించిన స్పందన, శాంతమ్మ నుండీ ఇప్పుడు రావడం అనంతకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఆ రోజు శాంతమ్మ తీరికగా ఉన్న సమయంలో తల్లి పక్కన చేరి ఆ మాటా ఈ మాటా చెప్తూ, "అమ్మా! నా చిన్నప్పుడు మామయ్య ఇంటికి వెడితే అక్కడి వైభోగాన్ని, ఐస్వర్యాన్ని చూసి వాళ్ళింట్లో లక్ష్మీకళ కనబడుతోందని అన్నావు. గుర్తుందా? నేను కూడా మామయ్యలాగా ఎంతో ఖర్చు పెట్టి భవంతి కట్టించిననాడు నువ్వు మౌనంగా ఉన్నావు. కానీ ఇప్పుడు మొక్కలను చూసి లక్ష్మీకళ అని అంటున్నావు. నాకేమీ బోధ పడట్లేదు. కొద్దిగా వివరించి చెప్తావా?", అని అసలు విషయం అడిగాడు అనంత.
శాంతమ్మ చిరునవ్వు నవ్వి అనంతను దగ్గరకు తీసుకుని," ఒరేయ్ నాన్నా! లక్ష్మీకళ అనేది ఒక్క డబ్బున్న చోటే కాదురా. ఇంకా ఎన్నో చోట్ల మనకు కనబడుతూ ఉంటుంది. మనము లక్ష్మిని అష్టలక్ష్ముల రూపాలలో కొలుచుకుంటాం కదా! విద్యాలక్ష్మి అనుగ్రహంవల్ల చదువులోనూ, ధాన్యలక్ష్మి అనుగ్రహంవల్ల పంటలలోనూ ఆ లక్ష్మీకళ మనకు కనపడినట్లు ఆ లక్ష్మీకళ ఈ సృష్టిలో ప్రకృతి రూపంగా మనకు కనబడుతుంది. కరువుకాటకాలు మన దరి చేరకుండా ఉండాలంటే ప్రకృతి స్వరూపిణి అయిన ఆ లక్ష్మిని ఆరాధించాలి. ప్రకృతిని చేజేతులా నాశనం చేసుకోకుండా ఉండటమేకాకుండా సాధ్యమైనంతవరకు దానిని కాపాడే ప్రయత్నం చెయ్యాలి! ఇప్పుడు అన్నిచోట్లా కరువు వచ్చిందంటే, పంటలు ఎండిపోయాయంటే లక్ష్మీకళ కొరవడినట్లే కదా? బయట కనపడని పచ్చదనం మన ఇంటి ఆవరణలో కనబడేసరికి నా ప్రమేయం లేకుండానే నా నోటివెంట వచ్చిన మాటలురా అవి! ", అని అంది.
ఆ సమాధానంతో అనంతకున్న సందేహాలన్నీ తొలగిపోయి తన తక్షణ కర్తవ్యం ఏమిటో అర్ధమైపోయింది.
మర్నాడు తెల్లవారుతూనే తన స్నేహితుడు రఘు దగ్గరకు వెళ్ళాడు అనంత. అనుకోకుండా వచ్చిన అనంతను చూసి ఆశ్చర్యపోయి రఘు విషయమేమిటని అనంతను అడిగాడు. 
అప్పుడు అనంత, "రఘు! ప్రకృతి గురించి ఆలోచించకుండా లేనిపోని ఆర్భాటాలకు పోయి నేను పెద్ద భవనం నిర్మించుకున్నాను. ఇప్పుడు ఆ ప్రకృతి విలువను తెలుసుకున్నాను. ఎందరో నాలాగే అవివేకంతో చెట్లను, మొక్కలను నిర్లక్ష్యం చేసి, ఆధునిక సౌకర్యాలు, వసతులే ఐశ్వర్యమని అనుకుంటూ ప్రకృతి అనే అసలైన సంపదను దూరం చేసుకుంటున్నారు. ప్రకృతిని రక్షించేందుకు నువ్వు ప్రారంభించిన కార్యక్రమంలో నేను కూడా భాగస్వామిని అయ్యి నాకు తోచిన విధంగా పచ్చదనం కాపాడటంలో నీకు సహాయపడాలని అనుకుంటున్నాను. ప్రకృతి తెచ్చే లక్ష్మీకళను గురించి అందరికీ తెలిపే ప్రయత్నం చేస్తాను! నీతో కలిసి పని చేసేందుకు నాకు అనుమతినిస్తావా?", అని అడిగాడు.
అనంత మాటలకు రఘు చాలా సంతోషించి, "నువ్వు నా ప్రాణస్నేహితుడివి! నేను చేసే ఏ కార్యక్రమంలోనైనా నిన్ను భాగస్వామిని చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తాను! ఈ సత్కార్యంలోకి నీకిదే నా ఆహ్వానం!", అంటూ అనంతను ఆప్యాయంగా కౌగలించుకున్నాడు!
*****

No comments:

Post a Comment

Pages