గూటిపాఠం - అచ్చంగా తెలుగు

  గూటిపాఠం

  - ప్రతాప వెంకట సుబ్బారాయుడు
పేరేదైతేతేనేం అదో వన్నెచిన్నెల పక్షి

అందమైన గూడు కట్టుకోవాలనుకుంది

రియల్ ఎస్టేట్ బూమ్ లు..బ్రోకర్ ల లీలలు దానికనవసరం

హంగులు..ఆర్భాటాలతో ఇంద్రభవనం కావాలనుకోలేదు

తనకీ, తన పిల్లలకీ వెచ్చని గూడుంటే చాలన్న చిన్న ఆశ

ఆకాశమంత పరచుకున్న పచ్చని వృక్షాన్ని ఎంచుకుంది               

అదివరకే అక్కడ గూళ్లున్న పక్షులు..రెక్కల టపటపలతో, కువకువలతో దానికాహ్వానం పలికాయి

కొమ్మల మధ్య అవసరానికి మించి కాకుండా.. ఉండడానికింత స్థలం చూసుకుంది

వాస్తునసలు పట్టించుకోలేదు

అదే ఆర్కిటెక్టు..మేస్త్రీ..కూలిగా

కొన్ని రోజులు కష్టించి..తనకంటూ గూడేర్పరచుకుంది

ముహూర్తాలు..గృహప్రవేశాలు..వ్రతాలు..ఏం లేవు

కనీసం 

గూడు గుమ్మానికి తోరణాలు కట్టడం..కుడికాలు లోపలపెట్టడం..పాలుపొంగించుకోడం దానికి తెలీనే తెలీదు

ఒకనాడు గూడులోపల అడుగుపెట్టింది..కొన్నాళ్లకు గుడ్లు పెట్టింది, పొదిగింది

బుజ్జి కువకువల్తో గూడు కళను సంతరించుకుంది

అమ్మ తెచ్చిపెట్టే ఆహారంతో పెరిగి పెద్దై, రెక్కలు తొడిగాయి..రివ్వున ఎగిరాయి

సూర్యోదయానికి గూడొదలడం..రాత్రికి చేరి విశ్రమించడం, ఇప్పుడు ఇదే దాని జీవిత చర్య

గూడు తన సొంతమన్న అధికారభావం, అంకితభావమూ లేదు

రేపెప్పుడన్నా తుపానొచ్చి గూడు చెదిరితే

మనలా నిర్వాసితురాలయ్యిందని గుండెలు బాదుకోదు

మరో చెట్టు వెతుక్కుని, ఓపిగ్గా పుల్లల్తెచ్చుకొని గూడు కట్టుకుంటుంది

దానికి చెట్లన్నీ గూడుకట్టుకోడానికి అనువైనవే..పక్షులంతా బంధుగణమే

మనసుతో చూడాలేగాని ప్రకృతి పాఠాల గని!

అందులో పక్షి నేర్పే గూటిపాఠం ఒకటి!!

***


No comments:

Post a Comment

Pages