శ్రీథరమాధురి - 79 - అచ్చంగా తెలుగు

శ్రీథరమాధురి - 79

Share This

 శ్రీథరమాధురి - 79
భగవతి అమ్మవారు

ఇతరులను అడక్కండి. మిమ్మల్నే ప్రశ్నించుకోండి. సమస్య ఎక్కడ ఉత్పన్నమయ్యిందో అక్కడే పరిష్కారం ఉంటుంది.

దైవం పరిష్కరించేందుకు మీకొక సమస్యను ఇచ్చినప్పుడు, మీకు ఆయనపై పరిపూర్ణమైన నమ్మకం ఉండి, మీరు ఆయనను శరణాగతి వేడినట్లైతే, స్వయానా ఆయనే మీకు పరిష్కారాన్ని కూడా ఇస్తారు.

ఈ మధ్యన జరిగిన సంఘటన ఒకటి నాకు తెలుసు. ఆమె భగవతి అమ్మవారిని బాగా పూజించేది. ఆమె కూతురి జీవితంలో అనుకోకుండా ఏదో జరగరానిది జరిగింది. ఆమె అమ్మవారిని నిందించడం మొదలుపెట్టింది. ఆమె తనకు తాను సర్ది చెప్పుకోడానికి, ఇలా అనుకోసాగింది,’నేను ఎవరిపట్లా ఎన్నడూ తప్పుగా ప్రవర్తించలేదు. నా కూతురికి ఎందుకిలా జరగాలి?’

ఇది పరిణితి లేకపోవడాన్ని సూచిస్తుంది. దైవం పట్ల మీ నమ్మకం స్థిరంగా, నిబంధనలు లేకుండా ఉంటే కనుక, మీరు దైవేచ్చను ఆనందంగా అంగీకరిస్తారు. ఏదీ మీ నమ్మకాన్ని బలహీనపరచలేదు.

నమ్మకం పూర్తిగా పక్కదారి పట్టిన సందర్భమిది.

ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. నమ్మకం ఉన్న వ్యక్తి యొక్క సమస్యల గురించి దైవం శ్రద్ధ వహిస్తారు. ఇతరులకు, ఆత్మవిచారణ చేసుకోవడం అవసరం. పరిష్కారం చెప్పమని ఇతరులను అడగకండి. ఎక్కడ నుంచైతే సమస్య పుట్టిందో, అక్కడే పరిష్కారం ఉంటుంది.


***

మైండ్ గేమ్స్ - కేరళలోని ఒకసత్రంలో ఒకరాత్రి నేను బస చేసాను. నేను పక్కేసుకుని పడుకోబోయేంతలో, ఒకతనువచ్చి, ‘సార్, ఇటు భగవతి దేవత ఉంటుంది, అందుకే ఇటు ప్రక్క కాళ్ళు పెట్టద్దు,’ అన్నాడు. నేను సరేనని, వేరే వైపు పడుకోబోతూ ఇలా అనుకున్నాను, ‘భగవతి అమ్మవారు, అన్ని చోట్లా ఉన్నారు, మరి కాళ్ళు ఎటుపెట్టాలి? తలక్రిందులుగా వేళ్ళాడినా, ఆమె ఆకాశంలో కూడా ఉన్నారు. నిలబడి నిద్రపోతే భూమిలో ఉన్నారు. మరేం చెయ్యాలి? నేను నడిచి కూడా ఆమెను బాధిస్తున్నానేమో, నేనామెపై నడుస్తున్నాను, కూర్చుంటున్నాను, పరిగెత్తుతున్నాను, అయ్యో, ఏం చెయ్యను?’ నిద్ర పట్టలేదు. ఆమె నాలోనూ ఉందికదా, నాతోనూ ఉంది, ఇలా అనుకున్నాకా, ఎంతో తృప్తిగా నిద్రపోయాను. తెల్లవారుఝామున భగవతికి కృతజ్ఞతలు చెప్పుకుని, ఆ సత్రం వదిలి వెళ్ళిపోయాను.

***

No comments:

Post a Comment

Pages