నాకు నచ్చిన నా కథ - గాంధీ కోరిన రాజ్యమా ఇది? - అచ్చంగా తెలుగు

నాకు నచ్చిన నా కథ - గాంధీ కోరిన రాజ్యమా ఇది?

Share This
నాకు నచ్చిన నా  కథ - గాంధీ కోరిన రాజ్యమా ఇది?
యలమర్తి అనురాధ 

“పదిహేడవ  నెంబర్ ప్లాట్ ఫారం పై ‘కడప’ వెళ్ళే బస్సు బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది మైక్ లో అనౌన్స్మెంట్ వినబడడం తో హడావిడిగా నడిచారు  వాళ్ళిద్దరూ. ఒకరికి వయసు మీద పడడంతో ఆయాసం మరొకరికి చేతిలో చిన్న పాప. బయలుదేరుతున్న బస్సు తనే చేతులెత్తి ఆపింది' శ్వేత ' ఒక్క చేతితో పాపను గట్టిగా పట్టుకొని, ఆగిన బస్సులోకి గబగబా సూట్కేసును తోస్తూనే. 
“శ్వేత చెబితే వినకుండా వెళుతున్నావు జాగ్రత్త చేరగానే ఉత్తరం వ్రాయి నేను సాయంత్రం ఫోన్ చేస్తానులే”. కండక్టర్ ఇది తనకు మామూలే అన్నట్లుగా దబ్ మని డోర్ ను లాక్ చేశాడు.  నడుస్తున్న బస్సులో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఖాళీ ఉన్న సీట్లోకి చేరి ప్రక్కనున్న అతనిని సూట్ కేస్ కాస్త పైన పెట్టమని రిక్వెస్ట్ చేసింది. అతను ఆమె సూట్కేసును  తీసుకువచ్చి ఆమెకు కనిపించేటట్టు పైన పెట్టాడు.బుట్టలో  పాపకు కావలిసిన అన్ని ఉండడంతో తన దగ్గరే అట్టి పెట్టుకుంది.
కిటికీ పక్క సీటు దొరకడం తో పాపకు  తనకు గాలికి  కొదవ ఉండదని సంబరపడింది. ఆమె సర్దుకోవడం అయ్యిందేమో ఆమె ఆలోచనలు తండ్రి వైపు మళ్ళాయి. ఒక్కతేనే పంపిస్తున్నానని ఎంత ఆదుర్ధాపడ్డారు. ససేమిరా పంపనని  గొడవ చేశాడు. ఆఫీసర్చ్ చెకింగ్ కి వస్తారని తెలియటంతో ఆయన చివరి నిముషంలో డ్రాప్ అవవలసి వచ్చింది. కనీసం ప్యూన్ ని పంప టానికి కూడా ఈ టైమ్ లో కుదరదు. అన్నయ్య ఊరిలో లేదు. తమ్ముడు ఫర్చేసింగ్ కి వెళ్ళటం , అన్నీ కలిసి వచ్చాయి. అప్పుడు డాడీ అన్న మాటలు, తన సమాధానాలు ఒకటికి ఒకటి గుర్తు వచ్చిన ఆమె పెదాల మీద చిరునవ్వును లిప్తపాటు మెరిసేట్లు చేసింది. 
"అరె! శ్వేతా ! చంటి పిల్లతో ఏమి ఇబ్బంది పడతావ్. ఏనాడన్నా నిన్ను ఒంటరిగా పంపామా.ఈ ఒక్కరోజు ఆగు. ఆఫీసర్ వెళ్ళిపోతాడు. రేవు. నేను వచ్చి దింపుతాను. అమ్మకి ఆరోగ్యం బాగుంటే అదయినా నీతో వచ్చేది.
"ఎందుకంత వర్రీ డాడీ! ఒక్క 'అయిదు ! గంటలు, ఎంతలో వెళతాను. ఏదటునా అవసరమొస్తే ప్రక్క వాళ్ళు వుండనే వుంటారు. గాంధీగారు అర్ధరాత్రి స్వాతంత్రం కావాలని అడిగితే మీ కూతుర్ని పగలు బయటకు పంపటానికి ఇంత ఆలోచిస్తారేం?
"నువ్వెంత చెపినా నా మనసు అంగీకరించటం లేదు. నీకు బస్ ఎక్కితే నిద్ర వస్తుంది. సూట్కేస్ జాగ్రత్తగా చూసుకోవాలి."
ఆయన ఇంకా ఏదో చెప్పబోతుంటే “ఓ !డాడీ! మీరిలా ఆలోచిస్తుంటే బస్ కాస్తా వెళ్ళి పోతుంది. ప్లీజ్! తొందరగా బయలుదేరండి. దేనికయినా బాధ్యత నాది. మీ అల్లుడుగారికి నేను చెబుతానుగా, మీకు మాట రానివ్వను. స్వీటీ, గురించి మీకు బెంగవద్దు. దానికి కావల్సి నవన్నీ నేనే సర్దేసుకున్నాను.
రిక్షా రావటం, డాడీ,నేనూ ఎక్కటం క్షణాల్లో జరిగి పోయాయి. కదులుతున్న బస్ ను ఎలాగయితేనేం ఆపి ఎక్కగలిగాను. కాస్త ఆలస్యమయితే మళ్ళీ ఎన్ని గంటలు బస్స్టాండ్ లో పడిగాపులు  పడాల్సి వచ్చేదో, అంతా మన మంచికే అనుకోవాలి” అనుకుంది శ్వేత స్వాగతంగా 
"పిచ్చి తల్లి. ఆ బస్ మిస్ అయితే జీవితం ఆమె చేతిలో వుండేవి. ఇప్పుడు విధి చేతిలోకి వెళ్లబోతోందని ఆమెకు తెలియదు. అలా అనుకుంటే మన జీవితాలన్నీ విధి ఆడుకొనే చదరంగం ఆటలోని సావులే. ఏ నిముషంలో ఏ పావుకి ఆయువు  మూడుతుందో, గతి తప్పుతుందో ఆడించే వాడికి తప్ప ఎదుటి వారికి తెలియదు.
కండక్టర్ “ఇంకా బస్సులో టిక్కెట్లు తీసుకోని వాళ్ళు ఎవరయినా వుంటే తీసుకోండి” అని అరిచాడు.
పాపతో  లేవలేక యాభై రూపాయిల నోటు ఇందాక  సూట్ కేస్  సర్దిన అతనికి ఇచ్చి త్రిపురాంతకానికి ఒక టికెట్టు తీయమంది శ్వేత. అతనే చిల్లర కూడా తెచ్చి ఇచ్చాడు. కృతజ్ణతంతా కళ్లలోకి చొప్పిస్తూ ‘థాంక్యూ’ అంది శ్వేత. 
"ఇంత మాత్రానికే" అని నవ్వి ఊరుకున్నాడు అతను. ముప్పావు గంటలో గుంటూరుకి తీసుకు వచ్చాడు.
దిగే వాళ్ళు దిగుతున్నారు ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు
మళ్లీ బస్సు నర్సరావుపేటలో ఆగినప్పుడు అతను అడిగాడు
“మేడమ్”! ఒక్కరే వచ్చినట్లున్నారు ఏమైనా తెచ్చి పెట్టమంటారా” అని
“నో !థ్యాంక్స్! అంటూ మృదువుగానే తిరస్కరించింది.
వినుకొండ దగ్గర భోజనాలకు ఆపారు బస్సు
“టిఫిన్లు, భోజనాలు చేసే వాళ్ళు ఇక్కడ దిగండి అని చెప్పి కండక్టరు డ్రైవరూ దిగారు
బస్సులో ఇద్దరు ముగ్గురు తప్ప అందరూ దిగిపోయారు అది వాళ్ల ఫ్రంట్ సీట్ లో ఉన్న ఆడవాళ్ళు.
*****
ఫోన్ మ్రోగుతున్న శబ్దానికి పక్క రూమ్లో భోజనం చేస్తున్నా సంతోష్ "ఎవరబ్బా" అనుకుంటూ ఫోన్ తీశాడు.
"నాయనా సంతోష్ నేను మీ మామ గారిని విజయ్ కాంత్ ని మాట్లాడుతున్నాను".
"ఆ!ఆ! చెప్పండి శ్వేత, స్వీటీ బాగున్నారా? ఈరోజు 10 గంటలకు తన ఫ్రెండ్ మేరేజ్. ఈ రోజు కు వస్తానందే. తను రాలేదని మీల్స్ చేసి బయలుదేరుదాం అనుకుంటున్నాను పెళ్లికి"
"ఏమిటి సంతోష్ శ్వేత ఇంటికి రాలేదా" ఆదుర్దా మేళవించిన కంఠం అవతల.
ఏదో జరగరానిది జరిగిందని సంతోష్ కి తెలుస్తోంది ఏం మాట్లాడాలో తెలియనట్లు బ్లాంక్ గా అయిపోయింది మైండ్.
"సంతోష్! మాట్లాడవేమిటి! నేను వద్దన్నా వినకుండా ఎనిమిది గంటల బస్సుకి బయలుదేరింది నాకు ఆఫీసులో హయ్యర్ అథారిటీస్ రావడంతో తనతో రావడానికి కుదరలేదు.
"అయితే శ్వేత ఏమయింది అది రెండు గంటల కల్లా ఇక్కడకు వచ్చేయాలి" మీరు వెంటనే ఫోన్ చేయాల్సింది"
"ఇదిగో ఆఫీస్ నుంచి వచ్చి ఫోన్ బుక్ చేస్తే నాకు కాల్ అందేటప్పటికీ ఈ టైం అయింది. క్షేమంగా చేరిందనే విషయం తెలుసుకోవటానికి ఫోన్ చేశాను. వెంటనే బస్టాండ్ కి వెళ్లి బస్సు వచ్చిందో లేదో కనుక్కొని నాకు ఫోన్ చెయ్యి. నువ్వేం కంగారు పడకు దారిలో బస్ ఏమైనా ట్రబుల్ ఇచ్చిందేమో, ఆ రూట్ బాగోదు. అంతా గతుకులు అని నువ్వే చెప్పావుగా, నువ్వు ఏ విషయము చెప్పే వరకూ నేను ఈ ఫోన్ దగ్గరనుంచి కథలను. సంతోష్! వింటున్నావా!"
"అలాగే మామయ్య గారు! నేను ఇప్పుడే వెళ్తున్నాను. బస్ వచ్చిందో లేదో కనుక్కోవడానికి" అంటూ ఫోన్ పెట్టేసి సింక్లో గబగబా చెయ్యి వేసుకుని షర్టు వేసుకుని రోడ్డున పడ్డాడు.
బస్సుకి  ఏమైనా ఆక్సిడెంట్ అవ్వలేదు కదా! స్వామి నా శ్వేత నూస్ వీటిని క్షేమంగా నా దగ్గరకు చేర్చు" అని మనసులో వెయ్యి దండాలు పెట్టాడు అతను సెంటర్ కి వెళ్ళేదాకా.
పండ్లు అమ్ముకునే పర్వతయ్య తగిలాడు "ఏమిటి ఇంజనీర్ బాబు! ఏ ఊరు వెళ్ళాలి"అంటూ.
"నా భార్య పాపా బస్సులో వచ్చారంటే ఇంకా రాలేదేమిటా అని కనుక్కోవడానికి వచ్చాను విజయవాడలో ఎనిమిది గంటలకు అది రెండు గంటలకు కదా రావాల్సింది" నడుస్తూనే అడిగాడు సంతోష్.
"అది కరెక్ట్ టైం కె వచ్చింది సారూ! ఎవరు ఆడవాళ్ళు దిగలేదే. నేనే కదా సారూ ఇక్కడ కూలీ కూడా చేసేది ఎవరో ఒక ఆయన మాత్రం  దిగాడు.
"మరి మా వాళ్ళు ఏమయినట్లు"స్వగతంలో అనుకొన్నట్లు పైకి అనేశాడు సంతోష్.మళ్ళీ "
“ఆ డ్రైవర్ సాబ్ కిల్లీ కొట్టు అతనితో ఏదో చెప్పి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి కనుక్కుందాం రండి. బస్ టైమ్ లు అయినా , ఏమయినా అక్కడే అందరూ కనుక్కుంటారు.
వినుకొండలో భోజనాలకు వెళ్ళి వచ్చేటప్పటికి ఆ అమ్మగారు లేరుట. మార్కాపురానికి టిక్కెట్టు తీసుకున్న ఇంకో ఆతను తీసుకు వెళ్ళాడని ' బస్ లోవాళ్ళు చెప్పారట. కండక్టరు ఆ అమ్మాయిది త్రిపురాంతకం కాబట్టి ఎవరయినా  వస్తే చెప్పమని చెప్పి పరుగెట్టిండు" సంతోష్ కాళ్ళూ చేతులూ ఆడలేదు. అచేతనంగా నిలబడ్డాడు. ఇంతవరకూ అతను ఊహించినది ఒకటి. ఇప్పుడు విన్నది ఒకటి. అయితే వీళ్ళు ఏమయినట్లు. అతను ఎవరు? ఎలా వుంటాడు. ఏమో!
"అయ్యగారూ! పదండి మిమ్మల్ని ఇంటి దగ్గర దించి వస్తా. మీరేమిటో ' అదోలా వున్నారు.వినుకొండ ఎల్లండి బాబూ, అక్కడి విషయాలు తెలుస్తాయేమో"
"అదే మంచిదనిపించింది. సంతోష్కి కూడా.
మామగారికి ట్రంకాల్ పెట్టాడు. 
ఎంత సేపు పడుతుందో ఏమో బయటకు వెళ్ళటానికి లేదు. అతని ఆలోచనలలో అతను ఉండగానే ' లై దొరికింది. అది అతని – అదృష్టము అనుకోవాలి. ఇదంతా దురదృష్టంలో – అదృష్టమే మరి. 
"సంతోష్!
"ఆ! నేసేవండి. శ్వేతను ఎవరో ఒకతను వినుకొండలో తీసుకెళ్ళాడటండీ నాకు ఏమీ తోచటంలేదు.మీకు ఈ సంగతి చెప్పి వినుకొండ వెళ్లాలని, అసలు మీరు తనొక్కర్థినీ ఎలా పంపారు? తను గొడవ చేస్తే మాత్రం” సగం కోపం సగం బాధ మిళితమయింది అతని స్వరంలో.
విషయం వింటున్న ఆయన చేతిలో రిసీవర్ జారిపోయింది.
ఇక ఆయన్ని పట్టించుకునే వ్యవధి లేని సంతోష్ తన కొలీగ్ ఇంటికి వెళ్ళాడు. విషయం క్లుప్తంగా చెప్పి అతనిని బయలు చేరదీశాడు. వెంటనే ఎక్స్ ప్రెస్ దొరకటంతో కాస్త రిలీఫ్ ' ఫీలయ్యారిద్దరూ, మొదట హోటల్ అతనిని కలిశారు. అప్పటికే 10 గంటలయింది. 
*****
కళ్ళు  తెరిచిన శ్వేతకు తనెక్కుడుందో తెలుసుకోవటానికి ఒక నిముషం పట్టింది.
తను బస్సులో వుండాల్సింది. ఈ ఎ.సి. కారులో వుందేమిటి? తన ప్రక్కన అతను తన పాపని ఒళ్ళో పెట్టుకొని. నరాలు చిట్లుతున్న భావన. ఏదో మోసం జరిగింది. ఎలా? అప్పుడు గుర్తు వచ్చింది ఆమెకు.
వినుకొండలో అందరూ భోజనాలకు దిగారు.
తనకూ ఏదైనా హాట్, హాట్‌గా తినాలనిపించింది. కానీ పాపతో లేచివెళ్ళి తినాలనిపించ లేదు. ఇందాకటి అతన్నే అడిగితే.. ఆ! వద్దులే! కాసేపు కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోవచ్చు అని తన మనసుకు తనే సర్ది చెప్పుకుంది.
ఇంతలో క్రింద నుంచీ అతమ టిఫిన్ తెచ్చి పెట్టమంటారా?” అని అడిగాడు.
“వద్దులెండి " అంది మొహమాటంగా చేతులు బస్ రాడ్ మీద వుంచి అడుగుతుండగా అతని చేతిలోని కర్చీఫ్ తన ఒడిలోకి జారింది. అది అతనికి తీసి ఇవ్వబోతుండగానే మధ్యలోనే అతను తన ముక్కు దగ్గిర అదిమాడు. ఆ తరువాత ఏమయింది తనకు తెలియదు. ఏదో వాసనకు తనకు కళ్ళు తిరుగుతున్నాయని మాత్రమే తెలిసింది. వీళ్ళు తనని ఎక్కడికి తీసుకు వెళుతున్నారు? అందరూ చూస్తుండగా ఎలా ఇతను తీసుకువచ్చాడు. భయంతో ఆమె గుండె విపరీతంగా కొట్టుకోసాగింది. తను  క్షేమంగా సంతోష్ ని చేరుకోగలదా. డాడీ వద్దన్నప్పుడు మానేస్తే ఇలా తను చిక్కుబడేది కాదుగా. అమాయకంగా వున్న ఇతను .ఇంత మోసం చేస్తాడా?
*****
"రండి సార్ కూర్చోండి" అంటూ ఆహ్వానించాడు హోటల్, ఓనర్ రంగనాథ్.
“మా ఫ్రెండ్ - భార్య , విజయవాడ నుంచి ఈ బస్ లో బయలుచేరారు. ఇక్కడ ఎవరితోనో దిగిపోయారని చెబుతున్నాడు. విషయం మీకేమయినా తెలుసేమో కనుక్కుందామని వచ్చాం. చెప్పగలరా మీకు తెలిసినంతవరకు" శ్రీకాంత్ అడగటంతో  
"అతను ఒక నిట్టూర్పు విడిచి “మా సర్వర్ ఆ బస్లోనే మార్కాపురం దాకా వెళ్ళి వచ్చాడు. వాడిని పిలుస్తాను మాట్లాడండి" అతను వచ్చి ఆ - "అసలు ఏం జరిగిందంటే..." అని చెప్పటం ప్రారంభించాడు. 
అందరూ భోజనాలు అయిన తరువాత బస్ ఎక్కారు.
"అందరూ వచ్చారా?" అని కండక్టర్ అడిగి కూర్చోబోతూ "ఇక్కడ ఒక ఆవిడ పాపతో , వుండాలిగా, ఆవిడ ఏరి?" అని అడిగాడు ముందు సీటులో వున్న ఆడవాళ్ళు “ఆయమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. . వాళ్ళ ఆయన అసలే నీరసం మనిషి. డాక్టర్కి చూపించి మళ్ళీ బస్ లో వెళతాం అని ఆమె సూట్ కేసు ఒక చేత్తో, ఆమెను ఒక వైపు పొదివి పట్టుకుని దింపాడయ్యా."
"ఇంతకీ ఎవరతను?"
“అదేనండి! ఆ యమ్మకు, టిక్కెట్ తీశాడు కదా!”
"అరెరే! మోసం" జరిగిపోయింది. అతడు ఆ అమ్మాయి భర్తకాదు. ఆమె ఒక్కత్తే బస్సు ఎక్కింది... ఆమెది . త్రిపురాంతకం, అతనిది మార్కాపురం. పాపతో వుందని, 'ఆవిడ డబ్బు ఇస్తే ఇతను. కొన్నాడంతే."
అయ్యో, తమ 'ముందే ఎంత ఘోరం జరిగిపోయిందని బాధ పడ్డారు వాళ్ళంతా.
"ఇప్పుడు ఏం చేద్దాం." అని అడిగాడు కండక్టర్. 
"పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చి వెలితే...” మళ్ళీతనే సూచించాడు కండక్టర్ ఎవరూ మాట్లాడక పోవటంతో,
"అడ్డమైన ప్రశ్నలూ మనల్ని వేసి - బస్ కదలనివ్వరు" డ్రైవర్ ఖరాఖండిగా చెప్పాడు. '
బస్ లో జనమంతా అన్ని వైపులా చూసారు. ఎక్కడా ఆమె కనిపించలేదు.
"ఈ పాటికి ఈ ఊరు పొలిమేర దాటి ఎంతో సేపయి వుంటుంది. ఇప్పుడు, బస్ ఆపి ఎంక్వయిరీలు చేసుకుంటే మాకు కుదరదు. బస్సు పోనివ్వండి" అన్నాడు. ఒకాయన.
అందరి తర్జన భర్జనల తరువాత బస్ కదిలింది. అతను చెప్పటం ఆపాడు. “జనంలో వున్న తత్వమే అది. బయటి వాళ్ళ కయితే ఒక నీతి, ఆ అమ్మాయి తన కూతురే అయితే అలా బస్ పోనివ్వమని అతను చెప్పగలిగేవాడా" అప్పుడే రిపోర్ట్ ఇస్తే ఎలా వుండేదే" విరక్తితో కూడిన భావనలో పెదవి విరిచాడు. సంతోష్ 
"పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇవ్వండి సార్"  అని హోటల్ అతనే  సలహా ఇచ్చాడు.
"సరే! వెళ్ళాస్తాం" అని అతనికి థాంక్స్ చెప్పి  పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు.
కంప్లయింట్ వ్రాసి యిచ్చాక “మీ ' అడ్రస్ అందులో వుంది కాబట్టి మీ భార్య ఫోటో ఇచ్చి వెళ్ళండి కనుక్కుంటాము” అన్నాడు. అంతా ఫార్మాలిటీగా జరుగుతోంది అంతే.
తనతో తెచ్చిన శ్వేత ఫోటోను ఇన్స్పెక్టర్ కు అందించారు.
“మా ప్రయత్నం మేం చేస్తాం. సమాచారం అందితే మీకు కబురు చేస్తాం."
అప్పటికి సంతోష్ పెదాలు వణుకుతున్నాయి. ఒళ్ళంతా పెనంలా వేడిగా కాలిపోతోంది.
శ్రీకాంత్ అతని పరిస్థితిని అర్థం చేసుకున్నట్టుగా ఓదార్పుగా భుజం తట్టి "పద సంతోష్! మనం వెళదాం" అన్నాడు.
ఇప్పుడు ఏమిటి దారి!"
"మార్కాపురం వెళ్ళి శ్వేతను తీసుకు వెళ్ళిన అతను ఎలా ఉన్నాడో ఇంకా క్లియర్ గా కనుక్కుంటే మంచిదనిపిస్తోంది. కానీ నీ పరిస్థితి బాగోలేదు. ఇంటికి వెళ్ళి రేపు ఆలోచిద్దాం."
“వద్దు శ్రీకాంత్. మనం ఆలస్యం చేసిన ప్రతి క్షణం శ్వేత ఎంత నరకం అనుభవిస్తోందో. దాని ముందు నాదెంత. పద వెళ్లాం"
"సరే! ఏదో లారీ వస్తున్నట్లుంది. అడుగుదాం"
చెయ్యి పెట్టి ఆపాడు. 
“మార్కాపురం"
“ఎక్కండి" అన్నాడు. అతను.
"సంతోష్! కాసేపు కళ్లు మూసుకుని పడుకో,మనసు ప్రశాంతంగా వుంటుంది".
“నిద్రా.. కళ్ళు మూస్తే నా శ్వేతకు ఏమవుతుందో అని భయంతో రెప్ప వాల్చలేక పోతున్నాను. నా శ్వేత నాకు దక్కుతుందంటావా?"
గొంతు బొంగురుపోయింది. ఏడుపు తన్నుకు వస్తోంది అతనికి.
మార్కాపూర్ " చేరేటప్పటికి రెండు గంటలయింది.
అక్కడ కండక్టర్ డ్యూటీ దిగి ఇంటికి  వెళ్లాడని ఇంటి అడ్రస్ తీసుకున్నారు. "ఈ వేళప్పుడు వెళితే బాగుంటుందా?" సంతోష్ లో సందిగ్ధత.
“ఏం ఫర్వాలేదు. మనసున్న వాడెవడూ తప్పు పట్టడు” 
నిద్రపోతున్న రిక్షా లతనిని లేపి ' పేరం బజార్' వస్తావా అని అడిగాడు.
అతను వస్తాననటంతో ఇద్దరూ రిక్షా ఎక్కారు. ఫలనా  వారమని చెప్పగానే కండక్టర్ కరుణానిధి సాదరంగా ఆహ్వానించాడు. 
మళ్ళీ మొదటి నుంచి అంతా వివరంగా చెప్పాడు. 
“అతను ఎలా వున్నాడు?”
“చాలా మంచివాడిలా కనిపించాడు బాబూ! ఎత్తు ఆరడుగులు ఉంటాడు”
స్పేషల్ గా " గుర్తు పెట్టుకోదగ్గవి - ఏమన్నా ఉన్నాయా?" 
"అలాంటివి ఏం లేవు. మళ్ళీ కనిపిస్తే మాత్రం గుర్తు పట్టగలను. కానీ కనిపిస్తాడని మాత్రం అనుకోను. 
" అతనికి థాంక్స్ చెప్పి త్రిపురాంతకం చేరేటప్పటికి అయిదు గంటలయింది.
గుమ్మంలో ఎదురుపడ్డ మామగారిని చూసి మాటరాని మూగవాడే అయ్యాడు సంతోష్.
అతని ముఖం చూడగానే ఆయనకు పరిస్థితి అర్ధమైంది. అక్కడి నుండి వాళ్ళిద్దరూ చెయ్యని ప్రయత్నం లేదు. పేపర్లో వేసారు. టి.వి.లో చూపించారు. " దేశమంతా గాలింపు చేశారు. డబ్బయితే మంచి నీళ్ళలా జారిపోయింది కానీ ఆమె ఆచూకి మాత్రం తెలియలేదు. సంవత్సరాలు గడిచిపోతున్నా ఆమె జాడ మాత్రం తెలియలేదు. ఇప్పటికి వాళ్ళందరి కళ్ళూ ఆమె కోసం అన్వేషిస్తూనే వుంటాయి.
*****
శ్వేత మాత్రం తన వాళ్ళందరికీ దూరంగా ఒక వేశ్యగా బ్రతుకుతోందని మాత్రం తెలియదు. శ్వేత ఎంతో మురిపంగా  పేరు పెట్టుకున్న స్వీటీ కూడా మరి కొన్ని సంవత్సరాలలో అదే వృత్తికి తల పడాల్సిందే. " తప్పదు. ఏ పుణ్యాత్ముడయినా దయతలిస్తే కనీసం తన కూతుర్నయినా ఈ కుళ్ళు  ప్రపంచానికి దూరంగా పంపాలని జీవశ్ఛవంలా బ్రతుకు వెళ్ళదీస్తోంది ఆమె. ఒకసారి పట్టుకున్న చిలకను వదిలి పెట్టని కిరాతకులు వాళ్ళు.. బయటకు రానివ్వరు. చావనివ్వరు.
ధైర్యంగా, ఒక్కరినీ వెళ్ళగలనని , తీసుకున్న నిర్ణయం తనని ఇలా నరకంలోకి తోస్తుందంటే అని తలపోయని క్షణం, లేదు ఆమె బ్రతుకులో.
గాంధీ తాతా! ఎక్కడున్నావయ్యా! . స్వరాజ్యాన్ని కష్టపడి సంపాదించి, పెట్టావు. కానీ మా ఆడవాళ్ళకు ఈ దేశంలో పగలు సంచరించే అవకాశం కూడా కోల్పోయామే. నువ్వు ఇంకా ఆర్థ రాత్రి ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళాలన్నావ్. నీదెంత తీరని ఆశయ్యా! " గాడ్సే నిన్ను, చంపి మంచి పని చేశాడు. లేకపోతే, ఈ కుళ్ళు లోకంలో జరిగే ఘోరాలు చూసి నిముష నిముషం బ్రతక లేక చచ్చిపోయేవాడిని మానసికంగా, అనుకుంది. బాధగా శ్రీదేవి ఉరఫ్ శ్వేత.
***

No comments:

Post a Comment

Pages