అవే చేతులు.. - అచ్చంగా తెలుగు
 అవే చేతులు..
      ప్రతాప వెంకట సుబ్బారాయుడు


ఒడిలోకి చేర్చుకుని ఓదార్చి..
ఆపన్నులకు అండగా నిలిచేవి- అవే చేతులు
విత్తనాన్ని మొక్కగా మొలిపించి..
కడుపులో ఆకలిని ఉపశమింపజేసేవి- అవే చేతులు.

సృజనాత్మకతకు జీవం పోసి..
ప్రపంచానికి పారిశ్రామిక వెలుగులిచ్చేవి- అవే చేతులు
ప్రతిభకు పట్టం కట్టి..
చప్పట్లతో నలుదిక్కులకు పరిచయం చేసేవి- అవే చేతులు.
 
ఉక్కు పిడికిళ్లుగా బిగిసి..
మానవహారంలో దారంలా నిలిచేవి- అవే చేతులు
ఉద్యమాలకు..సత్యాగ్రహాలకు ఊతమై..
విజయ మిఠాయిలు పంచేవి- అవే చేతులు.

స్వాతంత్ర్య పోరాటంలో సంకెళ్లకు వెరవక..
స్వేచ్ఛను సాధించి..జండా ఎత్తేవి- అవే చేతులు
కొవ్వొత్తుల మౌన ప్రదర్శన, 
గాలికి కొండెక్కకుండా అడ్డు నిలిచేవి..
హృదయ పుష్పగుచ్ఛాలను 
సమాధులపై పేర్చేవి- అవే చేతులు.

ప్రళయం ఆనవాళ్లను తుడిచిపెట్టి..
కొత్త జీవితానికి తోరణాలు కట్టేవి- అవే చేతులు
చేతుల చెమ్మలేని చరిత్ర లేదు
చేతుల కూర్పులేని విజయం లేదు.
***

No comments:

Post a Comment

Pages