మాలతీ మాధవం - అచ్చంగా తెలుగు
మాలతీ మాధవం
(మా జొన్నవాడ కథలు - 7)
టేకుమళ్ళ వెంకటప్పయ్య

"సారీ! మధూ! మూడోసారి కూడా అబార్షన్ కాకుండా ఆపలేకపోయాము" అంది టవల్తో చేతులు తుడుచుకుంటూ.
"మీరేం చేస్తారు డాక్టర్! మా రాత ఇలా ఉంది"
"మీరప్పటికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పటివరకూ బెడ్‌రెస్టులోనే ఉంది. మందులు అన్నీ టంఛన్‌గా వాడారు. బట్. వై?  అదే నాకు అర్ధం కావడంలేదు.
"మేమేం పాపం చేశామో! ఇలా అవుతోంది ప్రతిసారీ"
"అదేమీ కాదు గానీ... ఒక సలహా చెప్తాను. మీరు నవ్వనంటే!"
"హయ్యో! భలేవారే చెప్పండి మేడం!"
"ఏమీ లేదు మీరు ఈసారి ప్రెగ్నెన్సీ కన్‌ఫరం అయ్యాక జొన్నవాడలో కొన్ని నెలలు గడపండి. మా అక్క కూతురు కూడా ఇలాగే ప్రాబ్లం వస్తూ ఉంటే అక్కడ 4 నెలలు ఉన్నారు. సెంటిమెంట్ అనుకోండి గాలి మార్పు అనుకోండి. అక్కడ ఏదో మహత్తైతే ఉంది"
"తప్పకుండా! డాక్టర్‌గారూ! ఇప్పుడు నేను మాలతిని చూడొచ్చా? మా అమ్మవాళ్ళూ వాళ్ళ అమ్మావాళ్ళూ బాగా దిగులుగా ఉన్నారు" 
"ఇప్పుడు తను బాగా నీరసంగా ఉంది. బ్లడ్ ప్రతిసారి కంటే ఈసారి ఎక్కువగా పోయింది. లెట్ హర్ టేక్ రెస్ట్ టిల్ ఈవెనింగ్. ఐ విల్ ఇంఫార్మ్! డొంట్ వర్రీ అబవుట్ హర్ హెల్త్! ఈ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్." అని వార్డుకు వెళ్ళిపోయింది.
*    *    *
చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తున్న మాలతిని ఓదార్చడానికి చాలా కష్టమైంది వారికి.
"నన్ను కూడా తీసుకు పొయినా బాగుండేది గొడ్రాలనే పేరు లేకుండా పోయేదాన్ని"
"ఛా! వూరుకోమ్మా! కొందరికివన్నీ మామూలే" అంది తల్లి.
"అత్తయ్య ఏడుగురు పిల్లల తల్లి. ఆవిడకిలా అయిందా? నాకెందుకిలా అవుతోంది"
"అమ్మాయ్! మనం ఒకసారి శ్రీకాళహస్తికి బొయ్యి రాహు-కేతు జరిపించి వద్దాం. నాగదోషం పాడూ ఉంటే పోతాయి"
"నిజమే అత్తా! ఒకసారి వెళ్ళాలి"
"డాక్టరు నిన్న ఒక విషయం చెప్పారు" అంటూ మధ్యలో జోక్యం చేసుకున్న మధును అందరూ ఏం చెప్తాడా అని ఆతృతగా చూశారు.
"హుం.. ఏమీ లేదు.  కొంత గాలి మార్పు కావాలన్నారు"
"అందుకని" అన్నారు అందరూ.
"అందుకని కాళహస్తి వెళ్ళి వచ్చాక మేము ఒక రెండు మూడు నెలలు జొన్నవాడలో ఉండాలనుకుంటున్నాం"
"మంచిదే కదా! అయినా ఈ విషయం డాక్టరు గారు మీకు  చెప్పారా?" అంది ఆశ్చర్యంగా.
"అవును"
*    *    *
"రేపే ఉదయమే మనం జొన్నవాడ వెళ్తున్నాం. అక్కడ లోకల్‌గా మనకు ఒక ఆర్.ఎం.పీ డాక్ట్తరు ఉంటారు. నర్సును నెల్లూరినుండి పిలిపిస్తున్నాను. మనకు ఒక ఏ.సీ  రూం ఏర్పాటు చేశాను. మళ్ళీ మనం రేబాలకు వచ్చేది 3-4 నెలల తర్వాతే. గుడ్డలు అన్నీ సర్దుకో!"
"సరేనండీ!"
"నేను రోజూ కార్లో ఆఫీసుకు వెళ్ళి సాయంత్రానికి అటు వస్తాను"
"అలాగేనండీ!"
కారు జొన్నవాడ చేరుకునే సరికి ఉదయం 11 గంటలయింది. దర్శనం కోసం వచ్చే జనం బాగా ఎక్కువగానే ఉన్నారు. పూజారికి ముందుగా చెప్పి ఉండడం వలన వాళ్ళను లోపలికి పిలిచి ఉదయం సాయంత్రం దర్శనం చేసుకొని తీర్ధం ప్రసాదం తీసుకోవాలని ఇతర జాగ్రత్తలు అన్నీ చెప్పాడు.
*    *    *
రెండు నెలలు గడిచాక ఒకరోజు జొన్నవాడ ఆర్.ఎం.పీ డాక్టరు మాలతికి గర్భంతో ఉన్నదని కన్‌ఫరం చేసింది. ఆమె సంతోషానికి అంతే లేదు. వెంటనే దేవళానికి వెళ్ళి విశేష పూజలు జరిపించి ప్రసాదాలు పంచిపెట్టింది. విషయం తెలిసిన మాలతి అత్తా మామా అలాగే అమ్మా నానా వాళ్ళు జొన్నవాడ వచ్చారు. ఇంటికి వెళ్దాం అంటే మాలతి కొన్ని రోజులు అక్కడే గడపాలని ఉందని చెప్పారు. రోజూ నర్సు బీ.పీ. పల్సు చూస్తూ జాగ్రత్తగా ఉన్నారు. 
ఒకరోజు దేవళం పూజారి తీర్ధం ఇస్తూ "అమ్మా! ఇక్కడకు దగ్గరలో సాలె పేట ప్రక్కన ఒక ఆశ్రమం ఉంది. అక్కడ ఒక మాతాజి, బాబా ఉంటారు. నువ్వు వెళ్ళి ఒక్క సారి వారి ఆశీర్వాదం తీసుకొని వస్తే మంచిదేమో అని నా నమ్మకం అనగానే “అదేంటి పంతులుగారు మీరు చెబితే వెళ్ళనా! భలే వారే!” అని వెళ్ళిపోయింది. కానీ ఆ విషయం వెంటనే మరచిపోయింది. మళ్ళీ పూజారిగారు కూడా మళ్ళీ ఆవిషయం హెచ్చరించలేదు. 
ఒకరోజు దేవళం నుంచి వచ్చాక నర్సు సాలెపేట్లో ఎవరో పేషంటు ఉన్నారని అత్యవసరంగా చూడాలని చెప్పి అక్కడకు పోవడంతో సడన్‌గా  మాలతికి మాతాజి విషయం గుర్తొచ్చింది.  ప్రక్కరోజు ఉదయం మధు ఆఫీసుకు వెళ్తుండగా "ఒక సారి కారు పంపించండి. నేను ఇక్కడేదో ఆశ్రమం వుందట. వెళ్ళాలి పూజారిగారు చెప్పారు" అనడంతో "నువ్వు డ్రైవింగ్ చెయ్యకు. మీ తమ్ముడు ఖాళీగానే ఉన్నాడు. ఆఫీసుకు వస్తున్నాడు. వాణ్ణి పంపిస్తాను. పనవగానే పంపెయ్!" అని చెప్పి వెళ్ళిపోయాడు.
అన్నట్టుగానే 12 గంటలకు సురేష్ వచ్చాడు. ఏమిటక్కా నీ పిచ్చిగాని.. దేవుణ్ణి నమ్ముకో! మధ్యలో ఈ మాతాజీలు బాబాజీలు ఎందుకు?" అన్నాడు. "నువ్వు నోర్ముయ్‌రా! 10 నిముషాల్లో వస్తాను అని రెడీ అయి వచ్చింది. సాలెపేట వైపు కారు వెళ్తుంటే దూరంగా “శ్రీ నీలకంఠ  ఆశ్రమం” అన్న బోర్డు కనిపించింది. కారాపి సిగరెట్టు వెలిగించుకుంటూ "అక్కా! నువ్వెళ్ళి వెంటనే రా! నేను బయట ఉంటా!"అన్నాడు."ఒరేయ్ చంపుతా! లోపల దాకా వచ్చి వెళ్ళు. వెధవా! సిగరెట్ ఆపెయ్ ముందు" అనింది. విసుక్కుంటూ మెయిన్ గేట్ తెరవగానే ఒక నాగుపాము వీళ్ళిద్దరి మధ్యనుంచి వెళ్ళింది. ఇద్దరూ ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. లోపల ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. "అక్కా! అదుగో అక్కడ చూడు లారెల్, హార్డీ లాగున్నారు.. ఇద్దరు    పిలకాయలు  చూడు వాళ్ళనడుగు" అంటూ నవ్వుతూ బయటికి వెళ్ళిపోయాడు. కాస్తా భయపడుతూనే వాళ్ళ దగ్గరకు వెళ్ళి "బాబూ! ఇక్కడ మాతాజీ..." అనగానే వాళ్ళిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని చిరునవ్వుతో "లోపలకు వెళ్ళండి" అని దూరంగా ఉన్న ఒక గది చూపించారు. అక్కడకు నడిచింది.
అక్కడ లోపల ఒక బాబా ధ్యాననిమజ్ఞుడయి ఉన్నాడు. ఆయన తల జడలు కట్టి ఉంది. వళ్ళంతా విబూధి రేఖలు. మెడలో రుద్రాక్షలు. ప్రక్కనే పెద్ద ముత్తైదువ ఒకామె మొహమంతా పసుపు పూసుకొని నుదుట పెద్ద బొట్టుతో ఎర్రని వస్త్రాలు ధరించి ఆయనకు సేవలు చేస్తోంది. వారే మాతాజీ, బాబాలని గ్రహించింది. 
"నమస్కారం మాతాజీ!" అన్న మాటకు తలెత్తి చూసి చిరునవ్వుతో "రామ్మా! ఇలా రా! కూర్చో మాలతీ! అనింది మాత. "నాపేరు మీకు? అని ఆశ్చర్యపోతుండగా "నువ్వు వస్తావని తెలిసిందమ్మా!" అనింది. పూజారి గారు చెప్పి ఉంటారు అని అనుకుని "అమ్మా! ఆశీర్వదించు " అని పాదాలకు మ్రొక్కింది. పాదాలమీదనే ఒక నిముషం అలా ఉండిపోయింది. ఆవిడ కాళ్ళు చాలా చల్లగా ఉన్నాయి.  
  "పిచ్చిపిల్లా.. భయపడకు. ఈ సారి సుఖ ప్రసవం అవుతుంది. పండంటి మొగ బిడ్డకు జన్మనిస్తావు" అనింది. కళ్ళనీళ్ళ పర్యంతం అయింది మాధవి ఉద్విగ్నతో. బాబా కళ్ళు తెరిచిచూసి "అమ్మాయికి మరి..." అన్నాడు. వెంటనే ఆమె లోపల నుండి ఒక చెక్క బొమ్మను తెచ్చింది. "అమ్మా! ఈ బొమ్మ నీ బిడ్డనుకో! భారసాల వరకూ సదా నీవద్దనే ఉంచుకుని ఆ తర్వాత దేవుడి గదిలో పెట్టు" అని ఒక బొమ్మనిచ్చింది. కళ్ళకు అద్దుకుని "మహా ప్రసాదం మాతా!" అని కళ్ళకద్దుకొని బ్యాగ్‌లో పెట్టుకుని స్వామీజికి పాద నమస్కారం చెయ్యబోగా “వద్దు తల్లీ!  దూరంనుంచి నమస్కరించు చాలు" అన్నాడు. ఆయన పాదాల మీద మంచుగడ్డలమీద నుంచి వచ్చే పొగలాంటి ఒక చల్లని వాయువులు వీయడం గమనించింది మాలతి.  బయటకు వచ్చి ఇక్కడ ఏం అఘోరిస్తున్నావు రా? కారెక్కు! అంది. ఫోను మాట్లాడుతున్న సురేష్ ఉలిక్కిపడి ఫోన్-ఆఫ్ చేసి కారెక్కాడు.
*    *    *
మరుసటి రోజు  పూజారి ప్రసాదం ఇస్తుంటే తీసుకుని "పంతులుగారూ! నిన్న నేను మీరు చెప్పినట్లుగా ఆ ఆశ్రమానికి వెళ్ళాను!" అంది. నిన్న వెళ్ళావా? నిజమేనా? అని కొంచెం ఆశ్చర్యంగా చూశాక “అవును అన్నట్టు మాతాజీ, బాబా.. ఉన్నారా?" అని అడిగాడు. "ఉన్నారు స్వామీ! బాగా మాట్లాడారు" అన్నది. ఒక్క నిముషం ఉండు అని ఆఫీసు రూం నుండి ఒక ఫాంప్లెట్ తెప్పించి బొమ్మలు చూపించి "ఈ మాతాజీయేనా?" అని అడిగాడు. " ఏదీ చూడనివ్వండి..కాదు..కాదు! దీన్లో ఉన్నవాళ్ళు వేరు.  నేను కలిసిన వాళ్ళు వేరు  ఆశ్రమం పేరు మాత్రం... శ్రీ నీలకంఠ  ఆశ్రమం  ఇదే! స్వామీ!" అని బాబా..మాతాజీలను వర్ణించి చెప్పాక పూజారి మరింత ఆశ్చర్యానికి లోనయ్యాడు పూజారి. నాలుగు రోజులనుంచి వాళ్ళు ధార్మిక ఉపన్యాసాలకు నెల్లూరులో ఉన్నారు.  ఇంక రెండు రోజుల తర్వాత వస్తారన్న విషయం తేదీలు మరోసారి చూసి రూఢి చేసుకున్నాక ఏమీ మాట్లాడకుండా ఆశ్రమం లో ఏంజరిగిందన్న విషయం అడిగి తెలుసుకున్నాడు. ఆశ్రమంలోకి వెళ్ళగానే పెద్ద నాగుపాము బయటికి వచ్చిందన్న విషయం విని "అమ్మా! నీకు ఇంక ఏం భయం లేదు..నాగదోషం కూడా పూర్తిగా తొలిగిపోయినట్టే అనిపిస్తున్నది"  అని గర్భ గుడిలోకి చూస్తూ కామాక్షమ్మకు మల్లికార్జున స్వామికి ఒక్కసారి చేతులెత్తి నమస్కరించాడు.
*    *    *
ఆరో నెల వచ్చాక పూజారి "అమ్మా! నీకిక పర్వాలేదు! మీవూరెళ్ళి భర్త, అత్తమామల సంరక్షణలో ఉండి సీమంతం జరిపించుకో!" అని చెప్పి... “సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులే నీకు అండగా నిలబడ్డారు తల్లీ!. భయపడవలసిన పనేమీలేద”ని  ఆశీర్వదించాడు.   పంతులుగారికి వేయిన్నూట పదహార్లు దక్షిణగా ఇచ్చింది.  ఇంటికి చేరిన తర్వాత  మాలతి కాలు క్రింద పెట్టకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. 
సీమంతం ఏర్పాట్లు ఘనంగా చేశారు. సుఖప్రసవం జరగాలంటే గర్భకోశంపై తగినంత ఒత్తిడి వుండాలని వైద్య శాస్త్రం చెబుతోంది. చేతుల్లోని నరాలకు గర్భకోశానికి మధ్య అవినాభావ సంబంధం వుంటుంది. ఈ కారణంగా చేతులకు ఎక్కువగా గాజులు తొడగడం వలన అక్కడి నరాల ద్వారా గర్భకోశం పై కావలసినంత ఒత్తిడి పడుతుందని, ఫలితంగా సుఖప్రసవం జరుగుతుందని, ఎన్నో ఆరోగ్య సూత్రాలు ఇమిడి వున్న కారణంగానే నేటికీ ఆచారాలు కొనసాగుతూ ఉన్నాయని పంతులుగారు చెప్పి వేద మంత్రాలు చదువుతూ నేయి గలిపిన యజ్ఞశేష ప్రసాదాన్ని ఇచ్చాడు. మాధవ్ మేదిపుల్లతో మాలతికి పాపట తీసి వెంట్రుకలు చిక్కు దీయడం  అనే తంతు పెద్ద పెద్దముత్తైదువలు జరిపించి మంగళాన్ని ప్రసాదించే పాటలు పాడారు. వృద్దుల ఆశీర్వచనాలతోజరిగిన ఈ వైదిక కలాపము మాలతి హృదయంపై చెరగని ముద్ర వేశాయి.  తనకు మంచి గుణగణాలు గల పండంటి మగ బిడ్డ పుడతాడనే నమ్మకం ధృవపడింది. అలాగే అప్పుడే కాచిన ఆవునేయ్యు కలిపిన పులగాన్ని భగవంతునికి నివేదించి మాలతితో తినిపించారు. ఈ సంస్కారము పూర్తయిన తర్వాత కడుపునిండా బిడ్డలు కలిగిన పెద్దముత్తైదువలు చిరకాలము జీవించు బుద్ది మంతుడైన వంశోద్దారకులైన బిడ్డలను కనాలని, చిరకాలం సౌభాగ్యవతిగా వర్ధిల్లాలి అని ఆశీర్వదించి మంగళకరమైన పాటలు పాడారు.  ఆ అపూర్వ దృశ్యం మాలతికి చెప్పలేనంత బలాన్ని ఇచ్చింది.
*    *    *
తొమ్మిదవ నెలలో ఆసుపత్రిలో పండంటి బిడ్డను కన్న మాలతిని, మాధవ్‌ను అందరూ అభినందించారు. సంతోషంగా డిస్చార్జి అయి ఇంటికి తిరిగి వచ్చింది. డాక్టర్లకు, నర్సులకు ఆయాలకు ఘనమైన బహుమతులనిచ్చారు.
భారసాల రోజు ఎందుకో ఉదయం నుంచి బిడ్డ గుక్కపట్టి ఏడుస్తున్నాడు.  కారణం తెలీక కంగారు పడింది. పాలు పట్టింది. గ్రైప్‌వాటరు పట్టింది. ఇంతలో తల్లి రావడం తో ఆమెకు అప్పజెప్పి “చూడమ్మా మనవడు… పొద్దుటినుంచి గుక్కపట్టి ఏడుస్తున్నాడు”  అనగానే "బంగారు కొండ… రబ్బరు బొమ్మలా ఉన్నాడు. మనవణ్ణి నేనాడిస్తాగా! నువ్ పనులు చూడు" అని బయటకు తీసుకెళ్ళింది. అమ్మ నోటి నుండి “బొమ్మ” అని వినగానే, షాక్ తగిలినట్టయి ఒక నిముషం అలాగే ఆగి నిలబడ్డది.   వెంటనే ఉరుకులు పరుగుల మీద మేడమీదకు వెళ్ళి  హడావిడిగా  బీరువాలో గుడ్డలన్నీ విసిరేసి జొన్నవాడ నుంచీ వచ్చిన రోజున తెచ్చిన సంచీ దొరకగానే, దాన్ని ముద్దుపెట్టుకుని, గుండెలకు హత్తుకుని ఏడుస్తూ ఐదునిముషాలు అలా ఉండిపోయింది.  వెంటనే తేరుకుని బొమ్మను బయటకు తీసి శుభ్రం చేసి, పసుపురాసి కుంకుమ పెట్టి, దేవుడి మందిరంలో పెట్టింది. 
"అమ్మాయ్! మాలతీ! చూడు నీకొడుకు సామాన్యుడు గాదు తల్లోవ్!. రోడ్డులో కార్లు, ఆటోలు అన్నీ చూసి కిల కిలా నవ్వుతున్నాడు. నువ్వేమో ఏడుస్తున్నాడంటావ్" అంది. మాలతి గట్టిగా ఒక నిట్టూర్పు విడిచి, జగన్మాతను మనసులో ఒక్కసారి తలుచుకుని దండం పెట్టి,  మళ్ళీ తన భారసాల పన్లలో లీనమయింది.
*    *    *

No comments:

Post a Comment

Pages