ఆచారాలు! - అచ్చంగా తెలుగు
ఆచారాలు!
ప్రతాప వెంకట సుబ్బారాయుడు 


పిల్లలూ చూశారా, కరోనా సూక్ష్మ జీవి ఎలా ప్రపంచాన్ని వణికిస్తోందో! 
మన పెద్దవాళ్లు ఆచార వ్యవహారాలు మనకోసమే ఏర్పాటు చేసారు. వాటిని పాటించడంలోనే మన ఆరోగ్యం, అభ్యున్నతి ఆధారపడి ఉంటాయి. 
ఏదో చెబుతున్నారులే, ఏంటి వినేది? అని పెడచెవిన పెడితే ఎవరికి నష్టమర్రా, మనకే.
ఇంటి ముందు కళ్లాపి జల్లి ముగ్గు వేయడం, బయట నుంచి వచ్చినప్పుడు చెప్పులు వాకిట్లోనే విడిచి, మోకాళ్లదాకా, మోచేతులదాకా శుభ్రంగా కడుక్కుని ఇంట్లోకి వెళ్లడం, ఎవరన్నా పెద్దలు కనిపిస్తే నమస్కారం చేయడం, జ్వరం వచ్చినప్పుడు లంఖనం చేయడం, ఇంట్లో అమ్మ శుచిగా చేసిన పదార్థాలనే తినడం, బయట చిరుతిళ్లకు అలవాటు పడకపోవడం, ఉదయం, సాయంకాలం స్నానం చేయడం, వారానికోసారి తలంటుకోవడం, మానసిక బలం కోసం దేవుడికి పూజ చేయడం, పండగ విశిష్టతలను తెలుసుకుని పాల్గొనడం, గురువులను, పెద్దలను గౌరవించడం, కొత్త బట్టలు పసుపుపూసుకుని వేసుకోవడం ఇవన్నీ గొప్ప ఆచారాలే!
ఆచార వ్యవహారాల్లో మనదేశం చాలా గొప్పదర్రా. మన పూర్వికులు ఎంతో శ్రమించి, బోలెడన్ని విషయాలు కనుక్కుని మన తాతయ్యలు, బామ్మల ద్వారా మనకు తెలిజేశారర్రా! మనం పాటించి మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.
పిల్లలుగా ఉన్నప్పుడే విషయాలన్నీ శ్రద్ధగా తెలుసుకుంటే రేపు పెద్దయ్యాక మీకు ఎంతో ఉపయోగమర్రా.
మరి ఈ మామయ్య మాట వింతారు కదూ. పెద్దల మాట చద్దన్నం మూట అని గౌరవించి ఆచరిస్తారు కదూ..

మరి ఉంటానర్రా!
మీ సుబ్బుమామయ్య

No comments:

Post a Comment

Pages