మినగల్లు మీనాక్షమ్మ - అచ్చంగా తెలుగు

మినగల్లు మీనాక్షమ్మ

Share This
మినగల్లు మీనాక్షమ్మ
(మా జొన్నవాడ కధలు -2 )
టేకుమళ్ళ వెంకటప్పయ్య


అది కార్తీక మాసం.  జొన్నవాడ దేవళంలో ఈశ్వరాభిషేకాలు సాగుతున్నాయి. తడి గుడ్డలతో జనాన్ని తోసుకుంటూ "ముసిల్దాన్ని… ఉండండ్రా.. మీద పడబాకండి మీ దుంపల్దెగ!  అనుకుంటూ దర్శనానికి బోతున్నాది మీనాక్షమ్మ.
"ఒరే యెంకటేస్వర్లా! ఆ ముసిల్దానికి ఈ వయసులో యింత ఛలిలో పెన్నలో సరిగంగ స్నానాలూ.. పొద్దున్నే దర్శనాలు గావాల్నంటరా!  హాయిగా ఒక పక్కన ముడుచుకోని పడుకోక!" అన్నాడు  అంగట్లో సామాన్లు సర్దుకుంటూ చెంచయ్య.
"అరేయ్.. కళ్ళు పోతాయిరా.. దానికి పాతికేళ్ళ కాడ్నుంచి ఇదే అలవాటు. పొద్దున్నే కామాక్షమ్మను చూడందే పచ్చి మంచి నీళ్ళు కూడా అంటుకోదు" అన్నాడు అంగట్లో టీ గ్లాసులందిస్తూ.
"ఓం నమశ్శివాయ! శివయ్యా! చావాలనుకున్నోళ్ళను ఉంచతావు. బతకాలనుకున్నోళ్ళను చంపుతావు. నీ మాయలు  ఎప్పటికి అర్ధం కావు.  ఉత్త మాయగాడివి శివయ్యా నువ్వు అనుకుంటూ వచ్చి మీనాక్షమ్మ "ఓరి చెంచుగా! ఒక స్టాంగ్ కాపీ యియ్యి" అని బల్లపై కూలబడింది.
"ఒసే ముసిలీ! కాటికి కాళ్ళు చాచుకున్నదానివి. ఇంత ఛలిలో నీకు స్నానాలు ఎందుకే? ఏ ఛలిజ్వరమో వచ్చి చస్తే ఎవడు దిక్కు?" అన్నాడు కాఫీ గ్లాసు అందిస్తూ. 
"అవున్రా! ఆ చావే వచ్చి చావడంలేదు. ఎంజెయ్యమంటావ్ చెప్పు" అనుకుంటూ అంగట్లోకి వెళ్ళి టెంకాయలు సర్దుకుంటుంటూ ఒక్కసారి రమణయ్యమావ ఫొటో చూసి కళ్ళనీళ్ళ పర్యంతం అయింది.  
కాలచక్రంలో జ్ఞాపకాలు నలభై యేళ్ళ వెనక్కు వెళ్ళాయి.
*    *    *
మీనాక్షి ఎక్కి తొక్కుతున్న సైకిలు చక్రం ఉన్నట్టుండి ఆగిపొయ్యేతలికి విషయం అర్ధంగాలా... కొత్తూరు నుండి సైకిలు మీద గిర్రుమని పావు గంటలో పాతూరికి బొయ్యేది. దిగి చూస్తే చైను పడింది. ఇంకో పది నిముషాల్లో పాతూరు దేవళంలో పూలియ్యాల. చైను ఎయ్యడం రాదు. ఇదేమిట్రా భగవంతుడా అనుకుంటుంటే ఎదురుగుండా ఒక అబ్బాయి సైకిలు మీద వెనక పెద్ద తట్టతో దిగాడు. "ఎందిమే.. ఏంది కతా? ఏమయింది" అన్నాడు. మౌనంగా సైకిలు చైను చూపించింది. "ఒసి. నీయమ్మ బడవ! ఇంతేనా... చైను పడితేనే ఇంత బయపడిపోతున్నా.." అని క్షణాల్లో చైన్ వేసి. "నా పేరు రవణారెడ్డి" జొన్నాడకు పూలు అరిటిపళ్ళు తీసుకొనిబొయి అమ్ముతుంటా!  మేయ్… నీ పేరు ఏంది? ఎవురి అమ్మివి నువ్వు ?" అన్నాడు. జవాబు చెప్పకుండా మీనాక్షి తెలేదన్నట్టు చెయ్యి ఊపుతూ  నవ్వుకుంటూ సైకిలెక్కింది. నీ బండబడ!  పేరడిగితేనే ఇంత సిగ్గా..నీక.." అని సైకిలెక్కి జొన్నవాడ వైపు సాగిపోయాడు.
రెండు రోజులు అలాగే చూసి కూడా చూడనట్టు పొయ్యేసరికి రమణయ్యకు వళ్ళు మండి ఒకరోజు రోడ్డుకడ్డంగా సైకిలు బెట్టి నిలుచున్నాడు. ఏంది? అన్నట్టు కళ్ళెగరేసింది? "పేరు జెప్పమంటే ఏంది మే నువ్వు! నకరాలు పడతా వుండావు? నేనేమన్నా ముద్దు బెట్టమన్నానా ఏందీ?”  తలొంచుకుని "మీనాక్షి" మా నాయన కొత్తూర్లో పంచాయితీ ఆపీసు పక్క ఉండే అల్లం సుబ్బయ్య" అని చెప్పి ఇంక వెళ్ళాలన్నట్టు దారిమ్మన్నట్టు చూసింది.   "ఒరి ఒరి ...కొత్త మినగల్లు బోడి సుబ్బయ్య కూతురా నువ్వా?  బలే అందంగా వుండావు మే.. నువ్వు. నీ నవ్వుగూడా చానా బాగుంది. ఒక్కమాట నిజంగా జెప్తన్నా యిను.…  ఒట్టు మే.. నీ ముక్కు సూపరు. నీ కళ్ళు ఇంకా బెమ్మాండం. అదేందది.. ఏదో సినిమా పాట... ఏందోలే... గవనానికి రావడంలే... సరే.. ఇంకబో !" అన్నాడు.
“కళ్ళు బాగుంటాయనే మా యమ్మ నాకు మీనాక్షి అని పేరుబెట్టింది” అని సైకిలెక్కింతర్వాత  జెప్పి పెద్దగా నవ్వుతూ తుర్రుమంది. కళ్ళకూ మీనాక్షి పేరుకూ ఉన్న కనెక్షన్ అర్ధంగాక రవణారెడ్డి గుళ్ళో అయ్యోరిని అడగాలివాళ ఆ కతేందో తేలిపోవాల అనుకొన్నాడు.
*    *    *

“మే…రవణారెడ్డి ఎవురే?”  అన్న అమ్మ ప్రశ్నకు ఉలిక్కి పడింది మీనాక్షి. "ఏమో నాకేం దెలుసు.." అన్నది. “ఎదవ సెకలు చెయ్యబాక చంపుతా!” అనేసరికి జరిగిన విషయం చెప్పింది. “అంతేనా? ఇంకేమైనా ఎవ్వారాలు నడిచాయా మీ మద్దిన?” అన్న నాయన ప్రశ్నకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. “ఏం లేదులే బయపడమాక. నిన్న రచ్చబండ కాడ రమణయ్య వాళ్ల నాయిన అవపడి నాతో మాట్లాడాడు. వాళ్ళు  మాపిటికి నిన్ను చూడ్డానికి వస్తారంట" అన్న అమ్మ మాటలకు సిగ్గుపడి సందులోకి బోయింది. రమణయ్య అమ్మా నాయినా వాళ్ళు చూడడం పెళ్ళి కుదరడం వెంట వెంటనే జరిగాయి. పెళ్ళి మాఘమాసంలో అయిపోవాల. మళ్ళీ వైశాఖ మాసంలో జొన్నాడలో రమణయ్యకు పనెక్కువ అని తొందరపెట్టడంతో పెళ్ళి చేసి కాపురానికి పంపారు.   అలా  మీనాక్షి,  మీనాక్షమ్మగా మారి జొన్నవాడలో రమణయ్య మావతో కాపరం బెట్టింది.
*    *    *
ఐదేళ్ళు బెమ్మాండంగా నడిచింది. బుచ్చి నుంచి అరటిపళ్ళు, రేబాల నుంచి పూలు, కోవూరు నుంచి టెంకాయలు తెచ్చి వ్యాపారం మోత మోగించారు. కామాక్షమ్మ దయవలన పండంటి మొగబిడ్డ కలిగాడు. అందరూ దొరబాబు లాంటి కొడుకంటుంటే మురిసిపోయింది మీనాక్షమ్మ. ఆ శివయ్యే అండని శివయ్య పేరుబెట్టారు. అంతలోనే కష్టాలు మొదలయ్యాయి. రమణయ్యమావ ఒకరోజు పాతూరునుంచి సైకిల్లో వచ్చి గుండెల్లో నెప్పని అడ్డంబడ్డాడు. ఏవో నాటువైద్యాలు చేస్తే కాస్తా తగ్గినా మళ్ళీ ఒకరోజు మళ్ళీ తిరగబెట్టింది. నెల్లూర్లో రామచంద్రారెడ్డి ఆస్పత్రికి ఒంటెద్దు బండిలో తోలుకొనిబోతే రెండు రోజులు ఆగితే గానీ చెప్పలేమన్నారు. మీనాక్షి మొక్కని మొక్కు లేదు. కానీ ఆ దేవుడు మూడో నాడు ఉదయం మీనాక్షికి అన్యాయం చేసి, ఆస్పత్రివాళ్ళు శవాన్ని అప్పజెప్పారు. కన్నీరు మున్నీరుగా ఏడ్చినా ఫలితం ఏముంటుంది.  ఆ తర్వాత మీనాక్షికి చెప్పరాని కష్టాలొచ్చాయి. వయసులో ఉన్న పిల్లాయె. ఎందరో మొగాళ్ళు డబ్బు ఎరజూపించి, ఎన్నో విధాల ప్రలోభపెట్టినా, లొంగదీసుకోవాలనుకున్నా,  వాళ్ళ మొహాన ఉమ్మేసి,  గుండె దిటవు చేసుకుని బిడ్డను సాకింది. కామాక్షమ్మను గట్టిగా నమ్ముకుని టెంకాయల వ్యాపారం అట్టానే నడిపించింది. శివుణ్ణి జొన్నాడలో వీధిబడి అయింతర్వాత పాళెం హైస్కూల్లో జేర్చింది.  నెల్లూరు వి.ఆర్.కాలేజీలో చదువయిందని పుట్టింటివాళ్ళిచ్చిన పొలం, తోట, పాతమినగల్లులో యిల్లు అన్నీ అమ్మి చదివిస్తే  పట్నంలో జదివి పెద్ద ఇంజనీరయినాడు. 
*    *    *
శివారెడ్డికి మదరాసులోనే  పెద్ద ఉద్యోగం వచ్చింది. అమ్మను తనతో తీసుకొనిపోవాలని ఎన్ని తూరులు ప్రయత్నం చేసినా "అయ్యా శివయ్యా! నువు చల్లంగుంటే నాకు అంతే జాలు. నేను ఈ శివయ్యను కామాక్షమ్మను  చూడకుండా బతకలేను. మీ అయ్య నేను పొద్దున్నే పెన్నలో మునిగి దర్శనం జేసుకోని అంగడి బెట్టేవాళ్ళం. అట్టాంటిది ఈ కట్టె కాలేవరకూ అమ్మణ్ణిని జూడ్డం మాత్రం ఆగూడదురా అయ్యా.. నా మాటిను ఏవో నాలుగు టెంకాయలు అమ్ముకుంటే వంద రూపాయలు వస్తే నాకు రోజెల్లిపోద్ది. నీవేమి నాగురించి దిగులు పడమాక. ఈ మీనాక్షమ్మకు ఆ కామాక్షమ్మ ఎప్పుడూ తోడే" అని నవ్వేసేది.  శివయ్యా! నాకు ఒంట్లో బాగుండక జబ్బు జేసిందనుకో  నీ ఫోను నంబరు చూడు గోడ మీద ఎంత పెద్ద అచ్చరాలతో రాయించానో అని "శివారెడ్డి -  మీనాక్షమ్మ కొడుకు" అని బొగ్గుతో రాసిన నంబరు చూపించేది.
*    *    *
ఒకరోజు శివయ్య పెద్ద కార్లో దిగాడు. వెంట ఎవరో ఆడమడిషి ఉంది. "ఎవురయ్యా! శివయ్య! ఆ యమ్మి" అని అడిగింది. అమ్మా క్షమించమ్మా! అనుకోని పరిస్థితులలో పెళ్ళి జేసుకోవాల్సి వచ్చింది. నీ కోడలు పేరు సుగుణ" అన్నాడు. యిద్దరూ కాళ్ళపై బడ్డారు. "చిలుకా గోరింకల్లాగా ఉండండ్రా.. నేను ఎప్పుడో ఒకప్పుడు రాలిపోయే దాన్నే!" ముందు పండంటి మొగబిడ్డ బుట్టాలని ఆ కామాక్షమ్మకు మొక్కోని రాండి పోండి" అని చెప్పి పంపించింది. రమణయ్య పటం ముందు కన్నీళ్ళతో నిలబడింది "మావా! నువ్వుండుంటే యిట్టా అయ్యేదా! నిన్నేమో ఆ శివయ్య తొందరగా దీసుకోని పాయె! " అనుకుంటూ ట్రంకు పెట్టెలో రమణయ్యమావ పెళ్ళయిన కొత్తల్లో మోజుపడి కొనిచ్చిన వడ్డాణ్ణం బయటికి తీసింది. మీనాక్షమ్మ చేతులు వణికాయి. అది పెట్టుకుందే లేదు. ఎప్పుడూ అంగడి ధ్యాసే సరిపోయేది.  కోడలు చేతిలో పెట్టింది. కోడలు పరమానంద పడింది. "వరే.. శివయ్యా! నెలకో పాలు వచ్చి కనిపిచ్చి పోతా ఉండయ్యా చాలు" అంటుంటే కొడలు ఈ మట్టికొంపలో ఉండలేమన్నటు ముక్కు మూసుకుంటుంటే శివారెడ్డి "నువుబొయి కార్లో కార్లో కూర్చో! ఐదు నిముషాల్లో వస్తా!" అన్నాడు.
శివారెడ్డి నులకమంచంపై నిస్త్రాణగా కూలబడ్డ అమ్మను చూసి వొళ్ళో తలబెట్టుకుని పెద్దగా ఏడ్చాడు. "అమ్మా! నువ్వూ వొచ్చెయ్యెమ్మా మాతోటి" అన్న మాటకు నవ్వి జుట్టు సవరిస్తూ "ఒరే శివయ్య! కోడలు పిల్ల పెద్ద పెద్ద మిద్దెల్లో ఉన్న అమ్మి గావాల. జాగర్తగా జూసుకో! నేను మీ మద్దిన ఆడ పానకంలో పుడకలా వద్దు గానీ... నాకు పాణం బాగాలేని రోజు ఎలాగూ తప్పదు"  ఒక మాట జెపతా విను “తగాదాలు బడి కీచులాడుకోబాకండి. ఆయమ్మికి కోపం వత్తే నువ్వు తగ్గు. నీకు కోపం వచ్చినప్పుడు ఆ యమ్మిని తగ్గమను. అంతే కాపురంలో రహస్యం." ఇంక బో కోడలు దిగులు పడతుందేమో" అని కన్నీళ్ళతో సాగనంపింది.
*    *    *
శివారెడ్డి పోయిన మూడు రోజులకు పెన్నలో మునిగి అమ్మణ్ణి దర్శనం చేస్కోని వస్తుంటే జనాలు దోసుకోని బోళ్ళాబడి తలకు గట్టి దెబ్బ తగిలి చానా నెత్తురు కారిపోయింది. వొళ్ళు మగతగమ్మి మాట కూడా రాలేదు. ఊర్లో ఉన్న ఆర్.ఎంపీ. యింక ముసిల్ది బతకడం కష్టమే అని తేల్చేశాడు. టీ అంగడి చెంచయ్య కొడుక్కి ఫోన్ చేశాడు. శివయ్య వచ్చేదాకా ఎట్టాగో పాణం ఉగ్గబట్టింది. శివయ్య రాగానే కోడలేది అని సైగ చేస్తే కాన్పుకు బొయిందని చెప్పాడు. అంతే..కొంగునున్న తాళంచెవి యిచ్చి కన్నుమూసింది. దహన సంస్కారాలు అయింతర్వాత శివారెడ్డి తిరుగు ప్రయాణం అయ్యాడు. నాన్న ఫొటో తీసుకున్నాడు. అంతలో అమ్మ ఇచ్చిన తాళం గుర్తొచ్చి ట్రంకు పెట్టె తెరిచాడు. దాంట్లో అమ్మ మంగళసూత్రం, నల్లబూసలు వంటి బంగారం సొమ్ములు, వెండి సామాను, మంచి కొత్త పట్టు చీరెలు ఉన్నాయి. వాటిని భద్రం చేసుకున్నాడు. అడుగున తను తిర్నాళ్ళలో రెండేళ్ళప్పుడు అమ్మా నాయినతో దిగిన ఫొటో ఉంది. ఇంతవరకూ రాని దు:ఖం ఒక్కసారి కట్టలు తెంచుకుంది. వెక్కి వెక్కి ఏడ్చాడు. కారెక్కే ముందు చివరిసారి తన ఇంటివైపు చూసుకునే సరికి బాల్య స్మృతులు గుర్తొచ్చి కళ్ళనీళ్ళాపుకుంటూ వెళ్ళిపోయాడు.
మీనాక్షమ్మ రాత్రిపూట తెల్లధోవతి కట్టుకుని జొన్నవాడలో తిరుగుతుంటుందని, కొంతమందికి కనిపిస్తూ ఉంటుందని,  ఆ ఊరివాళ్ళు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు.
*    *    *

No comments:

Post a Comment

Pages