పరుగేలరా... - అచ్చంగా తెలుగు
పరుగేలరా ...  
మీనాక్షి దేవి చెరుకువాడ


గేటు తీసిన చప్పుడు. ఎనభై ఏళ్ళ పెద్దామె జుట్టు రేగిపోయి, నైటీని రెండు చేతులా ఎత్తిపెట్టుకుని తడబడుతున్న అడుగులతో తీసిన గేటు అలానే వదిలేసి తూలిపోతూ పరిగెట్టాలనే ప్రయత్నం. 
" అయ్యో పెద్దమ్మగారూ .. అదేటి అట్టా పరిగెడుతున్నారు? అసలు మీరెలా నెగిసారు .. ఇంట్లో ఎవుళు నేరా ఏటీ?  రండి ఇంటోకి " అప్పుడే అటుగా వస్తున్న సూరమ్మ ఆమెను జాగ్రత్తగా పట్టుకోబోయింది.
" ఉండవే బాబూ .. " అంటూనే పాదరసంలా జారిపోయిందావిడ. ఎక్కడ పడిపోతుందో అన్నట్లు తూలిపోతున్నా ఆ పరుగునాపలేదు.
" అరే .. పిన్నీ ఇదేమిటీ? అసలు నువ్వు..  నువ్వు మంచం ఎలా దిగగలిగేవు?  ఎలా .. ఎలా నడిచావసలు? ఇదేదో ఎనిమిదో వింతలా ఉందే .. పోనీలే ఇన్నాళ్ళకు ఆ ఫిజియో థెరపీ పనిచేసి లేవగలిగావు అదే పదివేలు .. రా మా ఇంట్లోకి " అంటూ  కొంటున్న కూరలు వదిలేసి ఈవిడ వైపు తిరిగింది ఆవిడ అక్క కూతురు లక్ష్మి.
" ఉండవే లచ్చుడూ .. బతికుంటే మళ్ళీ కలుద్దాం " అంటూ  జారిపోయి కాళ్ళకు అడ్డం పడుతున్న నైటీ మళ్ళీ ఎగ్గట్టి పరుగు లంకించుకుందావిడ.
అలా అతికష్టం మీద ఆ రోడ్ చివర వరకూ పరిగెత్తిన ఆవిడ కళ్ళు తిరిగి పడబోతుండగా అప్పుడే అక్కడకొచ్చిన ఓ కుర్రాడు గభాలున ఆమెను పడిపోకుండా పట్టుకున్నాడు.
" అరెరే .. బామ్మగారూ .. మీరు మీరేనా .. నాకు ఒక్కరోజూ సహకరించని మీరు ఇప్పుడు ఇలా లేచి .. ఓ గాడ్ లేవడం ఏంటీ! ఏకంగా పరిగెడుతుంటే .. నా ఫిజియో థెరపీ ఇంత బాగా పనిచేస్తుంటే .. ఓహ్ .. అద్భుతం, ఆశ్చర్యం .. ఆనందం .. ప్లీజ్ బామ్మా ఒక్క సెల్ఫీ .. మీతో ఒక్క సెల్ఫీ తీసుకుని నా క్లినిక్ దగ్గర పెట్టుకుంటే .. 'ట్రీట్మెంట్ ముందూ ... ట్రీట్మెంట్ తరువాతా ' అన్న టాగ్ లైన్ తగిలిస్తే ... వావ్ .. నా క్లినిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది " ఆనందం, ఆశ్చర్యం కలగలిపిన గొంతుతో మాట్లాడేస్తున్నాడు డాక్టర్ వివేక్.
" ట్రీట్మెంటూ .. లేదు ఆయింట్మెంటూ లేదు .. నీ మొహం మండా .. నన్ను వదులు .. నే పోవాలి " అతని నుంచి విడిపించుకోవాలని గింజుకుంటూ అంది మాణిక్యాంబ.
"అరే బామ్మా .. ఏమిటా ఆనందం .. మీకు నడవాలని ఎంత ఆరాటంగా ఉన్నా ఒకేసారి అంత సేపు నడవకూడదు .. మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ చెయ్యాలి. పదండి మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెడతా .. "
" వద్దురా అబ్బీ .. నన్నొదలరా, నేనా ఇంటికి రాను .. " ఎంతకూ వదలని అతని చేతిని వూడగా మిగిలిన నాలుగు పళ్ళతో లటుక్కున కొరికేసింది.
" అబ్బా .. బామ్మా చంపావు కదే " అంటూ ఏకవచనంలోకి దిగిపోయి ఆవిడను చటుక్కున వదిలేసి మంటపెడుతున్న చేతిని వూదుకుంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు ఆ కుర్ర డాక్టర్.
" అయిందా పెళ్ళి, మరి నే చెబుతుంటే వినకుండా నన్నే ఆపాలని చూస్తావ్! ఏడు ..  అయ్యో ..వాళ్ళు వచ్చేస్తున్నారే యములాళ్ళలా "  అంటూ మళ్ళీ పరుగు లంకించుకుంది మాణిక్యాంబ.
" పెద్దమ్మ గారూ, పిన్నీ,.. అత్తయ్య గారూ " అంటూ పరుగుల పోటీలో పాల్గొనే వాళ్ళలా ఒకరి వెనుక ఒకరు పరిగెత్తుకుంటూ వస్తున్న వాళ్ళను అప్పుడు చూసాడు.
" అరె .. ఏమైందీ ముసలామెకి .. ముందు ఆవిడను ఆపాలి " అనుకుంటూ మెరుపులా కదిలాడావైపు డాక్టర్ వివేక్.
తనను పట్టుకోబోతున్న వివేక్ తో " ఇదిగో కుర్ర డాక్టరూ .. నువ్వు కనక నన్ను వదిలేస్తే నా మెడలో ఉన్న కాశికాయగుళ్ళు నీకిచ్చేస్తా." ఆశ చూపింది.
"బామ్మ గారు .. మీకేం భయం లేదు, నేనున్నాగా .. అయినా అసలు మీరు దేనికి అలా పారిపోతున్నారు? మీ అబ్బాయీ, కోడలూ మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నారు, మరి ఏమైందీ, మిమ్మల్ని ఏమైనా అన్నారా? " అనునయంగా అడిగాడు ఆవిడను గఠిగా పట్టుకుని.
"నన్నెవ్వరూ ఏమీ అనలేదు, నా కొడుకూ, కోడలూ నన్ను ఎంతో ప్రేమగా చూస్తారు, నా రాతే ఇలా తగలడింది, ఎవరిని ఏమని లాభం " కళ్ళూ ముక్కూ ఒత్తుకుందుకు పమిట చెంగు లేకపాయే ..చటుక్కున డాక్టర్ చొక్కాకు తుడిచేసింది.
ఈ లోపుగా ఆయాసపడుతూ, ఒగుర్చుకుంటూ అక్కడికి చేరారంతా. 
"అత్తయ్యా .. ఏమైంది .. ఎందుకిలా .. మీకేమైనా అవసరమయితే నాకు చెప్పచ్చుగా .. " గుడ్ల నీరు కుక్కుకుంటూ అంది కోడలు.
"మరీ .. మరి నువ్వు .. నువ్వు ఆ సాధన ఆపకపోతే నే తట్టుకోలేనే అమ్మా. పెద్దముండాదాన్ని .. అలా మంచంలో పడి ఉంటే .. ఎటూ కదలలేని దాన్ని కదా .. ఎలా భరించాలి చెప్పు .. పోనీ గంటా .. ఘడియానా .. రోజంతా .. ప్చ్ ..ఈ ఆఖరి ఘడియల్లో నా కెందుకింత క్షోభ చెప్పు " కళ్ళ నీళ్ళు కారిపోతుండగా జాలిగా అడిగిందావిడ.
" అయ్యో అత్తయ్యా .. అదా మీ బాధ .. అలా అయితే నాతో చెప్పాలి కానీ ఇలా రోడ్డున పడతారా చెప్పండి.ఏదో ఇన్నాళ్ళకు కాస్త ఖాళీ దొరికి చిన్నప్పుడెప్పుడో నేర్చుకున్న విద్యను సార్ధకం చేద్దాననుకున్నానే కానీ అదే మిమ్మల్నింత బాధ పెడుతుందనుకోలేదు. రండి మీకు మాటిస్తున్నా ఇకనుంచీ నా సాధనా లేదు  .. మీకు వేదనా, రోదనా లేవు." ముఖం చిన్నబుచ్చుకుంటూ అంది కోడలు.
" అయినా మాడం గారి పాటతో రాయిలా పడిఉన్న మీరు రౌతులా మారారు చూడండి, అదే మరి సంగీతానికి రాళ్ళను కరిగించే శక్తి ఉండడమంటే ' పకపకా నవ్వాడు వివేక్.
నాలుగు నెలలు వెనక్కి వెడితే .. సంక్షిప్తంగా ...
                                    ***
మంచం మీదున్న మాణిక్యాంబ అశాంతిగా కదులుతోంది .. సుమారు మూడేళ్ళుగా మంచం మీదే అన్నీ అయిన ఆమెలో చిరు కదలిక. తల అసహనంగా కదిలిస్తోంది. కాళ్ళూ చేతులూ కదపాలనే ప్రయత్నం. 
అప్పుడే ఆవిడ కడుపులో పడ్డ ఇడ్లీ కూడా బయట పడే ప్రయత్నంలో గాభరాగ పరుగులు పెడుతోంది. 
భర్తని ఆఫీస్ కు పంపి అత్తగారి ఆలనా పాలనా చూసి. భక్తిగా భగవంతునికి పూజ చేసి, సుష్టుగా ఉపాహారం తిన్న సీతమ్మ హాలులో చక్కటి తివాచీ మీద శుభ్రంగా మఠం వేసుకుని కూచుని  హాలులో ఓ మూల బల్ల మీద కూర్చుని దీనంగా చూస్తున్న త్యాగరాజ వారికీ, సరస్వతీ దేవికీ భక్తిగా  కైమోడ్చి .. సాధన మొదలు పెట్టింది.
ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న సంగీత జ్ఞనాన్ని వెలికి తీసే విఫలయత్నం ఆమెది. ఎన్నో ఏళ్ళుగా ఇటు సంసార సాగరంలోనూ అటు విధి నిర్వహణ బాధ్యతల్లోనూ ములిగి తేలిన సీతామహాలక్ష్మి అనబడే ఆ సీతమ్మ ఇక విసుగెత్తి విధులకు ఉద్వాసన చెప్పి తనలోని సంగీత నిధులను వెలికి తీసే కఠోర దీక్షలో ఉంది. 
పాపం అదే ఆ అత్తగారి పాలిట   గృహ హింసగా మారింది. పారిపోదామన్నా వీలులేని స్థితి .. మొదట్లో మూగగా కన్నీరు కార్చేది .. రోజులు గడిచే కొద్దీ భరించడం కష్టమై పోయింది. సుమారు రెండేళ్ళ పాటు ఫిజియో థెరపిస్ట్ చేయలేని పని సీత రెండే రెండు నెల్లల్లో చాలా సులువుగా చేసేసింది. మొదట్లో నీటిలో పడ్డ చేపపిల్లలా గిల గిలా కాళ్ళూ చేతులూ కొట్టుకున్న మాణిక్యాంబ క్రమేపీ చచ్చుబడిపోయిన  కాళ్ళూ చేతులోఓ జీవం వచ్చి కదలడం ప్రారంభించాయి.
పాపం ఇదేమీ తెలియని సీతమ్మ యధేచ్చగా సుమారు రెండు గంటల సేపు రోజూ సాధన చేస్తూనే ఉంది. అదృష్టం ఏమిటంటే ఆ లంకంత కొంప చుట్టూ బోలెడంత జాగా, వాటిలో బోలెడన్ని మొక్కలూ చెట్లూ.
ఎప్పుడూ పక్షుల కిలకిలారావాలతో సందడిగా ఉండే ఆ తోట క్రమేపీ నిర్ పక్షీయం ( నిర్మానుష్యం లా అన్న మాట) అయిపోయింది. ఇప్పుడు చెట్లకున్న కాయలూ , పళ్ళూ అలానే  రాలిపోతున్నాయి తినే పిట్ట కూడా లేకపోవడం చేత.
నెల నెలా ఆమెను పరీక్షించ వచ్చే వైద్యుడి ఊహకు, జ్ఞానానికి అందనంత మార్పు కనబడింది మాణిక్యాంబ ఆరోగ్యంలో. ఇప్పుడు శరీరంలో కదలిక వచ్చింది, కదల గలుగుతోంది, తన చేత్తో తనే తినగలుగుతోంది, చిన్న గ్లాసుతో నీళ్ళు తాగగలుగుతోంది. వైద్య శాస్త్రంలోనే కనీవినీ ఎరుగని పరమాద్భుతమని ఆనంద పడిపోయాడా వైద్యుడు. అదంతా ఆవిడ పూర్వ జన్మ సుకృతం అనీ, కోడలు చేస్తున్న సేవల ఫలితం అనీ, బంగారంలాంటి ఉద్యోగం కూడా మానేసి ఆవిడ అత్తగారికి చేస్తున్న సేవలు ఫలించాయనీ వైద్యుడు, ఆయన చెప్పిన మాటలకూ, తన భార్య ఔన్నత్యానికీ సీతమ్మ మొగుడూ ఇద్దరూ కలిసి వేసిన చిందులకు పాపం ఆ వైద్యుడి నడుం కూడా పట్టేసింది.
                        ***
చూస్తుండగానే ఆరు నెలలు గిర్రున తిరిగిపోయాయి. సీత సాధన నిరాటంకంగా సాగిపోతోంది. మాణిక్యాంబను విధి పగబట్టిందా అన్నట్లు ఓ దుర్ఘడియలో ' సంక్రాంతి గాన సభల ప్రకటన ' వార్తాపత్రికలో సీతమ్మ కంట పడింది. 
వాటి నిర్వాహకులను కలిసి తనకు ఆ గాన సభల్లో పాడే అవకాశం ఇప్పించమనీ, ‘మనీ ‘ఎంతైనా విరాళంగా ఇవ్వడానికి తను సంసిద్ద’మనీ ’  చెప్పింది. దానితో ఆ నిర్వాహకుల గుండె కరిగి ఆమె సంగీత చింతనకు కళ్ళు చెమర్చి, హృదయం పులకించి .. ఓ సుప్రసిద్ద సంగీతకారుడి కచేరీకి ముందు ఒక అరగంట ఆమెకు కేటాయించారు.  బోలెడు డబ్బు పోసి ఆ సంగీతకారుడి కచేరీకి వచ్చే జనం ఆ అరగంట హింసా చచ్చినట్లు భరిస్తారన్నది వారి అనుభవం.
కేవలం రెండే రెండు నెలల వ్యవధి తన కచేరీకి అన్న ఆలోచన సీతమ్మను మరి నిలవనీయక ఇంకా ఇంకా సాధన కఠినతరం చేసింది.
దాని ఫలితమే, ఊరూ వాడా, బంధు మిత్రులందరిలో సంచలనం కలిగించిన మాణిక్యాంబ లోని ఈ చలనం.
  ***

No comments:

Post a Comment

Pages