గుణాఢ్యుడి బృహత్కథ - అచ్చంగా తెలుగు

గుణాఢ్యుడి బృహత్కథ

Share This
 గుణాఢ్యుడి బృహత్కథ
శారదాప్రసాద్ 


భారతీయ సాహిత్యంలో కథా సరిత్సాగరానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీన్ని పదకొండవ శతాబ్దానికి చెందిన సోమదేవుడు అనే బ్రాహ్మణుడు సంస్కృతంలో రచించాడు. ప్రపంచ ప్రఖ్యాతమైన గుణాఢ్యుడి బృహత్కథను ఆధారం చేసుకుని రచించినట్టు సోమదేవుడు పేర్కొన్నాడు. గుణాఢ్యుడు బృహత్కథను దక్షిణ భారతదేశానికి సంబంధించిన ప్రాచీన భాషయైన పైశాచీలో రచించాడు. బృహత్కథ పైశాచీ ప్రతులు ఇప్పుడు ఎక్కడా దొరకని కారణంగా బృహత్కథకు సంబంధించి దొరుకుతున్న రచనల్లో ప్రాచీనమైన అనువాదం కావడం, రచయిత యథామూలంగానే అనువదించారని భావన ఉండడంతో కథాసరిత్సాగరము చాలా ప్రాధాన్యత కలిగివుంది. కాశ్మీర దేశ రాజైన అనంతదేవుడి పట్టమహిషి అయిన సూర్యమతీ దేవి వినోదం కోసం ఈ కథలు రాయబడినట్లుగా తెలుస్తోంది. ఈ కథల్ని 18 పుస్తకాలు, 124 అధ్యాయాలు, 21000 శ్లోకాల్లో రాశారు. ఇవన్నీ మహారాజు ఉదయనుడి కుమారుడైన నరవాహనదత్తుడి సాహసాల చుట్టూ తిరుగుతాయి. దీనిని ప్రసిద్ధ పండితుడు, కవి వేదము వేంకటరాయశాస్త్రి గారు అనువదించారు. 

కొందరు పండితుల్లో సంస్కృతమంటే గౌరవము, ప్రాకృతమంటే ఈసడింపు
ఉంది. కానీ ప్రాకృతాన్నిహాలుడు చక్రవర్తి ఒప్పుకున్నాడు. క్రీస్తు శకానికి కొంచెం ముందు తెలుగు దేశాన్ని పాలించిన శాతవాహన ప్రభువుల్లో ఒకడు.గాథాసప్తశతిని సంకలన పరిచి చిరయశస్సును కైవసం చేసుకున్న హాలుడికి సంస్కృతం తెలియదు.అతడి భార్య లీలావతి సింహళ రాకుమార్తె.
ఒక నాడు ఆమె కొలనులో స్నానం చేస్తుండగా  ఈయన ఆమెపై నీళ్లు జల్లాడు. అప్పుడు ఆమె సంస్కృతంలో-

మోదకైస్తాడయా (మా..ఉదకైః.. తాడయ)- నీళ్లతో నన్ను కొట్టకు- అంది. 

ఆ మాట అర్థం కాని రాజు ‘మోదకాలు’ (లడ్డూలు) తెప్పించాడు.  రాణి హేళన చేయగా చుట్టూ ఉన్న పరిజనం నవ్వారు. రాజుకు తల దించుకున్నాడు. 
తనకు సంస్కృతభాషా పాండిత్యం అబ్బేమార్గం ఏమిటని ఇద్దరి ఆస్థాన పండితులను అడిగాడు. ఆ పండితులు --
గుణాఢ్యుడు, శర్వవర్మ. గుణాఢ్యుడు ఆరేళ్లలో నేర్పగలను అన్నాడు. శర్వవర్మ తాను ఆర్నెల్లలో నేర్పగలను అన్నాడు. ‘నీవు కనుక గెలిస్తే  ఆర్నెల్లలో నేను సంస్కృతము, ప్రాకృతము, దేశభాష మూడిటిని
వదులుకుంటాను’ అన్నాడు. పందెంలో శర్వవర్మే గెలిచాడు. ఓడిన గుణాఢ్యుడు దేశం వదిలి అడవుల పాలయ్యాడు. 

ఓడిన గుణాఢ్యుడు అడవిలో ఏడు సంవత్సరాలు ఉన్నాడు. ఆ ఏడు సంవత్సరాల్లో కష్టపడి ఏడు లక్షల శ్లోకాలతో బృహత్కథ అనే ఉద్గ్రంథాన్ని రచించాడు. సంస్కృతము, ప్రాకృతము, దేశభాష మూడూ వదులుకొంటానన్న శపథాన్ని నిజం చేస్తూ పైశాచీ భాషలో ఆ గ్రంథం మొత్తం పూర్తి చేశాడు. తర్వాత దానిని శిష్యులకిచ్చి జనంలో ప్రాచుర్యం పొందడానికి హాలుడి దగ్గరకు పంపించాడు.హాలుడు పైశాచీ భాషలో రాసిన గ్రంథాన్ని చూసి అసహ్యించుకున్నాడు.
రాజుకు చ్చని గ్రంథాన్ని కాల్చి బూడిద చేయాలనుకున్నాడు. నిప్పు రాజేసాడు. నిప్పును చూసి అడవిలోని మృగాలు, పక్షులు కలవరపడు తున్నాయి. గుణాఢ్యుడు ఒక్కొక్క తాటి ఆకు లో ఉన్నవాటిని పక్షులకు
 వినిపించి అగ్నికి ఆహుతి చేస్తున్నాడు.
ఇది తెలిసిన  రాజు వెంటనే  అడవికి చేరాడు. అప్పటికే ఏడు ఆశ్వాసాల ఆ గ్రంథంలో ఆరు ఆశ్వాసాలు అగ్ని పాలయ్యాయి. మిగిలింది ఏడవ ఆశ్వాసం. రాజు ప్రాధేయపడి ఆ చివరి ఆశ్వాసాన్ని పొందగలిగాడు .
అందులోని కొన్ని కధలు,  ఉపకథలు కలిపి బృహత్కథగా ప్రసిద్ధిగాంచింది. రెండు వేల సంవత్సరాల నాటి  ఆ బృహత్కథలోని గాథలు అరేబియన్ నైట్స్ కథలుగా, పంచతంత్రం, హితోపదేశం, భేతాళ పంచవింశతి కథలుగా రూపాంతరం చెందాయి.
ఆశ్చర్యం కొలిపే విషయం ఏమంటే  గుణాఢ్యుడు తెలుగువాడు కావటం!
బృహత్కథను రాసిన ప్రదేశం ఇప్పటి మెదక్ జిల్లాలో హైదరాబాదుకు దగ్గర్లో ఉన్న కొండాపూర్ అని ప్రజల నమ్మకం. .‘కథా సరిత్సాగరం’ ఎక్కువ ప్రాచుర్యం పొందింది .ఈ గ్రంథమే  నేడు  గుణాఢ్యుడి బృహత్కథను ప్రాచుర్యంలోకి తెచ్చింది. 
***

No comments:

Post a Comment

Pages