మలుపు - అచ్చంగా తెలుగు
మలుపు
ప్రకాష్ వడలి

అమ్మా ! అని పరిగెత్తుకుంటు వచ్చాడు విజయ్ వెనకాలే బిడియంగా వచ్చాడు సందీప్. ఇంకా ఆ ఊరు వచ్చి నెల కూడ కాలేదు సునీత రాజేష్ లకు. 
రాజేష్ బ్యాంకు ఆఫీసర్ గా ట్రాన్సఫర్ అయి ఆ ఊరికి వచ్చాడు. ముందు పిల్లలను మంచి స్కూలు చూసి చేర్పించి స్నేహితుల సహాయంతో ఇల్లు చూసి నచ్చి అడ్వాన్స్ ఇచ్చి ఆ ఇంట్లో ప్రవేశించారు దంపతులు.
వారికి ఒక్కడే కొడుకు విజయ్ . మంచి తెలివైనవాడు. కొత్తస్కూలు అయినా అందరిని తొందరగానే ఆకట్టుకున్నాడు తన తెలివితేటలతో. ఇదుగో ఇప్పుడు పరిగెత్తుకు వచ్చి అమ్మను కావలించుకున్నాడు. సామాను సర్దుతున్న సునీత “ ఆగరా బాబు , టిఫిన్ పెడతాను “ అని వెనక్కి తిరిగి చూసి ఎవరీ కొత్త బాబు అన్నట్టు చూసింది.
అమ్మా మరే మా క్లాస్ మేటు , నా పక్కనే కూర్చుంటాడు అని చెప్పాడు.
మాటల సందర్భములో సందీప్ వాళ్ల నాన్న ఇంకో బాంక్ లో క్లర్కు అని చెప్పాడు బిడియంగా. ఇద్దరికి టిఫిన్ పెట్టి మాటల సందర్భములో సునీత సందీప్ చాలా తెలివైనవాడు అని, కాకపోతే మితభాషి అని గ్రహించింది.
కాసేపు మాట్లాడాక సందీప్ ఇంక వెళతానని లేచాడు.
సునీత తృప్తిగా నిట్టూర్చింది కొడుకుకు మంచి స్నేహితుడు దొరికాడని.
రోజులు వేగంగా పరుగెత్తాయి ,రాజేష్ వాళ్లకి మళ్లీ ట్రాన్ఫర్ మూడేళ్లకే..
విజయ్ సందీప్ ఇద్దరు 10 వ తరగతికి వచ్చారు, ఇద్దరు ఒకరిని ఒకరు ఉండలేన పరిస్థితి.
ఇద్దరు ప్రతి తరగతిలో తమదైన శైలితో టీచర్లను ఆకట్టుకున్నారు ఫస్ట్ రాంక్ సెకెండు రాంక్ లో ఉండేవారు.
విజయ్ తండ్రి బాంక్ ఆఫీసరు అవడం వలన ట్రాన్స్ఫర్లు తప్పలేదు. ఇంక వెళ్లేరోజు విజయ్ సందీప్ లను ఎవరు పట్టుకోలేక పోయారు. 
ఇద్దరు ఏడుస్తూనే ఒకరికొకరు గుడ్ బై చెప్పుకుని విడిపోయారు.
రోజులు ఎవరి కోసము ఆగవు కదా !
విజయ్ ఇంటర్లో చాలా కష్టపడి చదివి ఐఐటి కి సెలక్టు అయ్యాడు.
ఇంజనీరింగ్ పేరుతో దూరం వెడుతున్న కొడుకును చూసి సంతోషించాలో బాధపడాలో తెలియని అయోమయ స్థితిలో కన్నీళ్లతో రైలు ఎక్కించి ఇంటికి వచ్చి బావురుమని ఏడ్చింది.
అమ్మా ! నేను ఐఐటికి సెలక్టు అయ్యాను అని సంతోషముతో తనను చుట్టుకుని చెప్పినప్పుడు ఎంతో గర్వపడింది.
విజయ్ పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని, 4 ఏళ్లు వాడిని వదిలి ఉండాల్సి వస్తుందన్న సంగతి మర్చిపోయింది.
వెళ్లగానే ఉత్తరం రాశాడు "అమ్మా! నీకు ఆశ్చర్యం కలిగించే సంగతి, ఆనందం కలిగించే సంగతి సందీప్ నా బ్రాంచ్ లోనే జాయిన్ అయ్యాడమ్మ!" అని రాశాడు.
ఇంక సునీత ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.
ఇంక తనకు ఏ బెంగ లేదనుకుంది.
సెమిస్టరు సెలవులో అయితే సందీప్ వాళ్లింట్లో కొన్ని రోజులు కొన్ని రోజులు అమ్మా నాన్నల దగ్గర గడిపేవాడు విజయ్.
నాలుగేళ్లు ఇట్టే గడచిపోయాయి.
తరువాత ఏమిటిని క్వశ్చన్ మిగిలింది సునీతకు రాజేష్ కి.
ఐఐమ్ కి మంచి ఫ్యూచర్ ఉంది అనుకున్నారు ఇద్దరు.
ఫైనల్ సెమిస్టరు అయ్యాక ఇంటికి వచ్చిన విజయ్ ని అడిగారు.
ఇప్పటివరకు తన మనస్సులో మాట బయటపెట్టని విజయ్ తను అమెరికా వెళ్లి అక్కడ పెద్ద సైంటిస్ట్ అవ్వాలని ఉందని చెప్పాడు.
వినగానే భోరున ఏడిచింది సునీత. రాజేష్ పైకి తేలలేదు కాని లోపల అనుమానంగానే ఉంది అక్కడకి వెళ్లినవారు అక్కడే సెటిల్ అయిపోతారని విన్నాడు.
బాధగా ఉన్నా బయటపడలేదు.
మనవాడు అమెరికా వెళితే మనకే గౌరవంగా ఉంటుందని నచ్చ చెప్పాడు. 
వాడితోపాటు సందీప్ కూడ వెళతాడని తెలిసి కాస్త మనస్సును చిక్కబట్టుకుంది సునీత.
మొత్తానికి స్నేహితులిద్దరికి ఒకటే యూనివర్సిటీ లో ph.d చెయ్యడానికి సీటు వచ్చింది.
మొదట్లో రెగ్యులర్ గా వచ్చే ఫోన్లు రాను రాను తగ్గుముఖం పట్టాయి.
రిసెర్చి హడావుడి అని సరి పెట్టకున్నారు.
అప్పుడప్పుడు సందీపే ఎక్కువ కాల్ చేసేవాడు విజయ్ కన్న. మిత్రులిద్దరికి PhDలు వచ్చాయి.
ఈ మధ్య అసలు విజయ్ ఫోను లేదు అని సునీత అంటుండగానే ఫోను మోగింది ఉదయమే. 
విజయ్ ఫోను మాటల మధ్య తెలిసింది ఒక పేరు పొందిన ఫార్మస్యూటికల్ కంపెనిలో జాబ్ దొరికిందని. మరి సందీప్ కో అని అడిగారు. 

వాడు మంచి కంపెనీకి try చేస్తున్నాడని చెప్పాడు. 
తాను ఇంకో వారంలో ఇండియా రాబోతున్నాని చెప్పాడు.
వారిద్దరి ఆనందానికి హద్దు లేకుండా పోయింది.
రకరకాల నిలవ పిండివంటలు చేసింది సునీత.
ఫ్రెండ్సందరికి చెప్పింది మనస్సులో ఒక ఫ్రెండు కూతురును సెలక్టు చేసుకుంది కోడలుగా. అమ్మాయి అపరంజిలా ఉంటుంది.
ఆ రోజు రానే వచ్చింది ఏయిర్ పోర్ట్ కి వెళ్లి రిసీవ్ చేసుకున్నారు.
రెండేళ్లయింది చూసి! బాగా మారాడు ; అసలే తెల్లని వాడు ఇంకాస్త రంగు తేలాడు.
కబుర్లు తనివీతీరా చెప్పుకున్నారు. అంతా అయ్యాక ఇంక పడుకోండి మిగతా కబుర్లు రేపు చెప్పుకోవచ్చు అని రాజేష్ హెచ్చరించాడు.
మరునాడు భోజనాలు అయ్యాక కబుర్లు అయ్యాక తన మనస్సులో మాట బయటపెట్టాడు విజయ్. తాను ఒక అమ్మాయిని ప్రేమించానని ఆ అమ్మాయికి మాట ఇచ్చానని !
ఇద్దరు హతాశులు అయ్యారు. 
సునీత ఏదో చెప్పబోతుంటే వారించాడు రాజేష్.
ఆరాత్రి ఏడుస్తున్న సునీతని ఓదార్చాడు రాజేష్. ఈ రోజులలో ఇవన్నీ సహజమే అని నచ్చ చెప్పాడు.
వాళ్లు పంజాబీలు , అన్నిటికి తలవొగ్గి విజయ్ పెళ్లి చేసారు.
సునీతకి చిన్నప్పడే విజయ్ కి ఒడుగు చెయ్యడము, వాడికి శ్లోకాలు నేర్పించడం పండుగలు వాటి ప్రాముఖ్యత గురించి వివరించడం, అన్ని గుర్తుకు వచ్చాయి.
దుఃఖము పొంగుకు వచ్చింది.
ఆ పెళ్లిలో సందీప్ అన్నీ తనే అయి ఆ దంపతులకు సహాయం చేశాడు.
నీ పెళ్లి ఎప్పుడు సందీప్ అని అడిగితే నవ్వేసి ఊరుకున్నాడు.
పెళ్లి అయిన వెంటనే భార్య షాలినిని తీసుకుని అమెరికా వెళ్లిపోయాడు విజయ్.
మళ్లీ ఇద్దరే మిగిలారు రాజేష్ సునీత.
నాలుగేళ్లు గడిచాయి ,ఈ నాలుగేళ్లలో విజయ్ కి ఇద్దరు పిల్లలు ఒక మగ ఒక ఆడ.
సిటిజన్ షిప్ తీసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయాడు విజయ్.
సందీప్ ఇంకా పెళ్లి చేసుకోలేదు.
విజయ్ షాలిని వచ్చినా అతిధులులానే గడిపి వెళ్లిపోతున్నారు.
రాజేష్ సునీతలు పెద్దవాళ్లు అయ్యారు. 
ఉన్నట్టుండి సందీప్ ఒకరోజు కాషాయబట్టలలో రాజేష్ వాళ్లింటికి వచ్చాడు.
ఇద్దరు తెల్లబోయారు. ఇదేమిటి సందీప్ అని అడిగారు,ఇద్దరి కాళ్లకి దణ్ణం పెట్టి చెప్పాడు తాను రామకృష్ణ మిషన్లో చేరానని చెప్పాడు.
అదేమిటి అంత ఐఐటి చదివి డాక్టరేట్ చేసి ఇలా చేసావు అని అడిగారు.
ఆంటీ ! మీరు చిన్నప్పుడు విజయ్ కి చెప్పినవన్ని విన్నాను. అప్పుడే నా మనస్సులో ఒక సంకల్పం కలిగింది. అమెరికా వెళ్లాక తెలిసింది అక్కడ వాళ్లకి మన అవసరం ఏమి లేదని, మనదేశానికే అవసరం ఉందని తెలిసింది.
అమ్మ నాన్న బాధపడతారని ఇన్నిరోజులు అలా గడిపాను.
ఆరునెలల క్రితం ఇద్దరు తీర్థయాత్రలకు వెళ్లి ఆక్సిడెంటులో పోయారు. 
ఇంక నా సంకల్పం ప్రకారం రామకృష్ణ మిషన్లో జయనయ్యాను.
మంచిది సందీప్ ,సేవ చెయ్యడానికి నీకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు.
నీ ఆశయం నెరవేర్చుకో అని మనసార ఆ దంపతులు సందీప్ ని దీవించారు.
***

No comments:

Post a Comment

Pages