కామందు - అచ్చంగా తెలుగు
కామందు
శ్రీను వాసా


తొమ్మిదేళ్ళ తన ఐదో కొడుకు మల్లిని పనిలో పెట్టడానికి తీసుకువచ్చాడు ఎంకన్న, గవర్రాజు గారి దగ్గరకి.
"ఇరవై కుంచాలకంటే ఎక్కువివ్వలేను" చెప్పారు గవర్రాజుగారు, పద్దెనిమిది అడుగుదామనుకుంటున్న ఎంకన్నతో. సంతోషాన్ని మనసులోనే నొక్కిపెట్టి, పైకి "సరేనండి. రోజూ సద్దన్నం, పన్లోకి రాగానే ఒకజత, సంకురేతిరికి ఒకజత బట్టలెట్టండి." అన్నాడు వెంకన్న.
"అలాగే.. సద్దన్నమేంకర్మ, ఏడన్నం, మజ్జిగ, ఆవకాయ బద్ద అన్నీ ఉంటాయ్. నాకూ ఓ కొడుకుంటే ఆడూ అంతే ఉండీవోడు.” దేనికీ ఇబ్బంది రానివ్వం. రేపట్నుంచి పంపించై" చెప్పారు గవర్రాజుగారు.
మజ్జిగలో ఆవకాయబద్ద కొరుక్కుతినడమంటే మల్లికి మహా ఇష్టం. అయనంతటాయనే ఇస్తాననే సరికి చలా ఆనందపడిపోయాడు ఎంకన్న.
***
"ఒరై.. కామందులుకి కోపమెక్కువ. జార్త. ఏసాలైకుండా సెప్పింది సెయ్యి" జాగ్రత్తలు చెప్పి మొదటిరోజు తీసుకొచ్చి గవర్రాజుగారింట్లో విడిచిపెట్టి వెళ్ళాడు ఎంకన్న.

మొదటిరోజు పనైపోయాకా సాయంత్రం ఇంటికొచ్చిన మల్లి  "అయ్యా నాకీ నూలుబట్టలొద్దు. కాందులికి (కామందుకి) సెప్పి పోలిట్టర్ కొనమను" గవర్రాజుగారిచ్చిన బట్టలు చూపించి అన్నాడు.
"నోర్ముయ్. కాందులేదిత్తే అత్తీస్కోవాలి. అయినా పోలిట్టర్ కంటే కాదీ సానా రేటెక్కువంట. పొలంపనులోళ్ళకి కాదీయే మంచిదంట." గదమాయించేడు ఎంకన్న. అయిష్టంగానే వేసుకుని మర్ణాడు పనిలోకెళ్ళాడు మల్లి.
-x-
మధ్యాహ్నం భోజనాల సమయం తరవాత.. "ఒరెయ్ మల్లీ.. దిమ్మమీద కందికంపలు కోసేసి పోగెట్టేసి ఇంటికెళ్ళిపో ఈయ్యాల్టికి. రేపు దున్నేసి వంగిత్తనాలేద్దాం. రేపుడికి పని మిగల్చకుండా పూర్తిచేసేసెళ్ళు." చెప్పేసి ఇంటికెళ్ళిపోయారు గవర్రాజుగారు.

సాయంత్రం చీకటి పడుతుండగా పొలంవైపు సైకిల్ మీద వెళుతున్న ఒక పిల్లాణ్ణి ఆపి, "ఒరెయ్.. మా మల్లిగాణ్ణి మా పాక్కాడ దిమ్మమీద కందికంప కొయ్యమన్నాను. ఇయ్యాల్టికి అయినకాడికి సరిపెట్టేసి ఆణ్ణి ఇంటికెళ్ళీపోమను. మిగిలింది రేపుచూద్దాం అని నేను చెప్పానని చెప్పు" అని చెప్పి పంపించారు గవర్రాజు గారు.
ఏదో పాత విషయమ్మీద లోపల గవర్రాజుగారిమీద కోపంగావున్న ఆ పిల్లాడు"ఒరెయ్ మల్లీ.. గవర్రాజు గారు అలాగే చెప్తాడు. నువ్వు ఇంటికెళ్ళిపో. మిగిలింది రేపు చేద్దువులే.. సందలడిపోతంది" అని చెప్పాడు మల్లితో.
"పిల్లోడుకున్నంత బుద్దీగేనం లేవు కాందులికి" అని మనసులోనే తిట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడు మల్లి.
***
ఖాళీ చేతిసంచీలు సైకిల్ కి తగిలించుకుని సంతకు బయలుదేరుతూ "సీతా.. ఇవ్వాళ అగష్టు పదిహేనుకదా.. పిల్లలకి సినిమాకి సగం టికెట్టంట. బడిపిల్లలంతా వెళ్తన్నారంట. నాల్గురూపాయలిచ్చి మల్లిగాణ్ణికూడా పంపించు. గేదెలకి నీళ్ళెట్టే టైముకి వచ్చేస్తాడు." భార్యని పిలిచి చెప్పారు గవర్రాజుగారు.

మల్లి సినిమానుంచి వచ్చేసరికి గవర్రాజుగారు సంతచేసుకుని ఇంటికొచ్చేసి వాడికోసం ఎదురుచూస్తున్నారు. వచ్చీరాగానే "సినిమా చూసి పాటడింది చాలు. పద.. గేదెలకి నీళ్ళెట్టాలి. సీతా.. ఈడిక్కాస్తేదన్నా తింటాకి పెట్టి మజ్జిగియ్యి. ఆల్సమైపోతుంది" కంగారుపెట్టేసారు ఇద్దర్నీ.
"అమ్మగోరెంతమంచోరో.. ఆవిడకాబట్టి పంపిచ్చేరు. ఈయనైతేనా.." తిట్టుకున్నాడు మల్లి మనసులోనే.
ఏడాది భారంగా గడిచిపోయింది. 
***
తరువాతి సంవత్సరానికి రెండుకుంచాలెక్కువడిగేడు ఎంకన్న. "అంతిచ్చుకునే కమతం కాదురా నాది. వేరేచోటెక్కడన్నా చూసుకో" చెప్పేసారు గవర్రాజుగారు. మొత్తానికి మునసబుగారి కమతంలో కుదిరిపోయాడు మల్లి.

పోలిస్టర్ బట్టలేసుకుని కందికంప కోస్తున్నాడు ఎండలో. చెమటలు కారుతున్నాయ్. చికాగ్గావుంది. ఎవరైనా వచ్చి "ఈవాల్టికి సరిపెట్టు" అంటారేమోనని చూస్తున్నాడు. చీకటిపడుతున్నా ఎవ్వరూ రాలేదు. కాస్త భయమేసింది. చేసేది లేక ఇంకా కాస్తమేర ఉండగానే ఇంటికెళ్ళిపోయాడు మల్లి. "వదిలేసి పోయావ్.. నీ బాబొచ్చి చేస్తాడనుకున్నావా?" అంటూ మర్ణాడు మునసబుగారు అగ్గిమీద గుగ్గిలం అయిపోయారు.
చద్దన్నంలో ఆవకాయబద్దలేదు.. ఆగష్టు పదిహేనుకి సినిమాలేదు. ఏడుపొచ్చింది మల్లికి.
సాయంత్రం ఇంటికెళ్ళకుండా తిన్నగా గవర్రాజుగారింటికెళ్ళాడు మల్లి. "కాందులు లేరాండి" అడిగాడు సీతమ్మ గారిని.
"రా మల్లీ.. ఇయ్యాళపుడొచ్చేవేంటిరా? ఆయన పనిమీద ఊరెళ్ళారు."
"ఏంలేదమ్మగోరూ.. " అన్నాడు నిర్లిపంగా నేలచూపులు చూస్తూ.
"పొద్దోయింది. అన్నం తిన్నావా లేదా"?
"లేదమ్మగోరు. ఉప్పుడే పొలంనుంచొత్తన్నానండి"
"అలాగా.. నూతికాడ కాళ్ళూచేతులు కడుక్కుని రా.. అన్నం తిందువ్ గాని."
వచ్చి వరండాలో కూర్చున్న మల్లి ముందు ఆకేసి వడ్డించారు సీతమ్మ. అన్నీ వడ్డించిన తరవాతకూడా దిక్కులు చూస్తున్నాడు మల్లి, తినకుండా.
అప్పుడే వచ్చిన గవర్రాజు గారు కల్పించుకుని "ఆడు ఆవకాయబద్దలేకుండా తినడు" నవ్వుతూ అనేసి పెరట్లోకెళ్ళిపోయారు స్నానానికి.
"అవునుకదా.. మర్చేపోయేను" అంటూ లోపలికెళ్ళి ఆవకాయ పట్టుకొచ్చి వడ్డిస్తున్న సీతమ్మగారిని చూసి దుఃఖం ఆపుకోలేక పోయాడు మల్లి.
అవాక్కై చూస్తున్న సీతమ్మగారిని చూసి.. "అమ్మగోరూ.. నేను మీ కమతంలోకొచ్చేత్తానండి. మా అయ్యికి చెప్పండి. అంటూ భోరున ఏడ్చేసాడు.
"ఊరుకో.. అన్నం తినీటప్పుడు ఏడకూడదు. నేను మీ అయ్యకి చెప్పి వచ్చీ ఏడాది మన కమతంలో పెట్టిస్తాలే. అన్నం తిను. పొద్దున్నుంచి ఒక్కలెక్కన పనిచేసుంటావ్. ఆలస్యమైంతే ఇంట్లో కంగారు పడతారు. తిను తిను" సముదాయించారు సీతమ్మ.
తరువాతి సంవత్సరం "నేను గవర్రాజుగారింట్లోనే పనిచేస్తా"నని పట్టుపట్టాడు మల్లి. అప్పట్నుంచీ ఆనయ కమతంలోనే ఉండిపోయాడు" అంటూ ముగించి మనవడివైపు తిరిగారు తాత, వాడి స్పందన ఎలా ఉందోనని కుతూహలంగా చూస్తూ.. మనవడు స్పందించలేదు. తాతయ్య ఊరునుంచి వచ్చినప్పుడల్లా పల్లెటూరి విషయాలు అక్కడ జరిగే సంగతుల గురించి కథలుగా చెప్పించుకోవడం అలవాటు. ఎప్పుడూ కథ విన్నతరవాత తనదైన సైలిలో అభిప్రాయాలు చెప్పే మనవడు సైలెంట్ గా ఉండేసరికి.. ఉండబట్టలేక అడిగేసాడు.. ఎలావుంది కథ? అని.
“నాకు నచ్చలేదు తాతయ్యా..” అన్నాడు మనవడు నిష్కర్షగా!
ఏం ఎందుకని? ఆశ్చర్యంగా అడిగాడు తాతయ్య.
"గవర్రాజుగారు చేసింది నాకు నచ్చలేదు. పిల్లలతో పనిచేయించుకోవడం క్రైం.. అంటే నేరం. ఆయన మంచివాడైతే మల్లికి చదువుచెప్పించి ఉండేవాడు" అన్నాడు మనవడు.
విన్న తాత దీర్ఘంగా నిట్టూర్చి.. "అయన అంతకంటే గొప్పపనే చేసాడ్రా! ఆయన ఆరోగ్యం పాడైంది. పిల్లలులేని గవర్రాజుగారు మల్లిని దత్తత తీసుకుని ఆస్తిని మొత్తం అప్పజెప్పేరు! పెళ్ళిచేసి, మల్లికి కొడుక్కి చదువుచెప్పించేరు.. ఇంతకీ ఆ మల్లి ఎవరోకాదురా.. నేనే! మనమందరూ ఇప్పుడు ఇలావున్నామంటే ఆయనవల్లేరా!" అంటూ ముగిస్తూ కన్నీటి పర్యంతమైన మల్లి మనవడి స్పందనకోసం ఎదురు చూడక బయటికి వెళ్ళిపోయాడు!
*****

No comments:

Post a Comment

Pages