నెత్తుటి పువ్వు - 17 - అచ్చంగా తెలుగు
నెత్తుటి పువ్వు - 17
మహీధర శేషారత్నం

(జరిగిన కధ : రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో బాగా తాగి, స్పృహ తప్పి పడిపోయిన సరోజ అనే అమ్మాయిని తన స్నేహితుడి గదికి తీసుకువస్తాడు రాజు. మాట వినకుండా మొరాయిస్తున్న ఆమెను, వెనక్కి దింపేస్తానని బెదిరిస్తాడు. రాజు ఆ అమ్మాయిని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తారు  అతడి శ్రేయోభిలాషులు. ఆమెను బట్టల కోటలో పనిలో పెడతాడు రాజు. రాజు చెల్లెలు వసంత అతని ఇంటికి వచ్చి వెళ్తుంది. జ్వరంతో ఉన్న సరోజకు సపర్యలు చేస్తాడు రాజు. బట్టల కొట్లో పనిచెయ్యనని చెప్పేస్తుంది సరోజ. ) 
 పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. సరోజ పిడత పగలగొట్టింది. అన్నీ చూస్తే ఐదారు వేలున్నాయి.      
          “ఎన్నున్నాయో చూడు!” అంది చిన్న పిల్లలా.
          “నాకు భయంగా ఉంది. ఎప్పుడూ ఒక్కదాన్నే ఉండలేదు” గొణిగింది.
          “ఉంటున్నావుగా! భయమెందుకు? రేపువస్తాలే!
          “మళ్ళప్పుడొస్తావ్! రేపు సందేలకొస్తా!” కూని రాగంగా అంది.
          “ఊఁ! ఆపు” గదిమాడు.
          “ఊ! చూద్దాంలే! ఏదైనా హాస్టల్ లో అయితే నలుగురూ ఉంటారు కాని ఖర్చెక్కువ. ఇది నా ఫ్రెండ్ గదికనుక రెండు వందలంటే ఊరికే ఇచ్చినట్టే. ఏమితోచకపోతే రాములక్క ఇంటికెళ్ళు.” సాలోచనగా అన్నాడు.
          “ఊహూఁ ! వెళ్ళను. అక్క మంచిదేకాని.... ఆడు దొంగ సచ్చినోడు. తినేసాలా చూస్తాడు”. తల అడ్డంగాఊపింది.
          “నీకు అసలు చదవడం, రాయడం వచ్చా!”ఇన్నాళ్ళూ అడగని ప్రశ్న ఇప్పుడడిగేడు ఏదో గుర్తొచ్చినట్టు.
          తెలుగు చదవడం, రాయడం వచ్చుద్ది. ఇంకేం రావు. తేలికగా అంది.
          “నిన్ను తీసుకొచ్చి పెద్ద తప్పుచేసాను. పోనీ దింపేస్తాను వెళ్ళి పోతావా?” కుతూహలంగా అడిగాడు.
          “ఎక్కడికి? ఏడాది దాటింది నేవచ్చి” కోపంగా అంది.
          “ఇంత పెద్దతప్పు ఎప్పుడూ చేయలేదు?ఇప్పుడెలా?”
          “సర్లే! ఇప్పుడు ఇబ్బంది లేదుగా! డబ్బులున్నాయి. తర్వాత చూద్దాంలే సమస్యని తేలికగా చూసే గుణం సరోజది. బహుశా పెరిగిన వాతావరణం ప్రభావమేమో. మంచో, చెడో ఆ అమ్మాయిని వెతుక్కునే వాళ్ళూ, ఆరాతీసే వాళ్ళూ లేకపోవడం వల్ల ఇంతవరకు సమస్యలేం రాలేదు. కాని రేపేమో!
          “సెంట్రల్ గవర్నమెంటు సంస్థ శ్రామిక విద్యా పీఠం అని ఉంది. ఫ్రీగానే నేర్పుతారు. వివరాలు కనుక్కొని వస్తాను. నీకు నచ్చిన దానిలో చేరు.”
          “అబ్బ! ఎప్పుడూ ఏదో ఆలోచనే! నువ్వు ఇంట్లోనూ ఇలాగే ఉంటావా?”
          “ఇలా అంటే ఎలా?”
          “ఎలా ఏమిటి? అది నేర్చుకో. ఇది నేర్చుకో అంటూ.”
          “నీకు తలకాయ ఉందో, లేదో తెలియటం లేదు. ఇంట్లో అయితే నేను పట్టుకొచ్చి పెడతాను. నీకు దారి చూసుకోవాలిగా!” విసుగ్గా అన్నాడు.
          “నాకూ నువ్వే పెడతావు.” కొంటెగా అంది.
          “మరే! నేను లక్షాధికారిని. అందరికీ పట్టుకొచ్చి పెట్టడానికి వెక్కిరింతగా అన్నాడు.
(సశేషం)

No comments:

Post a Comment

Pages