మానసవీణ -5 - అచ్చంగా తెలుగు
మానసవీణ -5
గొలుసుకట్టు నవల 
పూర్ణిమ సుధ(జరిగిన కథ: ఎవరూ లేని మానస చిన్నప్పటి నుంచి ఒక అనాథాశ్రమంలో పెరుగుతూ ఉంటుంది. సేవాభావానికి మారుపేరులా ఉండే మానస అంటే అందరికీ ఇష్టమే. ఒక బహుమతి ప్రదానోత్సవ సభలో మానసను చూసిన మంత్రి కృషీవలరావు, ఆ పాపలో తనకు తెలిసిన శ్రావణి అనే ఆవిడ పోలికలు ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు.)
పదో తరగతి కూడా కొన్నాళ్ళలో అయిపోవస్తోంది. ఇక బడి స్నేహాలకి వీడ్కోలు చెప్పి, కళాశాల లోకి అడుగిడాలి. అప్పుడు, మొదటి సారి, అనిరుద్ధ్ ధైర్యం చేసాడు, మానసతో మాట్లాడాలని. కానీ స్వతహాగా బిడియస్థుడవడం వల్ల, ఎలా మొదలు పెట్టాలో అర్థం కాక ఆగాడు. అంతలో, వీడ్కోలు సభలో, పిల్లలందరినీ, వారి భవిష్య ప్రణాళికల గురించి అడుగుతుండగా, అనిరుద్ధ్ లేచి, తన కల గురించి బెరుకు బెరుకుగా చెప్పడం మొదలు పెట్టాడు. తనకి ఆస్ట్రొనాట్ అవాలని ఉందని, అందుకు సంబంధించిన విద్యా నైపుణ్యాలని మెరుగుపరుచుకోవడానికి తను చేసే ప్రయత్నాల గురించి విని, పిల్లలు ఒక్కసారి ఘొల్లుమన్నారు. అసలే బెదురుగా ఉండే అనిరుద్ధ్ ఈ చర్యతో మరింత పాలిపోయాడు. "ఇంత పిరికి వాడివి, ఇక్కడే నలుగురిలో తిరగలేని వాడివి, పైనెక్కడో ఒక్కడివే... ఉండగలవా ?" అంటూ గేలి చేసారు. టీచర్ వాళ్ళని మందలించి, తరువాత వారిని పిలిచింది. మానస వంతు రాగానే, తనలోని భవిష్య ప్రణాళికని ఈ విధంగా చెప్పింది మానస - "ఒక సమాజం బాగుండాలంటే, ఎవరి పనిని వారు సక్రమంగా చేస్తూ, పదిమందికి తల్లో నాలుకగా ఉంటే చాలని మన టీచర్స్ చెప్పారు. అన్నిట్లోకీ అతి పవిత్రమైన వృత్తి మటుకు టీచింగే... ఎందుకంటే, ఒక  టీచర్ మాత్రమే మిగతా అన్ని వృత్తుల వారినీ తయారు చేయగలదు. మంచి సమాజాన్ని నిర్మించగలదు. నాకు తెలిసిన ప్రపంచం చాలా పెద్దది. ఆశ్రమం, బడి మాత్రమే కాదు, ప్రతీ వారూ నా వారే... అందరూ బావుండాలి. అలా ఉండాలంటే, నేనొక టీచర్ ని అయి, అబ్దుల్ కలామ్ గారు చెప్పినట్టు పిల్లల కలల్ని, కేవలం పుస్తకాల్లో అదిమెయ్యకుండా, మన బడి లా చెప్పే మరిన్ని విద్యాలయాలకి శ్రీకారం చుడతాను... అని చెప్పి ముగించి, చివరగా, ఒక్క మాట, అనిరుద్ధ్ కల కన్నాడు, దాన్ని నిజం చేసుకోవాలనే తపన ఉన్నవాడు... ఖచ్చితంగా తను సాధిస్తాడు. ఆల్ ద బెస్ట్ అని ధైర్యం చెప్పింది. ఆ మాట అనిరుద్ధ్ కి మంత్రంలా పనిచేసింది. మొదటిసారి, తన ముఖంలో ఆత్మ విశ్వాసపు మెరుపు తొణికిసలాడింది. 

-----------------------------------                                  --------------------------------------------------                    -----------------------------------------------

కృషీవలరావ్ పళ్ళు, స్వీట్సు తీసుకుని, హేమలతా ఆశ్రమానికి వెళ్ళాడు... హోం శాఖ అమాంతం ఒక ఆశ్రమానికి వస్తోందంటే, ఛారిటీ అయినా అయి ఉండాలి, తనిఖీ అయినా అయి ఉండాలని, మీడియా అంతా కోడై కూస్తుందన్న భయంతో, పి.ఎ. కి ముందుగానే ఎవ్వరికీ చెప్పొద్దన్న ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉండడం వల్ల, ఒక హాలిడే నాటి వ్యాహ్యాళిగా పరిగణించి, మీడియా ఊపిరి పీల్చుకుంది... ఆశ్రమంలోకి అడుగు పెడుతూనే, రంగురంగుల పూలమొక్కలు పలకరించాయి... అన్నీ సుమరంజితాలే... కాస్త దూరంగా మామిడి, సపోటా లాంటి చెట్లు, కాలి బాట పొడుగుతా, టైల్స్, మిగతా అంతా పచ్చటి తివాచీ. ఆశ్రమానికి ముఖద్వారంలో నవ్వుతూన్న శాంతి దూత మదర్ తైలవర్ణ చిత్ర పఠం. ముందరున్న రిసెప్షన్లో మానస గురించి అడిగితే, తోటలో ఉన్నదని చెప్పడంతో, పిలవద్దు... నేనే వెళ్ళి కలుస్తానని చెప్పి, బయలుదేరాడు కృషీవలరావ్. దూరంగా, ఒక ఇరవై మంది 5,6 క్లాసుల వాళ్ళనుకుంటా...! వాళ్ళకి ఎక్కాలు చెప్తూ, తనేమో కెమిస్ట్రీలోని ఎలిమెంట్స్ పీరియాడిక్ టేబుల్ ని చదువుకుంటోంది మానస. మధ్య మధ్యలో  వీళ్ళు చెప్పే తప్పుల్ని సరి చేస్తూ...

ఒక్కసారిగా, కృషీవలరావ్ కి శ్రావణి గుర్తొచ్చింది. చక్కగా చదువుకుంది. మంచి తెలివైన వ్యక్తి. తనకి ఏ ఉద్యోగానికి వెళ్ళాలన్నా, కాంపిటీటివ్ ఎక్జామ్స్ కి వెళ్ళాలన్నా, సమయపాలన, ఎటిక్ టిప్స్ అన్నీ చెప్పి, ’మీ నాన్నగారిలా కాక, నువ్వు ఉన్నతంగా చదువుకుని, మీ నాన్నగారికి మంచి పేరు తేవాలని చెప్తూ ఉండేది. మహా ఇల్లాలు, ఏనాడూ పేదా, గొప్పా... పాలేరా, ఏలేవారా అన్న తేడా చూసేది కాదు. పేరుకి నాన్నే పాలేరు కానీ, ఏ పని మీద చుట్టు పక్కలా కనిపించినా, ఏదో ఒక పని అంటగట్టే వారు. ఆ బిల్లు కట్టు, చదువుకున్న వాడివి కదా, ఈ పద్దు చూడు అంటూ... కానీ శ్రావణి గారు మాత్రమే, ఏమైనా తిన్నావా ? తినలేదా ?’ అని అడిగి, మిగిలినవి కాక, తను తినేదాంట్లో కొంచెం తీసి మరీ పెట్టేది. మరో శ్రావణమ్మని చూసినట్టుంది, మానసని చూస్తుంటే... అనుకుంటూ... అలా నిలబడిపోయాడు. మానసే ముందుగా పలకరించింది... "హాయ్ అంకుల్. ఎలా ఉన్నారు ? ఏంటి ఇలా వచ్చారు ? ఇంకా కోపం పోలేదా ?" అంటూ... అదేం లేదు నాన్నా... ఊరికినే ఆశ్రమం చూడాలనిపించి వచ్చాను. ఆదివారాలు, సెలవురోజుల్లో ఇలా టైమ్ ని స్పెండ్ చెయ్యడం నాకు చాలా ఇష్టం అన్నాడు కృషీ. ఆ రోజు, మానసని, లంచ్ కి ఎక్కడికైనా తీసుకెళ్దామనుకుని, అడిగాడు. లేదంకుల్, నా స్నేహితులంతా ఉన్నారు కదా, మీరెళ్ళి లంచ్ చేసి రండి. మాకు ఇవాళ స్పెషల్ సండే... అంతా కలిసి, తలా ఒక వెరైటీని ప్లాన్ చేసి, దాన్ని వడ్డించుకుని తింటాం... నేనివాళ టొమాటో రోటి పచ్చడి చేస్తానని మాటిచ్చాను. అదంటే వీళ్ళకి ఎంత ఇష్టమో, అని కళ్ళింత చేసి చెప్పింది. అయితే, ఇవాళ ఆ అమృతమే నా భోజనం అన్నాడు కృషీ.... అరగంటలో, తోటలో, ఎంతో మురిపెంగా, ధనియాలు జల్లి పెంచిన కొత్తిమీర, టమాటాలు కోసి, లేత పచ్చిమిరప జోడించి, రుచిక్రమైన పచ్చడి చేసింది. అలాగే మిగతా వారు కూడా వారి బుల్లి వంటకాలతో సిద్ధం. ఆ రోజు కృషీ తిన్న భోజనం ఏ స్టార్ హోటల్ కీ సాటి రాదని తృప్తిగా తిని నిట్టూర్చాడు.

ఇంటికి రాగానే, భూషణం గారికి ఫోన్ చేసాడు కృషీ - "మీతో ఒక విషయం మాట్లాడాలి అని". "ఏరోయ్... మాట్లాడాలంటే, ఇంటికి వచ్చి చెప్పొచ్చుగా, ఫోన్లో ముందీ వార్నింగ్ లేంటి ? నీకన్నా మీ నాన్నే నయం, విశ్వాసం ఉంది. చదువుకున్న కుక్క ఉస్కో అంటే డిస్కో అన్నట్టు, నీకు మాత్రం కొంచెం టెక్కెక్కువే రోయ్..." అన్నాడు భూషణం. "విషయం మీకు సంబంధించింది... అందుకే. పైగా ఇంట్లో మాట్లాడే వెసులుబాటు ఉండకపోవచ్చు. నా ఆఫీసే సేఫ్" అన్నాడు కృషీ. "అంత ముఖ్యమైనదైతే, వస్తాలే. కారు పంపు" అనాడు భూషణం. అరగంటలో ఇద్దరూ, తన ఎ.సి. చాంబర్లో... మౌనం మాత్రమే మాట్లాడుతోంది. "ఏరా...? పిలిచావ్. మాట్లాడు ?" అన్నాడు భూషణం. "అదీ... శ్రావణమ్మ ఎలా ఉన్నారు ?" అన్నడు కృషీ. "ఏముంది, ’నా పాప, నా పాప’ అంటూ అలాగే ఉంది.  కొన్ని జీవితాలంతేరా...! ఒక చట్రం, ఒక బంధం, ఒక సెంటిమెంట్. అందులోనించీ బయట పడరు. అవునూ... నువ్వు చెప్తానన్న మాటర్ కి, శ్రావణి బాగోగులకీ సంబంధం ?" "సార్. మీకు చెప్పదగినంతటివాణ్ణి కాదు, కానీ జరిగిందేదో జరిగిపోయింది. మీ మనవరాలు, బంగారు తల్లి... మా నాన్నకి ఇంకా మానవత్వం ఉండడంవల్ల, పాపని ఆనాడు, చంపకుండా ఆశ్రమంలో వదిలాడు. మీరు మాత్రం కత్తులతో, విత్తులతో తప్ప, వ్యక్తులతో స్నేహం చేయనివారు కాబట్టి, మా నాన్నని పొట్టన పెట్టుకున్నారు. మీరేమీ మీ మనవరాలికి ఆస్థులివ్వక్కర్లేదు. తనే ఎవరింటికి వెళ్ళినా, వారికి తరగని నిధి లాంటిది. ఆ పిచ్చితల్లిని, ఈ బంగారు తల్లిని ఒకటి చేయండి. ఇంతకు మించి మిమ్మల్ని ఏమీ అడగను... మీమీద నాకే కోపమూ లేదు..." అంటూ జరిగింది చెప్పి, చేతులు జోడించాడు...
"ఏరా...? ఇందుకా, నన్ను పిలిచింది ? పూటకి ఠికాణా లేనివాణ్ణి, పోనీలే అని చోటిస్తే... నా ఎంగిలి మెతుకులు తిని నాకే నీతులు చెప్పే స్థాయికి ఎదిగావా ? అంతేరా... మీ బుధ్ధులే ఇంత. అసలయినా అది నా మనవరాలే అని ఏంటి నమ్మకం ?" అంటూ ఇంతెత్తున ఎగిరాడు. ఓబులేష్ ఉత్తరం చూపించాడు కృషీ. భూషణం మొహం పాలిపోయింది. అవమాన భారం రెట్టిపయింది. ఉక్రోషంతో, కోపంగా, తన జేబులోని రివాల్వర్ తో, కృషీ మీదకి తెగబడ్డాడు. వరుసగా, 4 రౌండ్లు. నెత్తుటి మడుగులో కృషి... 

ఎ.సి. సౌండ్ తప్ప ఇంకేమీ వినబడట్లేదు. ఇంతలో మొబైల్ రింగయింది. ఉలిక్కిపడి లేచిన కృషి టైం చూసి అర్థరాత్రి 1:30 అని తెలుసుకుని, కల అని కన్ఫర్మ్ చేసుకుని, చల్లటి మంచినీళ్ళు తాగి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇంత ముక్కు సూటిగా వెళితే జరిగే అనర్థం బాగా అర్థమయింది. మొహానికి పట్టిన చెమటని తుడుచుకుని, ఉదయం లేస్తూనే, దినేష్ కి ఫోన్ కలిపాడు.

దినేష్. ఎ.పి. లోని టాప్ ఐ.పి.ఎస్ ల్లో... ఆ మాట కొస్తే, ఇండియాలోని టాప్ ఫైవ్ లిస్ట్ తీస్తే, అందులో ఖచ్చితంగా చోటు దక్కించుకునే మేథో సంపన్నుడు. ఎన్నో క్లిష్ఠమైన కేసుల్ని, ఎలాంటి ప్రలోభాలకీ లొంగకుండా సాల్వ్ చేసిన ట్రాక్ రికార్డ్. తనకీ, వీరిద్దరినీ కలపడంలో ఎలాంటి పాత్ర ఇవ్వాలో ప్రణాళిక రచించి పెట్టుకున్న కృషి, ముందు భూషణానికి నైతికంగా బుద్ధి చెప్పే ప్రక్రియలో భాగంగా, పథకాన్ని సిద్ధం చేసాడు. 
(సశేషం)

No comments:

Post a Comment

Pages