మానసవీణ - 2 - అచ్చంగా తెలుగు
మానసవీణ – 2
-శ్రీనివాస్ యనమండ్ర


“మానస”
రిజిస్టరులో ఏ ముహుర్తాన ఆ అనాధ ఆశ్రమం మానేజరు ఆ పేరు రాసిందో కానీ, పేరుకు తగ్గట్టు ముగ్దమోహనత్వాన్ని నింపుకుని పెరిగింది మానస.ఆమెను కన్నతల్లిదండ్రులకి ఏ ఇబ్బంది వచ్చిందో కానీ నిండా మూడునెలలునిండని పసిగుడ్డుని అలా అనాధఆశ్రమం వద్ద వదిలిపెట్టి వెళ్ళారు.
దిక్కూమొక్కూ లేకుండా ఉండేవారికి దేవుడొక్కడే దిక్కుకాకూడదని నమ్మేవ్యక్తులలో మొదటగా వినపడేపేరు ఈ రాష్ట్రంలో GTR దే. యాభైఆరేళ్ళ గుమ్మనేని త్రివిక్రమరావు రాష్ట్రంలోని వేళ్ళతో లెక్కించదగ్గ కోటానుకోటీశ్వరులలో ఒకరు. ఆయన జీవితం కూడ వడ్డించిన విస్తరేమీ కాదు. ఏన్నో వ్యయప్రయాసల కోర్చి చిన్నతనంలోనే తల్లిదండ్రులని పోగొట్టుకున్నా,పెంచినమామయ్య అండదండలతో అంచెలంచెలుగా ఎదిగినవ్యక్తి GTR . స్వయంకృషితో ఆ మామయ్య స్థాపించిన రియల్ఎస్టేట్   వ్యాపార మెళకువలు యువకుడిగా వున్నప్పుడే ఆకళింపు చేసుకున్నాడు.రియల్ఎస్టేటు రంగానికీ రాజకీయరంగానికీ వుండే అవినావభావసంబధాన్ని మొదటగా గుర్తించి దానిద్వారా కుటుంబవ్యాపారసామ్రాజ్యాన్ని విస్తరించినవ్యక్తులలోGTR పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.  తను స్థాపించిన ఎన్నో వ్యాపారసంస్థలతోపాటు తన తల్లిపేరుమీద ఒక అనాధఆశ్రమం నడిపిస్తున్నాడు గతపాతికేళ్ళుగా. తను చిన్నప్పుడు అనుభవించిన ఒంటరితనం ఇంకొకరు అనుభవించకూడదనే ఉద్దేశ్యముతో ఆ ఆశ్రమంలోని పిల్లలకు అన్నివసతులూ కల్పించాడు. ఆ ఆశ్రమం స్థాపించిన మొదటి రెండువారాల్లోనే మానసని తనతల్లిదండ్రులు అక్కడ వదిలివెళ్ళారు.
సంస్థ స్థాపించిన మొదటిరోజులు కావటంతో GTRఎక్కువసమయం వారాంతాల్లో అక్కడే గడిపేవాడు.తనతోపాటుగా తనభార్య సువర్చలని కూడ తీసుకుని వచ్చేవాడు అక్కడికి. వారిద్దరి దృష్టిని  ఎంతగానో ఆకర్షించింది మానస. బొద్దైన రూపం. చక్కటి బోసినవ్వు.ముచ్చటైన కనుముక్కుతీరు. పిల్లను చూడగానే చిదిమి దీపంపెట్టాలనిపించే అందం. అలాంటి పాపను వదలాలని  ఆ తల్లిదండ్రులకి ఎలాఅనిపించిందో అని అనుకున్నారు ఆ దంపతులు మానసను చూసిన మొదటి నిమిషమే.పాపను చూసిన మరుక్షణమే తనని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పెంచుకుందామనుకున్నారు. కానీ ఇంట్లో అప్పటికే ఏడాదివయసున్న బాబు అనిరుధ్  ఉండటం,సువర్చల ఆరోగ్యపరిస్థితి కూడా అంతంతమాత్రముగానే ఉండటముతో ఆ ఆలోచన విరమించుకుని ఆశ్రమంలోనే మానసని ప్రత్యేకశ్రద్ధతో పెంచమని మానేజరుని ఆదేశించాడు GTR.
దాంతో చిన్నప్పటినుండీ మానస మీద ప్రత్యేకమైన శ్రధ్దతో ఆ ఆశ్రమంలోని ప్రతీవారు మెసలుకునేవారు. దానికి తగ్గట్టుగానే మానస చిన్నతనమునుండే అన్నివిషయాలలోనూ అందరిమన్ననలనూ అందుకునేది.
GTR తను స్థాపించిన ఇంటర్నేషనల్ స్కూల్ లో ఈ ఆశ్రమములోని మెరిట్స్టూడెంట్స్ ఏడాదికి ముగ్గిరిచొప్పున ఉచితంగా చదువుకునే ఏర్పాటు చేశాడు.అలా ఆరవతరగతిలో ఆ స్కూలులో మిగతాడబ్బున్న పిల్లలమధ్యలో చేరింది మానస. చుట్టూ వుండే పిల్లలతల్లిదండ్రులు ఎంతోగొప్పగొప్ప పొజిషన్లో ఉండి తమపిల్లలకు ఎన్నోసౌకర్యాలు అందిస్తూ వుంటే,మానసమటుకు ఏ విధమైన ప్రలోభాలకూ లోనుకాకుండా చదువుమీద శ్రద్ధపెట్టి, అన్నిక్లాసులలోనూ మొదటిర్యాంకు సాధిస్తూ ఉండేది.
తన గురించి చెప్తేతప్ప మానసని చూస్తే ఎవరూ అనాధ అని ఊహించరు. ఎప్పుడూ తనమొహములో చెరగని చిరునవ్వు. తొణకని ఆత్మవిశ్వాసం. చెదరని నిర్మలత్వం.దానితో ఒకసారి తనని కలిసినవారెవరైనా తనకి స్నేహితులుగా మారవలసిందే. చిన్నప్పటినుండీ తను అలానే అందరి తలలోనాలుకగా వ్యవహరిస్తూ ఎవరికి సహాయంకావలన్నా దగ్గరుండి చేసేది. స్కూలు అయిపోగానే ఆశ్రమం కార్యకలాపాలలో మానేజరుకి చేదోడువాదోడుగా ఉంటూ తనకన్నా చిన్నపిల్లలకు చదువు చెప్పేది.వాళ్ళచేత గార్డెనింగ్  చేయించేది.సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేది.
అలా చలాకీగా తిరిగే మానస అంటే టీచర్లకి ఒక ప్రత్యేకమయిన అభిమానం ఉండేది. క్లాసులో చదువువిషయాలే కాకుండా మిగతా స్కూలు కార్యక్రమాలలో వారికి మొదటగా గుర్తుకువచ్చే పేరు మానస. ముఖ్యంగా యాన్యువల్డే సందర్భంగా స్కూలువారు నిర్వహించే కార్యక్రమాలు తను ఆరవతరగతిలో జాయిన్అయిన ఏడాదినుండీ పదవతరగతి వచ్చేవరకూ చాలా సమర్ధవంతముగా నిర్వహించింది మానస. చక్కటి గాత్రముతోడవటంతో ప్రతీఫంక్షన్లోనూ ప్రార్ధనాగీతాలని మానస పాడాల్సిందే. ఆ రకముగా స్కూలులోనూ, ఆశ్రమములోనూ అందరిలోకీ ప్రత్యేకమయిన స్ఠానం సొంతంచేసుకుంది మానస.
అంత ప్రత్యేకతని తెచ్చుకుని కూడా ఏనాడూ మానసగర్వముతో విర్రవీగిన సందర్భములేదు. అలా అని తనకి ముఖ్యమయినస్నేహితులు అనబడేవారు ఎవరూ లేరు. కనపడిన ప్రతీఒక్కరిని చక్కటిచిరునవ్వుతో పలకరిస్తూ అందరినీ సమానంగా చూస్తూ, అందరితో సమానమయిన స్నేహంతో మెసలుకునేది.క్లాసుపూర్తయ్యేవరకూ శ్రద్దగా టీచరు చెప్పినపాఠాలు వినడం, క్లాసుపూర్తయ్యాక కాసేపు వాటిని మననంచేసుకోవటం, సాయంత్రం ఒక గంటసేపు లైబ్రరీలో పుస్తకాలు తిరగెయ్యటం ఇదే దినచర్యగా కొనసాగింది తనకి. పుస్తకాలు తోడువుంటే తనలో వచ్చే ఉత్సాహాన్ని గమనించిన మానస తనకి నిజమయిన నేస్తాలుగా వాటినే చేసుకుంది. లైబ్రరీలో గంటలుగంటలు గడిపినా అలుపు వచ్చేదికాదు తనకి. పుస్తకాలు చదవటమేకాకుండా వాటిలో తనకినచ్చే వ్యాఖ్యలను నోటీసుబోర్డులో పెట్టి, పదిమందిచేతా చదివించేలాగా చేసేది.
అలా ఉత్సాహముగా గడిచిన స్కూలురోజుల్లో ఆమెకితెలియకుండా ఆమెమీద ఎంతో మంది అభిమానం పెంచుకునేవారు. అందులోఒకరు GTR కొడుకు అనిరుధ్.స్వభావరీత్యా మానసకి సమానమే అయినా పదిమందిముందరికి రావాలంటే బిడియపడే మనస్తత్వం అనిరుధ్ది. ఎవరైనా ప్రత్యేకంగా గమనిస్తేతప్ప తనుక్లాసులో వున్నాడనే విషయం తెలియదు. తనపనేదో తను మౌనంగా చేసుకునిపోవటం తప్ప , వేరే ఎవరితోనూ పెద్దగాసంబధాలు పెట్టుకోవటమూ తెలియదు అతనికి.అలాంటి అనిరుధ్ ను  మానస చలాకీతనం ఎంతగానో ఆకర్షించింది. ఆ ఆకర్షణ మొదలయ్యింది వారు  ఎనిమిదవతరగతి ఉన్నప్పుడు స్వాతంత్రదినోత్సవ సంబరాలసందర్బముగా స్కూలువారు నిర్వహించిన కార్యక్రమాలలో ఇద్దరూ కలిసి పాల్గొన్నప్పుడు.
ఆ రోజు ఏమయ్యిందంటే…..
(సశేషం)

No comments:

Post a Comment

Pages