నెత్తుటి పువ్వు - 14 - అచ్చంగా తెలుగు
 నెత్తుటి పువ్వు - 14
                                                                               మహీధర శేషారత్నం



(జరిగిన కధ : రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో బాగా తాగి, స్పృహ తప్పి పడిపోయిన అమ్మాయిని తన స్నేహితుడి గదికి తీసుకువస్తాడు రాజు. మాట వినకుండా మొరాయిస్తున్న ఆమెను, వెనక్కి దింపేస్తానని బెదిరిస్తాడు. రాజు ఆ అమ్మాయిని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తారు  అతడి శ్రేయోభిలాషులు. ఆమెను బట్టల కోటలో పనిలో పెడతాడు రాజు. రాజు చెల్లెలు వసంత అతని ఇంటికి వచ్చి వెళ్తుంది. హఠాత్తుగా కాశింబి కొడుకూ, కోడలూ ఆత్మహత్య చేసుకు చనిపోవడంతో వాళ్ళ నలుగురు పిల్లలను తీసుకుని, నాగరాజు వద్దకు వస్తుందామె.)
ఒకరోజు నాగరాజు సెంటర్లో వెడుతుంటే ఆదినారాయణ ఎదురుపడ్డాడు. 
“నమస్కారం సార్!” అన్నాడు ఆదినారాయణ.
          “నమస్కారం బాగున్నారా?" సైకిలు దిగాడు నాగరాజు.
          “బాగున్నాను సార్! మీరుపెట్టిన అమ్మాయి వారం రోజులుగా రావటంలేదు. ఎందుకో కనుక్కుందామంటే ఎక్కడుంటుందో తెలియదు.”
          ఉలిక్కి పడ్డాడు నాగరాజు. మనసులో చటుక్కున ఆలోచన మెదిలింది ఉడాయించిందా ఏమిటని? 
“కనుక్కుంటాలెండి, ఇంతకీ పనిబాగా చేస్తుందా!”
          “బాగానే చేస్తుంది. తన పనేదో తనే ఎవరితో ఎక్కువ కల్పించుకు మాట్లాడదు.”
          “సరే! సరే! మళ్ళీ కలుస్తాను.”
          “ఉంటా బాబూ! నమస్కారం” చేతులు జోడించాడు ఆదినారాయణ.
          సైకిలెక్కిరయ్యిమని రాములమ్మ ఇంటిముందు ఆగాడు. తాళం వేస్తుంది. అక్కడ టీకోట్లో ఎంక్వైరీ చేసాడు.
          “రాములమ్మ, మొగుడు ఊరెళ్ళారు బాబూ! కూతురికి కానుపు రోజులట. రెండు మూడు నెలలు రామన్నారు.”
          సరోజ ఉండే గదికి వెళ్ళాడు. తలుపుతట్టి తోసాడు. తీసే ఉంది. చూస్తే ఒక మూల చాపమీద మూటలా పడి ఉంది.
          “సరోజ!” పిలిచాడు. పలకలేదు.
          సరోజా! పిలుస్తూ దగ్గరకెళ్ళాడు. కళ్ళు తెరవడానికి ప్రయత్నించినా తెరవలేకపోయింది. ఒంటిమీద చెయ్యేసి చూసాడు. కాలి పోతోంది. ఏం చెయ్యాలో తోచలేదు. ఒక్క క్షణం ఆలోచించి వీధి చివర ఆర్. ఎమ్.పి. డాక్టరు ఉంటే తీసుకు వచ్చాడు. “విష జ్వరాలు సార్! ఊరంతా ఇవే. 104 డిగ్రీల దాకా ఉంటుంది.” ఇంజక్షన్ ఇచ్చి టాబ్లెట్స్ రాసి ఇచ్చాడు.“ప్రతి ఆరు గంటలకి ఒకటి వెయ్యిండి. జ్వరం కంట్రోల్ లోకి వస్తుంది. రేపు వచ్చి చూస్తాను.” బలవంతంగా లేపి ఒక టాబ్లెట్ వేసాడు. ఎవరున్నారు తోడు? తనకు తప్పేలా లేదు అనుకుంటూ సాయంత్రం దాకా ఉండి హోటల్ నుండి పాలు పట్టుకొచ్చి ఇచ్చాడు. వద్దన్నా బలవంతం మీద తాగించాడు. తాగుతూనే భళ్ళున కక్కుకుంది. నాగరాజు మీద చింది పడింది. భయం భయంగా చూసింది. నీరసం, భయంతోకూడిన ఆ చూపులు రాజుకి జాలి కలిగించాయి.
          ఫర్లేదులే అన్నట్టుచూసి కడుక్కొని మగ్గులో నీళ్ళుతెచ్చి నోరు కడిగించాడు. కడుక్కుని కళ్ళు మూసుకుని పడుక్కుంది. మాటేరానంత నీరసంగా పడున్న ఆ పిల్లను ఎలా వదలాలో అర్థం కాలేదు. అని అని తానుండాలంటే ఎలా?... అని మధనపడ్డాడు. చేసేది లేక ఇప్పుడే వస్తానని ఇంటికి బయల్దేరాడు. భోజనం చేసి ఒక స్నేహితుడికి ఆరోగ్యం బాగాలేదని సాయం ఉండి పొద్దునే వస్తానని చెప్పి దుప్పటి తీసుకు బయల్దేరాడు. వెళ్తూ, వెళ్తూ వాటర్ బాటిల్, ఎలక్ట్రాల్ ప్యాకెట్ తీసుకెళ్ళాడు. నిద్రపోతున్న ఆమెను లేపి మాత్ర ఇచ్చి ఎలక్ట్రాల్ కలిపి తాగించాడు. అక్కడే దుప్పటి పరచుకుని పడుక్కున్నాడు. నిద్రపట్టేసింది. నిద్రలేచి చూసేసరికి లేచి ముఖం కడుక్కున్నట్టుంది. చాపమీద పక్కనే కూర్చుని అతన్నే చూస్తోంది.
***

No comments:

Post a Comment

Pages