మానసవీణ - అచ్చంగా తెలుగు
'మానస' వీణ
భావరాజు పద్మిని

వాళ్లకు తెలిసినవి రెండే కులాలు... డబ్బున్న వాళ్ళు,పేదవాళ్ళు.

వాళ్లకు ఎప్పుడూ తోడుండే నేస్తాలు రెండే  .... ఆకలి,పేదరికం.

వాళ్ళ మనసుల్లో ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు ... “డబ్బు మా వద్ద ఎందుకు లేదు ? మేము అందరిలా మంచి బట్టలు ఎందుకు వేసుకోలేము ? నచ్చినవి ఎందుకు కొనలేము, తినలేము ? ఆకలి ఆగనప్పుడు, చెత్తబుట్ట దగ్గర ఎంగిలాకులు ఏరుకు తినే కుక్క బ్రతుకులకి, మా బ్రతుక్కి తేడా ఎందుకు లేదు ? “ అవసరాలు ఎప్పటికప్పుడు ఆ ప్రశ్నల నోళ్ళు నొక్కేస్తూ ఉంటాయి. ఈ రోజు గడిచిందిగా, సరిపెట్టుకోమంటాయి. 

వాళ్ళ కళ్ళల్లో ఆశల దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. ఇలలోనో, కలలోనో ఎవరో ఒకరు దైవంలా వస్తారని, ఎండిన తమ బ్రతుకుల్లో వసంతం తెస్తారని... ఎడతెగని ఎదురుచూపులు. అమావాస్య చీకట్లు కమ్ముకుని, ఆకలికి, దాహానికి, దేహాన్ని కప్పుకోడానికి కూడా చాలీచాలని తమ బడుగు బ్రతుకుల్లోకి ఎవరో నిండు పున్నమిలా వస్తారని... వెన్నెల చలువలు తెస్తారని... నిరీక్షిస్తూ ఉంటారు. నిద్రలో కూడా ఉలికులికి పడుతుంటారు. ఎండకి, వానకి ఎండే వారి జీవితాల్లోకి హరివిల్లులా వెళ్తుంది 'మానస.'

అలాగని మానస కోటీశ్వరురాలు కాదు. మనలాంటి మామూలు మనిషే ! 'మనసుంటే మార్గం ఉంటుంది...',  అని త్రికరణ శుద్ధిగా నమ్మిన సాధారణ వనిత ఆమె. యుక్తి, నమ్మిన పని పట్ల అనురక్తి, పట్టు సడలని సంకల్ప శక్తి... ఈ మూడూ కలిస్తే ఆ వ్యక్తి ఒక శక్తి అవుతాడు. అందుకే మానస తానే ఒక సైన్యంగా,   తనలోని విశ్వప్రేమ వాహిని ప్రవాహినిగా, తన గమనాన్ని నిర్దేశించుకుని కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.

లోకంలో రెండు రకాల వ్యక్తులు మనకు తారసపడుతూ ఉంటారు. ఒకరు మార్గం కోసం నిరీక్షిస్తూ కాలం గడుపుతుంటారు. మరొకరు తమ మార్గం తామే ఏర్పరచుకుంటారు. అలా తన పధం తానే నిర్దేశించుకుని, తన బాట తానే వేసుకుని, నిశ్శబ్ద ప్రభంజనమై కదిలింది మానస. అటువంటి ఒక్క ముందడుగు పడితే, అదే ఒక మార్గంగా ఏర్పడి, ఇతరుల్ని ఆ దారిలో నడిచేలా చేస్తుందని, ఆమెకు తెలుసు !

చీకట్లో మగ్గిన వాళ్ళకే వెలుగు విలువ తెలుస్తుంది. కడుపు కాలిన వాళ్ళకే ఆకలి విలువ తెలుస్తుంది. ప్రేమ, ఆదరణ కరువైన వాళ్ళకే ప్రేమానురాగాల విలువ తెలుస్తుంది. అలా పెరిగిన అనాధ మానస. అయితే, ఇవన్నీ లేని వాళ్ళు సహజంగా సమాజం పట్ల అసహ్యాన్ని, తిరస్కార భావాన్ని పెంచుకుంటారు. అలా పెంచుకున్న వారు నేరస్తులుగా, ఉన్మాదులుగా మారుతుంటారు. అటువంటి వాళ్ళను సమర్ధించదు మానస. ఆమె దృష్టిలో ఎవరికైనా అందుబాటులో ఉండే దారులు రెండే ! మొదటిది ప్రేమ, రెండవది ద్వేషం. ఎందరో రెండవ  దారిని ఆశ్రయిస్తారు. కాని, మానస మొదటి దారే, సమాజంలో మార్పుకు తొలి మెట్టు అని నమ్ముతుంది.

ప్రేమతో ద్వేషాన్ని జయించవచ్చు. ప్రేమతో అసహ్యాన్ని తుడిచెయ్యచ్చు. ప్రేమతో హృదయాల్ని కరిగించవచ్చు. ప్రేమతో మనసులు గెల్చుకోవచ్చు. ప్రేమతో మనుషుల్లో నిద్రాణమై ఉన్న మానవత్వాన్ని మేల్కొల్పవచ్చు. ప్రేమతో విశ్వ మానవ సంబంధాలకు ఒక కొత్త రూపు తీసుకురావచ్చు. అయితే, ఎవరో ఒకరు ఈ దిశగా పయనించాలిగా... సమస్యల్ని విహంగ వీక్షణం చేస్తూ, కొత్త పరిష్కారాలు కనిపెట్టాలిగా...  ‘ఆ ఒక్కరూ తనే ఎందుకు కాకూడదు ?’ అనుకుంది మానస.

సొందర్యాన్ని నిలువెత్తున పోతపోస్తే మానస . మంచు ముత్యాల వంటి స్వచ్చమైన నవ్వుల్ని కలబోస్తే మానస. చందమామ చలువ వంటి చల్లటి మమతల్ని పట్టితెస్తే మానస . ఆమెను చూడగానే ఒక రకమైన ఆరాధనాభావం కలుగుతుంది.  ఆమె నడుస్తుంటే రాజహంస రాజసం కదలాడుతుంది. ఆమె మాట్లాడితే ఎదుటివారి మానస వీణ మీటినట్లు ఉంటుంది. ఆమె ప్రతీ కదలికలోనూ ఒక అందం, ఠీవి, దైవత్వం ! అది ప్రేమ మాత్రమే నిండిన ఆమె హృదయం లోని లాలిత్యమేమో ! దారి తప్పి వచ్చిన ఏ దేవతో అనిపిస్తుంది ఆమె . ఏ దారీ కానరాని వారికి రహదారి చూపేందుకు వచ్చిన మార్గదర్శి అనిపిస్తుంది ఆమె.

( సశేషం... )

No comments:

Post a Comment

Pages