రుద్రభూమి - అచ్చంగా తెలుగు
||రుద్రభూమి||
 వాసుదేవమూర్తి శ్రీపతి

కానివ్వు..!
గాలి నీకిచ్చే ఊపిరిని
ఉపసంహరించుకునేవరకూ ఇలాగే కానివ్వు!!
నీరు నీ ప్రాణాలను తాగేసే వరకూ ఇలాగే కొనసాగు!!

నీచే కొట్టివెయ్యబడ్డ చెట్ల మోళ్ళు
నీ నాశనాన్ని కోరుతూ చేసే ప్రార్థనలు
దిగంతాలు దాటి విధాత చెవులను
బద్దలు కొట్టేవరకూ అలా నరుకుతూనేవుండు!

కొట్టు! మరో చెట్టుని కొట్టి బల్లగానో, కుర్చీగానో
మంచంగానో, దర్వాజాగానో మార్చేయ్‌
నిన్ను మోసిన నేరానికి
నేల ఆకాశానికి ఉరేసుకుని చచ్చిపోయేలా చెయ్యి!!


పచ్చగా ఉన్న పిచ్చితల్లి నువ్వెంత చిచ్చు పెట్టినా
సహిస్తోందికదా అనుకోకు
పచ్చని తల్లి కన్నెర్రబడితే
ప్రళయం పంచముఖమవుతుంది
ఆకాశం మంచులా మీద పడుతుంది
గాలి అచరాలనుండి ఆకారాన్ని
చరాలనుండి ప్రాణాన్నీ లాక్కుపోతుంది
అగ్ని తన ఆకలి తీర్చుకుంటుంది
నీరు నీ సొంతం అనుకున్న సమస్తాన్నీ ఆక్రమించేస్తుంది
భూమి రుద్రభూమిగా మారిపోతుంది.
అప్పటివరకూ ఇలాగే కానీవ్వు!!

 ****

No comments:

Post a Comment

Pages