'నాకు నచ్చిన నా కధ(ఇది నా కధే) - స్వచ్ఛంద పదవీ విరమణ- స్వచ్ఛంద సమస్యలు - అచ్చంగా తెలుగు

'నాకు నచ్చిన నా కధ(ఇది నా కధే) - స్వచ్ఛంద పదవీ విరమణ- స్వచ్ఛంద సమస్యలు

Share This
నాకు నచ్చిన నా కధ(ఇది నా కధే) - స్వచ్ఛంద పదవీ విరమణ- స్వచ్ఛంద సమస్యలు
శారదాప్రసాద్ 

నేను 2001 లో స్వచ్ఛంద పదవీ విరమణచేశాను. అప్పుడు నా వయస్సు 50 సంవత్సరాలు.చిన్న తనంలోనే నాకు వివాహం జరగటం వల్ల బాధ్యతలన్నీ పూర్తి అయ్యాయి.

నేను మొదటినుండీ 'స్వేచ్చా జీవిని'.అన్నీ చదువుతాను,అన్నీ వింటాను ...కానీ ఎవరి ప్రభావం నా మీద పడకుండా చాలా జాగ్రత్త పడుతాను.నన్ను ప్రభావితం చేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు.అయితే,వారి భావాలకు నేను బందీని' కాను,కాలేను.ఎందుకంటే భావదాస్యం' అనేది దేశభక్తి లేకపోవటం కన్నా పెద్ద పాపం' అని ఒక మహాకవి అన్నాడు.విషయంలోంచి, ప్రక్కత్రోవ పడుతున్నట్లున్నాను.విధులనుండి విముక్తి లభించగానే చాలా సంబరపడిపోయి ఒక వారం రోజులు ఎవ్వరికీ కనపడకుండా చిన్ననాటి స్నేహితులందరినీ కలుసుకున్నాను.నా బలం,బలహీనత నా స్నేహితులే!అసలు సమస్యలు అప్పుడే మొదలయ్యాయి.మీరు అనుకున్నట్లుగా పెన్షన్  gratuity లాంటివి కావు.బాగా పొద్దు పోయిన దాకా T.V.programmes చూడటం వల్ల ఉదయం ఆలస్యంగా నిద్ర లేవటం మొదలైంది.ఒక రోజు పనిమనిషి అడిగింది ' అమ్మగారూ! అయ్యగారు ఆఫీసుకు పోరా?ఇంకా నిద్ర కూడా లేవలేదు ' అని. అప్పుడు నా భార్య, ' నీకు తెలియదా! అయ్యగారు ఉద్యోగం  మానేశారు ' అని చెప్పగానే, పనిమనిషి అమాయకంగా, ' అయ్యో పాపం ! ఏమయ్యింది,ఇప్పుడేమి  చేస్తారు? ' అని అడగగానే నా భార్య,' ఏమీ చెయ్యరట!' అని చెప్పింది.పనిమనిషి వెళ్లి పోయింది.

' ఏమి పోయిందీ!కొంతకాలం ఉద్యోగం చేస్తే!అందరికీ చెప్పలేక చస్తున్నాను ' అని గొనుక్కుంటూ(నాకు వినపడేటట్లు) వంటింటిలోకి వెళ్లి ఏదో పని చేసుకుంటుంది  మా ఆవిడ.నేను లేచి టైం చూసుకొని,ఉదయం 10 గంటలు  అయినందుకు సంతోషపడ్డాను. సంతోషం ఎందుకంటే, మనం ఆఫీసుకు పోనవసరం లేదు, మనం ఎవరికీ జవాబుదారీ కాదు.గబగబా బ్రుష్ చేసుకొని వచ్చి,కాఫీ  త్రాగి ' ఏమోయ్! టిఫిన్ తీసుకొని రా!' అని నా శ్రీమతికి ఆజ్ఞ వేశాను. అందుకు ఆమె,' ఇప్పుడు 10 గంటలైంది,కాఫీ త్రాగారు.ఒక గంటలో వంట పూర్తి అవుతుంది,ఒకేసారి భోజనం చేయవచ్చు' అని చెప్పి, నా సమాధానం కోసం ఎదురు చూడకుండా ' రేపటినుండీ కూడా ఇదే కార్యక్రమం కొనసాగుతుంది'.అని తన నిర్ణయమే ఫైనల్ అన్నట్లుగా చెప్పి వెళ్ళిపోయింది.కొంత కోపం వచ్చినప్పటికీ, ఆవిడను ఏమీ అనను,అనలేను .ఎందుకంటే,ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళు ఇల్లు వాకిలి పట్టించుకోకుండా union వ్యవహారాలలో తిరుగుతుంటే,అన్నీ తానై ఇంటి కార్యక్రమాలన్నిటినీ చక్క బెట్టింది. అప్పుడే పనిమనిషి వచ్చింది.ఆ కోపం అంతా పనిమనిషి మీద చూపించా! ' ఇప్పుడా వచ్చేది ! టైం ఎంత అయిందీ? అని నేను గట్టిగా అడుగగానే,వెంటనేమా ఆవిడ వచ్చిఎందుకు దాన్ని అరుస్తారు? నేనే ఆలస్యంగా వచ్చి పనులన్నీ నిదానంగాచేసుకెళ్లమని చెప్పాను ' అని మా ఆవిడ దానికి supporting  గా మాట్లాడేటప్పటికి,అదీ కొద్దిగా ధైర్యం తెచ్చుకొని,' మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసేసారట కదయ్యా! మీరు ఆఫీసుకు పోనవసరం లేదటగా! అందుకని ఆలస్యంగా వచ్చినా ఫరవాలేదు అని అమ్మగారు చెప్పారు 'అదీ దాని సమాధానం.' ఇప్పటికిప్పుడు తేలాల్సిందే, 'చెప్పు! నన్ను ఉద్యోగం లోంచి తీసేసారని ఎవరు చెప్పారు? 'అని నా భార్య వంక కూడా తెలియనట్లు ఒక చూపు చూసా!

'నన్ను తీసి వేయండి అని మీరు దరఖాస్తు పెట్టుకుంటేనే కదా,వాళ్ళు తీసేసింది? పిచ్చిది, అవన్నీ దానికి ఎలా తెలుస్తాయి? 'అని మా ఆవిడ పనిమనిషినే సమర్ధించింది. అసలు ఆవిడ కోపమేమిటంటే,పొద్దున్నే ఆఫీసుకి వెళ్లి చీకటి పడి ఇంటికి వస్తేనే  తెగ మండిస్తారు.ఇక రోజు మొత్తం ఈయనను ఎలా భరించటం? అని. 

నాపరిస్థితిని వివరించి నాకు పూజ్యులు ,అనుభవజ్ఞులు అయిన మిత్రులను సలహా అడిగాను .వాళ్ళు కూడా మా పరిస్థితి అదే ! అని ముక్తకంఠంతో సమాధానం చెప్పారు. వాళ్ళల్లో ' భార్యను లొంగతీసుకొనటం ఎలా? ' అనే subject మీద కొంత పరిశోధన చేసిన మిత్రుడు ఇలా అన్నాడు,' వీటన్నిటికీ మనం చేసిన తప్పులే కారణం,ఎందుకంటే కనీసం సంవత్సరానికి ఒకటి,రెండైనా సినిమాలు చూపించామా?, LFC  లలో విహార యాత్రలకు ఎన్నిసార్లు తీసుకొని వెళ్ళాం? ' అలా అన్నీ నిజాలే వాడు చెబుతుంటే  బిత్తరపోయి,జాలిగా వాడి మొహం వంక చూస్తున్నాం,ఏదైనా పరిష్కారం చూపిస్తాడు కదా అని.వాడు ఇంకో విషయం కూడా చెప్పాడు.అది ఏమిటంటే,' ఈ రంగారావు గాడి భార్య రాత్రి మా ఆవిడకు ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడింది.ఆడవాళ్ళంతా ఒకటై  ఏదో గూడుపుఠాని చేస్తున్నారు '. 

' అది సరిలేరా! తరుణోపాయం చెప్పమంటే, కొత్త సమస్యలు సృష్టిసున్నావు' అని వాడిని కొద్దిగా మందలిస్తే ,వాడు ఒక పని చేద్దాం ! ఒక రెండు నెలలు అన్ని ప్రదేశాలు వాళ్ళను తీసుకొని చూపిద్దాం అని అందరమూ ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొన్నాము.అలాగే వెళ్లి వచ్చాము.

ఒక లక్షరూపాయలు అయిపోయాయి. మాలో ఒక ఆర్ధిక వేత్త ఉన్నాడు. వాడు ఇదేమి బాగా లేదు,డబ్బులు ఇలా ఖర్చు అయిపోతే,ముందు ముందు మన గతి ఏమి కాను? 'మన డబ్బులన్నీ కుండలో నీరు లాంటివి,అవి అయిపోతే ,మళ్ళీ ఇంకొక చోట నుంచి వచ్చే అవకాశం లేదు.ఉద్యోగం చేస్తున్నప్పుడు జీవితం ఒక పారే సెలయేరు , ఎప్పుడు కావాలంటే అప్పుడు నీరు లభిస్తుంది.ఫెస్టివల్ అడ్వాన్సు అనో,మరో loan అనో ఏదో ఒకటి తీసుకొని,కాలం వెళ్ళ బుచ్చవచ్చు.ఇప్పుడు అలా కుదరదు,ఈ డబ్బుల మీద వడ్డే మనకు ఆధారం' అని గీతోపదేశం చేసాడు. 

అప్పటినుంచి కొంత జాగ్రత్తగా ఉండటం మొదలు పెట్టాం.ఇంక social ,domestic problems మొదలయ్యాయి.ఆమధ్య ఒకాయన ట్రైన్ లో పరిచయ మయ్యాడు 'మీరు ఏమిచేస్తున్నారు? అని అడిగితే , నేను'Andhra Bank లో మేనేజర్ గా పనిచేసి రిటైర్ అయ్యాను ' అని చెప్పగానే ,ఆయన వెంటనే,' రిటైర్ అయ్యి ఎంత కాలం అయ్యింది?'అంటే 15 ఏళ్ళు అయింది అని చెప్పగానే, ఆయన 'అంటే ఇప్పుడు మీకు 75 ఏళ్ళ వయసన్న మాట! ఈ వయసులో ఇంత నవనవలాడుతున్నారు,ఎలాగో కాస్త చెప్పగలరా?' అని ఆయన అడుగుతుంటే,ప్రక్కనున్న మా ఆవిడ ముసిముసి నవ్వులు నవ్వుతుంది.' వెంటనే Urinals కు వెళ్ళాలని ' బయటపడి,ఆయన దిగిపోయిన తర్వాత నా సీట్లో కూర్చున్నాను.ఆయన వెళ్ళిపోతూ ' మీ నెంబర్ తీసుకున్నాను,మీ యవ్వన రహస్యం నాకు కావాలి.ఫోన్ లో మాట్లాడుతానని బిగ్గరగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు.

మా ఆవిడను అడిగాను ' అసలుకు ఆయనకు నా నెంబర్ ఎందుకిచ్చావు? 'అని అడిగితే మా ఆవిడ,' నాకేమి తెలుసు మీకు ఆయన బాగా తెలిసివున్నట్లు మాట్లాడితే, తెలుసేమోనని నెంబర్ ఇచ్చాను ' అంది. ఆయన ఇప్పటికీ ఫోన్స్  చేస్తూనేఉన్నాడు.ఇది వరకైతే చాలా functions కు వెళ్ళటం ఎగ్గొట్టే వాడిని, సెలవు లేదని.ఇప్పుడు అలా కాదు. పిలిచే వాళ్ళు ముందుగానే మీరు కూడా రావాలి,ఇప్పుడు ఖాళీయే కదా! అని పిలుస్తుంటారు.' ఖాళీయే కదా!' అనే మాట కొద్దిగా ఎగతాళిగా ఉందేమో ననిపిస్తుంది.ఏమి చేద్దాం,చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా! అలా అన్ని functions కు సతీసమేతంగా వెళ్ళక తప్పటం లేదు.ఖర్చు కూడా పెరిగింది. అన్నిటికంటే దారుణమైన సంఘటన ఒకటి చెప్పి ముగిస్తాను.మా ఫ్లాట్స్ లో ఒక అమ్మాయి రజస్వల అయింది. 

ఆ అమ్మాయి అమ్మా నాన్నలు వచ్చి,'సాయంత్రం ఫంక్షన్ ఉంది, మీ ఆవిడతో మీరు కూడా రండి,ఖాళీయే కదా! ' అని పిలిచి వెళ్లారు.ఇలా పేరంటాలకు కూడా వెళ్ళ వలసి వస్తుంది.
స్వచ్ఛందంగా తెచ్చుకున్న సమస్యలు కదా ఆనందంగానే అనుభవిస్తున్నా!

మరికొన్ని ముచ్చట్లు మరొకసారి!             

***

No comments:

Post a Comment

Pages