నెత్తుటి పువ్వు - 11 - అచ్చంగా తెలుగు
నెత్తుటి పువ్వు - 11
                                                                               మహీధర శేషారత్నం
(జరిగిన కధ :రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో బాగా తాగి, స్పృహ తప్పి పడిపోయిన అమ్మాయిని తన స్నేహితుడి గదికి తీసుకువస్తాడు రాజు. మాట వినకుండా మొరాయిస్తున్న ఆమెను, వెనక్కి దింపేస్తానని బెదిరిస్తాడు. రాజు ఆ అమ్మాయిని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తారు  అతడి శ్రేయోభిలాషులు. ఆమెను బట్టల కోటలో పనిలో పెడతాడు రాజు. రాజు చెల్లెలు వసంత అతని ఇంటికి వస్తానని కబురు పెడుతుంది.) 


అనుకున్నట్టే వసంత కొడుకు వచ్చారు. వసంత కొడుకు పేరు మురళి ఏడేళ్ళు ఉంటాయి వాడికి. వసంత మొగుడు స్నేహితులతో కలిసి తిరుపతి వెళ్తన్నాడుట. ఒక్కరాన్నీ ఏం ఉంటానని వచ్చేనంది. “నేనూ వెళ్తును వదినా! కానీ నెలసరి టైము. అదీకాక అంతా మగాళ్ళే వెడుతున్నారు. వీడు మామయ్య వాళ్ళింటి కెడదామని గోల” అంది. నాగరాజు పెద్దగా పండగల విషయం పట్టించుకోడుకాని వినాయక చవితి, దీపావళి పిల్లల పండగలని శ్రద్ధగా చేస్తాడు. మేనల్లుణ్ణి, కొడుకుని తీసుకెళ్ళి అన్నీ కొనిపెట్టాడు.

లక్ష్మి సినిమా ప్రపోజల్ పెట్టింది. సరోజ ఖర్చుకూడగా మీద పడడం వల్ల నాగరాజు చేతిలో డబ్బు ఎక్కువ ఆడడం లేదు. వసంత ఆశగా చూసింది. ఆవిడకు సినిమాలపిచ్చి. వాళ్ళాయన ఇష్టపడడు. అందుకు అవకాశం వస్తే వదులుకోదు.

నాగరాజు లక్ష్మిని లోపలికి పిలిచాడు.

“నా జేబులు ఖాళీ చూడు” అన్నాడు నవ్వుతూ

“ఇవేళ తారీఖు ఎంత? ఇరవై మూడు అంతేగా. వారం ఆగు. చక్కగా వెళదాం” అన్నాడు సున్నితంగా

“మీరు మరీను. మన కోసమేంటి? వసంతకోసం. నా దగ్గర ఉన్నాయి లెండి” అంది.

“అయినా మీరు పరోపకారి పాపన్న డబ్బులేం మిగుల్తాయి.

” బయటికి వెళ్ళి పోయింది.

ఈ ఆడాళ్ళు గమ్మత్తైనవాళ్ళు. సంపాదించకపోయినా ఎక్కడో అక్కడ ఎలాగో అలాగ దాస్తారు. అవసరానికి ఆదుకుంటారు. ఫైనాన్సు మినిష్టర్లుగా చేసి ఎవరూ జోక్యం చేసుకోకపోతే అప్పు లేకుండా దేశాన్నినడిపించగలరు. తనలో తనే నవ్వుకున్నాడు.

ఇంతలో లోపలికి వచ్చిన లక్ష్మి ఆశ్చర్యంగా చూసింది.

“ఏమిటి మీలో మీరు నవ్వుకుంటున్నారు?” “ఆహా!

ఏంలేదు. నిన్ను ఇండియాకి ఆర్థికమంత్రిగా చేస్తే ఎంత బాగుండు అనుకుంటున్నాను.” నవ్వాడు.

“నాకు కాదు, ఆ పదవేదో మీ చెల్లెలికే ఇవ్వండి.” నవ్వుతూ అతని చేతికి డబ్బు ఇచ్చింది.

ఆశ్చర్యంగా చూసాడు నాగరాజు.

“ఈ డబ్బు మీచెల్లి ఇచ్చింది. ఖాళీగా ఉండడమెందుకని ట్యూషన్లు చెబుతోందిట. రాగానే నా చేతికి ఇచ్చింది, ఉంచు వదినా, అవసరానికిఉంటాయి అని”

          నాగరాజుకి సంతోషంగా అనిపించింది. ఆడవాళ్ళకి ఆర్ధిక స్వావలంబన  ఉండాలని గాఢంగాకోరుకుంటాడతను.

          “గుర్తుగా రాయి. దాని అవసరానికి ఇద్దాము.”

          “నేనూ అదే అనుకున్నాను.”

          నాగరాజు ఆటో తెస్తానన్నాడు. అందరం నడవగల వాళ్ళమే కదా! కొద్ది దూరం నడిచి ఆటోపట్టుకు వెడదాం అంది లక్ష్మి.

          ఇంటర్వెల్లో పాపకారన్ పాకెట్లు కొనుక్కొచ్చింది వసంత. అన్నా వదినలతో కలిసి సినిమాకి రావడం ఆవిడకి సంతోషంగా ఉంది.

          ఎంతైనా ఆడపిల్లలకి పుట్టింటి మమకారం ఎక్కువే ఉంటుంది. మర్నాడు భోజనాలయ్యేక కేరమ్స్ ఆడదాం అన్నయ్యా! అంది వసంత. నిద్రవస్తున్నట్టున్నా చెల్లెలు అడిగింది కదా అని సరే నన్నాడు నాగరాజు, మురళి, నేను మామయ్య ఒకటి, నువ్వు, అత్తఒకటి గేమ్ గా  ఆడదాం అన్నాడు. వాడికి ఆట బాగా రాకపోయినా ఇష్టం. అదీ కాక నాగరాజు బాగా ఆడతాడు. అతను పోటీల్లో పాల్గొంటాడు. అందుకు మావయ్య పక్కన చేరాడు వాడు. నేను, నేను అంటూ కొడుకు కూడా నాగరాజు భుజాలమీద వాలేడు. నాగరాజు వాణ్ణి ముద్దుచేసి నువ్వు మా క్యాషియర్  విరా. మా కాయిన్స్ అన్నీ నీదగ్గరే దాద్దాం సరేనా! అంటూ బుజ్జగించాడు. వాడు బుద్దిగా బుర్ర ఊపేడు. లక్ష్మికి అంత బాగారాదు కాని వసంత బాగానే ఆడుతుంది. అందులో అన్నగారిలో ఆట అంటే ఆ అమ్మాయికి బాగా ఇష్టం.
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages