ఆడపిల్లలకు అండగా రచయిత్రులు - సాహిత్యమే ఆయుధంగా రచనలు - అచ్చంగా తెలుగు

ఆడపిల్లలకు అండగా రచయిత్రులు - సాహిత్యమే ఆయుధంగా రచనలు

Share This
ఆడపిల్లలకు అండగా రచయిత్రులు - సాహిత్యమే ఆయుధంగా రచనలు
డా. సరోజ వింజామర 
  


ఆదివారం.  కుటుంబ సభ్యులతో సందడిగా గడుపుతూ ఇంట్లోవారందరికీ కావాల్సినవి చేసిపెట్టడం,  ఉద్యోగినులైతే వారంరోజుల పనులను చక్కబెట్టడానికి కాసింత విశ్రమించడానికి దొరికే ఒక్కరోజు. వీటన్నింటినీ వారు నిరభ్యంతరంగా పక్కకు పెట్టారు. పసిపిల్లలపై పైశాచికత్వం తాండవమాడుతున్న ఇలాంటి ఆపద సమయంలో ఆ పిశాచులను నిరోధించే చర్యలకోసం నడుం బిగించారు. ఇందుకుగానూ కర్తవ్య రూపకల్పనకోసం ‘12 గంటలు మాతో మేము’ గడుపుతామని నిర్ణయించుకుని గత ఆదివారం 14-7-2019న అక్షర్ యాన్ - 5 గా 35 మంది తెలుగు కవయిత్రులు, రచయిత్రులు సమూహంగా కదిలారు. సాహిత్యకారులు, ఉన్నతాధికారులు, ఉపాధ్యాయినులు, ప్రొఫెసర్లు, కళాకారిణులు, యోగ అధ్యాపకులు, ఆయా రంగాలలో ఉన్నత స్థానాలలో పనిచేసి రిటైరైనవారు ఇలా అందరూ ఒకచోట కలిసి తమ అభిప్రాయాలను తెలిపిన వేదిక ఇది. ‘నాలుగు కొప్పులు కలిస్తే కలహమే’ అనే మాటను అబద్దం చేస్తూ, నాలుగు కొప్పులు కలిస్తే కోలాహలం, కలివిడితనం, క్రమశిక్షణ, కోకిల కూజితాలు, లక్ష్యసిద్ధికోసం నిజాయితీగా శ్రమించడం అనేది నిజం చేసారు వీరు. ఇక్కడివారెవరూ గుర్తింపుకోసమో, కీర్తికోసమో కాదు, ప్రాణం పోసే స్త్రీ జాతిని అమానుష దాడూలనుండి కాపాడుకునే లక్ష్యంగా ఏర్పడిన సమూహం.    ఇందులో 40 దాటిన యువతులు, 70 దాటిన పిల్లలే ఎక్కువ. వీరిలో ఉత్తేజం చూసిన తరువాత వయసు శరీరానికేగానీ మనసుకు కాదని అర్థమౌతుంది. ధృడచిత్తులే కాదు, ధృడ శరీరం, మెత్తని మనసు కల అమ్మలు, అమ్మమ్మలు, బామ్మలు. వారిని చూసాకా ఈ పదాలకు నిత్య యవ్వనులు, ఉత్సాహవంతులు అని నిఘంటువులో అర్థాలు మార్చవలసి ఉంటుంది. తమను తాము ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకున్న నిత్యచైతన్యులు. అమ్మమ్మ, నానమ్మలు పున్నమి వెన్నెల్లో గోరుముద్దలు పెడుతూ కథలు చెప్పిన తియ్యని జ్ఞాపకాలు వీరితో కలిసి గడిపిన క్షణాలలో మరొక్కసారి మదిలో తళుక్కుమన్నాయి. సాంప్రదాయాలను గౌరవిస్తూనే ఆధునిక భావాలను కలిగిన స్పూర్తిమంతులు, మూర్తిమత్వ నిర్మాతలు వీరు.     

  అత్యవసరమైన అంశంగురించి చర్చించేందుకు  రచయిత్రులు ప్రణాళికా ప్రకారం అనుకున్న సమయానికి ఉదయం రవీంద్రభారతిలో కలుసుకుని అల్పాహారం చేసిన తరువాత 8 గంటలకు ప్రత్యేక వాహనంలో మొయినాబాద్ కు ప్రయాణమయ్యారు.

     మార్గమధ్యంలో చిలుకూరులో బాలాజీ దర్శనం చేసుకున్నాము. కిటకిటలాడిన ప్రాంగణమైనా రచయిత్రులందరూ వచ్చిన కారణంగా ఆలయ ప్రధాన పూజారి శ్రీ సౌందర రాజన్ గారు ప్రత్యేక దర్శనం చేయించినారు. తదనంతరం రచయిత్రులు ఏమి రాయాలో నిర్దేశించినారు. ‘ఒల్లంతా అంగంగా బతికే రేఫాసురులను నిర్మూలించాలి. ఐతే ప్రాణాలు తీసి కాదు, వారి మనసుల్లో ఉండే రావణాసురుణ్ణి, కీచకుణ్ణి కాల్చాలి. ఇది సమాజంలో ఉన్న మనందరి బాధ్యత. ఆ విధమైన రచనలు చేసే బాధ్యత మీదే. ఎక్కడ స్త్రీ జాతి అవమానపడుతుందో ఆ దేశం బాగుపడదు. ఆడవారు అమ్మవారి స్వరూపం అనే భావన ప్రతి ఒక్కరిలో నింపాలి. అది విద్యార్థి దశనుండే మొదలుపెట్టాలి. ముందుండి నడిపించేది ఎప్పుడూ స్త్రీనే. ఆమెకు వెన్నుదన్నుగా నిలబడేది మా మగవారం. కాబట్టి నీచస్వభావుల పీచమణచడానికి మీరు ముందడుగు వేయండి. మా అందరి తోడ్పాటు మీకు ఎల్లవేళలా ఉంటుంది’ అనే ఆశీర్వచనాలతో స్వామిజీలు రచయిత్రులకు దిశానిర్దేశం చేశారు.  

       ఇండ్లకు గొళ్ళాలు లేని, తాళం వేయవలసిన అవసరం లేనివిధంగా షిరిడీ దగ్గరగల శనిసింగనాపూర్ ఊరిగురించి అబ్బురంగా చెప్పుకుంటాం. మన తెలంగాణా రాష్ట్రంలో, మనకు దగ్గరలోకూడా అటువంటి గ్రామమే ఉందంటే ఆశ్చర్యమే మరి. ఆ విషయాన్ని నిజం చేసిన ఘనత మొయినాబాద్ సి.ఐ. శ్రీ వెంకటేశ్వర్లుగారిది. తాను సి.ఐ.గ వచ్చిన తరువాత నేరాలు లేని ఊరుగా తీర్చిదిద్దిన ఘనత వారిది. వారిని కలవడంకోసం రచయిత్రులమందరం మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళినాము. ఇక్కడి ప్రజల ప్రశాంత జీవనానికి బాసటగా ఉన్న సి.ఐ. వేంకటేశ్వర్లుగారిని సన్మానించుకోవడం, కృతజ్ఞతలు తెలుపడం, వారి అభినందనలను అందుకోవడం మంచి అనుభూతి. అలాంటి ఆదర్శ నగరం మొయినాబాద్ లో ఒకరోజు గడపడం మరువలేని జ్ఞాపకం.

             సమావేశ స్థలంగా నిర్ణయింపబడిన మొయినాబాద్ లోని తన అందమైన బృందావనంలోకి రచయిత్రులందరినీ సాదరంగా తీసుకెళ్ళారు సీనియర్ ఆకాశవాణి వ్యాఖ్యాత శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మిగారు. ఈ ఒకరోజు పర్యటనను పకడ్బందీగా, ప్రణాళికాబద్దంగా ఏర్పాటు చేసిన వారి నేతృత్వం, ఇచ్చిన చక్కని ఆతిథ్యం, ప్రకృతిమాత ఒడిలో రుచికరమైన వంటకాలతో వారు కూర్చిన విందు ఎప్పటికీ మరువలేనిది. ఫార్మ్ హౌస్ లో ఆటపాటలు, చిట్టిపొట్టి బహుమతులు, యోగాభ్యాసం, ఈతకొలను మునకలతో కేరింతలు, రెయిన్ డాన్స్ ల అల్లరి, దగ్గరలో ఉన్న పురాతన దేవాలయ సందర్శనలతో వచ్చినవారమంతా ఉల్లాసంగా, సందడిగా గడిపాము. 

ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో  ఆహార, ఆరోగ్యాల గురించిన ఎన్నో అవసరమైన విషయాలను పంచుకున్నాము. సాహిత్య సమావేశానికి ప్రత్యేక అతిథులుగా కవి, రచయిత శ్రీ నాళేశ్వరం శంకరం గారు, ఆకాశవాణి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ ఐన శ్రీ సి.యస్. రాంబాబుగారు విచ్చేసి ప్రత్యేక ప్రసంగాలు చేశారు. మారిన కాలానికి అనుగుణమైన వస్తువును ఎంచుకోవాలని చెబుతూ రచనల్లో మెళకువలను సూచించారు. రచనకు అంశంతోపాటు నిర్మాణం, శైలికికూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని, అది ఎలా ఉండాలనేది వివరించారు. రేడియోలో కానీ, మీడియాకోసం కానీ రచనలు, ప్రసంగాలు ఎలా ఉండాలి, చెప్పాల్సిన అంశాన్ని తక్కువలో ఎక్కువగా ఎలా చెప్పాలి, అంశం పరిధిని ఎలా నిర్ణయించుకోవాలివంటి అంశాలను చక్కగా వివరించారు.  





ఈ అందమైన బృందావనిలో సాయంసంజలో నెమలి సవ్వడుల మధ్య సాహితీ మయూరాలం సమావేశం అయ్యాము. ప్రముఖ సినీ రచయిత ఐన శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారితో వీడియోలో మాట్లాడినాము. అటుతరువాత విషసర్పాలనుండి ఆడబిడ్డలను రక్షించుకోవడం ఎలా, అందుకు మనం ఏంచేద్దాం అనే అంశంగా చర్చ జరిగింది. మనం చేయబోతున్న పని కఠినమైనదే ఐనా ఆడపిల్లలను కాపాడుకోవాలనుకుంటున్న మన ఆశయం గొప్పది. అత్యవసరమైనది. ఇందుకు సంకల్పం చేసుకుందాం. అవసరమైన అన్ని ప్రయత్నాలూ చేద్దాం. ఏ మీడియా ఐతే పసిమనసులను కలుషితం చేస్తున్నదో అదే మీడియాను ఉపయోగించుకుని మనం మంచికి ఉపయోగపడేలా కార్యక్రమాలను రూపొందిద్దాం. పిల్లల ప్రథమ గురువులు వారి తల్లిదండ్రులు. బిడ్డలు తమ తల్లిదండ్రులనే అనుసరిస్తారు. కాబట్టి పిల్లల పెంపకం విషయంలో అమ్మానాన్నలు తగు జాగ్రత్తలు తీసుకోవడం, ఆదర్శ జీవనంవంటి అవసరం ఏమిటో తెలియజేసే విధంగా ఆయా బడులకు వెళ్ళి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశాల నిర్వహణ ఇలా విస్తృత కార్యక్రమాలను నిర్వహిద్దాం. సామాజిక మాధ్యమాలలో ఎడాపెడా  వస్తున్న పోర్న్ సైట్స్ ను ఆపేయాలి. ప్రభూత్వాలు నిజాయితీగా, ఖచ్చితంగా అమలు చేస్తే ఇది సాధ్యమే అన్నారు. 

ఇటీవలి కాలంలో విశృంఖలత్వమే ప్రధానంగా ఉండి సూపర్ హిట్ అవుతున్న కొన్ని సినిమాలు కొల్లలుగా ప్రజాబాహుళ్యంలోకి  వచ్చి చిన్నాపెద్దా మెదల్లలో పశుప్రవృత్తిని ప్రేరేపిస్తున్నాయి. నడిబజారులో వికృతమైన పెద్ద పోస్టర్ల  ప్రదర్శనతో రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయి. నీతిమాలిన ఇలాంటివాటిని వ్యతిరేకించినవారిని వింతగా చూస్తున్న దౌర్భాగ్య స్థితిలో మనమున్నాం. మద్యపానం మరొక పెద్ద మహమ్మారి. చిన్న చిన్న ఆడపిల్లలపై అఘాయిత్యాల గురించి మనం ఈరోజు బాధపడుతున్నాం కానీ బాల్య వివాహాలనే తీసుకుంటే పెళ్ళి పేరుతో పసిమొగ్గలు తెలియని వయసులో చట్టబద్దంగా లైంగిక దాడులను ఎదుర్కొంటున్నారు కదా! 15, 16 సంవత్సరాల వయసుకే ఆడపిల్లలు తల్లులవడం, వారి శరీరం గుల్లయిపోతున్నది కదా.  ఇలా పుట్టిన ప్రతి ఆడపిల్లా ఏదో ఒక దశలో ఎన్నో రకాలుగా లైంగిక దాడులను ఎదుర్కుంటున్నారు. ఇంట్లోనూ, బయటా అన్ని రకాలుగా జీవితం గండంగా బ్రతుకుతున్న స్త్రీలు చాలామంది. ఇటువంటి అన్ని స్థితులనూ ఎదుర్కునే సామర్థ్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ నీ ఆడపిల్లల్లో పెంచాలి. మహిళలకు ఆపద సమయంలో అండగా ఉండాలి. ఆడా, మగ పిల్లల్లో గౌరవభావం కలిగించే విధమైన సాహిత్య సృజన జరగాలి వంటి అంశాలతో కూడిన నిర్ణయాత్మకమైన చర్చ ఈ సమావేశంలో జరిగింది.  

       సంఘటితంగా ఉంటే ఎంతటి మహత్కార్యాన్నైనా అవలీలగా సాధించవచ్చని మరోసారి ఈ సమావేశం నిరూపించింది. ‘లక్ష్యాన్ని సాధించే దిశలో మా సంకల్పానికి సహకరించండి. పడగ విప్పి బుస కొడుతున్న విషపు కామాంధులనుండి స్త్రీ జాతిని కాపాడుకుందాం. ఆ కోరలను పీకేద్దాం. ఇది కేవలం మహిళలకేగాక సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతగా స్వీకరిద్దాం’ అని మొయినాబాద్ అక్షర్ యాన్ - 5 రచయిత్రుల సమావేశం పిలుపునిచ్చింది.


డా. సరోజ వింజామర   
ఉపాధ్యాయిని
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్  (బి)
మెయిల్ : sarojavinjamara@gmail.com

No comments:

Post a Comment

Pages