కన్నయ్య అల్లరి వెనుక అంతరార్థం - అచ్చంగా తెలుగు

కన్నయ్య అల్లరి వెనుక అంతరార్థం

Share This
కన్నయ్య అల్లరి వెనుక అంతరార్థం !
-సుజాత .పి .వి. ఎల్. 

బాలకృష్ణుడు బాల్యంలో ఎంత అల్లరిచేసేవాడో పురాణ కథలు ద్వారా మనందరికీ తెలిసిన విషయమే. కానీ! ఆ అల్లరి వెనుక ఎంతో అంతరార్థం దాగుంది. గోపబాలులతో కలిసి వింత వింత ఆటలాడేవాడు. గొడవ పడటానికి వచ్చిన ఆ పిల్లల తల్లులను చూసి కిలకిలా నవ్వేశేవాడు. తల్లి యశోద మందలించేటప్పటికీ అమాయకమైన ముఖం పెట్టి జాలిగా చూసేవాడు. కన్నయ్య చేసే నిర్వాకానికి కోపం వచ్చినా మిన్నకుండిపోయేది తల్లి యశోద. గొడవలకొచ్చిన గోపబాలల తల్లులనే తిట్టి పంపించేసేది.
గోవుల్ని మేపడానికి వెళ్లి మురళివాయిస్తుంటే.. గోపికలే కాదు గోవులు కూడా మైమరచిపోయేవట.!
ఆటల్లో కిట్టయ్య దేహానికి అంటిన దుమ్ము కూడా భూతి భూషణుడు ప్రీతితో అలంకరించుకొను విభూతి వలే కనిపిస్తుంది. ఆ ఉంగరాల జుట్టుపై తల్లి యశోదమ్మ తలలో చిన్ని పిలకకు చుట్టిన ముత్యాల మాల ఇందుశేఖరుడు తలదాల్చిన చంద్రుడ్ని పోలి ఉంటుంది. నుదుటి మీద ఎర్రని కస్తూరి తిలకం కాలుడి మూడవ నేత్రమా?! అన్నట్టు కనిపిస్తుంది. రత్నాల హారంలోని నీలమణి గరళ కంఠుని కృపావృష్టికి నిదర్శనమైన హాలాహలపు మచ్చవలె శోభిల్లుతుంది. మెడలోని ముత్యాల హారాలు నాగభూషణుడుని అలంకరించు సర్పహారాలవలె వుంటాయి. సామవేద సారుడైన కృష్ణయ్య వేణువు ఖట్వాoగుని దండాన్ని పోలి ఉంటుంది. ఇలా 'శివుడూ నేనూ ఒకటే సుమా!' అని హెచ్చరిస్తున్నాడా? అన్నట్టు కనిపించేవాడు కన్నయ్య.
ఒకనాడు కన్నయ్య ఒక గోపిక ఇంటిలోకి జొరబడి కడవలలోని వెన్ననంతా తినేశాడు. అంతే కాక ఖాళీ కడవలు తీసుకువచ్చి పొరుగింటిలో పడేసి వెళ్ళిపోయాడు. తరువాత ఆ ఇంటివారికీ ఈ ఇంటివారికీ పెద్ద పోట్లాట జరిగింది. ఈ అల్లరి వివరిస్తూ గోపిక, యశోదాదేవితో ఇలా అంది.
'వారిల్లు సొచ్చి కడవల
దోరంబగు వెన్న ద్రావి తుది నా కడవల్
వీరింట నీ సుతుండిడ
వారికి వీరికిని దొడ్డవాదయ్యో సతీ!'
అంటే దీని ద్వారా మనకు ఏమి బోధ పడుతుందంటే ..
వెన్న జ్ఞానానికి సంకేతము. జ్ఞానాన్ని వస్తు రూపంలో భద్రపరచిన, అంటే ఇక్కడ కడవలో ఉంచిన వెన్న అనే అర్థం. గోపిక నిజానికి జ్ఞానాన్ని ఆర్జించుకోలేదు. దీనికి నిదర్శనం నిజానిజాలు తెలుసుకోకుండా పక్కింటివారితో పోట్లాడ్డమే. కన్నయ్య వెన్నను తినేసి జ్ఞానమునెన్నడూ దాచుకోరాదు .. దాచుకోలేరు అని చూపించాడు. అంతేకాక సంపాదించిన జ్ఞానమును ఇతరులకు పంచాలని అది తెలియ చెప్పటానికే ప్రక్క ఇంటిలో పడేశాడు కడవలను. అయితే జ్ఞానము, స్వానుభవైకవేద్యమైనది కావునా జ్ఞానమును వెన్న రూపంలో పంచలేము. జ్ఞాన బోధనకు ఏకైక మార్గం జ్ఞానార్జన పై జిజ్ఞాస కలిగించడం. అందుకనే శుద్ధ జ్ఞాన పరాత్పరుడైన శ్రీ కృష్ణుడు కమ్మని వెన్న కడవలు పొరుగింటిలో పడేసి, జ్ఞాన బోధ చేశాడు.
జ్ఞానమును సంపూర్ణంగా ఆస్వాదించిన తరువాతే ,పూర్తి గురుత్వమును పొందిన తరువాతనే ఇతరులకు బోధించాలని శ్రీ కృష్ణ పరమాత్మ వెన్న దొంగలా మారి హిత బోధ చేశాడు.
******


No comments:

Post a Comment

Pages