శాస్త వైభవం - 1 - అచ్చంగా తెలుగు
శాస్త వైభవం - 1
శ్రీరామభట్ల ఆదిత్య 

పూర్వం క్షీరసాగర మథనం జరిగిన సమయంలో  శ్రీమహావిష్ణువు 'మోహినీ' అవతారాన్ని ధరించాడు. ఆ మోహిని రూపాన్ని చూసి పరమేశ్వరుడు మోహుడవ్వగా వారికి హరిహరపుత్రుడు జన్మించాడు. ఇది కృత యుగంలో జరిగింది. ఆ తరువాత మహిషాసురుడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించగా ఆయన సోదరి 'మహిషి' దేవతలపై పగతీర్చుకోవాలని బ్రహ్మ దేవుడి కొరకై తీవ్రతపస్సు చేయగా, బ్రహ్మ ఆమె తపస్సుకు మెచ్చి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు మహిషి తనకు 'హరిహరపుత్రుని' చేతిలో మరణం కలగాలని వరం కోరింది. అందుకే మహిషి సంహారం కోసం శివకేశవుల కలిసి హరిహరపుత్రునికి జన్మనిచ్చారు.
ఆ హరిహరపుత్రుడికే 'అయ్యనార్', 'శాస్త' అనే ప్రముఖ పేర్లు ఉన్నాయి. ఆ హరిహర తనయుడు లోకహితార్థమై అనేక అవతారాలుగా తనను తాను సృజింకున్నాడు. ఆ అవతార పరంపరలో 'అయ్యప్ప స్వామి' ఒకరు. శ్రీ 'భూతనాథ పురాణం' అనే గ్రంథంలో ఈ విషయం చెప్పబడింది. ఆయనకు 'ధర్మశాస్త' అనే పేరు ఉంది. శాస్త అంటే 'గురువు', 'దారి చూపు వాడు','రాజు' అనే అర్థాలున్నాయి. దక్షిణ భారతదేశంలో శాస్త అనే పదంతో ముడిపడి చాలామంది దేవుళ్ళు ఉన్నారు. మనకు ఆ శాస్తుడి యొక్క ఎనిమిది రూపాలు ముఖ్యంగా కనిపిస్తాయి.
ఆ ఎనమిది రూపాలే 
1) ఆదిమహా శాస్త
2) ధర్మ శాస్త (అయ్యప్ప స్వామి)
3) జ్ఞాన శాస్త
4) కళ్యాణవరద శాస్త
5) సమ్మోహన శాస్త
6) సంతానప్రాప్తి శాస్త
7) వేద శాస్త
8) వీర శాస్త

ఇప్పుడు ఈ అష్టశాస్త స్వరూపాల గురించి తెలుసుకుందాం.
1) ఆదిమహా శాస్త:
ఎనిమిది శాస్త స్వరూపాలలో ఈయనది మొదటిరూపంగా చెబుతారు. ఈ స్వామికి 'పూర్ణ', 'పుష్కళ' అనే ఇద్దరు భార్యలు ఉన్నారు.  తమిళనాడు రాష్ట్రంలో ఈ స్వరూపాన్ని బాగా పూజిస్తారు. వర్షాలు సకాలంలో కురవడానికి, పంటలు బాగా పండడానికి, పోయిన వస్తువులు తిరిగి పొందడానికి ఈ స్వామి పూజ మంచిదని నమ్మకం. చోళ రాజైన కరికాల చోళుడు శాస్తుడి మహాభక్తుడు. ఆయన యుద్ధానికి వెళ్ళేముందు కాంచీపురంలోని ఈ స్వామి తప్పక పూజించేవాడట.

2) ధర్మశాస్త ( అయ్యప్ప స్వామి ):
ఈ అష్టశాస్త స్వరూపాలలో కేవలం ధర్మశాస్త స్వరూపం అంటే అయ్యప్ప స్వామి మాత్రమే బ్రహ్మచారి. అయితే కేరళ రాష్ట్రంలో పూర్వం పందళ రాజ్యానికి రాజైన రాజశేఖరుడికి సంతానం లేదు. ఆయన సంతానప్రాప్తికై భగవంతుడిని రోజూ ప్రార్థించేవాడు. అయితే ఆయన ఒకసారి వేటకు వెళ్ళగా అక్కడ ఆయనకు ఒక బాలుడు మెడలో ఒక దివ్యమైన 'మణి'తో దొరికాడు. ఆయనే అయ్యప్ప స్వామి. మెడలో మణితో దొరికాడు గనక ఆయనకు 'మణికంఠ' అనే పేరు వచ్చింది.

మణికంఠుడి గురించి మిగిలిన ఆరు రూపాల గురించి వచ్చే నెల చెబుతాను..... ( సశేషం )

No comments:

Post a Comment

Pages