శ్రీధరమాధురి - 50 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి - 50

Share This
శ్రీధరమాధురి - 50
(మతం, భక్తి గురించి పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)


మతమంటే నమ్మకం. నమ్మకమే మతం.

ఉన్నత స్థాయికి చెందిన ఆధ్యాత్మిక విశ్వాసాన్నే ‘నమ్మకం’ అంటారు. నమ్మకం అనేది కేవలం దేవతలకో, మతానికో చెందిన ప్రక్రియ మాత్రమే కాదు. మనం మరొకరిలో ఒక భాగంగా మమేకమైపోయినప్పుడే, నమ్మకం జనిస్తుంది. నమ్మకమనేది ఏమీ ఆశించకుండా ఉండాలి, ఏమి జరిగినా అంగీకరించే విధంగా ఉండాలి. మీరు ఎవరిపైనైనా నమ్మకం ఉంచినప్పుడు, బదులుగా ఏమీ ఆశించకూడదు, ఇది ఇతరులు ఎంతటి చెడు ప్రతిచర్యను చూపినా కూడా ఎప్పటికీ అలాగే నిలిచి ఉంటుంది. ఒక మామూలు వ్యక్తికి నమ్మకం కలిగి ఉండడం, ఏమీ ఆశించకపోవడమన్నది ‘ఆత్మహత్యాసదృశంగా’ ఉంటుంది.  


మతంలో నమ్మకమే కీలకమైనది. నమ్మకం అనేది దైవాన్ని చేరే మార్గం. గురువును చేరే మార్గం. తర్కం లేక తెలివితేటలకు, నమ్మకానికి ఏ మాత్రం సంబంధం లేదు. నమ్మకం అనేది హృదయానికి సంబంధించిన విషయం. కాబట్టి, మీరొక గురువు వంక బుద్ధితో చూసినప్పుడు, ఏమీ అర్ధం చేసుకోలేరు. మీరొక అర్హుడైన పండితుడిని గుర్తించేందుకు మీ బుద్ధి సహకరిస్తుంది, కాని ఒక ఆధ్యాత్మిక గురువును అర్ధం చేసుకోడానికి ఉపయోగపడదు. గురువుతో మీ అనుబంధానికి అతి పెద్ద ఆటంకం మీ బుద్దే.


విజయం సాధించినవారందరూ సంతృప్తిని కలిగి ఉండలేరు. కాని తృప్తిగా జీవించేవారు, జీవితంలోని అన్ని పార్శ్వాలలో అఖండమైన విజయాన్ని సాధించి ఉంటారు. జీవితంలో విజయాన్ని సాధించలేనప్పుడు మతం వైపు లేక కొందరు అపజయాన్ని పొందాకా, మతం వైపు పరిగెడతారు. అటువంటివారు మతం అనే ముసుగును ఆధ్యాత్మికత వైపు పరుగులు తీయడాన్ని తృప్తి అనరు. కొన్నిసార్లు లౌకిక జీవనంలో ధరించి, లౌకిక జీవనంలో విజయాన్ని సాధించే ఏకైక లక్ష్యంతో అన్నింటినీ త్రోసిపుచ్చుతారు. అటువంటివి చూసినప్పుడు, ఒక జ్ఞాని తన సహజమైన రీతిలో పగలబడి నవ్వుతారు.


మతాన్ని, దైవాన్ని వివరించలేము. కేవలం అనుభూతి చెందగాలము. అటువంటి అనుభవం పొందేందుకు కావలసినది ఏ నిబంధనలూ లేనినమ్మకం, సంపూర్ణ శరణాగతి.


దైవంపై బేషరతైన నమ్మకం అనేది లేకుండా మతంలో ఏమీ పని చెయ్యదు. ఇదే భక్తికి కావలసిన ఏకైక అర్హత.


మతం అనేది గంభీరమైన అంశమేమీ కాదు. ఒక మతపరమైన వ్యక్తి దిగులుగా, నీరసంగా ఉండడు. అతడు ఎల్లప్పుడూ ఆనందంగా, సరదాగా ఉంటాడు. ఆయన అందరికీ ప్రేరణ కలిగించే విధంగా, అందరూ ఆయన్ను అనుసరించే విధంగా ఉంటారు. ఆయన మార్గాలు గుహ్యమైనవి. ఆయన ప్రస్తుతంలో జీవిస్తారు, అందరూ  ప్రశాంతమైన జీవితం గడిపేలా దిశా నిర్దేశం చేస్తారు. ఆయనే సత్యం. ఆయన జ్ఞాని, అటువంటి వారిని జీవితంలో కోల్పోకూడదు.


ఎల్లప్పుడూ గంభీరంగా ఉండేవారు వారి జీవితాన్ని ఆస్వాదించలేరు, ఇతరులనూ ఆనందంగా బ్రతకనివ్వరు. అటువంటివారు ఇతరులను మతం పేరుతో అపరాధ భావనకు గురయ్యేలా చేస్తారు. మతం అనేది గంభీరమైన అంశం కాదు. మతంలో హాస్యం కూడా ఒక భాగమే.


మానవాళికి సేవ చెయ్యడమే ప్రధాన లక్ష్యంగా భావించినట్లయితే, మనం కుల, మత, జాతి, వర్గ, లింగ భేదాలను అధిగమించాలి.  ఒక ప్రత్యేకమైన కులానికో, మతానికో చెందిన వారికి మాత్రమే సేవ చేసే అనేక సంస్థలు, ట్రస్ట్ లు ఉన్నాయి. వారు చాలా పాక్షికమైన దృష్టిని కలిగి ఉన్నారని, సంఘంలో విభేదాలు కలిగేందుకు దోహదపడుతున్నారని, నా భావన.
కుల రహితమైన సమాజం కోసం మనం పాటు పడాలి. సేవ అవసరమైన ప్రతి వ్యక్తికీ మనం ఉపయోగపడాలి.

 ***

No comments:

Post a Comment

Pages