గొప్ప వ్యక్తి - అచ్చంగా తెలుగు

గొప్ప వ్యక్తి

Share This
గొప్ప వ్యక్తి
దొండపాటి కృష్ణ 

గోపాల్ కు 35 యేళ్ళు. వేలల్లో జీతం అందుకుంటున్నా మనశ్శాంతి లేదు. వయసు ప్రభావమో, మనశ్శాంతి కరువవ్వడమో తెలీదు కాని కాస్త ఒళ్ళు చేశాడు. ఏసీల్లో గడపడం వలనేమో జుట్టు కూడా బాగా రాలిపోయింది. పొట్ట కూడా బాగానే పెరిగిపోయింది. గ్యాస్ ప్రాబ్లం అంటూ సరిపెట్టుకుంటున్నాడు. పెళ్ళీడోచ్చినా పెళ్లి జరక్కపోయినప్పుడు అమ్మాయికైనా, అబ్బాయికైనా మనోవేదనేక్కువుంటుంది. ఎప్పట్నుంచో అతని స్నేహితులు అడుగుతున్నా పట్టించుకోనివాడు (వాళ్లకి పెళ్ళైపోయింది మరి), ఈసారి మాత్రం శ్రీవారిని దర్శించుకోవడానికి సన్నద్ధమయ్యాడు.
ముగ్గిరితో కలిసి తిరుపతి వెళ్ళగానే అలిపిరి మెట్ల నుండి కాలినడక ప్రారంభించాడు. యాభై మెట్లు ఎక్కగానే పక్కనున్న ఆలయంలో శ్రీవారి పాదాలను నెత్తి మీద పెట్టుకుని మూడుసార్లు ప్రదక్షిణలు చేశాడు. ఆగకుండా ‘ఓం నమో వేంకటేశాయ’ అంటూ శ్రీవారి నామస్మరణ చేస్తూ వెళ్ళిపోతున్నారు. కొన్ని మెట్లు నడిచాక ఆయాసం తీర్చుకోవడం, మరలా ప్రారంభించడం వాళ్ళ పద్ధతైతే, నెమ్మదిలో నెమ్మది కాకుండా వేగంలో వేగం కాకుండా శ్రీవారి నామస్మరణ చేసుకుంటూ వెళ్ళడం గోపాల్ పద్ధతైంది.
జింకల పార్కు దగ్గర వాటిని చూస్తూ చిన్న పిల్లాడిలా మురిసిపోయాడు. రాళ్ళూ, రప్పల మధ్య అంత ఎండలో, ఆకలికోసం ఆవేళవి పడుతున్న ఆత్రం చూసి ధ్రవించిపోయాడు. తనవంతుగా కొన్ని పండ్లు తినిపించాడు. తనలాగే చాలామంది తినిపిస్తుండడం చూసి తృప్తిగా నడకను కొనసాగించాడు. మొకాలిమెట్టు గోపురం దగ్గర చాలామంది ఆగిపోతున్నా గోపాల్ మాత్రం భయపడలేదు. శక్తి తగ్గకుండా రెండు పెద్ద ఐస్క్రీం లు స్వీకరించి కొనసాగించాడు. మూడుగంటల్లోనే చివరిమెట్టుకు చేరుకున్నాడు. ఏడుకొండలు ఎక్కినా ఆయాస పడలేదంటే మన ఇంజనీర్ల ఘనతను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ఎండలో వచ్చేవాళ్ళకు కాళ్ళు కాలకూడదని వైట్ పెయింటింగ్ వేయడం వారి ముందుచూపుకు తార్కాణంలా తోచింది. స్నేహితులు కూడా రాగానే, వారికే కేటాయించిన పాంచజన్యం (సేదతీరే గదులు) ల్లోకి  వెళ్ళారు.
తిరుమల కొండంటే అదంతా కొండ ప్రాంతంగా ఉంటుందేమోననుకున్న అతనికి, అక్కడి వాతావరణం మనోవికాసాన్ని కల్గించింది. ఆలయప్రాంగణంలా కాకుండా ఓ పట్టణ నిర్మాణంలా ఉంది. కొండప్రాంతం అంతా చదునుగా చేయడంతో యాత్రికులకు ఇబ్బందులు తలెత్తడం లేదు. తిరుపతిలో నీటి సమస్య ఉందని విన్నాడు. ఇక్కడ తిరుమలలో కొండమీద అటువంటి సమస్యేం కనిపించలేదు. కొన్ని వేలమంది భక్తులు నిత్యం దర్శించుకోవడం జరుగుతుంది. వెళ్ళేవాళ్ళు వెళ్తుంటే, వచ్చేవాళ్ళు వస్తున్నారు. ఒకసారి కనిపించిన వాళ్ళు మళ్ళీ కనిపించరు. అంతా కొత్తగానే ఉంటుంది. శ్రీవారి కరుణతో ఎంతమందికి జీవనోపాధి దొరికిందో గమనిస్తున్నాడు. శబరిమలై నుండి అయ్యప్పలు ఇరుముళ్ళు ఇచ్చేసి రావడంతో ఎటుచూసినా అయ్యప్పలే కన్పిస్తున్నారు.
వాళ్ళ హడావుడిని చూస్తూ గోపాల్ బృందం తొందరపడిపోయి కళ్యాణకట్టకు దారి తీశారు. పెద్ద క్యూ ఉంది. వీళ్ళ ముందూ వెనకా అయ్యప్పలే ఉన్నారు. డెబ్బైయేళ్ళ గురుస్వామి ఉన్నారు. తలనీలాలు సమర్పించి వెళ్ళేవాళ్ళు వెళ్తుంటే, వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. వాళ్ళను చూపిస్తూ అయ్యప్పలకేదో చెప్తుంటే గోపాల్ కూడా ఆలకించాడు.
“అయ్యప్పా..! అటు చూడండి. వాళ్ళు తలనీలాలు సమర్పించినా ‘శిఖ’ను మాత్రం తీయలేదు. అది సంప్రదాయం. సౌత్ ఇండియా వాళ్లకు, నార్త్ ఇండియా వాళ్ళకూ అదే తేడా. వాళ్లంతగా సంప్రదాయాల్ని పాటిస్తారు. ఎక్కడెక్కడో ఉంటూ వెస్ట్రన్ డ్రెస్ లను వేసుకున్నా కూడా సంప్రదాయాల్ని వదలరు. పోరపాటునైనా ‘శిఖ’ను తీసేస్తే ఇంట్లోవాళ్ళు, ఊళ్లోవాళ్ళు ఒప్పుకోరు. ముస్లీంలు మాత్రమె ‘శిఖ’ను ఉంచకుండా గుండు చేయిస్తారు. మనకలా కాదు. ఎవరన్నా ‘శిఖ’ను ఉంచుకుంటే “నువ్వు బ్రాహ్మణుడివా.?” అని అడుగుతారు. అదీ దౌర్భాగ్యం.! దేవుడికి కులాలు, వర్ణాలతో సంబంధముంటుందా.? కొంతమంది గడ్డాల్ని, కొంతమంది మీసాల్ని ఇస్తే ఇంకొంతమంది మూడు కత్తెరలు ఇస్తారు. ఏంటి ఉపయోగం.? అంటే శ్రీవారికి ముష్టి వేస్తున్నారా.? కేశాల్ని (వెంట్రుకలు) సమర్పించి క్లేశాలు (కష్టాలు) పోగొట్టమని శ్రీవారిని కోరుకోవడమే సంప్రదాయం” అంటూ నార్త్ ఇండియా వాళ్ళను చూపిస్తూ చెప్పుకుంటూ వెళ్తున్నాడు గురుస్వామి.
సారాంశాన్ని గ్రహించిన గోపాల్ ‘శిఖ’తో రూమ్ కొచ్చేసరికి అతని స్నేహితులు కాసేపు ఆటపట్టించడంతో గురుస్వాములు సత్యాన్నే ప్రస్తావించారని నిర్ధారణకొచ్చాడు. ఆయన ప్రవచనాలు వినాలనిపించడంతో చుట్టూ కలియ తిరిగినా కన్పించకపోయేసరికి చలికి తట్టుకోలేక పక్కనే రగ్గులను అద్దెకు తీసుకుని రూమ్ కొచ్చేశాడు.
రెండవరోజు ఉదయం శ్రీవారి కోనేటిలో మూడు మునకలు వేశారు. శీతాకాలం బయట చలిపెడుతున్నా కోనేటిలో మాత్రం చలి తెలియలేదు. స్వామివారి మహిమేనని మనస్సులో మనస్పూర్తిగా స్మరించుకొన్నాడు. ముందుగా వరాహస్వామి దర్శనం చేసుకున్నాకే, ప్రత్యేక దర్శనానికి క్యూలో నిలబడ్డారు. అక్కడున్న సెక్యూరిటీ ప్రోద్బలంతో హడావుడిగా కాకుండా బంగారు వాకిలి ముందు రెండు నిమిషాలు నించొని, తనివితీరా స్వామిని దర్శించుకున్నారు. బయట ఫోటోల్లో కన్నా ప్రత్యక్షంగా శ్రీవారు చాలా అందంగా ఉన్నారనిపించింది. కాని ఆ అందాన్ని వర్ణించలేకపోయాడు. అంతలా పారవశ్యంలో మునిగిపోవడానికి రెండు యాదృచ్చికాలున్నాయి. అతను పుట్టిన రోజైన శుక్రవారమే మొదటిసారిగా దర్శించుకోవడం మరియు పుట్టిన సమయమైన 10:00 గం’ల నుండి 11:00 గం’ల ప్రాంతంలోనే దర్శనం జరగడం. భక్తిభావంతో బయటికొచ్చాక కృతజ్ఞతాభావంతో సెక్యూరిటీకి ధన్యవాదాలు తెలిపారు. బయటికొచ్చాక వెనక్కి తిరిగి శ్రీవారి రూపాన్ని స్మరిచుకుంటే కళ్ళముందు కదల్లేదు. బహుశా నిజరూప దర్శనం జరగడం చేతనే, ఆ క్షణాన రూపం కనిపించి, మనోవికాసాన్ని కల్గించి మాయమైయింది. అదే ఏడుకొండలవాడి మహిమ..!!
ఒకరి మాటను పడకుండా, అధికారం చెలాయిస్తూ, తనకు నచ్చినట్లే ఉండే గోపాల్లో ఇక్కడ మాత్రం అతని ఆధీనంలో లేని సంఘటనలెన్నో అతన ప్రమేయం లేకుండా జరిగిపోతున్నాయి. ఈ పుణ్యక్షేత్ర మహిమ అదేనని ముక్తకంఠంతో స్నేహితులు తేల్చేశారు. తనలో అంత మార్పు వస్తుందనుకోలేదు గోపాల్.
* * * *
ముందుగా అనుకున్నట్లే, షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నా ఏదో అసంతృప్తి, అలజడి గోపాల్ మనస్సును తొలిచేస్తుంది. పక్కనే ఉన్న తిరుచానూర్ వెళ్ళి పద్మావతి అమ్మవారిని దర్శించుకుని యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. శ్రీకాళహస్తిలో వాయులింగాన్ని దర్శించుకోవడంతో పాటు రుద్రాభిషేకం చేయించారు. జ్ఞానప్రసూనాంబకు పంచామృతం ఇచ్చారు. గోపాల్లో ఏదో వెలితి కన్పించడాన్ని గుర్తించిన స్నేహితులు, అతను పెళ్లి గురించే దిగులు చెందుతున్నాడని ‘శ్రీనివాస మంగాపురం’ కళ్యాణ వెంకటేశ్వర స్వామీ ఆలయానికి తీసుకెళ్ళారు.
తులసిమాలను, పుష్పాలను స్వామివారికి సమర్పించి, కోరికలను కోరుకుని ఆలయ ఆవరణంలో కూర్చున్నారు. స్థలపురాణం గురించి ఆలయ గోపురం నుండి మైకులలో విన్పిస్తోంది. తిరుచానూర్ జమిందారీ వనంలో ఒకరికొకరు చూసుకున్నారని, ఆ చూపులు కలిసిన శుభముహూర్తంలో ఒకరిని ఒకరు ఇష్టపడుతూ శ్రీనివాస మంగాపురంలో వివాహం చేసుకున్నారని, కాని శ్రీనివాసుడు మాత్రం భక్తులకోసం కొండపైనే ఉండిపోయారని, అమ్మవారు అలిగి తిరుచానూర్ లోనే ఉండిపోయారని, దానికి గుర్తుగా శ్రీనివాస మంగాపురంలో శ్రీనివాసుడి విగ్రహాన్ని ప్రతిష్టించి కళ్యాణ వెంకటేశ్వరుడని పిలుచుకుంటున్నారని, ఇక్కడ దర్శనం చేసుకుంటే త్వరగా పెళ్లి జరుగుతుందని భక్తుల నమ్మకమని వగైరా వగైరాలను చెప్పారు.
తిరుగు ప్రయాణం ఆటోలో ప్రారంభించారు. వాటర్ ట్యాంక్లు చాలా కన్పించాయి. తిరుమల కొండపైన నీటి సమస్య కనిపించలేదు. తిరుపతి పట్టణంలో తీవ్రంగా ఉందనడానికి అద్దం పడుతున్నవి. శీతాకాలంలోనే వాటర్ ట్యాంకర్లు జోరీగల్లా తిరుగుతున్నాయంటే అర్ధం చేసుకోవచ్చనిపించింది. ఎక్కడెక్కడనుంచో భక్తులు వచ్చి తమ కోర్కెలు తీర్చమని కోరడం, ఫలించిన వారు కృతజ్ఞతగా కానుకలతో రావడం పరిపాటి. అందరి కష్టాలను తీరుస్తున్న శ్రీవారు, తను స్వయంభుగా ఉన్న ప్రాంతంలోనే ఎందుకిలా చేస్తున్నాడో గోపాల్ కు అంతుబట్టలేదు.
పరధ్యానంగా ఉన్నతన్నీ లోకంలోకి లాక్కోచ్చించి ట్రాఫిక్. సిగ్నల్స్ పడడంతో ఆటోకు బ్రేకులు పడ్డాయి. ఒక పెద్దాయన పెన్నులను అమ్ముతూ దగ్గరికొచ్చాడు. చూస్తుంటే చాలా ముసలాడిగా ఉన్నాడు. కొద్దిగా చిరిగిన, బాగా నలిగిన బట్టలను తొడుక్కున్నాడు. పంచెతోపాటు చొక్కా కూడా అదే రంగులో ఉంది. అది తెలుపో నలుపో శ్రీవారికే తెలియాలి. మూడోకాలి (చేతికర్ర) సాయంతో నడుస్తున్నాడు. ఒక చేతిలో పెద్ద కర్ర, ఇంకో చేతిలో పదివరకు ఉంటాయేమో పెన్నులు, పట్టుకుని ఆగిన ప్రతి బండి దగ్గరికెళ్ళి కొనుక్కోమని అడుగుతున్నాడు.
ఆ క్షణంలో అతని ఆహార్యం కన్నా పెన్నులపైనే దృష్టి మళ్ళడంతో, అవి అవసరం లేదనుకొని వద్దని చెప్పేశాడు. అతనుకూడా నాకిది మామూలేననుకుంటూ మరో బండి దగ్గరికి, అక్కడ్నుంచి మరో బండి దగ్గరికి చకచక వెళ్ళిపోతున్నాడు. మూడు కాళ్ళతో నడవొచ్చుకాని నాలుగు కాళ్ళతో కష్టం. అలా జరగకూడదని శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. ఒక్కొక్కరూ మోటార్ బండ్లను నడుపుకుంటూ వచ్చి, ఎక్కడ ఖాళీ కనిపిస్తే అక్కడ దూరిపొతున్నారు. ఆ హడావుడిలో ముసలతన్ని డీ కొడుతున్నారు. ఎంతైనా రోడ్డుమీద వ్యాపారం చేసేవాడెప్పుడూ చాలామందికి చులకనే కదా.! కొంతమందైతే అతను పెన్నులను అమ్మడానికి వస్తున్నప్పుడే చీదరించుకుంటున్నారు. వాళ్ళ ప్రవర్తన గోపాల్ కు కోపాన్ని తెప్పించింది. కాని స్థానబలం లేకపోవడంతో మారు మాట్లాడలేదు. అంత పాపం అతనేం చేశాడో పాపం..!! నిరాశ నిశ్ప్రుహల మధ్య తిరుగుతున్న అతనికేసి గోపాల్ పరీక్షగా చూశాడు. ఒక కాలు చాలా పెద్దగా (బోదకాలు) ఉండడం గమనించాడు. అంత బాధను భరిస్తూ కూడా, బ్రతుకు దెరువు కోసమని అడుక్కోకుండా పని చేసుకుంటున్నాడు.
మరోపక్కనుండి బిచ్చగాడు అడుక్కుంటూ వెళ్తుంటే, అతనికి చిల్లరైనా అందడం చూశాడు. ఏ పని చేయని అడుక్కునేవాడికి చేతనైన సాయం అందుతుంది కాని కష్టపడి పని చేసుకునేవాడికి మాత్రం ఫలితం అందడం లేదు. దేవుడెందుకు చిన్నచూపు చూస్తాడో అర్ధం కాలేదు. ‘మనమే చేసి, దేవుణ్ణి అడ్డుపెట్టు కుంటున్నామా.? పది పెన్నులు ముప్పై రూపాయలు అవుతుందేమో.! తిరుమలలో ఎక్కడపడితే అక్కడ యాభై రూపాయల కాగితం చందాలుగా వేశాం. కాని ఇక్కడీ గొప్పవ్యక్తి దగ్గర మాత్రం ముప్పై రూపాయల ఖర్చు చేయలేకపోయాం. ఇచ్చేదేదో ఆ యాభై రూపాయలు అతనికిచ్చేసి, ఆ పది పెన్నులు తీసుకుని స్వామివారి ప్రసాదమని చిన్నపిల్లలకు పంచిపెడితే ఎంత బావుంటుంది.! అందుకతను ఎంతలా సంతోషపడతాడు.?’
ఎప్పుడైతే తనని తాను తెలుసుకోగలిగాడో గోపాల్ మొహంలో ఆనందం వెల్లివిరిసింది. వెనక్కి తిరిగి ఆ గొప్పవ్యక్తిని పిలవబోతుండగా ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయ్యి, రయ్యిమంటూ ఆటో దూసుకెళ్ళిపోయింది. రెప్పపాటులో తప్పిపోయాడు. అరుస్తూ పక్కనే ఆటోని ఆపించేశాడు గోపాల్. వెంటనే పక్కనున్న కానిస్టేబుల్ ఈలవేసుకుంటూ రావడంతో గోడవెందుకనుకున్న డ్రైవర్ నడిపించాడు. బయటకు తలపెట్టి అతని కోసం గోపాల్ కళ్ళు వెతికాయి. ఏదైనా మన దగ్గరికొచ్చినప్పుడే అందుకోవాలి. లేకపోతె అందకుండా పోతుంది. మళ్ళీ రాకపోవచ్చు. శ్రీవారే అతని రూపంలో వచ్చి, జ్ఞానోదయం కలిగించినట్లయింది. ఆలయాలు, కొండలు, కోనలంటూ దేవుడెక్కడో లేడు. మనలోనే, అందరిలోనూ ఉంటాడు. సాయం పొందినవాడి ముందు, సాయం చేసిన వాడు దేవుడే.! అందుకే దైవం మానుష్య రూపేణా అన్నారు.
గడిచిన ముప్పై ఐదు సంవత్సరాల్లో అనుభవంలోకి రానిది, ఈరోజీ సంఘటనతో ఒక్కసారిగా అనుభవంలోకొచ్చింది. జ్ఞానోదయమనే ఈకలతో బూజుపట్టిన మెదడును శుభ్రం చేసినట్లుంది. దీర్ఘమైన ఉచ్ఛ్వాస నిచ్చ్వాసలతో దేహం శుద్ధి చేసుకుంది. ముసలతని కారణంగా కొత్త గోపాల్ అవతారమెత్తాడు.

-: శుభం :-

No comments:

Post a Comment

Pages