శ్రీరామకర్ణామృతం - 23 - అచ్చంగా తెలుగు
శ్రీరామకర్ణామృతం -23
సిద్ధకవి
డా.బల్లూరి ఉమాదేవి.

తృతీయాశ్వాసం.
11  .శ్లో :రామం సీతాసమేతం విమల రవి శతాభాసమానం రసార్ద్రం
శ్యామం దేదీప్యమానం స్మితరుచిర ముఖం కుండలోద్భాస గండమ్
శ్రీవత్సం శ్రీనివాసం సురతరు విలసద్రత్న సింహాసనస్థం
దివ్యాకల్పోజ్జ్వలాంగం దివిజ పతినుతం సంతతం తం భజేహమ్.

భావము:  సీతతో కూడినట్టి నిర్మలమగు నూరుగురు సూర్యులశోభతో సమాను డైనట్టి దయారసముచే తడిసి నట్టి నల్లనై మిక్కిలి ప్రకాశించుచున్నట్టి చిరునవ్వుచే సొగసైన మొగము కలిగినట్టి కుండలములచే ప్రకాశించుచున్న గండస్థలములు గలిగినట్టి శ్రీవత్స చిహ్నము కలిగినట్టి లక్ష్మికి స్థానమైనట్టి కల్పవృక్షములయందు ప్రకాశించుచున్న రత్నపీఠమందున్నట్టి శ్రేష్ఠములగు నలంకారములచే ప్రకాశించు దేహము కలిగినట్టి దేవేంద్రునిచే స్తోత్రము చేయబడుచున్న చున్న రాము నెల్లపుడు సేవించుచున్నాను.
అనువాదపద్యము.
మ:సురభూజాంతిక రత్నపీఠ విలసిత్ క్షోణీ సుతాయుక్తు భా
స్కర కోటి ద్యుతు శ్రీనివాసు గుముద శ్యామున్ బరంధాము సుం
దర మందస్మిత వక్తృ  జిష్ణునుతు నానారత్న విభ్రాజితా
భరణున్ రాము రసార్ద్రు వజ్రినుతు శ్రీవత్సాంకు సేవించెదన్ .

12  .శ్లో :జలనిధి కృత సేతుం దేవతానంద హేతుం
దశముఖ ముఖ రక్షోదార వైధవ్యహేతుమ్
మునిజన నివహానాం ముక్తి సౌఖ్యాది హేతుం
రఘువర కులకేతుం కీర్తయే ధర్మహేతుమ్.

భావము:  సముద్రమందు చేయబడిన గట్టు గలిగినట్టి దేవతలకానంద కారణమైనట్టి రావణుడు మొదలగు రాక్షసుల భార్యల వైధవ్యమునకు కారణమైనట్టి ముని సముదాయములకు మోక్షాది సుఖాదులకు కారణమైనట్టి రఘువు యొక్క శ్రేష్ఠమైన వంశమున కలంకారమైనట్టి ధర్మమునకు కారణమైన రాముని గానము చేయుచున్నాను.
అనువాదపద్యము
మ:తత పౌలస్త్య ముఖాసురేంద్ర సతి వైధవ్యప్రహేతుండు సం
తత మౌనీశ్వర మోక్షసౌఖ్యదుడు మార్తాండాన్వయాంబోధి భా
సిత చంద్రుండు సురప్రమోదితుడు రాజీవాయతాక్షుండు బం
ధిత సింధుండగు రామభూవిభుడు మన్నించున్ ననున్ సత్కృపన్.

13  .శ్లో :సకల గుణ నిధానం యోగిభిః స్తూయమానం
భజత సుర విమానం రక్షితేంద్రాది  మానమ్ మహితవృషభ యానం సీతయా శోభ మానం
స్మరతు హృదయ భానుం బ్రహ్మ రామాభి రామం.

భావము:  సమస్త గుణములకు నిధియైనట్టి యోగీశ్వరులచే స్తోత్రము చేయబడినట్టి పొందబడిన దేవ విమానము కలిగినట్టి రక్షింప బడిన యింద్రాదుల గౌరవము గలిగినట్టి పూజింపబడిన యీశ్వరుడు గలిగినట్టి సీతతో ప్రకాశించుచున్నట్టి హృదయమందు సూర్యుడైనట్టి, సుందరులలో సుందరుడైనట్టి ,పరబ్రహ్మను జనులు స్మరించుగాక.
అనువాదపద్యము
మ:వరయోగీంద్రు నుతున్ సురేంద్రముఖ గీర్వాణేశ మానావనున్
హరమిత్రున్ హితపుష్పకున్ జనకజా వ్యాయుక్తు హృత్పంకజాం
తర సందీపిత భాను సద్గుణ నిధిన్ రామాభిరామున్ బరా
త్పరు శ్రీరాము నమేయు రాఘవ పరబ్రహ్మంబు చింతించెదన్.

14  .శ్లో :వరగుణి మణి సింధు ర్మైథిలీ ప్రాణబంధుః
కనకశిఖరి ధైర్యో భూతలాబ్జాత సూర్యః
దశరథ నృపసూనుః దేవవక్త్రాబ్జ భానుః
జయతు భువన భద్రో సర్వదా రామభద్రః.

భావము:  శ్రేష్ఠ గుణములనెడు మణులకు సముద్రుడైనట్టి సీతయొక్క ప్రాణబంధువైనట్టి మేరుపర్వతము వంటి ధైర్యము కలిగినట్టి భూమియందున్నత కిరణములు గల సూర్యుడైనట్టి దశరథరాజుయొక్క ప్రధానవస్పువైనట్టి దేవతలకు ముఖ్యముగా లెక్కించదగినట్టి  పొందింపబడిన లోకముల శుభములుగల రామభద్రుడు నన్ను రక్షించుగాక.
అనువాదపద్యము
మ:సరసున్ సద్గుణ రత్నసింధు వసుధాజా ప్రాణసద్బంధువున్
ధరణీ తామరస ప్రభాకరు జగద్భద్రాను సంధాయి బం
క్తి రథక్షోణిప రత్నమున్ రఘువరున్ దేవాగ్రగణ్యున్ బరా
త్పరు శ్రీరాము సుమేరుధీరు మదిసంభావింతు నిష్టాప్తికిన్.

15  .శ్లో :త్రిదశ కుముద చంద్రో దానవాంబోజ చంద్రో
దురిత తిమిర చంద్రో యోగినాం జ్ఙానచంద్రః
ప్రణయ తనయ చంద్రో మైథిలీ నేత్ర చంద్రో
దశముఖ రిపు చంద్రః పాతుమాం రామచంద్రః.

భావము:  దేవతలనెడి కలువలకు చంద్రుడైనట్టి రాక్షసులనెడి పద్మములకు చంద్రుడైనట్టి పాపములను చీకటికి చంద్రుడైనట్టి యోగుల జ్ఞానమునకు చంద్రుడైనట్టి నమస్కరించువారి నేత్రములకు చంద్రుడైనట్టి సీత యొక్క కన్నులకు చంద్రుడైనట్టి రావణుని శత్రువైనట్టియు చంద్రునివలె శోభించు నట్టియు రామచంద్రమూర్తి నన్ను రక్షించుగాక.
అనువాదపద్యము
మ:శ్రితనేత్రాబ్జుడంధ కారకమలారి ప్రాజ్ఞసుజ్ఞాన మా
నిత చంద్రుండు సురాబ్జ మిత్రుడసురానీకాబ్జ సోముండు సం
తత సీతా నయన ప్రకాశ శశి దైత్య శ్రేష్ఠప్రాణాపహ హో
ద్ధత సోముండగు రామభూవిభుడు నిత్యంబున్ననుం బ్రోవుతన్.

16  .శ్లో :స్వయువతి కుచచంద్రం బంధు దుగ్ధాబ్ధి చంద్రం
సుజనకుముద చంద్రం వైరివక్త్రాబ్జచంద్రమ్
వికసిత ముఖ చంద్రం వ్యాప్త సత్కీర్తి చంద్రం
సకలభువనచంద్రం సంతతం రామచంద్రమ్.

భావము:  సీతాకుచముల యందు నఖకషతములు కలిగిన వాడైనట్టి చుట్టములనెడి పాలసముద్రమునకు చంద్రుడైనట్టి యోగ్యులనెడి కలువలకు చంద్రుడైనట్టి శత్రువుల ముఖపద్మములకు చంద్రుడైనట్టి వికసించిన ముఖచంద్రుడు కల్గినట్టి వ్యాపించిన కీర్తిచంద్రుడు కలిగినట్టి ఎల్ల లోకములకు చంద్రుడైనట్టి రామచంద్రు నెల్లప్పుడు సేవించుచున్నాను.
అనువాదపద్యము
మ:తనయోషా కుచ చంద్రు బంధుజన సంతానాబ్ధిచంద్రున్  సుధా
శన విద్వేషి ముఖాబ్జ చంద్రు గరుణాసాంద్రున్ మునిస్తోత్రు  స
జ్జన నీలోత్పల చంద్రు దిగ్భరిత రాజత్కీర్తి చంద్రున్ సనాతను
జంద్రానను రామభూరమణు నిత్యంబున్ ప్రశంసించెదన్.

17  .శ్లో :భేత్తారం దశకంఠకంఠ కదళీః కందర్ప దర్పాపహ
శ్రీకంఠాకృతి మాప్నువాన మమలం ఘోరాసురప్రాణదమ్
బాణం ప్రత్యుపసంహరంత మతులం బాణాసనోద్యత్కరం
వందే రాతి భయావహం ముని నుతం రామం ఘనశ్యామలమ్.

భావము:  రావణుని యొక్క అరటి దువ్వలవంటి కంఠములను ఛేదించునట్టియు మన్మథుని దర్పమును హరించిన యీశ్వరుని యాకారము కలిగినట్టియు నిర్మలుని భయంకరులగు రాక్షసుల ప్రాణములను హరించునట్టి ,బాణమును ఉపసంహరించునట్టి సామ్యము లేనట్టి ధనస్సునందు సంధించిన హస్తములు కలిగినట్టి శత్రువులకు భయంకరుడైనట్టి మునులచే స్తోత్రము చేయబడినట్టి మేఘము వలె నల్లనైన రాముని నమస్కరించుచున్నాను.
అనువాదపద్యము
ఉ:లీల దశాస్య కంఠకదళీదళనక్రమ విక్రమ క్రమున్
ఫాల విలోచనాకృతి శుభప్రదుదైత్యవిరామ మౌనిరా
ట్పాలు విరోధి భీతికరు బాణపరంపర కార్ముకోజ్జ్వలున్
నీల ఘనాఘనాంగు రమణీయ చరిత్రుని రాము గోల్చెదన్.

18  .శ్లో :ఆకర్ణాంత గుణోల్ల సచ్ఛరమజం కల్పాంతకాలోపమం
నేత్రాంతారుణతాం వహంత మనిశం ప్రహ్లాదదం నాకినమ్
పౌలస్త్యాసుర దృష్ఠిచంచల కరం శస్త్రాస్త్ర సంధాయినం
బాణానేక విచిత్ర హస్త కుశలం శ్రీ వీర రామం భజే.

భావము:  కర్ణాంత పర్యంత మున్న నారియందు శోభించుచున్న బాణము గలిగినట్టియు బుట్టువు లేనట్టియు బ్రళయమందలి  యమునితో సామ్యము గలిగినట్టియు నేత్రప్రాతములందెరుపును వహించుచున్నట్టియు దేవతలకు సంతోషమిచ్చునట్టియు
పులస్త్యవంశమందలి రాక్షసుల దృష్టికి చలనము చేయునట్టియు మంత్ర ప్రధానబాణములును కేవల బాణములను సంధానము చేయునట్టియుబాణ ప్రయోగముల బహుచిత్రములుగ హస్తనైపుణ్యము గలిగినట్టి వీరుడైన రాముని సేవించుచున్నాను.
అనువాదపద్యము
శా:ఆకర్ణాంత గుణ ప్రయుక్త విశిఖుండై తామ్ర నేత్రాబ్జుడై
యాకల్పాంత కృతాంతుడై చలిత శైత్యాలోకనుండై పరా
 నీకాశ్చర్య విచిత్ర లాఘవ వరానీకుండునౌ దేవతా
లోకాభీష్టదు వీర రామ విభు నాలోకింతు నశఅరాంతమున్.

19 .శ్లో :నహి మాతా నహి తాతోనహి మమ తనయాశ్చ నైవ  సోదర్యః
ఇతి మమ నికటే మృత్యౌ రఘపతి రయమేవ బంధురాసన్నః

భావము:  నాకు మృత్యువు సమీపించి యుండగా తల్లి లేదు తైడ్రి లేడు కొడుకులు లేరు.తోడబుట్టిన వాడు లేడు అట్లుండగా నీరాముడే దగ్గర చుట్టమై యుండును.
అనువాదపద్యము
ఉ:ఆరయ మృత్యు సన్నిహితమైన తరిన్ దన తల్లిదండ్రులున్
గూరిమి కల్గినట్టి కొడుకుల్ నిజసోదరు లింక నన్యులె
వ్వారలు లేరు లేరు హిత వర్తను డార్త శరణ్య గణ్యుడౌ
శ్రీ రఘురామ దైవతమె చేరువ బందుగుడై మెలంగెడిన్.

20  .శ్లో :దేవేంద్రేణ సమర్పితే ధ్వజయుతే తత్స్యందనే సంస్థితం
సోత్కంఠం సురవైరి వీర్యవిభవం జ్ఞాత్వా భుజా స్ఫాలనమ్
కృత్వా సూతయుతం దశాననహరం తూణీర సంస్థం శరం
హృత్వా జ్యానినదా దరాతి భయదం శ్రీవీర రామం భజే.

భావము:  ఇంద్రుని చేత నీయబడినట్టి టెక్కెముతో కూడినట్టి యా యింద్రుని రథమందున్నట్టి వేడుకతో కూడుకొన్నట్టి రాక్షస పరాక్రమము నెరిగి చోయి చరచి సారథితో గూడు నట్టుగా రావణుని సంహరించునట్టి యంబుల పొదియందున్న బాణమును బూని ధనుష్ఠంకారము వలన శత్రుభయముచేయు వీరుడగు రాముని సేవించుచున్నాను.
అనువాదపద్యము
మ:శతమన్వ్యర్పిత సూత కేతుయుత భాస్వత్స్యందనా రూఢుడై
ప్రతిరోధీ శబలంబిరింగి కృతదోస్ఫాలుండు  సోత్కంఠ ను
ద్ధతుడై జ్యాని నదంబునన్ భయదుడై దైత్యేశ నానాశుగా
దృతహస్తుండగు వీర రామ విభునెంతున్ స్వాంతమందెప్పుడున్.
***

No comments:

Post a Comment

Pages