శివం - 31 - అచ్చంగా తెలుగు

శివం - 31

శివమ్మ కధ -7 
రాజ కార్తీక్ 

నేను "అమ్మా, ఈ బ్రహ్మాండాలు సృష్టి చేసినందుకు ఇంత ప్రతిఫలం ఇస్తావా ," అని అడిగాను.
శివమ్మ "ఏమి లేదు శివయ్య, అదంతా భక్తుల మీద నీకు ఉన్న ప్రేమ, నేను ఎంత శివయ్య " అంది వినయంగా.
నంది మాత్రం తల్లి కొడుకులు ఇద్దరి సంగతి బాగుంది కానీ అంత రుచికరమైన పాయసం మేము ఎలా రుచి చూసేది అని అనుకుంటున్నాడు .
శివమ్మ "తాగు శివయ్య,ఈ తల్లి నీ  కోసం ప్రేమగా చేసిన పాయసం తాగు "అంది.
నేను "అందుకే కదా  అమ్మ, నేను వచ్చింది !ఈ విరాగికి కన్న తల్లి  ప్రేమ చూపిన  తల్లివి నువ్వు" అన్నాను.
విష్ణు దేవుడు "ఈ శివమ్మ ఎంతో గొప్పది. ఈమె గురించి చెప్పేందుకు మాటలు చాలవు ,మహాదేవుడ్ని తన భక్తితో కట్టేసింది. తన సోదరి ఈమెను కైలాసం తీసుకువెళ్ళి, ఇంకా ఎంత బాగా చూసుకుంటుందో కదా " అనుకున్నాడు.
నేను కళ్ళు మూసుకొని ఆ మిగిలి ఉన్న నా తల్లి ఎంగిలి పాయసం ఆస్వాదిస్తూ తాగుతున్నాను ...
విష్ణు  దేవుడు  బ్రహ్మ దేవుడు కూడా తమ కళ్ళు మూసుకుని నిలబడ్డారు.
నేను తాగుతున్న పాయసం వారు ఆస్వాదిస్తున్నారు. ఇక పార్వతి మాత ఐతే శివయ్యలో సగం కదా! ఆమె కూడా సగం పాయసం తాగుతుంది ,కాదు అందుతుంది.
నంది మాత్రం 'పాయసం తాగలేకపోతే ఎలా?' అని బాధగా చూస్తున్నాడు.
ఇప్పుడు శివయ్య మెడలో ఫణిరాజు ఏమి చేసాడో చూడండి... 
శివయ్య పాయసం తాగుతుంటే, ఆ మైమరుపులో పాత్ర నుండి కొంచెం పాయసం చుక్కలు కింద పడుతున్నై ..
అంతే, చటుక్కున అ పాయసం చుక్కల్ని ఒడిసి పట్టుకున్నాడు ..ఇలా పాయసపు చుక్కలను తాగి పరమానంద పడుతున్నాడు.
ఇక శివయ్య మాత్రం తక్కువ తిన్నాడా ?
"మా అమ్మ చేసిన పాయసం నాకు మాత్రమే  అని "సైగ చేసి  తన ఆభరణాన్ని తీసి నంది వైపు కి వెళ్ళమన్నాడు.
అంతే, ఆ ఫణిరాజు తన సర్ప రూపం  నుండి మారి నంది పక్కకు వెళ్లి నుంచున్నాడు.
నంది వైపు మాత్రం "నంది ,ఆ పాయసం మాములుగా లేదు ..అబ్బ ..నీకు ఒక విషయం తెలుసా? ఆ పాయసాన్ని త్రిమూర్తులు, మన మాత కూడా గ్రోలినట్టు అనిపించింది "అని చెప్పాడు. 
ఇక శివయ్య పాయసం  మొత్తం పాత్రలో తాగుతున్నాడు ..పాయసం అయిపోయింది.
తీవ్ర తన్మయత్వంతో కళ్ళు తెరిచాడు శివయ్య .బ్రహ్మ ,విష్ణు, పార్వతి మాతలు ఆశ్చర్యంగా చూడసాగారు.
శివయ్య నోటి వెంట మాట రాలేదు.
విష్ణు దేవుడు "బ్రహ్మ దేవా !తమరు కూడా తాగారా ..మాకే సరిపోవట్లేదు" అని ఛలోక్తి విసిరాడు.
బ్రహ్మ "మన త్రిమూర్తులం అంతా ఒకటే కదా " అన్నాడు.
విష్ణువు " మనం ఏమిటి అంతా ఒకటే. తెల్సుకోవటం తెల్సుకోకపోవడమే తేడా" అన్నాడు నవ్వుతూ.
పార్వతి మాత మాత్రం ఇంకా పులకించిపోతోంది.
విష్ణుదేవుడు  "సోదరీ,  మాకన్నా మీరే ఎక్కువగా ఆస్వాదించారు. తమరు శివుడిలో సగం కదా సోదరి !సోదరి , సోదరీ.. అని "పిలిచేసరికి మాత స్పృహలోకి వచ్చింది .
పార్వతి మాత "సోదరా, తమరు చేపితే ఏంటో అనుకున్నా ..ఆ పాయసం ముందు, ఆమె భక్తి ముందు, ఎవరైనా ,మహాదేవుని లాగా మైమరచి పోవాల్సిందే!  " అంది ఆనందంగా.
నంది "మరి మహాదేవుడు అలా ఉండిపోయాడు, కట్టుబడిపోయాడు, ఇదంతా ఏంటి ? " అని అడిగాడు.
విష్ణు దేవుడు "పాల సముద్రం అంత పాయసం ఐతే బాగుండు, అందరికీ సరిపోతుంది." అన్నాడు.
నంది మాత్రం మహాదేవుడి మీద ప్రేమగా అలిగాడు. బుంగమూతి పెట్టాడు.
నేను "అమ్మా, నేను ఈ పాయసం తాగి ఎంతో సంతుష్టుడ్ని అయ్యాను. ఇక నేనేం చెప్పను ? నాకు ఆకలి వేస్తోంది, అన్నం తింటాను " అన్నాను.
నంది అలక చూసి విష్ణు దేవుడికి బ్రహ్మ దేవుడికి ,కూడా ముచ్చటేసింది. పార్వతి మాత్రం తన బిడ్డ అలిగితే ఎలా, అని చూస్తోంది.
నేను "నంది ..నంది..నంది "అని పిలిచాను ఆప్యాయంగా. 
నంది "ఉమ్మ్ ..."అంటూ ఉత్సాహం లేకుండా అన్నాడు.
నేను "పాయసం కావాలా నంది ..నేను ఊరికే సరదగా అన్నాలే ..మా అమ్మ ముందు అంటే అప్రతిష్ట " అన్నాను.
అందరికి ఏమి జరగబోతోందో అర్ధం కావటంలేదు ..శివమ్మ కి కూడా ..
నంది "అందరూ తాగారు. నేనే తాగలేదు. అమ్మ చేసింది నాకూ తాగాలని ఉంటుంది కదా ప్రభు ..చూడండి, ఈ నాగరాజు కూడా తాగాడు "అన్నాడు.
నాగరాజు "ప్రభు, ప్రభూ! అది లెక్కలోకి రాదు ప్రభూ" అన్నాడు కంగారుపడుతూ.
నేను "నంది, నీకు పెట్టకుండా నేను తింటానా? అందరికన్నా అప్తుడివి నువ్వే కదా నాకు,సరే రా నీకు పాయసం తాగిస్తా" అన్నాను.
నంది మొహం లో నవ్వు కనిపించింది.‌నంది కి తెల్సు మహాదేవుడు తనను చాల ప్రేమగా అందరికన్నా ఎక్కువగా చూస్తాడని.
నంది మహాదేవుడి దగ్గరకు వెళ్లి ,శివయ్య తాగిన పాత్ర తీసుకొని నుంచున్నాడు. 
ఇక అందరికి సందేహం, శివయ్య ఏమి చేయబోతున్నాడా అని ..
నేను ఏమైనట చేయగలను కదా!
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages