శివమ్మ కధ – 3 - అచ్చంగా తెలుగు
శివం- 28 
( శివుడే చెబుతున్న కధలు)
శివమ్మ కధ – 3 
రాజ కార్తీక్
 9290523901
(నిస్వార్ధ బుద్ధితో అందరినీ అక్కున చేర్చుకుని, కడుపులు నింపుతూ ఉండే తన భక్తురాలు శివమ్మ భక్తికి లోబడి ఆమె కోసం దిగి వస్తాడు శివుడు... ఇక చదవండి.)
శివమ్మ “ఇందాకటి నుంచి వర్షం పడుతున్నా నేను తడవట్లేదు. నువ్వు తడుస్తున్నావు. అయినా మొత్తం గంగమ్మనే తల మీద పెట్టుకున్నావు, నిన్ను వానేం చేస్తుంది?” అంటూ పైకి చూసింది, అప్పుడు అర్ధం అయ్యింది ఆమెకు ... నా మెడలో అలంకారంగా ఉండే నాగరాజు ఆమెకు గొడుగు లాగా ఉన్నాడని.
శివమ్మ నా చేతులు గట్టిగా పట్టుకుని “రా శివయ్య, అంటూ గారంగా లోపలికి తీసుకువెళ్ళింది..
నాగరాజు నా దగ్గరకు రాబోయాడు ..నేను చెప్పా “మా అమ్మకి గొడుగుగా ఉండమని.”
అలా ఇంట్లోకి అడుగుబెట్ట పోతుండగా ..మరోసారి శివమ్మ గట్టిగా నన్ను వాటేసుకొని "ఉండు శివయ్య ఇక్కడే ఉండు "అని లోపలికి వెళ్ళిపోయింది .
"ప్రభూ! ఇందాక ఆ బండికి కట్టిన త్రిశూలం మరిచిపోయారు "అంటూ త్రిశూలం తెచ్చి నంది ఇచ్చాడు. 
నంది " ప్రభూ!  నన్ను అలా వదిలేసి పోతే ఎలా ? ఎక్కడ అని వెతకాలి నిన్ను ..కానీ ప్రభూ! మిమ్మల్ని వెంటనే కనిపెట్టవచ్చు. నిజ భక్తుడి దగ్గరే కదా మీరు దొరికేది. ఈ శివమ్మ ఎంతో అదృష్టవంతురాలు" అన్నాడు.
ఈలోపు వచ్చింది శివమ్మ ...హారతి తీసుకొని ..
నేను "అమ్మా! నీ కోసం నంది కూడా వచ్చాడు చూడు " అన్నాను.
శివమ్మ"ఎంత ఆనందంగా ఉందో ఈరోజు నిన్నే కాదు శివయ్య,  నీ పరమ నేస్తం నందిని కూడా చూసాను.  ,నందీశ్వర నీకు కూడా నా స్వాగతం..శివయ్య వచ్చాడు మీరు రాలేదేంటి  అని చూస్తున్నా ,తమరువచ్చారు  , అంతే చాలు శివభాక్తాగ్రేశ్వరా ! " అంది ఆనందంగా.
నంది "అమ్మా ! మహాదేవుడికి అమ్మ ఐతే, నాకు కూడా మీరు మాతతో సమానం. నన్ను ఎందుకు మీరు గౌరవించి వేరు చేస్తున్నారు? "వినయంగా ఒదుగుతూ అడిగాడు నంది.
నేను "నంది ! మా అమ్మ నన్ను పిలిచినట్టు,  నిన్ను ఎందుకు పిలుస్తుంది ? " అనడిగాను.
నంది మనసుకు పులకరింత .. అంత గొప్ప మహాదేవుడు ..ఒక చిన్న పిల్లడిలాగా ఈ ముసలమ్మ భక్తికి అల్లరి చేస్తున్నాడు ...ఆది అంతం లేని దేవుడు ..పరమాత్మ ఐన ప్రభువు ..అనంత శక్తిమంతుడు కేవలం భక్తి అన్న చిన్న భావనకి ఇంతలా లోబడతాడా? ఇదే కదా సృష్టి రహస్యం.
నేను "సరే అమ్మ నందిని కూడా  నందికి నచ్చినట్టు పిలువనీ, లేకపోతే రంకె వేస్తాడు " అన్నాను.
నంది "అయ్యా అమ్మ నిన్ను తీసుకురమ్మంటే , నేను నిన్ను మోసుకు తేనా? నువ్వే రావాలా... నీ ఆజ్ఞ కోసం ఎదురుచుసే ఈ దాసుడిని ఎందుకు విస్మరించావు " అని అడిగాడు.
నేను "మా అమ్మని నేను తీసుకువస్తేనే నాకు ఆనందం " అన్నాను.
నంది అసలు మహాదేవుడి ప్రవర్తన ఇదీ అనుకుంటున్నాడు ..
నేను "ఎందుకమ్మా నాకు హారతి ..రోజు ఇస్తావుగా ఈరోజు కొత్త ఏంటి " అనడిగాను.
శివమ్మ"ఈరోజు  హారతి కాదు శివయ్య ..నీకు దిష్టి తీయాలి " అంది.
నంది వైపు “మా అమ్మ చెప్పినట్టు విను” అన్నటు చూసాను..
నేను "అమ్మా నాకు ఎవరు దిష్టి  పెడతారు చెప్పు, నందికి అర్ధం కావటంలేదు " అన్నాను.
శివమ్మ "చూడు శివయ్య నేను చెప్పానని అనుకోకు .ఎప్పుడు చూడు పార్వతి మాత నిన్నే చూస్తుంది .మరి ఎంత దిష్టి  చెప్పు ."అంది.
నంది అవాక్కయ్యాడు ..పార్వతి దేవి ముసిముసిగా నవ్వుకుంటూ లేచి నిల్చుంది  కైలసంలో.
శివమ్మ "ఇదిగో శివయ్యా, నీకు తెలిదు ..అలా భార్య ఎప్పుడూ భర్త వైపు చూస్తే  ఎంత దిష్టి తగుల్తుంది చెప్పు? ఏ గుడిలో నైనా అమ్మ నిన్ను చూస్తూనే ఉంటుంది.. ఆ దెబ్బకు నువ్వు పెళ్లి చేసుకోని  కూడా చూడు విరాగిలాగా ఉంటావు .." అంది నవ్వుతూ.
పార్వతి మాత వైకుంఠం లో ప్రత్యక్షమయ్యింది .అక్కడ విష్ణు దేవుడు లక్ష్మి దేవి ఉన్నారు ..
పార్వతి మాత "చూడు సోదరా, ఈ తల్లి కొడుకులు నా మీద అభాండం వేసారు ..నేను దిష్టి పెడతానట" అంది.
విష్ణు దేవుడు "అది సరే వీరిద్దరూ కలిసి నా మీద ఏమి ఛలోక్తి విసురుతారో అని నాకు భయంగా ఉంది " అన్నాడు భయం నటిస్తూ.
శివమ్మ " ఆ విష్ణు దేవుడు చూడు హాయిగా చక్కగా అలంకారాలు చేయించుకుంటూ నిత్య శోభాయ మానంగా ఉంటాడు " అంది.
లక్ష్మి దేవి "ప్రభు తమరి మీద కూడా ఈ తల్లి కొడుకులు ..."అంది నవ్వుతూ.
నేను "అవునమ్మా చిన్నగా అను ..అసలు ఈ నంది నా భక్తుడైనా మీ పార్వతి మాతకు విధేయుడు..ఆమెకు చెప్పాడో, ఇక చూడు . అసలే భద్ర కాళీ. ఒకసారి నా గుండెల మీద కాలు పెట్టే దాక నిద్రపోలా."అన్నాను.
విష్ణు దేవుడు "ఇది  భలే ఉంది .కావాలని మా సోదరిని శాంతింపచేయటానికి అంటూ ఇలా చెప్తాడేంటి  మహాదేవుడు "అన్నాడు వినోదం చూస్తూ.
నంది ,మాత్రం జరిగవన్నీ చూసి ‘ఈ సరదాలు మహాదేవుని లీలలు’ అనుకున్నాడు ..
శివమ్మ మాత్రం మహాదేవునికి దిష్టి తీసి ..అరచెయ్యి చాపి ఉమ్మివేయమంది ...
నంది "అమ్మా, ఇలా ఎవరూ మహాదేవుడ్ని ఆడగలా ..అసలే ఆయన గొంతులో హాలాహలం ఉంది. అది ఈ సృష్టి ని కబళిస్తుంది "అన్నాడు భయంగా.
నేను "నంది .. నువ్వు ఉండు "అని తు తు అని ఉమ్మాను, అచ్చు చిన్న పిల్లాడు తన తల్లి చెప్పింది చేసినట్టు.
నంది "భోల స్వామి ఏంటి ఇదంతా..తమరు ఒక బాలుని వలె ,తమకు ఏదైనా సాధ్యమే " అన్నాడు.
నేను "చెప్తా విను నంది".... అని ఇలా చెప్పసాగాను.
(సశేషం)





No comments:

Post a Comment

Pages