దైవం మానుష రూపేణా.....
-" మినీ కథాచక్రవర్తి " కె.బి.కృష్ణ
" అది కాదయ్యా మీ వేపు గాని, మా వేపు గాని అసలు ఈ గుండెజబ్ళు ఎవరికీ లేదు. ఎందుకొచ్చిందంటావ్ నీకు ఈ గుండె జబ్బు? అయినా ఎన్నిసార్లు చెప్పినా వినవు. వంటింట్లో ఒక కుర్చీ వేసుకుని అప్పడప్పడు ఒక్క క్షణం కూర్చోమని, కాని వినవు ఉదయం లేచింది మొదలు, ఆ స్నానం చేసేటప్పడు తప్పితే నిలబడే టిఫిను కుక్కుకుంటావు. ఇప్పడు చూడు ఓపెన్ హార్ట్ సర్జరీకి ఎంత ఖర్చు అవుతుందో ఏమో, డబ్బు గురించి కాదు, జీవన్మరణ సమస్య కదా-" అంటున్న నన్ను విచార వదనం తో చూస్తోంది నా శ్రీమతి, ఆమెకు కూడా ఏమవుతుందోననన్న భయం పట్టుకుని పీడిస్తోంది.
మనుషులు ఛాతీ లో యడమ వేప ఏ నెప్పి వచ్చినా తమ గుండెల్లో ఏదో జరుగుతోందని, వెంటనే ఆ భావన రాగానే, చెమట పట్టేసి బాధ పడిపోతుంటారు. ఈ రోజుల్లో ఇది చాలా సహజమైన విషయం అయిపోయింది. అయితే ఛాతీ లో ఏ భాగం లో నెప్పి వచ్చినా అది గుండె జబ్చే కానవసరం లేదు, ఛాతీ లోపల ఎన్ని శరీర భాగాలు ఉన్నాయో ఒక సారి మానవశరీర నిర్మాణం చిత్రపటాన్ని చూస్తే తెలిసే అవకాశం వుంది.
ఒక పదిహేను రోజుల్నించి నా శ్రీమతికి గుండెలకు కిందుగా పోట్లు వస్తున్నాయి, ఎవరో గుండెలను పొడుస్తున్నట్లు తీవ్రమైన బాధగా వుందనీ గోలపెడుతోంటే, నేరుగా ఒక హార్ట్ కేర్ సెంటర్ కి తీసుకువెళ్ళాను. ఒక గుండె ఆపరేషన్ కి మూడూ నాలుగు లక్షల రూపాయల మధ్యన ఖర్చు అవుతోంది కాబట్టి, హార్ట్ కేర్ సెంటర్స్ కూడా చాలా హంగూ ఆర్భాటంగా వుంటున్నాయి. గుండెజబ్బుల డాక్టర్ పేషెంట్ ని మటుకుంటే వెయ్యి రూపాయలు కనీసం తీసుకుంటున్నాడు, అనేక రకాలైన టెస్టులు అదనం. ప్రవేశద్వారం నుండి ఎయిర్కండిషన్డ్ వాతావరణం. టెస్టులు చేసే చోటునుండి, రోగులు ఎదురు చూసే గది, చివరికి బాత్రూమ్స్ కూడా ఎయిర్కండిషన్డే ఫైవ్ స్టార్ హెూటల్స్ లాగా చాలా విలాసవంతం గా, పోష్ గా ఉంటున్నాయి. ఏడవతరగతి చదువుకొంటున్న అబ్బాయినీ, ఐదవ తరగతి చదువుతున్న అమ్మాయినీ, వాళ్ళకు దసరా సెలవులు కాబట్టి ఇంట్లో వుంచి, హార్ట్ కేర్ సెంటర్ కి వచ్చేశాం. హాస్పటల్ కి బయలుదేరుతోంటే అమ్మను పట్టుకొని గొలుమన్నారు వాళు.
"పిచ్చిపిల్లల్లారా-ఏడవకండి, యడమ పక్కన నొప్పి వస్తే గుండె జబ్బు కాదు, మీ అమ్మానేనూ ఊరికే కంగారు పడిపోతున్నాం. అమ్మకేం కాదు-" అంటూ వాళ్ళను ఓదార్చిలోలోపల నాకు విపరీతమైన టెన్షన్ తో కూడిన దుఃఖం పొంగుకొస్తున్నా ధైర్యం తెచ్చుకుని హార్ట్ కేర్ సెంటర్ కి వచ్చేం శ్రీమతి తో కలిసి,
మేం ప్రవేశించిన వెంటనే వెయ్యిరూపాయలు ఫీజు ముందుగానే కట్టించేసుకుని, పద్దెనిమిదో నెంబరు టోకెన్ ఇచ్చారు. ప్రస్తుతం రెండో నెంబరు టోకెన్ నడుస్తోందనీ, మా వంతు వచ్చేటప్పటికి మధ్యాహ్నం మూడు గంటలవొచ్చనీ, ప్రతి రోజూ ఇరవైఐదు టోకెన్లు మాత్రమే ఇస్తామనీ అందర్నీ చూసే వరకూ డాక్టరు గారు వెళ్లరనీ, కంగారు పడవద్దనీ చెప్పారు రిసెపన్ కౌంటర్ లో
రెండు గంటల్లో మా వంతు వచ్చింది. మధ్యాహ్నం పన్నెండు గంటలయింది. ఒక ప్రక్కన ఆకలినీ, మరో పక్కన తనకు ఏమైపోతుందోనని, నా శ్రీమతి ఆందోళన, ఆమెకు ఏమైనా అయితేకుటుంబం సంగతి ఎలాగరా బాబూ అని నా ఆవేదన, వెరశి మా యిద్దరికీ నీరసాలు వచ్చేశాయి. డాక్టరు గుమ్మంలో నర్స్ తో " అమ్మా మా ఇద్దరికీ కొంచం నిప్రాణ గా వుంది మంచినీళ్ళు ఇప్పించండి అన్నానో లేదో, వెంటనే మినీ కూల్డ్రింక్ బాటిల్స్ వచ్చేశాయి. ఆ డ్రింక్స్ తాగి కుదుటపడ్డాం.
డాక్టరు నుండి పిలుపు రావడంతో లోపలకు వెళ్ళాం. ఆయన పరీక్షలన్నీ చేసి, నా శ్రీమతిని అనేక ప్రశ్నలు వేసి " మీ శ్రీమతికి హార్ట్ లో ఏవో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వున్నటుగా అనుమానం గా వుంది. ఈ పరీక్షలన్నీ చేయించండి, ఒక గంట లో రిపోర్టులు తీసుకొని రండి, మా హాస్పటల్ లోనే టెస్ట్లన్నీ చేయించండి లేకపోతే క్వాలిటీ గా వుండవ రిపోర్టులు. అప్పటివరకూ నేను వుంటాను -" అన్నారు డాక్టరు గారు. మా ఇద్దరికీ ఆయన రాసిన అడుగు పొడవున్న పరీక్షల లిస్ట్ చూసేటప్పటికీ ఆకలీ నీరసం ఎగిరిపోయి, డబ్బు ఆవిరి అయిపోతుందనే దిగులు మొదలైంది. వెనకటికి రోటిలో తల పెట్టేకఅన్న సామెత చెప్పినట్లు గా ప్రతీ పరీక్షకూ నేను తెచ్చిన వందరూపాయల కట్టలోంచి డబ్బు తీసి ఇస్తూ ఆమెకు అన్ని టెస్ట్లూ చేయించేశాను మేం టెస్టుల జాబితాలో ఆఖరు టెస్ట్ చేయించే సమయానికి అంతకు ముందు మేం చేయించిన టెస్ట్ లకు సంబంధించిన రిపోర్టులు వచ్చేశాయి. డబ్బు పోతే పోయింది గాని, అన్ని చోట్లకూ తిరగకుండా రిపోర్టులు వచ్చేశాయని తెగ సంబరపడ్డాను. మనిషి అల్ప సంతోషి గదా,
" డాక్టరుగారు రమ్మంటున్నారు " అంటూ నర్స్ వచ్చింది మేం కూర్చున్న చోటుకి వచ్చి అంటే ఆఖరు పరీక్ష అయిపోతుండగానే డాక్టర్ కి తెలిసిపోతుందన్నమాట! గొప్ప నెట్వర్క్ మెయిన్స్టైన్ చేస్తున్నారే ఈ డాక్టర్ అనుకున్నాను.
లోపలకు వెళ్ళాం. ఇద్దరి గుండెలు చేతో పట్టుకుని, నాకు కూడా గుండెకాయ దగ్గర ఏదో కలుక్కుమనిపించింది. కుడిచేతో నిమురుకుని ఏం కాదులే అనుకున్నాను. అన్ని రిపోర్టులూ చూసి డాక్టరు గారు "వెరీసారీ సర్, మీ శ్రీమతి గారికి సాధ్యమైనంత త్వరగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. ఈ నెలలో మేం గత పది రోజుల్నించీ హార్ట్ సర్జరీలకి హెవీ రిబేట్ ఇస్తున్నాం. వెంటనే చేయించేసుకుంటే మీకు పాతిక శాతం డబ్బు తగ్గుతుంది-" అన్నారాయన. అమ్మో! వెంటనే అపరేషన్ చెయ్యాలా? లేకపోతే ఆమెకు ఏమవుతుంది ? అనే ఆందోళన ఒక వేపూ, వెంటనే చేయించేసుకుంటే పాతిక శాతం డబ్బు తగుతుందనే సముదాయింపు మరో వేపూ మమ్మల్ని ముప్పిరిగొన్నాయి.
ఇంటికి వచ్చేసి హాలులో భోజనాలు కూడా చేయకుండా తలలు పట్టుకుని కూర్చున్నాం. మాకు చెరో పక్కనా ఇద్దరు పిల్లలు బిక్కమొఖాలు వేసుకుని కూర్చుని వున్నారు.
ఇంతలో మా వీధి లో సామాజిక సేవకుని గా పేరు వున్న మూర్తి గారు చకచకా తలుపులు తెరిచే వున్న మా ఇంటి హాలు లోకి వచ్చేశారు,
" అవును బాబూ నేను విన్నది నిజమేనా ? అమ్మాయికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నారా ? నా ఫ్రెండ్ ఒకడు మీతో హాస్పటల్ లో మాట్లాడేడుట, చెప్పాడు. చూడండీ మీ శ్రీమతి చలాకీగా వుంటుంది ఎప్పడూ ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటూను. నధింగ్ డూయింగ్ ఆమెకు గుండె జబ్బు వచ్చే ప్రశ్న లేదు. అయినా పెద్దవాణ్ణి ఒక సలహా చెబుతాను, మన ఊళ్ళ ఉచితంగా వైద్యం చేసే ఒక మహానుభావుడు వున్నారు. నేను రోజూ సాయంత్రం ఐదు గంటలనుండి పన్నెండు గంటల వరకూ ఆయన దగ్గరే వుంటాను. ఆయన కేన్సర్, టి.బి, బిపి, షుగర్ పక్షవాతం లాంటి ఎన్నో ముదిరినవ్యాధులు నయం చేస్తున్నారు. నేను ప్రత్యక్షం గా చూశాను. మీరు ఒక్కసారి ఆయనకు అమ్మాయిని చూపించి అసలు విషయం తెలుసుకుని, తరువాత ఆపరేషన్ చేయించవచ్చుననుకోండి. ఛాతీ లో యడమ పక్కన నొప్పి అని హార్ట్ సెంటర్ కి వెళ్ళారంటే, మిమ్మల్ని ఆపరేషన్ టేబుల్ ఎక్కించేస్తారు. దయచేసి నా మాట విని ఒక్కసారి ఆయన్ను సాయంత్రం సంప్రదించండి. నేను అక్కడే వుంటాను ప్రతీరోజూ ఉదయం టోకెన్ తీసుకుంటే రాత్రి పన్నెండు గంటలకు కూడా వాళ్ళ వంతు రాదు. అంత బిజీగా వుంటుంది అక్కడ. అక్కడ నేను వెంటనే దగ్గరుండి చూపిస్తాను. నా మీద నమ్మకం ఉంచండి. -" అంటున్న ఆయన మాటలు వింటూ, దేవుణ్ణి నమ్ముకుంటే మనిషి రూపం లోనే దేవుడు ఆపద లో ఎదురవుతాడని విన్నాను, చదివాను, ఈయన్ని ఆ సర్వేశ్వరుడే పంపించాడేమో అనుకుని మేం ఇద్దరం ఎంతో రిలాక్స్ అయ్యాం.
" బాబయ్యగారూ సాయంత్రం వస్తాం-" అనేసింది నా శ్రీమతి మరి మారు మాటాడకుండామర్నాడు నేనూ నా శ్రీమతీ తేలిక పడిన హృదయాలతో సాయంత్రం నాలుగున్నర గంటలకే మూర్తి గారు చెప్పిన ఇంటికి చేరుకున్నాం. అది రెండంతస్తుల మేడ. ఆకుపచ్చని రంగులో ఎరుపు రంగు బోర్డర్స్ తో ఎమల్షన్ పెయింట్ వేసి ఉంది. ఇంటి ముందు ఖాళీ స్థలం లో అన్నీ పూల చెట్లూ, క్రోటన్స్ రంగు రంగుల మొక్కలూ, కొన్ని పెద్ద చెట్లూ వున్నాయి. ఆకుపచ్చగా కనువిందు చేస్తున్నాయి చెట్లన్నీ, రెండు పెద్ద గేట్లు వున్నాయి, మధ్యలో ఒక చిన్న గేటు వుంది. మేడకు యడమ వైపు పెద్ద గేటు దగ్గర చాలా మంది జనం వున్నారు. బయట రోడ్ మీద బైకులు, సైకిళ్ళు ఒక కారు వున్నాయి. నేను ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాను. ఉచితం గా వైద్యం చేయడం, మందు ఇవ్వడమే గాకుండా, రోగులకు తన పై విశ్వాసం కలిగిస్తేనే ఇలా జనం వస్తారు. పైగా ఆయన హస్తవాసి కూడా మంచిదేమో, నాకు మూర్తిగారు మా ఆపద లో దైవం పంపిన దూతగా గోచరించారు, లేకపోతే నా జీవనసహచరి గురించి ఎంత ఆందోళన చెందాను.
జనమంతా అక్కడ వున్న బెంచీల మీద కూర్చుని వున్నారు. డాక్టరు గారు లోపల వున్నారు. గుమ్మం దగ్గరకు ఒకరు వచ్చి బయట వున్న జనం లోంచి, వారి టోకెన్ నెంబరు చెప్పి లోపలకు పంపిస్తున్నారు. నేను గుమ్మం దగ్గరకు వెళ్ళి లోపలకు తొంగి చూశాను. లోపల డాక్టరు గారి చుట్టూ చేరి, దాదాపు ఆరవయ్యో వడిలో ఉన్నవారు ఆయనకు సహాయపడుతున్నారు. అంతలో మూర్తిగారు నన్ను చూసిగభాల్నలేచి నా దగ్గరకు వచ్చారు. ఆయన్నుచూడగానే నా మనము సంతోషంతో పొంగిపోయింది." రండి రండి. అమ్మాయిని తీసుకువచ్చారా? " అని ఆయన అంటూవుండగానే మూర్తి గారికి నమస్కరించి ఇద్దరమూ ఆయన్ను అనుసరించాము.
లోపల ఒక చెక్కబల్ల ముందు కుషన్ చైర్ లో కూర్చుని ఉన్నారు డాక్టర్ గారు. ఆయన కు నలభై పైన వయసు వుంటుందేమో. తెల్లని లాల్చీ, పైజమా ధరించి, సన్నని కళ్ళద్దాలు, సామాన్యమైన సంస్కారం లేని జుట్టూ, ఆయన కళ్ళల్లో ప్రశాంతత, ఆయన కు మాత్రమే వినపడేట్టుగా మెల్లగా మాట్లాడుతున్నారాయన. నన్నుమూర్తిగారు ఆయనకు దగ్గరగా తీసుకువెళ్ళారు."డాక్టరు గారూ ఇంతకు ముందు మీకు చెప్పానే వీరి శ్రీమతికే ఓపెన్ హార్ట్ ఆపరేషన్ చేయాలన్నారు. దయచేసి వారి ఆందోళన తొలగించండి సార్ " అన్నారు మూర్తి గారు." ఈమెను చూస్తోంటే హార్ట్ పేషెంట్ లా లేదే. అయినా చూద్దాం-" అని తన ముందు కూర్చున్న పేషెంట్ కి మందులు ఎలా వేసుకోవాలో చెప్పిఒక్క పూట కూడా మందు మానేయకూడదని జాగ్రత్తలు చెప్పి పంపేసి, మమ్మల్ని దగ్గరగా రమ్మన్నారాయన. నా శ్రీమతి ని ఆయన ముందు వున్న బల్ల మీద కూర్చోమని చెప్పి ఆయనకు నమస్కారం పెట్టి నిలబడే వున్నాను. ఆమెను ప్రశ్నలు వేస్తూ ఆమె దినచర్య అడిగారు. ఛాతీ ముందు భాగం, వెనుక భాగం, స్టెత్ తో చూశారు, కళ్ళూ నాలుకా చూశారు.
" మూర్తి గారూ ఈమెను బాధించే గుండె కింద భాగం లో నొప్పి, గుండె కు సంబంధించినది కాదు. ఆది గాస్ట్రిక్ ప్రోబ్లమ్. పొట్టలోంచి గుండెల వేపు గ్యాస్ ఎగదన్నడం వలన ఆమెకు ఎవరో గుండెలవేపు నొక్కినట్లు అవుతుంది, వెరీ సింపుల్, ఒక నెల రోజుల్లో తగ్గిపోతుంది " అని అయన అంటోంటే నేను లేచి ఆయన రెండు చేతులూ పట్టుకుని తడి అయిన కళ్ళతో " చూడండి అనవసరం గా ఆందోళన చెందకండి. దేముడిని నమ్మండి. ఎవరికీ అపకారం చెయ్యకండి, ఉపకారం చెయ్యక పోయినా పర్వాలేదు, అపకారం మాత్రం చేయకండి—
చూడండి- సాధారణంగా ఆడవాళ్ళ ఉదయం లేచిన దగ్గరనుండీ భర్తకు, పిల్లలనూ సవరించడం ఇల్లు సర్దుకోవడం, వీటన్నింటి తో సతమతమైపోతారు. ఈ పరిణామక్రమం లో తన కడుపు సంగతి, ఆకలి విషయం పట్టించుకోరు. పైగా అప్పడప్పడు కాస్త్ర కాఫీ లేదా టీ నోట్లో పోసుకుంటారు. పిల్లలు కాన్వెంటికీ, భర్త ఆఫీసుకు వెళ్ళేక పదకొండు గంటలకు నెమ్మది గా టిఫిన్ తింటారు. అంటే అప్పటి వరకూ కడుపు ఖాళీ ఉంటుందన్నమాట. అందువలన ఖాళీ కడుపులో ఏసిడ్స్ వుత్పత్తి అవుతాయి. అలాగే రోజంతా వీరు సంసారం గొడవలో పడి తమ కడుపు సంగతి ఆలోచించుకోరు. సామాన్యం గా నూటికి ఎనభై శాతం ఆడవాళ్ళకి ఇలాంటి నెప్పి వస్తోంది. అందువలన వారు తమ దిన చర్యను మార్చుకుంటే సరిపోతుంది. అయినా నేను మందులు కూడా ఇస్తాను-" అంటూ తన బల్ల మీద ఉన్న సీసాల్లో ఒక సీసా తీసి నా శ్రీమతి నాలిక మీద పది చుక్కలు వేశారు. ఆ మందు వలన నోటిని శుభ్రం చేయడం జరుగుతుందని నాకు తరువాత తెలిసింది. డాక్టరు గారు మమ్మల్ని వారం రోజుల తరువాత రమ్మన్నారు. మరో సారి హార్ట్ కేర్ సెంటర్ కి వెళ్ళాద్దని చెప్పారు.
" డాక్టర్ గారూ మీతో మాట్లాడాలి, ఒక్క పావు గంట నాకు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించండి. రేపు ఎప్పడు రమ్మంటారు ? " అన్నాను." మధ్యాహ్నం ఒంటిగంటన్నర కు రండి " అన్నారాయన, చకచకా బయటకు వచ్చేశాం, తిరిగి వస్తోంటే చూశాను ఆయన గేటుకు పెద్ద బోర్డ్. శ్రీ రామచంద్రమూర్తి. యం.ఏ(తెలుగు),యం.ఏ.(ఇంగ్లీషు),యం.ఏ.(సైకాలజీ),యం.ఇడి,డి.సి.ఎ ఇలా ఎన్నో డిగ్రీలు, కిందుగా హెడ్ మాస్టర్, మునిసిపల్ హై స్కూల్ అని వుంది. ఓ మై గాడ్! ఒక స్కూలు కు హెచ్.యమ్ గా ఉద్యోగవిధులు నిర్వహిస్తూ ఈయన ఈ ఉచిత వైద్యం ఎలా చేస్తున్నారో అని లోలోపల అనుకోబోయి పైకి అనేశాను. నా పక్కనే ఉన్న ఒక పెద్దాయన " ఆయ్ బాబో- ఈయన ఈ వైద్యమే కాదండి బాబో, చానా పనులు చేత్తాఉండారు " అన్నాడు. సరేరేపు మాట్లాడితే ఆన్ని విషయాలు తెలుస్తాయి అనుకుని ఇంటికి వచ్చేశాను. నాకు ఆ రోజు రాత్రంతా కునుకు లేదు, రోగులను పరిశీలనగా చూస్తోన్న ఆయన సుందరమైన విగ్రహమే గోచరిస్తోంది.
ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలుపొంది, చేసిన వాగ్దానాలు తుంగలో తొక్కేస్తున్నారు. వేలాది రూపాయలు జీతాలు తీసుకునే ప్రభుత్వోద్యోగులు తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదు, పైగా ఏదైనా ప్రశ్నిస్తే వారికి విసుగూ, కోపమూను. ప్రజల బాగోగులుఆలోచించని మనుషులు దర్జాగా సంచరిస్తున్న నేటి ఆ సమాజంలో, ప్రజలకు ఉచితం గా వైద్యం చేస్తున్న ఈ హెడ్ మాస్టర్ గారిని ఎలా సంబోధించాలో నాకు బోధపడలేదు.
ఒక డజను యాపిల్స్ సంచీలో వేసుకుని మాస్టారి ఇంటికి కాదు కాదు సాక్షాతూ శ్రీరామచంద్రుని దగ్గరకు బయలుదేరాను. సమయం సరిగా ఒకటిన్నర అయింది. గేటు తీసిన చప్పడైందో లేదో వరండా తలుపులు తీసుకుని మాస్టారు ఎదురు వచ్చారు." నమస్కారం సార్ " అంటూ బల్లమీద పండ్ల సంచీ ఉంచాను, "మాస్టారూ అనవసరంగా డబ్బు ఖర్చుపెట్టకండి. నేను యాపిల్స్ కొనుక్కుని తినగలను. కాని బజార్లో గంపల్లో వాటిని చూస్తూ వాటికి కొనలేక వాటి రుచిని తలచుకుని గుటకలు వేసే బీదవారికి ఆ యాపిల్ రుచి చూపిస్తే ఎంత బావుంటుంది చెప్పండి ? " అన్నారాయన. నేను యాపిల్స్ కొనుక్కోగలనని ఆయన అనగానే కోపం వచ్చింది, కాని తరువాతి ఆయన మాటలు ఆయన విశాల హృదయాన్ని విశదపరిచాయి. "మాస్టారూ, దేశంలో అందరూ ఈ కోణంలో ఆలోచిస్తే, అసలు బిచ్చమెతుకునే వారు కనుపించరేమో-" అని నేను అంటోంటే- "ఇవ్వాళ నాతో మాట్లాడాలన్నారు ఏం మాట్లాడాలి ? " అన్నారాయన.
" ఈ ఉచితవైద్యం ఎలా చేస్తున్నారో నాకు బోధపడలేదు. వివరం తెలుసుకుని యధాశక్తి నేనూ తోడ్పడాలని-" నా మాటలు పూర్తి కాకుండానే.
" మాస్టారూ కృతజ్ఞతాంజలి, నన్ను నా జీవన విధానాన్ని చూసి, మీ వంటి ఆలోచనాపరులు సమాజం లో వుండడం బహు అరుదు అంటూ ఆయన నాకు చేతులు జోడించి నమస్కరించారు, చెప్పొద్దూ నాకు సిగ్గువేసింది.
“చూడండీ, మా తాత ముత్తాతల నుండీ, మేం జమీందార్లం కాదు గానీ, మా జీవితావసరాలకు కావలసినదాని కన్నా ఎక్కువ గా వున్న వాళ్ళం. నాకు మా పూర్వీకుల వలన కొబ్బరి చెట్లతో పదెకరాల పొలం వారసత్వం గా వచ్చింది. ఈ రెండతస్తుల మేడ నా తోట మీద వచ్చిన ఆదాయం తో కట్టేను. నా పొలమూ, ఈ మేడా కదిలించకుండా నాకు సామాజిక సేవ చేయాలనిపించింది. పోస్టల్ కోచింగ్ లో హెూమియోపతీ చదివాను,డిప్లొమా సంపాదించి, పేరు పొందిన హెూమియో వైద్యుల దగ్గర మెళకువలు నేర్చుకుని, ఉచితం గా వైద్యం చేస్తున్నాను. నేను ఎవరి వద్ద నుండీ సహాయం తీసుకోను. ఎప్పడైనా మందుల కంపెనీ వాళ్ళ వచ్చి మందులిస్తోంటారు. ఇకపోతే పేషెంట్లను కంట్రోల్ చెయ్యడం, మందులు నేను చెప్పినటుగా పొట్లాలు కట్టడం, నాకు అన్ని విధాలా సహాయపడడం, మీ స్నేహితులు మూర్తి గారి లాంటి వారు రోజు విడిచి రోజు కొంత మంది వస్తారు. నేను రోగిని నిశితంగా పరిశీలించి, పరీక్షించి నాకు వైద్యం లో మెళకువలు నేర్పించిన ప్రముఖవైద్యుల సలహాలను, వారు ట్రీట్ చేసే విధానం అనుసరిస్తుంటాను. అందువలన నేను దీర్ఘ వ్యాధులను కూడా నయం చేయగలుగుతున్నాను. ఈ నగరం లోనే కాకుండా ప్రతీ ఆదివారం వరుసగా ఒక ప్లాన్ ప్రకారం ఒక్కొక్క గ్రామం వెళ్ళి వైద్యం చేస్తాను. తరువాతి వైద్యానికి వారు ఇక్కడికే వస్తారు-" అని ఆయన చెబుతోంటే
" మరి హెడ్ మాస్టర్ గా మీ విధులు ? " నా మాటలు పూర్తి కాకుండానే…
"నేను ఈ సామాజిక సేవలో నా విధులలో ఏ మాత్రం అశ్రద్ద చేయను. ఉత్తమ ఉపాధ్యాయునిగా జిల్లా, రాష్ట స్థాయిలో నాకు అవార్డులు వచ్చాయి, అంతే కాకుండా నేను ఒక ఇరవై మంది బీద విద్యార్దులనుకాకుండా, రోజూ ఉదయం ఐదు గంటలనుండి ఎనిమిది గంటల వరకూ దాదాపు ఏభై మంది విద్యార్ధులకు ఉచితం గా ట్యూషన్ చెబుతాను. అలాగే నగరం లోని మిగతా పాఠశాలల్లో బీద విద్యారులుంటే వారికీ సహాయం చేస్తాను. ప్రభుత్వం నుండి పరిమితంగా నిధులు వస్తుండడం తో నగరంలోని ధనవంతులను అభ్యర్ధించి స్కూల్లో బాత్ రూమ్లూ, పిల్లలకు మినరల్ వాటర్ సప్లయి, ఆటవస్తువులు కొనడం చేస్తున్నాను. ఇంకా చాలా ప్రణాళికలు అమలు చేయాలి.
నాకు దైవం ఇచ్చిన సిరిసంపదలను ఇలా సద్వినియోగపరుస్తున్నాను. ప్రతీనెలా నా జీతంలో ఇరవైశాతం కుటుంబఆవసరాలకు వుంచుకుని మిగతా మొత్తమంతా ఖర్చుపెడతాను. దీనికి నా శ్రీమతీ, ఇంజనీరింగ్ చదువుకుంటున్న ఇద్దరు అబ్బాయిలూ ప్రోత్సాహం ఇస్తున్నారు. మాస్టారూ ఈ చర్యలన్నీ నాకు మానసికంగా, శారీరకంగా, ఎంతో శక్తిని ఇస్తున్నాయి. నాకు ఎంతో తృప్తిగా ఆనందంగా వుంటుంది. నేను ఇంతకు ముందు దత్తత తీసుకున్న విద్యారులు ఇంజనీరింగ్, డాక్టరు, చార్టర్డ్ ఎకౌంటెంట్స్ తదితర వృత్తులు చేస్తూ తరచు నా దగ్గరకు వచ్చి సంతోషంతో చెబుతోంటే ఎంతో సంబర పడిపోతుంటాను. నా జన్మధన్యమైందని ఎంతో సంతోషిస్తాను. మనిషికి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? కోటి రూపాయలు సంపాదించినా ఈ ఆనంద తరంగాలు మురిపిస్తాయా చెప్పండి. అంటున్నారు శ్రీరామచంద్రమూర్తి గారు, ఎదురుగా శంఖుచక్రాలతో స్వామి ప్రత్యక్షమైనంత ఆనందం తో నా మనసు సంతోషం తో ఊగిసలాడింది. ఇవ్వాళ ఒక మహనీయుని కలుసుకునే భాగ్యం కలిగింది" మాస్టారూ ఎప్పడైనా వస్తుంటాను మన్నించండి " అంటూ తిరిగి వచ్చేశాను
ఒక నెల రోజుల్లో నా జీవనసహచరి ఆరోగ్యం పూర్తిగా నయమైపోయింది.
ఎవరైనా సహాయం చేస్తే ఆ సహాయాన్ని పొందిన వారు, సహాయం చేసిన వారికి కృతజ్ఞత చెప్పక పోతే వారి జీవితం వ్యర్ధం అని నా నిశ్చిత అభిప్రాయం.
ఆ రోజు మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు నేనూ నా శ్రీమతీ శ్రీరామచంద్రమూర్తి గారి ఇంటి ముందు నిలబడి ఉన్నాం." రండి " అన్నారాయన మందస్మిత వదనం తో, నా శ్రీమతి వెంటనే ఆయన పాదాలను తాకి, తడికళ్ళను తన చీర చెంగుతో అద్దుకుంది. "సాక్షాతూ మనిషి రూపంలో ఉన్న దైవం మీరు ఎంత మందికి ప్రాణభిక్ష, విద్యాదానం చేస్తున్నారో -" అంటూ వేనోళ్ళ పొగడుతోంది ఆయన్ని ఒక వంద నోటు పుస్తకాలు, హెూమియో మందులు వేసుకునే బుల్లిసీసాలు, మందు కలుపుకునే ఖాళీ సీసాలు, పొట్లాలు కట్టడానికి తెల్లకాగితాల రోల్స్ ఇలా ఆయన సామాజిక సేవకు ఉపకరించే అనేక వస్తువులు ఆయన ముందు ఉంచి " చంద్రునికోనూలు పోగు. స్వీకరించండి" అన్నాం ఇద్దరమూ చేతులు జోడించి" మీ దంపతుల మంచి తనం చూసి వీటిని తిరస్కరిస్తే మీరు బాధపడతారని, దానివలన నాకు పాపం కలుగుతుందనీ తీసుకుంటున్నాను. భవిష్యత్తు లో ఎప్పడూ ఇటువంటి పని చేయకండి-" అన్నారాయన చిరుకోపంతో ఆయన కనుల వెంట చల్లని చూపులు వెలువడుతోంటే ఆ చూపుల్లో వశీకరణ శక్తి గోచరిస్తోంటే ముగ్దులమై తిరిగి ఇంటికి పయనమయ్యాం.
రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రప్రభుత్వాలు ఇచ్చే అవార్డులూ, సత్కారాలూ ఇటువంటి నిజమైన మహనీయులకు అందడం లేదు. వీరికి ప్రచారం చేసుకోవడం ఇష్టం వుండదు. దేశంలో కోట్లాది రూపాయలు వున్నవారిలో పది శాతం మంది ఇలాంటి సేవాకార్యక్రమాలు చేస్తే బీదరికం ఎందుకు వుంటుంది ? ఏది ఏమైనా ఈ మాస్టారి సేవకు తగిన ప్రచారం చేయాలని నేను అనుకున్నాను. మీరు కూడా ఇలాంటి వారు తారసపడితే పది మందికీ చెప్పి ఇతోధికంగా సాయం చేస్తారు కదూ !
***
No comments:
Post a Comment