పల్లె శోభ - అచ్చంగా తెలుగు
పల్లెశోభ.
ఆదూరి.హైమవతి."తాతా ! మీ కొడుక్కు నువ్వైనాచెప్పచ్చుగా! ప్రతిశుక్రవారం రాత్రి ఇక్కడికీ, ప్రతి ఆదివారం రాత్రి
 ఆ ఏ.సీ ఫైవ్ స్టార్ హోటలుకూ ఇలా ఈ మూడువారాలుగా ఎందుకు తిప్పుతాడూ అసలిదంతా ఎందుకూ?"  తాత దగ్గరకొచ్చి మెల్లిగా గుసగుసగా అడిగిన అవినాష్ తో ,   "ఒరేనా కొడుక్కొడుకా ! ఆ అడిగేదేదో నాకొడుకునే అడగ రాదురా! నన్నడిగితే నేనేం చెప్తానూ?"  అన్నాడు తాత.

 అమ్మో మానాన్ననే! భయంబాబూ!”

 "ఏరా ఎందుకూ భయం? మీ నాయనేమన్నా దయ్యమా? భూతమా?"

  "ఐనా ఆయనెందుకూ? తాతా నీవున్నావుగా చెప్పేందుకు, నీవేచెప్దూ! ".

  "సరే నీవు ఇంకో పదివారాలు ఆగు నీకే తెలుస్తుంది, అప్పటికీ తెలీకపోతే నేనే చెప్తాను సరా!అంటూ ,చల్లని పూరి నట్టంట్లో, పేడ అలికిన అరుగుమీద పరచిన తాటాకుల చాప మీద అటుకేసి తిరిగి పడుకున్నాడు తాత. 
****

ఒరే! ఒరేనా కొడుక్కొడుకా ! ఎక్కడున్నావురా! అవినాష్!అంటూతాత మనవడికోసం ఆపల్లెలోని
 వీధులు తిరుగుతూ ఊరి నడిబొడ్డుకు వచ్చాడు. అక్కడున్న పంచాయితీ ఆఫీసు ముందున్న వేపచెట్టు క్రింద అరుగు దగ్గర కోడుంబిళ్ల ఆడుతున్న మనవడ్ని చూసి 

ఏరా ఒరేనాకొడుక్కొడుకా! మనం వెళ్ళే సమయమైంది. నాకొడుకు నీకోసం కాచుక్కూర్చున్నాడు కార్లో

తాతా ఇంకొక్క గంట ఆగి వెళితేనేం? ఏముందక్కడ ఆ ఏసీ కి ఒళ్ళంతా ఎండు తుంటుంది, ఆ హోటల్లో ఎప్పుడో వండిన కూరలు వేడిచేసి , రుచీ పచీలేకుండా పెడతాడు. తాతా! నీవు చెప్పవూ?"

 "ఏరా! నేనేమన్నా నీకూ మీ నాయనకూ పోస్టు నడిపే బంట్రీతు ననుకున్నావేరా! నాకు తెలీదుపో నీవే అడుగు. ఐనా క్రికెట్ ఆటఆడేవాడికి , ఈ కోడుంబిళ్ళేంట్రా!"  

 "అబ్బాతాతా!నీకేంతెల్సు ఈ కోడుంబిళ్ల మజా! వీరయ్య వాళ్ల తోటలో పండిన జామపండ్లు, తేగలూ
 తెస్తానని వెళ్ళాడు. ప్లీజ్  అంటూ అరుగెక్కి చూడసాగాడు. ఇంతలో వీరడు గస పెట్టుకుంటూ పరుగెత్తు
 కొచ్చి చిక్కంలో కట్టిన అరమాగిన జామ పండ్లూ, తేగల కట్టా ఇచ్చాడు. అవి తీసుకుని వీరడ్ని గుండెలకు హత్తుకుని   థాంక్స్ రా! మళ్ళా శుక్రవారం వస్తా, నీకు మిఠాయుండలు తెస్తాన్లేరా!"  అంటూ అవన్నీ తీసుకుని కదిలాడు.  
"ఒరేమనవడా! అదేంట్రా ఛీపాడు అన్నతేగలు తీసుకుని , ఆపల్లె వాడ్ని, చెమటకారుతున్న వాడ్ని అలా హత్తుకున్నావ్! వాడెక్కడ? నీవెక్కడ?"  అంటున్నతాతని కోపంగా చూసి,
 "తాతా వెనుక నేనన్న మాటలు నాకే తిరిగి రాంబాణంలా కొడుతున్నావ్! వీరడెంతమంచి వాడోతెల్సా
 తాతా! నాకోసం వాళ్ళ తోటలో కెళ్ళి జామపండ్లు , కాల్చిన తేగలూ తెచ్చాడు.ఈ పల్లె ఎంతహాయిగా ఉంది తాతా! చల్లని గాలి, ప్రేమగా మాట్లాడే స్నేహితులు, చల్లని పూరిల్లు, కమ్మని గుమ్మపాలూ, మువ్వల గంటలూ, లేగదూడలతో పరుగు పందేం వేసుకుంటే అవే గెలుస్తాయ్ తాతా ! అబ్బ మన పట్టణానికీ,. ఈపల్లెకూ పోలికే లేదంటే నమ్ము. 

 ఇలా మాట్లాడుతున్న మనవడితో ,   "మరి నీవు పదినెలల క్రితం  ఛీపాడుపల్లె అన్నావు గుర్తుందిరా!?" అన్నాడు తాత.

 "ఐయాం సోసారీతాతా ! అలా అన్నందుకు , ఈ పల్లె అందాలు అప్పుడు తెలీలేదు."  అంటూ ఆనందంగా అంటున్న ఎనిమిదోక్లాసు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న మనవడి తల ప్రేమగా తట్టాడు తాత.

కారు లోకొచ్చి కూర్చోగానే   "నాన్నా! మనం మన ఇంటికెళ్ళిపోదాం ఆ హోటల్కు వద్దు లేదా ఈరాత్రికీ
 ఇక్కడే ఉండి రేపు నేరుగా ఇంటి కెళదాం"  అంటున్నది ఏడోక్లాస్ చదువుతున్న మనవరాలు మాధురితన చేతికున్నఎర్రగాపండిన గోరింటాకు చూసుకుంటూ .

ఓరిపిల్లల్లారా!! మీనాన్న చిన్నతనంలో ఉన్న ఇల్లురా ఇదీ! వాడు తన తాతతో , బామ్మతో కల్సి తిరిగిన ఊరురా ఇదీ! ఈమామిడి చెట్లక్రింద ఆడుకుంటూ,ఈ కొబ్బరి కాయల నీరు త్రాగుతూ, ఈ ఊరిచెఱువులో ఈతలాడుతూ, ఈ చల్లని పూరినట్టంట్లో ఈ పేడ అలికిన అరుగుమీద తాటాకుల చాప పరుచుకునిఇప్పుడు మీరు పడుకున్నట్లే వాళ్ళ తాత పక్కన పడుకుని రామాయణం , మహా భారతం కధలువింటూ నిద్రపోతూ, బామ్మ పాడే మేలు కొలుపుపాటలతో లేస్తూ ,వేపపుల్లతో పళ్ళుతోముకుని , గుమ్మపాలు త్రాగుతూ బడి కెళ్ళి చదువుకున్నరోజులు గుర్తుచేసుకోనూ , ఆమధుర క్షణాలను స్మరించుకోనూమీకు పల్లే లో ఉండే మధురిమనూ, ఆరోగ్య వాతావరణాన్నీ తెలియజేయనూ ప్రతి శుక్రవారం మనందర్నీ ఇక్కడికి తీసుకొస్తున్నాడ్రా , మీకు ఆ కలుషిత నగర వాతావరణానికీ ఈ ప్రశాంత వాతావరణానికీ ఉన్న తేడా చెప్పకుండానే తెల్సుకునేలా చేశాడ్రా నాకొడుకు! ఆనగర ఫైవ్ స్టార్ హోటళ్ళ గురించీ మీకు తెలియ జేయనే ఆదివారం రాత్రికి అక్కడికి తీసుకెళ్ళి డిన్నర్ పెట్టిస్తున్నాడ్రా !ఈ రెండింటికీ తేడా ఈపాటికే మీకు తెలిసిపోయిందిగా!"   అంటున్నతాత చేతులు పట్టుకుని   "నిజంగానే బాగా తెలిసిపోయిందితాతా. ఫైవ్ స్టార్ హోటలంటే వైవ్ డేస్ బ్యాక్ వి, త్రీ స్టార్ హోట లంటే త్రీ దేస్ బ్యాక్ వీ వేడిచేసి పెట్టేవి, ఇహ ఎప్పుడూ ఆహోటళ్ళ తిండి తినం. ఈపల్లెలోని తేగలూ, బుర్ర గుంజు, కొబ్బరి నీరూ, తాటిముంజెలూ, గడ్డ పెరుగూ రుచి మరి దేనికీ రావు. మాగుడ్డలనూ, వాటి ఖరీదు నూ చూసి చేసే స్నేహాలు ఇక్కడ లేవు.మాకిక్కడేబావుంది. చాలా థాంక్స్ నాన్నగారూ!"  అంటూన్న మెరిసే కళ్లతో చెప్తున్న పిల్లలిద్దరినీ ప్రేమగా చూశారు వారి తాత,అమ్మానాన్నగారూనూ.

****** No comments:

Post a Comment

Pages