మను చరిత్రము -5 - అచ్చంగా తెలుగు

ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాత్య ప్రణీత -మను చరిత్రము -5
(కళా ఖండానికి ఒక పామరుడి ప్రశంస)
బాలాంత్రపు వేంకట రమణ


మృగమదసౌరభ విభవ
ద్విగుణిత ఘనసార సాంద్ర వీటీగంధ
స్థగితేతర పరళ మై
మగువ పొలుపుఁ దెలుపునొక్క మారుత మొలసెన్
కస్తూరిపరిమళంతో (మృగమద సౌరభ విభవ), దానికి  రెట్టించిన (ద్విగుణిత) పచ్చకర్పూరం కలిపి (ఘనసార)  పరిమళం (గంధ) ఇంపారగా, ఇంకా ఇతర పరిమళ వస్తువులు కలిపిన  (స్తగిత  + ఇతర) సువాసనలతో  నిండిన (సాంద్ర) తాంబూలం (వీటీ) యొక్క సువాసనలను తెలుపుతూ ఒక్కా (ఒకానొక) చిరుగాలి  వీచింది (ఒలసెన్).  ప్రవరుడి ముక్కుపుటాలకి సోకింది.  ఆ సువాసనని బట్టి, సమీపంలో ఒక జవరాలు (మగువ)  ఉందని గ్రహించాడు.  ఆ చిరుగాలి ఆమె జాడని (పొలుపున్) తెలిపింది.

తాంబూలసేవనంలో వైభోగం.  మగవారైతే  రెండు పాళ్ళు కస్తూరి ఒక పాలు పచ్చకర్పూరం తో తాంబూలం సేవిస్టారు.  మగువలైతే తాంబూలంలో ఒకపాలు కస్తూరి, రెండు పాల్లు పచ్చకర్పూరం వేసుకుంటారు.  కాబట్టి ప్రవరుడు తనకేసి వీచిన చిరుగాలిలో ఆ పరిమళాన్ని బట్టి మగువ పొలుపుని, అంటే ఈ సమీపంలో ఎక్కడొ ఒక జవరాలు ఉంది అని  గ్రహించాడు. 

అతఁడా వాత పరంపరా పరిమళ వ్యాపారలీలన్ జనా
న్వితమిచ్చోటని చేరఁబోయి కనియెన్ విద్యుల్లతా విగ్రహన్
శతపత్రేక్షణఁ జంచరీకచికురన్ జంద్రాస్యఁ జక్రస్తనిన్
నతనాభిన్ నవలా నొకానొక మరున్నారీ శిరోరత్నమున్
ప్రవరుడు  గాలి జాలునందు సుగంధము యొక్క ప్రవర్తన విలాసము చేత, ఈ ప్రాంతం జనులు కలదిగా గ్రహించి, వెళ్ళేసరికి అక్కడ అతనికి ఒక అత్యుత్భుతమైన సౌందర్యవతి  అగుపించింది.  మెఱుపుతీగలాటి మేను కలదానిని (విద్యుల్లతావిగ్రహన్); కమలలాటి కన్నులు గలదానిని(శతపత్ర + ఈక్షణన్), తుమ్మెదరెక్కలవంటి కురులు గలదానిని (చంచరీక చికురన్), చంద్రబింబం లాటి మోముగలదానిని (చంద్ర + ఆస్యన్), చక్రవాకముల వంటి చన్నులుగలదానిని (చక్రస్తనిన్), లోతైన బొడ్డు కలదానిని (నత నాభిన్) ఒకానొక, దేవతాస్త్రీశిరోమణిని (మరుత్ నారీ శిరోరత్నమున్), జవరాలిని (నవలాన్) చూశాడు (కనియెన్).  ప్రవరుడు. 
 సర్వశుభలక్షణ అని వర్ణన. 
తనకేసి వస్తున్న ప్రవరుణ్ణి చూడగానే, ఆ దేవతాస్త్రీకి -

అబ్బురపాటుతోడ నయనాంబుజముల్ వికసింపఁ గాంతి పె
ల్లుబ్బి కనీనికల్ వికసితోత్పల పంక్తులఁ గ్రుమ్మరింపఁగా
గుబ్బ మెరుంగుఁ జన్గవ గగుర్పొడువన్ మదిలోనఁ గోరికల్
గుబ్బతిలంగఁ జూచె నలకూబర సన్నిభు నద్ధరామరున్  
నలకూబరనితో సమానమైన అందంగల ఆ బ్రహ్మణుణ్ణి (ధర+అమరున్) చూడగానే ఆశ్చర్యంతో ఆమె కళ్ళు విప్పారాయి ; కాంతిపెల్లుబ్బి కంటినల్లగ్రుడ్లు విచ్చిన (వికసిత) కలువపూవుల్లా అయ్యాయి (ఉత్పలపంక్తులని గ్రుమ్మరించాయి); గుండ్రనైన మిసమిసలాడే స్తనద్వయం (గుబ్బమెఱుంగు చన్గవ)  గగుర్పొడిచింది.  మదిలోన కోరికలు పెల్లుబికాయి (గుబ్బతిలంగన్).
ఎక్కడివాఁడొ యక్షతనయేందు జయంత వసంత కంతులన్
జక్కఁదనంబునన్ గెలువఁ జాలెడువాఁడు,  మహీసురాన్వయం
బెక్కడ యీ తనూవిభవ మెక్కడ యేలని బంటుగా మరున్
డక్కఁ గొనంగ రాదెయకటా! నను వీడు పరిగ్రహించినన్!
ఎక్కడివాడో! అబ్బ! ఎంత సౌందర్యం! నలకూబరుణ్ణి (యక్షతనయ), చంద్రుడ్ని (ఇందు), జయంతుడిని (ఇంద్రకుమారుడైన జయంతుణ్ణి) వసంతపురుషుణ్ణి, మన్మధుణ్ణి (కంతున్) అందంలో గెలవగలిగినవాడు! బ్రాహ్మణకులం ఎక్కడ? ఈ శరీరసంపత్తి (తనూ విభవము) ఎక్కడ?  అకటా, నన్ను ఇతడు పరిగ్రహిస్తే మన్మధుడిచేత వెట్టిచాకిరీ చేయించుకోనా!  అంటే మన్మధ సామ్రాజ్యాన్ని   జయించి దాని అధిపతి అయిన మన్మధుడి చేతనే బానిసలాగా వెట్టిచాకిరీ చేయించుకోనా, అని.
ఆ దివ్యాంగన ప్రవరుడి రూపలావణ్యాన్ని ఇలా వర్ణిస్తోంది:

వదన ప్రభూత లావణ్యాంబు సంభూత
     కమలంబు లన వీని కన్నులమరు
నిక్కి వీనులతోడ నెక్కసక్కెము లాడు
     కరణి నున్నవి వీని ఘన భుజములు
సంకల్ప సంభవాస్థాన పీఠిక వోలె
     వెడఁద యై కనుపట్టు వీని యురము
ప్రతిఘటించు చిగుళ్ళపై నెఱ్రవాఱిన
     రీతి నున్నవి వీని మృదుపదములు

నేరెటేటి యసల్ తెచ్చి నీరజాప్తు
సానఁబట్టిన రాపొడి చల్లి మెదిపి 
పదను సుధ నిడి చేసెనో పద్మభవుఁడు
వీనిఁ గాకున్నఁ గలదె యీ మేని కాంతి!

ఈ అందగాని కన్నులు ముఖ కాంతి అనే నీట పుట్టిన కమలాల లాగ ఉన్నాయి.  అతని ఎగుభుజాలు నిక్కి చెవులతో ఆటలాడుతున్నాట్టున్నయి.  ఇతని విశాల వక్షస్థలం మన్మధుడి సింహాసనంలాగ ఉంది.  పాదాలు ఎంత సుకుమారంగా వున్నాయంటే, నడుస్తున్నప్పుడు గడ్డి చిగుళ్ళు తగిలి కందిపోయాయి కాబోలు, బాగా  ఎఱ్రబారి ఉన్నాయి. 

ఆ బ్రహ్మదేవుడు జంబూనది (నేరెటి+ఏటి) యందలి బురద (అసల్) తెచ్చి  (జంబూనదిలోని అడుసు బంగారమని చెప్పబడింది), సూర్యుణ్ణి సానబట్టగా రాలిన పొడిని (రజను) అందులో జల్లి, కలయగలిపి, ముద్ద పాకానికి కావలసిన (పదను) తడిని, అమృతంతో కలిపి రంగరించి ఇతనిని చేశాడేమో ! లేకపోతే ఇంతటి శరీర కాంతీ, లావణ్యం ఎలా సాధ్యం ? 
ఇంకా -
సుర గరుడోరగ నర ఖే
చరకిన్నర సిద్ధ సాధ్య చారణ విద్యా
ధర గంధర్వకుమారుల
నిరతము గనుఁగొనమె పోలనేర్తురె వీనిన్?
దేవతలు (సుర) గరుడ (పక్షీంద్రుడైన గరుత్మంతుడు), నాగజాతి (ఉరగ), ఆకాశంలో సంచరించే దివ్యపురుషులు (ఖ అంటే ఆకాశం, దానిలో చరించేవారు ఖేచరులు), కిన్నర, సిద్ధ, సాధ్య, చారణ, విద్యాధర, గంధర్వ - వీరిలో యుక్తవయసులో ఉన్నవారిని (కుమారులన్), నిత్యం చూస్తూ ఉండనా? వారిలో ఎవరైనా వీనితో సరిపోలగలరే (పోలనేర్తురే)? అనుకుంది. 

ఇంతలు కన్నులుండఁ దెరు వెవ్వరివేఁడెదు భూసురేంద్ర! యే  
కాంతమునందు నున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించులా
గింతియ కాక నీ వెఱుఁగవే మును వచ్చిన త్రోవచొప్పు నీ
కింత భయంబు లే కడుగ నెల్లిద మైతిమెమాటలేటికిన్?

చెంపకి చారడేసి కళ్ళు పెట్టుకుని ఎవరినయ్యా దారి అడుగుతున్నావు? ఒంటరిగా ఉన్న జవరాలిని పలకరించే నెపం కాకపోతేను! నువ్వు వచ్చిన త్రోవ అప్పుడే మర్చిపొయావా?  ఇంత భయంలేకుండా అడగడానికి నేను నీకు చులకనగా కనబడుతున్నాను.

"భూసురేంద్రా"  అని సంబొధించింది.  బ్రాహ్మణులలో ఇంద్రునివంటి వాడా అని.  నేను అప్సరసని - నీవు ఇంద్రుడివి.  చక్కటి కన్నులతో ఉన్నావు.  నీ ఆందం నాకు నచ్చింది.  జవరాలిని.  యుక్తవస్సులో ఉన్నదానిని.  ఒంటరిగా ఉన్నాను.  అన్ని సూచనలనిచ్చింది.  ఇంక మాటలెందుకు - నేను నీకు భోగ్యురాలిని - అని నర్మగర్భంగా పలికింది. 

ఇంకా అతడు తనని సామాన్యురాలిగా తలచకూడదని ఇలా చెప్పింది. 



చిన్ని వెన్నెలకందు వెన్ను దన్ని సుధాబ్ధిఁ
     బొడమిన చెలువ తోఁబుట్టు మాకు
రహి పుట్ట జంత్ర గాత్రముల ఱాల్ గరఁగించు
     విమల గాంధర్వంబు విద్య మాకు
ననవిల్తు శాస్త్రంపు మినుకు లావర్తించు
     పని వెన్నతోడఁ బెట్టినది మాకు
హయమేధ రాజసూయము లనఁ బేర్పడ్డ
     సవనతంత్రంబు లుంకువలు మాకుఁ

గనకనగ సీమఁ గల్పవృక్షముల నీడఁ
బచ్చరాచట్టుగమి రచ్చపట్టు మాకుఁ
బద్మసంభవ వైకుంఠ భర్గ సభలు
సాముగరిడీలు మాకు గోత్రామరేంద్ర.

ఓ భూసురోత్తమా !  పాల సముద్రంలో (సుధాబ్ధిన్) బాల చంద్రుని  (చిన్ని వెన్నెలకందు) వెనుకనే ప్రభవించిన అందగత్తె (చెలువ) - సాక్షాత్తూ లక్ష్మీదేవి - మాకు తోబుట్టువు; వీణ మొదలైన జంత్రవాయిద్యాలచేతనూ, కంఠగానం (గాత్ర) తోనూ బాగా రక్తి కలిగించే గొప్ప సంగీత విద్య మా గంధర్వుల సొత్తు; కామశాస్త్రపాఠాలని (మినుకులు - పలుకులు; ఆవర్తించడం - వల్లెవేయడం) బాల్యంలోనే వెన్నతో పాటు మాకు వంటబడతాయి.    
అశ్వమేధం, రాజసూయం లాటి గొప్ప యఙ్ఞాలు చేసినవాళ్ళకి మాత్రమే మేం దక్కుతాం. ఆ యఙ్ఞఫలాలే వాళ్ళు మాకు ఇచ్చే కట్నాలు (ఉంకువలు).
మేరుపర్వతం (కనక నగ సీమ), కల్పవృక్షాల నీడలో పచ్చఱాళ్ళ చరియలపై మేము కూటమి తీరుస్తాం.  బ్రహ్మ, విష్ణు మహేశ్వరుల సభలు మాకు నాట్యశాలలు.  అంత గొప్పదాన్ని సుమా !

ఎక్కడియూరు కాల్ నిలువకింటికిఁ బోయెద నంచుఁ బల్కెదీ
వక్కటమీకుటీరనిలయంబులకున్ సరిరాకపోయెనే
యిక్కడి రత్నకందరము లిక్కడి నందన చందనోత్కరం
బిక్కడి గాంగసైకతము లిక్కడి యీ లవలీ నికుంజముల్     

ఊరు, ఊరని పలవరిస్తున్నావు.  అదేం ఊరయ్యా?  కాలునిలబడకుండా ఉంది! ఇంటికిపోతానంటావు.  ఇక్కడి మా మణిమయములైన గుహలూ, ఈ ఉద్యానాములందలి మంచి గంధపుచెట్ట్లూ, ఇక్కడి గంగానది యొక్క ఇసుకతిన్నెలూ, వెన్నెల తీగెల పొదరిళ్ళూ, మీ గుడిసెకొంపలకి సరిరాక పోతున్నాయా? 

అంధునకు గొఱయె వెన్నెల
గంధర్వాంగనల పొందు గాదని సంసా
రాంధువునఁ బడియె దకటది
వాంధము వెలుఁగు గని గొంది నడఁగిన భంగిన్.

అయ్యో (అకటా)!  గ్రుడ్డివానికి వెన్నెల ఎలా  పనికి వస్తుంది? గంధర్వాంగననైన నాతో సంభోగం కాదని సంసారమనే నూతిలో (సంసార+అంధువునన్) పడతానంటావేమిటి - పగటిపూట వెలుతురు చూడలేని గుడ్లగూబ (దివాంధము) కలుగులో (గొందిన్) దూరి దాక్కు న్నట్లు (అడగిన భంగిన్)?

ప్రాంచద్భూషణ బాహుమూలరుచితోఁ బాలిండ్లు పొంగార బై 
యంచుల్ మోవఁగఁ గౌగలించి యధరం బాసింప "హా! శ్రీహరీ"
యంచున్ బ్రాహ్మణుఁ డోరమో మిడి తదీయాంసద్వయం బంటి పొ
మ్మంచున్ ద్రోచెఁ,  గలంచునే సతులమాయల్ ధీరచిత్తంబులన్

మోహం ఉప్పొంగగా, వరూధిని ప్రవరుని కౌగిలించి ముద్దుపెట్టుకోబోగా, అతడు "హా, శ్రీ హరీ!" అంటూ పెడమొహంతో (ఓరమోమిడి)  "పో" అని తన మునివ్రేళ్ళతో ఆమెభుజాల్ని - త్రోయడానికి ఎంత అవసరమో అంతమాత్రమే వ్రేళ్ళు ఆనించి అని - త్రోసేశాడు.  స్త్రీల కపటకృత్యాలు ధీర చిత్తులయిన వారి మనస్సులని కలత పెట్టగలవా? లేవు అని అర్థం. 

వెలిపెట్టిరే బాడబులు పరాశరుఁ బట్టి
     దాశకన్యాకేళిఁ దప్పుసేసి
కులములో వన్నె తక్కువ యయ్యెనే గాధి
     పట్టికి మేనక చుట్టఱికము
ననుపుకాఁడై వేల్పు నాగవాసముఁ గూడి
     మహిమ గోల్పడియెనే మాందకర్ణి
స్వారాజ్య మేలంగ నీరైరె సుర లహ
     ల్యా జారుఁడైన జంభాసురారి

వారికంటెను నీమహత్త్వంబు ఘనమె
పవన పర్ణాంబు భక్షు లై నవసి యినుప
కచ్చడాల్ గట్టుకొను ముని మృచ్చులెల్ల
తామరస నేత్రలిండ్ల బందాలు గారె.

యేమయ్యా, పరాశరుడు దాశరాజు కూతురు సత్యవతితో కూడినందుకు మీ బ్రాహ్మణులు ఏమైనా అతన్ని తప్పుబట్టి వెలివేశారా?  మేనకరితో చుట్టరికం పెట్టుకున్నందుకు విశ్వామిత్రుడికి కులంలో వన్నెతగ్గిందా?  అనేకమంది అప్సరసల మేళంతో సంభోగించినా మాందకర్ణి తన మహిమ ఏమాత్రమైనా కోల్పోయాడా?  అహల్యకోసం విటుడుగా మారిన ఇంద్రుణ్ణి దేవతలు స్వర్గలోకం ఏలనీయం అన్నారా?  లేదే?  

వాళ్ళందరికన్నా నువ్వు గొప్పవాడివా?  గాలి (పవన) ఆకులు (పర్ణ) నీరు (అంబు) మాత్రమే సేవించి కృశించిపోయి, ఇనుపగోచీలని (ఇనుప కచ్చడాల్) కట్టుకొనే దొంగమునులందరూ, మా అందగత్తెల ఇళ్ళలో బందీలుగా పడిఉండేవారే కదా !! 

దానజపాగ్ని హోత్ర పరతంత్రుఁడనేని భవత్పదాంబుజ
ధ్యానరతుండనేనిఁ బరదార ధానాదులఁ గోరనేని స
న్మానముతోడ నన్ను సదనంబున నిల్పు మినుండు పశ్చిమాం
భోనిధి లోనఁ గ్రుంకకయ మున్న రయంబున హవ్యవాహనా.

యఙ్ఞ్జయాగాదులనుండి హవిస్సుల్ని తీసికువెళ్ళే ఓ అగ్నిహోత్రుడా (హవ్యవాహనా)!  దాన జప అగ్నిహోత్రములకు నేను అధీనుడనైతే, సదా నీ పాద పద్మములయొక్క ధ్యానమందు ఆసక్తికలవాడనైతే, పరుల భార్య-దనాదులను నేను ఎన్నడూ కోరనివాడనైతే, సగౌరవంగా (కామ మోహిత అయిన ఈ వరూధినిచే అగౌరవం పాలవకుండా), సూర్యుడు (ఇనుడు) పడమటి సముద్రంలో (పశ్చిమాంభోనిధిలోనన్) క్రుంకకముందు నన్ను ఇల్లు చేర్చు తండ్రీ - అని ప్రార్థించాడు.

సూర్యాస్తమయ వర్ణన -

శ్రేణుల్ గట్టి నభోంతరాళమునఁ బాఱెన్ బక్షులుష్ణాంశు పా
షాణ వ్రాతము కోష్ణమయ్యెమృగతృష్ణా వార్థు లింకెన్ జపా
శోణం బయ్యెఁ బతంగ బింబము దిశాస్తోమంబు శోభాదరి
ద్రాణంబయ్యెఁ సరోజషండములు నిద్రాణంబులయ్యెన్ గడున్

పక్షులు బారులు తీరి ఆకాశ మధ్యభాగానికి (నబోంతరాళంబునన్) పరిగెట్టయి - ఎగిరాయి.  సూర్యకాంత శిలాసముదాయం  (ఉష్ణాణంశు పాషాణవ్రాతము) నులివేడి (కోష్నము) కలవిగా అయింది. మధ్యాహ్నానికి వేడెక్కిన సూర్యకాంతపురాళ్ళు చల్లబడ్డాయి అని.  సముద్రంలాగా అంతులేనట్టు కనబడే ఎండమావులు (తుష్ణావార్థులు) ఇంకిపోయాయి.  సూర్యమండలం (పతంగ బింబం) జపాకుసుమం - దాసానిపువ్వు - లాగ ఎఱ్రగా అయింది.  దిక్కుల సమూహం (దిశాస్తోమంబు) కాంతిచే పేదఱికం చెందింది (శొభాదరిద్రాణంబు అయ్యెన్).  అంటే అన్ని దిక్కులా కాంతి తగ్గి చీకటి పడడం మొదలయింది.  పద్మసమూహాలు (సరోజ సండములు) బాగా (కడున్)  ముకుళించాయి (నిద్రాణంబు).  అంటే ప్రొద్దుక్రుంకు సమయం అయింది.

ఇరుట్లు (చీకటి) వర్ణన -

మృగనాభి పంకంబు మెయినిండ నలదిన
     మాయాకిరాతు మై చాయఁ దెగడి
నవపింఛ మయ భూషలవధరించి నటించు 
     పంకజాక్షుని చెల్వు సుంకమడిగి
కాదంబ నికురుంబ కలిత యై ప్రవహించు
     కాళింది గర్వంబుఁ గాకు సేసి
తాపింఛ విటపి కాంతార సంవృతమైన
     యంజనాచల రేఖ నవఘళించి

కవిసె మఱియును గాకోల కాల కంఠ
కంఠ కలకంఠ కరి ఘటా ఖంజరీట
ఘన ఘనా ఘన సంకాశ గాఢకాంతిఁ
కటిక చీకటి రోదసీ గహ్వరమున

అర్జునుడికి పాశుపతాస్త్రం ప్రాదించిన సమయంలో, మాయా కిరాతుడి రూపంలో వచ్చిన శివుడు ఒళ్ళంతా కస్తూరి (మృగనాభి) అలముకున్నప్పుడు కలిగిన నల్లటి ఒంటి రంగు,  నెమలిపింఛమునలంకరించుకున్న కృష్ణుడు, నల్లని హంసలను కలిగిన యమునా నది, చీకటి చెట్లతోపులు (తాపించ విటపి కాంతార) గల కాటుకకొండ (అంజనాచలం), మాలకాకులు (కాకోల), నెమిళ్ళమెడలతో (కాలకంఠ కంఠ), ఏనుగుమంద (కరిఘటా), కాటుక పిట్టలతో (ఖంజరీట), కాఱుమబ్బులు (ఘన ఘనా ఘన)- వీటంతటి కాఱు నలుపుని మించిన నలుపుతో కటికచీకటి జగమంతా కమ్ముకుంది.


కలయ జగమునఁ గలయట్టి నలుపులెల్ల
దెలుపులుగఁజేసి నీడలు దెలుపు సేయఁ
గా వశము గామిఁ బొడము దుఃఖమునఁ బోలె
సాంద్ర చంద్రిక తుహిన బాష్పములు గురిసె

వెన్నెల తాను జగమునందలి నల్లని పదార్థాలన్నిటినీ తెల్లగాచేసికూడా, నీడలని మాత్రం తెలుపుచేయడానికి శక్యం కాకపోవడంతో (వశము గామిన్), జనించిన దుఃఖంతో కబోలునన్నట్లు మంచు చినుకులు (తుహిన బాష్పములు) కురిసాయి. 

వరూధిని విరహ పరాకాష్ట -

వరూధిని ప్రవరుడి కోసం బహువిధములైన విరహ బాధలననుభవించింది.  ఆ విరహం  పరాకాష్టకి చేరుకుంది.


చనుగవఁ గప్పు దొలగ వాసన గాలి కెదురేఁగుఁ
     బరు వొప్ప నలుగుల బాఱు కరణి
నిడుద వేనలి నూనె ముడి వీడఁ జిగురాకు
     బొదఁ దూఱుఁ గార్చిచ్చుఁ గదియు కరణిఁ
బసిడి గాజులు పైకి వెసఁద్రోచి నునుఁదీగఁ
     దెమలించు నురిత్రాడు నెమకు కరణి
మొలనూలు బిగియించి వెలది వెన్నెలఁ జొచ్చుఁ
     బిఱుదీయ కేటిలో నుఱుకు కరణి

జడియ దళులకుఁ గురియు పుప్పొడుల మునుఁగు
మావికడ నిల్చు విరుల నెత్తావిఁ గ్రోలు
విషమ సాయకునేఁపుల విసివి విసివి
తనువుఁ దొఱగంగ దలఁచి యవ్వనరుహాక్షి.

ఇది విరహావస్థలో "మృతి" అనే చివరి మన్మథావస్థ. ఈ స్థితికి చేరుకున్న వరూధిని విరహం తట్టుకోలేక చేసిన మరణ ప్రయత్నం అభివర్ణింపబడింది.

ఆమె మన్మథుడు వేసిన పుష్పబాణాలచే (విషమ సాయకు తూపులన్) విసిగి విసిగి, శరీరాన్ని విడిచిపెట్టెయ్యడానికి (తనువు తొఱగంగన్) నిశ్చయించుకుని, పైట తొలగిపోయినా, పరుగున పరుగున సువాసనలు వెదజల్లే గాలికి ఎదురేగుతోంది.  అటునుంది వచ్చేవి మన్మథుడు వదులుతున్న పూల బాణాలు; ఆ పూలబాణాలు సువాసనలు వెదజల్లుతూ ఈమె కేసి వస్తున్నాయి - ఇటునుండి ఈమె ఆ బాణాలకేసి వేగంగా - శరీరత్యాగానికి కూడా వెనుకాడకుండా - ఆ బాణాలకేసి దూసుకు వెళ్తోంది. 

దావాగ్ని (కార్చిచ్చు) చేరబోవు విధంగా (కదియు కరణిన్) పొడవైన (నిడుద) జడ తో వేసిన సిగయొక్క (వేనలి) ముడివీడిపోగా, చిగురాకు పొదలలోకి దుముకుతుంది. (విరహిణి మతిచలించి చనిపోదామని చిగురుటాకుల రాశి అగ్నిగుండమని భ్రమించి దూకింది).

బంగారుగాజులు పైకి త్రోసుకొని, లతలని ఉరిత్రాడుగా పెనవేసుకుంటుంది.  మొలత్రాటిని బిగించుకుని, సముద్రంలో దూకుతున్నట్టు వెన్నెలలో జొరబడుతుంది. తుమ్మెదలకి (ఆళులకి) భయపడదు.

రాలే పుప్పొడులలో మునుగుతుంది.  మామిడిచెట్టు వద్ద నిలిచి పూవులనిండు పరిమళాన్ని గ్రోలుతుంది.

గంధర్వుడు మాయా ప్రవరుడిగా అవతరించాడు.

అర్ధచంద్రుని తేట నవఘళించు లలాట
     పట్టి దీర్చిన గంగ మట్టి తోడఁ
జెక్కుటద్దములందు జిగివెల్లువలు చిందు
     రమణీయ మణికుండలముల తోడఁ
బసిఁడి వ్రాఁత చెఱంగు మిసిమి దోఁపఁ జెలంగు
     నరుణాంశుకోత్తరీయంబు తోడ
సరిలేని రాకట్టు జాళువా మొలకట్టు
     బెడఁగారు నీర్కావి పింజె తోడ

ధవళ ధవళము లగు జన్నిదముల తోడఁ
గాశికాముద్ర యిడిన యుంగరము తోడ
శాంతరస మొల్కు బ్రహ్మతేజంబు తోడఁ
బ్రవరుఁదయ్యె వియచ్చర ప్రవరుఁడపుడు

అర్థచంద్రుణ్ణి తిరస్కరించే నుదిటిమీద గంగమట్టిని తిలకంగా దిద్దుకున్నాడు.  అద్దాల్లాటి బుగ్గల మీదకి కాంతులుచిందే అందమయిన మణులతో చెక్కిన కుండలాల్ని ధరించాడు.   బంగారుపనితనంతో అంచులు మిసమిసలాడుతున్న, ఎఱ్రని రంగుగల ఉత్తరీయం మీద వేసుకున్నాడు.  వెలలేని రత్నాలతో పొదిగిన బంగారు మొలత్రాడు (జాళువా మొలకట్టు) కట్టుకున్నాడు.  అందమైన కావిరంగు (నిత్యం ఉతికి ఆరవేసుకోడం వల్ల కావిరంగు తేలింది) పంచె కట్టుకున్నాడు.  అతితెల్లటి యఙ్ఞోపవీతం ధరించాడు. వేలికి కాశీముద్రవున్న ఉంగరం పెట్టుకున్నాడు.  శాంతరసం ఒలికే బ్రహ్మతేజస్సుతో  వెలిగిపోతూ - ప్రవరుడి రూపంతో నిలిచాడు ఆ గంధర్వశ్రేష్టుడు (వియచ్చరప్రవరుడు).


కాంచి కలక్వణత్కనక కాంచిక యై యెదురేఁగి యప్పు డ
క్కంచన కేతకీ కుసుమ గాత్రి వయస్యలడించి తన్నికుం
జాంచల వీధిఁ దాఱుచు ఘనాంత చలచ్చపలాకృతిన్గలన్
గాంచిన వస్తువున్ దెలిసి గాంచినయట్లనురక్తిఁ గాంచుచున్

పసిమి మొగలిపువ్వులాంటి మేనుఛాయగల వరూధిని ఆ కపట బ్రాహ్మణుడైన మాయాప్రవరుణ్ణి చూచి (కాంచి) - అతడు అసలు ప్రవరుడనే ఆమె  అనుకుంది - మొలకు కట్టుకున్న మువ్వల వడ్డాణం అవ్యకమధురంగా ధ్వనులు (కనత్ కనక కాంచితయై) చేస్తుండగా,  చెలికత్తెలని విడిచి, తానే వంటరిగా (ఎదురేగి), అతడు ఉన్నచోటున వున్న పూపొదలసమీపంలో (తత్ నికుంజ + అంచల వీధిన్) తాపీగా నడుచుకుంటూ (తారుచున్), కలలోచూసిన వస్తువుని మెలకువ వచ్చాకా చూసినట్టు (కలన్ కాంచిన వస్తువున్ తెలిసి కాంచినయట్లు), అతనినే ప్రేమపూర్వకంగా (అనురక్తిన్) చూసింది.



పలాశిడాసి రాజుఁజూచి పల్కె నోరి నోరికీ
పొలానఁ బెన్పొలాన లేకపోవ నీవు దోచితౌ
బలా, బలాలితోడఁ బాలఁబట్టి బిట్టుచుట్టి నిన్
హళాహళిన్ హలాహలాభయౌ బుభుక్షఁ దీర్చెదన్

మాంసభక్షకుడైన (పలాసి) ఆ రాక్షసుడు సమీపించి (డాసి) రాజుని చూసి ఇలా అన్నాడు (పల్కెన్).  ఓరీ, ఈ వనంలో (పొలానన్) నా నోటికి (నోరికి), పెనుమాంసం (పెన్ పొల) తినడానికి (ఆనన్), లేకపోయిన ఈ సమయంలో (లేకపోవన్), నువ్వు కనపడ్డావు (తోచితి); ఇది నాకు తగును (ఔ);  భలే (బలా).  నీ సైన్యంతో సహా (బల + ఆలి తో), ఈ బాలికని (బాలన్) పట్టుకొని (పట్టి), ఇప్పుడే, వడిగా (బిట్టు), నిన్నుకూడా చుట్టబెట్టి (నిన్ చుట్టి), ఆత్రంతో (హళా హళిన్) హాలాహలంలాంటి (హలా హలాభయౌ), ఆకల్ని (బుభుక్ష) తీర్చుకుంటాను (తీర్చెదన్).

ఇందీవరాక్షుడు చాటుగా అదృశ్యరూపంలో ఆయుర్వేదవిద్యని నేర్చుకొన్నాడు.  తరవాత గురువుగారి దగ్గఱకి వెళ్ళి  అపహాస్యం చేసినప్పుడు.    నీచపు బిచ్చపు మునీ (కష్ట ముష్టింపచా) అని ధిక్కరించాడు. 

అనినన్ గన్నులు జేవురింప నధరం బల్లాడ వేల్లత్పునః
పునరుద్యద్భ్రుకుటీ భుజంగ యుగళీ ఫూత్కార ఘోరానిలం
బన నూర్పుల్ నిగుడన్, లలాట ఫలకం బందంద ఘర్మాంబువుల్
చినుకన్, గంతు దిదృక్షు రూక్షనయన క్ష్వేళాకరాళ ధ్వనిన్
    
ఇందీవరాక్షుడు అలా ప్రేలగానే, బ్రహ్మమిత్రుడనే ఆ మునికి కన్నులు ఎఱ్రపడిపోయాయి.  పెదవులు కోపంతో కంపించాయి (అల్లాడన్). వ్రేళ్ళాడు తున్న  (వేల్లత్), గుబురుగా ఉన్న,  కనుబొమలు (భ్రుకుటి) మాటిమాటికీ (పునః పునః), ఎగిరిపడ్డాయి (ఉద్యత్).  సర్పద్వయంలా (భుజంగ యుగళీ) బుసకొట్టినట్టు (ఫూత్కార) భయంకరమైన (ఘోర) గాలియా అన్నట్టు (అనిలంబు అనన్) శ్వాశ (ఊర్పులు) వదలుతూ, ఆ నిట్టూర్పులు అంతకంతకు ఆవేశం వల్ల ఎక్కువైపోయాయి  (నిగుడన్).  నుదిటిమీద అక్కడక్కడ (అందంద) చెమటబిందువులు (ఘర్మాంబువుల్) చినుకగా - ఒక భయంకరమైన అరుపు అరిచాడు.  ఆ బొబ్బ ఎలాఉందంటే, మన్మధుణ్ణి (కంతు) తన కోపపుచూపుతో (దిదృక్షు) వేడికన్నుగల (రూక్షనయన) పరమశివుడు చేసిన సింహనాదంలాటి (క్ష్వేళా) భీతిని  కలుగచేసేటటువంటి (కరాళ), మహాశబ్దం (ధ్వనిన్) అలాటి ధ్వని ఈ ముని నోటివెంట వచ్చింది. 

వెంటనే ఇందీవరాక్షుణ్ణి బ్రహ్మరాక్ష్సుడవైపొమ్మని శపించాడు.


మునిశాపప్రభావం వల్ల క్రమేపీ తనకి బ్రహ్మరాక్షస లక్షణాలు ఎలా వచ్చాయో ఇందీవరాక్షుడు స్వరోచి కి ఇలా చెబుతున్నాడు.

అభ్రమండలి మ్రోచునందాక నూరక
     పెరిగినట్లౌ మేను నరవరేణ్య
యవధి భూధర సానువందాక నూరక
     పఱచినట్లౌ మేను పార్థివేంద్ర
యబ్జ భూ భవనంబునందాక నూరక
     యెగసినట్లౌ మేను జగధదీశ
యహిలోక తల మంటునందాక నూరక
     పడినయట్లౌ మేను ప్రభువతంస

యఖిల జగములు మ్రింగునంతాకలియును
నబ్దులేడును జెడగ్రోలునంత తృషయు
నచల చాలన చణమైన యదటుఁ గలిగె
నసురభావంబు ననుఁ జెందు నవసరమున

స్వరోచి వనదేవత ద్వారా ఒక కుమారుణ్ణి కన్నాడు.

కాంచెన్ బుత్రు విశాలనేత్రుఁ బృథువక్షః పీఠి విభ్రాజితున్
బంచాస్యోద్భట శౌర్యధుర్య ఘన శుంభద్బాహుఁ దేజోనిధిం
బంచాస్త్ర ప్రతిమాను మాన ఘను సామ్రాజ్యైక హేతు ప్రభూ
తంచల్లక్షణ లక్షితున్ సుగుణ రత్నానీక రత్నాకరున్

విశాలమైన కళ్ళు, వెడదఱొమ్ము, సింహపరాక్రమమం, మన్మధుణ్ణిమించిన సౌందర్యం, సార్వభౌమలక్షణాలూ, సకలసద్గుణసంపన్నుడూ, అభిమానధనుడూ అయిన కుమారుడు జన్మించాడు.

అతడే స్వారోచిషమనువు.
ఇదీ ఆంద్ర కవితాపితామః అల్లసాని పెద్దనామాత్యుడు రచించిన  “స్వరోచిషమనుసంభవమ్” అనే ప్రబంధం.
తెలుగు భాష లాలిత్యం, సౌకుమార్యం తెలియాలంటే "మనుచరిత్ర" చదవాలి  అని పెద్దలంటారు.   చతుర్దశ (పధ్నాలుగు) వర్ణనలు కలిగి, ఆఱు ఆశ్వాసాల ఈ ప్రబంధ రత్నం, 750 పైగా పద్య-గద్య-వచనాలతో ఒక కళాఖండంగా వెలిసింది.   తెలుగు భాష ఉన్నంతకాలం అల్లసాని పెద్దనామాత్యుని పేరు ఈ భూమీద సుస్థిరంగా ఉంటుందనడానికి సందేహం లేదు. 

శుభం !!

No comments:

Post a Comment

Pages