అమ్మ - అచ్చంగా తెలుగు

అమ్మ

-భండారి శైలజ

గర్భమనే లోకం లో....... బొమ్మను చేసి,ప్రాణం పోసి....... నవమాసాలు మోసి,ఒక రూపం ఇచ్చి....... ప్రసవమనే ప్రళయాన్ని దాటుతూ...... మరణం అంచుల దాకా చేరి..... మరలా నీకై పునర్జన్మించే పునర్జీవి “ అమ్మ”. జీవితపు పుటల్లో నిక్షిప్తం అయిన “బొమ్మ”. ఒక మధురమైన మరపురాని జ్ణాపకాల “చెమ్మ”. అమ్మతనం ఆభరణమైన అతివ.. పొత్తిళ్లలో తన ప్రతిరూపానికి జోల పాడుతుంది. గర్భం లో వటపత్రశాయివై ఊయలలూగుతూ..... అమ్మ ఒడిలో పసిపాపాయివై జోలపాటల్లో తేలుతూ..... తన రుధిరమే అమృతధారలుగా...... నీకు ఊపిరులూదగా.... ఇంతింతై వటుడింతై ఎదిగి పోయేవు. నీ చిట్టి పాదాలు ... గర్భవాసాన తన్నినా.... పొత్తిళ్లలో శయనించి తన్నినా... మురిపాల ముత్యాలుగా మురిసిపోతుంది. నీ చిన్ని కళ్లలో కోటి నక్షత్ర కాంతులను......... నీ బోసి నవ్వుల్లో విశ్వరూప సందర్శనాలను....... నీ లేత చేతుల్లో కృష్ణమాయలను...... రతనాల రాశులుగా మైమరచిపోతుంది. చిరు ప్రాయం లో---- గోరు ముద్దలు..... జోలపాటలు.... చిన్నారి కథలు...... చిలిపి అల్లర్లు.... మందలింపులు..... యవ్వన ప్రాయం లో---- సలహాలు....... సూచనలు........ ఒక మంచి స్నేహితురాలు...... ఒక మార్గదర్శకురాలు......... కరుణించిన దేవత అయి.... ఎన్నెన్నో రూపాలు,మరెన్నో వరాలు.... నిన్ను ఋణానుబంధం లో ముడివేస్తూ......... దేవుడెప్పుడూ భరోసాగానే ఉంటాడట... ఎందరో తల్లులు లోకానికి రక్షగా ఉన్నారంటూ..... అమ్మ చేతి ప్రతి స్పర్శ లో.. శతాయుష్మానభవ ఆశీర్వచనాలేనంటూ...... తడబడుతూ పడే నీ తొలి అడుగులోనూ....... జీవిత పర్యంతం సాగిపోయే... నీ ప్రతి అడుగులోనూ.......... అనుక్షణం ఆరాటపడే అనుబంధం అమ్మ. అమ్మంటే -- మధురం. అమ్మ ప్రేమ ---మధురాతి మధురం.

No comments:

Post a Comment

Pages