'రమణించిన' బాపు - తనికెళ్ళ భరణి - అచ్చంగా తెలుగు

'రమణించిన' బాపు - తనికెళ్ళ భరణి

Share This

'రమణించిన' బాపు

( తనికెళ్ళ భరణి గారితో ప్రత్యేక టెలిఫోన్ ముఖాముఖి)

- భావరాజు పద్మిని

ప్రఖ్యాత సినీ రచయత, నటులు, దర్శకులు, శివభక్తులు శ్రీ తనికెళ్ళ భరణి గారు, బాపు గారితో తన అనుభవాల్ని ఫోన్ లో మాతో పంచుకున్నారు. “అచ్చంగా తెలుగు” పత్రిక పాఠకుల కోసం ప్రత్యేకించి ఆయన మనసులోని మాటలు ... అక్షర మాలికగా గుచ్చి అందిస్తున్నాము. చదవండి... బాపు గారితో మీ మొదటి పరిచయం గురించి చెప్తారా ? చిన్నప్పటి నుంచి బాపుగారంటే అపారమైన ఇష్టం. నేను కూడా చిన్న చిన్న బొమ్మలు వేస్తుండే వాడిని, బొమ్మలంటే నాకు ఇష్టం. అప్పట్లో(35 సం. క్రితం) ఆంధ్రపత్రికలో పోడూరి కౌసల్యాదేవి, యద్దనపూడి సులోచనారాణి వంటి వారి నవలలు జీవనతరంగాలు, చక్రభ్రమణం, శంఖుతీర్ధం లాంటివి సీరియల్స్ గా వస్తుండేవి. వాటికి బాపు గారు బొమ్మలు వేస్తుండేవారు. ఆ సీరియల్స్ అంటే ఆడవాళ్ళకు పెద్ద క్రేజ్ !మేము విజయవాడ లో రైల్వే క్వార్టర్స్ లో ఉండే కాలంలో మా వదిన ఆ బొమ్మలు అన్నీ కట్ చేసి, ఒక పుస్తకంగా తయారుచేసేది. అవన్నీ చూస్తుండేవాడిని. బాపు గారంటే యెంత ఇష్టమంటే ఒక దశలో పచ్చబొట్టు కూడా పొడిపించుకోవాలని అనుకునేవాడిని. మా గురువుగారు రాళ్ళపల్లి గారు. 35 సం.క్రితం నేను ఇండస్ట్రీ కి రాకముందు చెన్నై వెళ్ళినప్పుడు బాపు గారిని కలవాలని ఆయన్ను అభ్యర్ధిస్తే తీసుకువెళ్ళారు. మొదటి పరిచయంలో ,నేను ఆయన కాళ్ళకు దణ్ణం పెడితే, ఆయన నా కాళ్ళకు దణ్ణం పెట్టారు. ఆయనకు పొగడ్తలు, దణ్ణాలు, ఎక్కువసేపు మాట్లాడడాలు వంటివి గిట్టవు. నేను కంగారు పడిపోతే , ఆయన ‘తప్పేముందండీ, మీరు నాకు పెడితే నేను మీకు ఎందుకు పెట్టకూడదు ?’ అని అడిగారు. సినిమాల పరంగా బాపు గారితో మీ పరిచయం గురించి చెప్తారా? మొదటి పరిచయం తర్వాత వ్యక్తిగత పరిచయం, ఆయన సినిమా పెళ్లి పుస్తకంలో వేషం వెయ్యడం, అది ఎడిటింగ్ లో తీసేసి, ‘చాలా బాగుందని, మేమే ఉంచేసుకున్నాము ,’అని నాకు కబురుచెయ్యడం జరిగింది. పెళ్లి జరిగాకా నేను వచ్చి ఒక పెద్ద లెంతీ డైలాగ్ చెప్తాను. లెంగ్త్ ఎక్కువ అవడంతో ఆ సన్నివేశం సినిమా నుంచి తొలగించారు. అప్పుడు జరిగిన ఒక అద్భుతమైన సంఘటన ఇక్కడ ప్రస్తావించాలి. పద్మాలయాలో 25 ఏళ్ళ క్రితం షూటింగ్ జరుగుతోంది. రమణ గారు వెళ్ళగానే నన్ను పిలిచి, సీన్ అంతా చెప్పారు. రాజేంద్రప్రసాద్ శోభనం గదిలో ఉంటాడు, నువ్వెళ్ళి డిస్తుర్బ్ చేసి, డబ్బులు అడిగి, కొన్ని డైలాగ్ లు చెప్పాలి. అయితే ఇది బ్రాహ్మణుడి వేషం కనుక, సందర్భానుసారంగా కొన్ని మంత్రాలు అవీ కూడా చెప్తే బాగుంటుంది, అన్నారు. ఒక సగం రోజు పని కూడా లేదు. 2,3 గంటల పని , షూటింగ్ అయిపోయి డ్రెస్ మార్చుకుని వచ్చాను. ఈ లోపల బాపు గారు ఒక కవర్ తీసి నా చేతిలో 10,000 రూ. చెక్ పెట్టారు. అప్పట్లో అది చాలా పెద్ద అమౌంట్. ఆ రోజుల్లో మొత్తం సినిమా చేసినా అంత డబ్బు ఇచ్చేవారు కాదు. “ఇంత డబ్బు ఎందుకండి ? మీ సినిమాల్లో వేషం వెయ్యడంతోనే నా జన్మ ధన్యమైనట్లు భావిస్తాను. ఒక్క రూపాయి ఇవ్వండి చాలు, దాని మీద బాపురమణ అని రాసి భద్రంగా పెట్టుకుంటాను”అన్నాను. ఆయన వినలేదు ...లేదు లేదు, “రమణ గారు అట్లా ఒప్పుకోరు” అన్నారు బాపు తెలివిగా . నేను బయటకు వచ్చేస్తుండగా రమణ గారు కబురు చేసి, మరో కవర్ ఇచ్చారు. “బాపు గారి వద్ద తీసుకున్నానండి... దానికే నేను సిగ్గుతో చచ్చిపోయి ఉన్నాను“ అన్నాను. అబ్బెబ్బే, అది నటనకండీ, ఇది రచనకు. ఏవో శ్లోకాలు, మంత్రాలు అవీ రాసారు కదండీ ,సాయం చేసారు కదా, ఒక రచయత అయ్యుండి ,తోటి రచయతకు ఎలా ద్రోహం చెయ్యమంటారు ? అన్నారు. కష్టపడి చేసిన సినిమాలకే డబ్బు రాని రోజుల్లో, ఒక్క సీన్ కి రెండు చెక్ లు ఇచ్చారు. అటువంటి మహానుభావులు వాళ్ళు. ఈ ప్రపంచంలో ఇటువంటి మంచివాళ్ళు కూడా ఉంటారా అని, ఆ సంఘటన తలచుకుంటేనే దుఃఖం వస్తోంది. నా కళ్ళు చెమరుస్తున్నాయి. ఇక్కడే ఒక తమాషా జరిగింది. “చాలా మంచి తెలుగుదనం ఉట్టి పడుతోందండి... “ అన్నాను చెక్ చూసి బాపు గారితో. “అబ్బే, తెలుగు ధనమేం కాదండీ, మార్వాడీ ధనమేనండి... “అన్నారు.ఆ తర్వాత మిష్టర్ పెళ్ళాం లో విలన్ గా చేసాను. టీవీ మహాభారతంలో కలిపురుషుడి వేషం వేసారు కదా, ఆ వివరాలు చెప్తారా ? కొన్నాళ్ళకు వారు జోక్స్ అంటే టీవీ కార్టూన్స్ తీస్తుండగా నేను వారితో కలిసి 2,3 బిట్స్ చేసాను. అనుబంధం బాగా పెరిగాకా, మహాభారతం తీసే కాలంలో నాకు కబురు వచ్చింది. అందులో నాకు కలిపురుషుడి వేషం ఇచ్చారు. అప్పటికి నేను టీవీ లో పని చెయ్యలేదు, కాని బాపు గారి కోసం నేను సినిమా వదులుకుని మరీ ఆ వేషం వేసాను. రామోజీ ఫిలిం స్టూడియో లో ఈ షూటింగ్ జరుగుతోంది. అప్పట్లో తార వంటి హోటల్స్ నిర్మాణం జరుగుతోంది. బాపు గారు వెళ్ళడం, రావడం ఎందుకని అక్కడే ఉండేవారు, నేనూ ఉండేవాడిని. ఇంటికి వెళ్తున్నప్పుడు “మీకు మెంతికాయ్ పచ్చడి అంటే ఇష్టం కదా, ఓ హార్లిక్స్ సీసాడు పట్టుకొస్తాను,” అన్నాను. “హార్లిక్స్ సీసా ఎందుకండి, అమృతాంజనం సీసా లో ఇవ్వండి చాలు, “అన్నారు. ఆయన మితభాషి మాత్రమే కాదు, మిత భోజనం కూడా చేసేవారు. ఒక ఇడ్లీ సగం వడ తిని, మరో సగం ఎప్పుడైనా ఆకలేస్తే తినడానికి జేబులో వేసుకునేవారు. బాపు గారు మీ పుస్తకాలకు ముఖచిత్రాలు వేసారు కదా ! వాటి గురించి చెప్తారా ? బాపు గారి చేత బొమ్మ వేయించుకోవడం అంటే ఏ తెలుగు రచయత అయినా అదృష్టంగా భావించారు. నేను బి.కాం పాసైన తర్వాత ఆంధ్రజ్యోతిలో “అబ్బూరి bapu_bommaఘాటువులు “ అనే కవిత రాస్తే, దానికి బాపు గారు బొమ్మ వేసారు. అప్పుడు చాలా థ్రిల్ గా అనుభూతి చెందాను. ఆ విధంగా నా కల నెరవేరింది. ఆ తర్వాత నేను “ఆటకదరా శివా...” శివతత్వాలు రాసి, ఆయన వద్దకు తీసుకువెళ్ళి వినిపించాను. బొమ్మ వేసి ఇవ్వమని అభ్యర్ధించాను. ఆయన విని, సమగ్రంగా చదివి, ఒక పది రోజుల్లో బొమ్మ వేసి పంపారు. ఆ బొమ్మను అలా చాలా సేపు చూస్తుండిపోయాను. ఆటగదరా శివా... ఆటగద కేశవా... అనే శివకేశవ తత్వాన్ని ఆయన అద్భుతంగా ఆవిష్కరించారు. మువ్వలు ధరించి, తాండవమాడుతున్న శివుడికి నెమలి పించం పెట్టారు. పీతాంబరం, మెళ్ళో పాము. భూమిని బంతిలాగా తంతూ ఉన్నట్లుగా ఉంది. ఒక నెల రోజుల లోపే ఆయన మళ్ళీ ఫోన్ చేసి, “వేసాను కానీండి, భూమి మరీ దూరంగా ఉంది, మళ్ళీ వేసి పంపుతాను, ‘ అంటూ, మళ్ళీ వేసి పంపారు. అంటే, ఒకేదానికి రెండు బొమ్మలు వేసారు. ఆ తర్వాత వెండిపండగ కు ముఖ చిత్రం కావాల్సి వచ్చింది. నేను సంశయిస్తూనే, ఫోన్ చేసి, “గురువుగారు, ఒక బొమ్మ కావాలండి, సావనీర్ కి,’ అని అడిగాను. సరే పంపమన్నారు. నేను మాసిన గడ్డంతో ఉన్న 2,3 ఫోటోలు పంపాను. ఆయన అందులో ఒకటి ఎంపిక చేసి, ఫోటో బాగుంది కానీండి, కాస్త క్షవరం చేసి వేస్తాను, అన్నారు. అదొక అద్భుతమైన పెయింటింగ్. తర్వాత శృంగారగంగావతరణం అనే కావ్యం రాసాను. ఇంకా ప్రింట్ అవలేదు. దానికి బొమ్మ కావాలంటే ఆయన శివుడు గంగను పడుతున్నట్టుగా వేసి, నెల తర్వాత తనకు తృప్తిగా లేదని ,మరలా వేసి పంపారు. ఇలా ఒకే పుస్తకానికి రెండు సార్లు బొమ్మ వేయించుకున్న అదృష్టం నాకే దక్కిందేమో ! మిథునం సినిమా చూసి,బాపు గారు మీకొక లేఖ వ్రాసారట. “దస్తూరితిలకం” అంటూ మిథునం కధంతా స్వదస్తూరితో బాపు గారు రాసి కానుక ఇచ్చారట ? మిధునం సినిమా చూసి, పరమానందపడిపోయి, నాకు ఫోన్ చేసారు. చాలా బాగుంది, నీ వంటి గొప్ప వ్యక్తి నాకు పరిచయమయినందుకు, ఫ్రెండ్ అయినందుకు గర్విస్తున్నాను, అన్నారు. “దస్తూరితిలకం” శ్రీరమణ గారికి బాపు కానుక ఇచ్చారు. రమణ గారితో కలిసి మిథునం సినిమా చూడలేకపోవడం ఒక్కటే లోటు అంటూ నాకొక లెటర్ రాసి, వర (ముళ్ళపూడి వెంకటరమణ గారి అబ్బాయి) చేత పంపారు. చెన్నై ఫిలిం ఫెస్టివల్ లో మిధునం చిత్రం ఎంపిక అయ్యింది. ఆ సందర్భంగా 3,4 నెలల క్రితం నేను చెన్నై వెళ్ళినప్పుడు ఆయన్ను కలిసాను. అప్పుడు ఆయన ఆరోగ్యం అంతగా బాలేదు. ఒక అరగంట మాట్లాడి, 2,3 ఫోటోలు దిగి బయలుదేరాను. అదే బాపు గారిని చివరగా కలవడం. తర్వాత నేను ఆస్ట్రేలియా లో ఒక సభ నుంచి వస్తుండగా బాపు గారు ఇక లేరన్న వార్త అందింది. ఒక్కడినే కూర్చుని చాలా సేపు రోదించాను. ఒక ఆత్మీయుడితో నా బాధ పంచుకోవాలని, బాలు గారికి కబురు చేసి, ఆయన వీలు చూసుకుని వచ్చాకా, భోరున ఆయన్ను కావలించుకుని ఏడ్చాను. మిథునం సినిమా బాపు గారి సినిమాలకు దగ్గరాగా ఉందన్న టాక్ వచ్చింది. బాపు గారి ప్రభావం మీపై ఏమన్నా ఉందా ? నేను కూడా సహజత్వం అంటే బాగా ఇష్టపడతాను, సాధ్యమైనంత సహజంగా తీసేందుకు ప్రయత్నించాను. ఆ సినిమా పలువురి హృదయాలను తాకింది. ఎంతో మందికి స్పూర్తిని ఇచ్చింది. ఈ సినిమా గురించి నాకు కనీసం ఒక వెయ్యి అద్భుతమైన అనుభూతులు ఉన్నాయి. ఈ సినిమా చూసిన ఓ కుర్రాడు తన స్క్రీన్ సేవర్ ఉన్న ఐశ్వర్యా రాయ్ ఫోటో తీసివేసి, అమ్మానాన్నల ఫోటో పెట్టుకున్నానని చెప్పడం ఎప్పటికీ మరువలేను ! బాపురమణల స్నేహం గురించి మీ మాటల్లో వినాలని ఉంది.... bapu_ramanaవాళ్ళిద్దరి స్నేహం మనకొక దివ్యమైన దృశ్యం. వారిద్దరిదీ ఒక్కటే ఆత్మ. రమణ గారు ఎప్పుడైతే వెళ్ళిపోయారో, బాపు గారు కూడా న్యాయానికి వెళ్ళిపోయారు. ఊరికే బండిని లాగారు, అంతే. రమ ‘రమ(మర)ణించిన బాపు ‘ అన్న పేరుతో నేను ఫేస్ బుక్ లో ఒక కవిత రాసి పెట్టాను. అది మీకు వినిపిస్తాను. బాపు బొమ్మకు బాధ్యత పెరిగింది... బాపు రేఖకు మొన్ననే కుంకం చెదిరింది తెలుగుజాతి జాతంతా ఉసూరుమనగానే బాపు చిత్రాలన్నీ బావురుమన్నాయి.... అచ్చతెలుగు చిత్రానికి గోదావరి ‘సాక్షి’ స్వచ్చమైన స్నేహానికి బాపురమణలే సాక్షి ! (మొత్తం కవిత ప్రక్కన బొమ్మలో చదవగలరు ) బాపు గారంత గొప్ప వ్యక్తి, సంస్కారవంతుడు, నిరాడంబరుడు, గొప్ప కళాకారుడు మన తెలుగు గడ్డపై పుట్టడం నిజంగా మన అదృష్టం ! ఆయన బొమ్మలన్నీ తెలుగువారి హృదయాలపై చెరగని పచ్చబొట్లే ! కళాహృదయ కుహరాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న బొమ్మల బ్రహ్మ బాపు గారు ఆ వెంకట్రావ్ ను, రాముడిని చేరుకొని రమణించారు !

No comments:

Post a Comment

Pages