లేఖలో వ్రాయంగల విశేషములు .... - అచ్చంగా తెలుగు

లేఖలో వ్రాయంగల విశేషములు ....

Share This

లేఖలో వ్రాయంగల విశేషములు ....

--- విజయ లక్ష్మి సువర్ణ (మాంట్రియాల్, కెనడా)

మన ఊరు ‘సుందర పల్లి’ విశేషాలు విపులంగా రాయమని అడిగిన నీ కోరికపై ఈ క్రింద వ్రాయు ఈ లేఖార్థములు... ఆలయ వీధిలో గల మందిరం లో ఈ మధ్య జరిగిన గణపతి నవరాత్రులు మహా వైభవంగా జరిగినవి. పూజారి గారు ప్రతిరోజూ వినాయకుడి గురించి చెపుతుంటే ఊరు ఊరంతా వచ్చేసి విని ఆనందించారు. చివరి రోజున భక్తులు గొంతెత్తి చేసిన భజనలు ఊరి చివరి వరకు వినిపించి భగవంతుడు ఆమోదించినట్టుగా గరుడ స్థంభం గంటలు కూడా మోగినవి. గుడి వెనకనే ఇల్లు కాబట్టి ప్రతి పూట ప్రసాదానికి నేను సిద్ధం. ఇంటికి ఆనుకుని ఉన్న పెద్ద మామిడి చెట్టు కి కాసిన కాయలు ఎన్నో కోసేసినా కూడా ఎక్కడో పైన కొమ్మకు మిగిలిన వి చక్కగా పండి చిలకలు కొరికితే కిందకు రాలినవి. అసలే ఈ చెట్టు పండ్లు తీపి అందులో చిలక కొరికిన పండ్లు ఇంకా తీపిగా ఉన్నవి. చెట్టు పై గూళ్ళు కట్టుకున్న పక్షుల జంటలకు చిన్న చిన్న పిల్లలు వచ్చాయి. అరుగు పైకి రాగానే ఎగిరి వచ్చి నన్నుపలకరించి వెళతాయి. చెట్టు కింద హాయిగా నీడలో పడుకునే మన ఆవుకు ఒక చిన్న లేగ దూడ పుట్టింది. మరి మన ఆవు పేరు ‘గోమతి’ ఎద్దు పేరు ‘సత్యం’ కాబట్టి చిన్ని తువ్వాయికి ఏం పేరు పెట్టాలా అని అలోచించి చివరికి ‘గంగి’ అని నిర్ణయించాము. పుట్టిన కొన్ని గంటలకే గంతులు వేయడం మొదలు పెట్టి చాలా చూడముచ్చటగా ఉంది. ఎప్పుడు నా వెంటే తిరుగుతూ తన భాషలో ఏదేదో చెప్తూ ఉంటుంది. ఇంటి ముందున్న చిన్న కొలనులో తామరాకుల మధ్యలో నుండి పుట్టుకొస్తున్న పద్మాలు తెలతెల వారే సమయానికే నిటారుగా నిల్చుని సూర్యుని అదే పనిగా చూస్తుంటవి. అదేం చిత్రమో సూరీడు తల్లీ గర్భం లో చేరగానే ఈ కమలాలు ముడుచుకుని నిద్దరలో మునిగిపోతాయి. కొలను చిన్నదే అయినా ఎక్కడినుండో వచ్చిన రెండు బాతులు ఇక్కడే కాపురం పెట్టుకున్నవి. నేను అరుగు పైన ఉన్నంతసేపు అక్కడక్కడే తిరుగు తుంటవి. అరుగంతా ఆవు పేడతో అలికి, ఆరిన తరవాత తెల్లని పిండి కలిపి, కొత్తగా నేర్చిన పాటల కూని రాగం తీస్తూ, మధ్య మధ్యలో ఇటు చిలకమ్మలని అటు బాతులని పలుకరిస్తూ, నేను కొత్తగా నేర్చుకున్న ముగ్గులు ఈ తడి పిండి తో పెట్టుకుంటూ సంబరపడి పోతున్నాను. చెట్టునుండి మామిడాకులు తెచ్చి గుమ్మానికి తోరణాలు కడుతుంటే చిన్నారి ‘గంగి’ నా వెంటనంటే ఉన్నది. సూర్యుడు ఉదయించగానే ఎండతీవ్రంగా ఉండే వేసవి కాలం అయినా కూడా చల్లని చెట్టు నీడలో శుభ్రంగా అలికిన అరుగు పైన కూర్చుంటే ఎంతో ఉల్లాసంగా ఉంది. ఆలయం లో నుండి ఎవరో వాయిస్తున్న సన్నని సన్నాయి నాదం వినిపిస్తున్నది. పూజ ఇప్పుడే జరిగినట్టున్నది మధ్య మధ్యలో గాలి వీచినప్పుడు మంచి కర్పూర సుగంధాలతో కలసిన అగరొత్తుల గుబాళింపు పరిసరాలను నింపుతున్నది. జడలో ముడుచుకున్న మల్లెలు ఘమఘమ పరిమళాలు వెదజల్లు తున్నవి. ఈ సమయంలోనే ఒక కాగితం కలం తీసుకుని అరుగుపై కూర్చుని ఈ లేఖ రాయాలని పూనుకున్నాను. ఈ చిన్ని గ్రామం లో ఉన్న మన ఇంటి విశేషాలు తప్ప ఇంకేమి లేవు రాయడానికి. ------------------------------------------ ఇంత మధురమైన సుందర గామీణ పరిసరాల సన్నివేశం ఒక్క చిత్రం లోనే కూర్చిన శ్రీ బాపు గారికి సుమాంజలలులతో.

No comments:

Post a Comment

Pages