అచ్చ తెలుగు సినిమాలు - అచ్చంగా తెలుగు

అచ్చ తెలుగు సినిమాలు

Share This

అచ్చ తెలుగు సినిమాలు

- వసంతశ్రీ

బూరె బుగ్గల్ని సాగదీసి పసిపిల్లాడి నవ్వులా ముఖమంతా నవ్వే సత్తిరాజు లక్ష్మీ నారాయణ గారనబడే తెలుగు చిత్రకారుడైన బాపు. వారి గురించి నేనేదైనా రాయగలననీ రాస్తాననీ ఊహించలేదు గానీ- నా భావాలను ఇక్కడ పరుస్తున్నా. తనవి వంకర గీతలని తనమీద తనే జోక్ వేసుకునే బాపు చేతిలో ఊపిరిపోసుకున్న అమ్మాయి-బాపు బొమ్మగా జగద్విదితమయ్యింది.తనకి కాబోయే భార్య బాపు బొమ్మల ఉండాలనే మార్క్ పొందింది.మనం వినే స్తోత్రాలలోని దేముళ్ళు ఇలా ఉంటారని చూపించిన బాపు గారి చిత్రాలు ఎప్పటికీ నిలిచి ఉండే కళాఖండాలు.ఒక్కో చిత్రానికీ ఒక్క్కో కవిత రాయొచ్చు. వారు తెలుగువారిగా జన్మించడం మనం చేసుకున్న సుకృతం. ఒక ఆర్టిస్ట్ చేతిరాతని కంప్యూటర్ ఫాంట్ గా వాడడం అనేది ఒక్క బాపు గారిదే అరుదైన సన్మానం ,అవకాశం కూడా బాపుగారికే దక్కింది. నేను బాగా చిన్నదాన్ని ముత్యాల ముగ్గు సినిమాని వైజాగ్ లో చూసాం , సినిమా ఏమీ అర్ధం కాలేదు కానీ కోతి మాత్రమే అట్రాక్షన్.పాటలు కంఠతా వచ్చేసాయి. కాస్త పెద్ద అయాక సంపూర్ణ రామాయణం చూసా.శోభన్ బాబు రామునిగా బాగా నచ్చెసాడు. ఇంత హుందాగా ఉండాలన్నమాట అదీ పెద్దరికం అనిపించింది.ఇంక అప్పట్నించీ సినిమాలలో వెరైటీలూ,దర్శకత్వంలో దర్శకుల ప్రత్యెక శైలి గమనించడం మొదలెట్టా.ఈ అబ్సర్వేషన్ బాపుగారి నుండి మొదలయిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. మా పెళ్లైన తర్వాత వచ్చింది పెళ్లి పుస్తకం, తర్వాత మిస్టర్ పెళ్ళాం రిలీజ్ అయాయి. సుమారుగా . బాపుగారి శైలి చెప్పేంత గొప్పదాన్ని కాను కానీ ఒక సామాన్య గృహిణి దృష్టికోణం లో ఆలోచిస్తే- రామయణం స్పూర్తి అయన కధలు అని అందరికీ తెల్సినదే. ఎక్కడా స్త్రీ ఔన్నత్యాన్ని తగ్గించేలా ఉండవు స్త్రీ పాత్రలు. తెలుగుతనాన్ని,అందమైన గ్రామీణ వాతావరణాన్నీ ఎంచక్కా చూపించే కళాత్మకత బాపుగారిసొంతం. సాక్షి-ఒక ప్రయోగం, గోదారి ఒడ్డున తీసిన కావ్యం,స్టూడియో లలో మగ్గే సినిమాని పల్లెల్లో చిత్రీకరించిన తొలి తెలుగు సినిమాగా నిలిచింది.తన అన్ననుండి కదానాయకుణ్ని రక్షించడానికి పెళ్ళాడిన ధీర గా కనిపిస్తుంది నాయిక. ప్రతీ నాయిక లోనూ నవరసాల పాళ్ళు కనిపించేలా ఉంటుంది కధ కూడా. బుద్ధిమంతుడు- సాంఘిక ప్రయోజనం తో కూడిన భక్తి మంచిదని చెప్పిన సినిమా. ముత్యాలముగ్గు-భార్యని అనుమానించిన భర్త,వారు పిలిస్తే తప్ప రానని మామగారితో చెప్తూ-మీతో నాకు ముగ్గురు పిల్లలనుకుంటానన్న బాధ తో కూడిన ఆప్యాయత స్త్రీ లోని పూర్ణత్వాన్ని ప్రతిబింబించే విధానం బాపుస్వంతం. గోరంత దీపంలో అత్తగారి దాష్టీకాన్ని భర్త ప్రేమ లో భరిస్తూ,ఇంటికొచ్చి భర్త స్నేహాన్ని ఆసరాగా తీసుకుని,అతి చనువు తో ప్రవర్తిస్తున్న విలన్ కి,అతని స్నేహితులకీ బుద్ది చెప్పే ధీమణి కధానాయిక పాత్ర. భార్య డిగ్రీ చేసిందనే విషయం తర్వాత తెలుసుకున్న భర్త ఆమె నిదానాన్ని,నమ్రతకి ముగ్దుడౌతాడు. సీతాకల్యాణం - సున్నితమైన రమణీ లలామ సీత ఇంతందంగా ఉంటుందానిపించే పాత్ర.రామాయణాన్ని చెప్పే తీరు బాపు గారి శైలి ప్రత్యేకం. మంత్రిగారి వియ్యంకుడు- ఇదో పొలిటికల్ డ్రామా తో కూడిన హాస్యాన్ని చక్కగా కలగలిపిన కధ,బాపు-రమణల గారి మార్క్ సంభాషణలు. పెళ్లి పుస్తకం-కుటుంబం కోసం వేరే ఊళ్ళల్లో అయిన ఉద్యోగాలు కొన్నాళ్లపాటు చెయ్యాలని నిర్ణయించుకున్న నాయికా,నాయికలు,పెళ్లికానివారికి మాత్రమే ఉద్యోగాలనడంతో ఆమెకి పెళ్లైందనీ,హీరో కి పెళ్లి కాలేదని చెప్పి,ఉద్యోగాలలో జాయినవడం, తర్వాత అధికారులకి నిజం చెప్పడం కధ. అయితే పట్నవాసం గురించి చెప్తూ-అడవిలో ఉప్పు దొరకదు అక్కడ అమ్మాలి,సముద్రపొడ్డున చింతపండు అమ్మాలి .పట్నాలలో రెండూ కలిపి పచ్చడి చేసి అమ్మమని,పెట్టుబడిగా తన .....తీసి ఇచ్చిందనే భావోద్వేగం,బాపు గారి దర్సకత్వ ప్రతిభ కళ్ళను చెమరుస్తుంది. బంగారు చిలక-సినిమాని మళ్ళీ పెళ్లి కోడుకుగా తీసారు కలర్ సినిమాలోచ్చాక. బాపుగారి సినిమాలలో వనభోజనాల కాన్సెప్ట్ అందరికీ నచ్చిన అంశం.మడిసన్నాక కూసంత కళా పోసనుండాలి.మంచి,చెడ్డ రాశులు పోసినట్టు వేర్వేరుగా ఉండవు.అవసరంరాక చెడ్డవాడు మంచివాడిగా మిగిలిపోవచ్చు.అవకాశం వచ్చి-మంచి వాడు కూడా చెడ్డ వాడిగా తయారవచ్చు.ఇలాటి జీవిత సత్యాలను క్లుప్తంగా చెప్పే విధానం బాపు సినిమాలలో చూస్తాం. ఒక పెళ్లి పుస్తకం,రాధాగోపాళం ఉద్యోగిని అయిన మహిళ ఎంత చక్కగా తన పనినీ,ఇంటినీ సంభాళించు కుంటుందో,పతిని అతని తొందరపాటునీ సహనం తో తెలియజేసి సరిదిద్దుతుందో చక్కగా పాత్ర పరంగా చెప్పారు. రాధాకళ్యాణం సినిమాలో నాయిక పాత్ర పెళ్లినా ప్రేమిస్తున్న పేద గాయకుని ద్వారా పెళ్లి గొప్పదనం,భారతీయ సంస్కృ తి సంప్రదాయం చెప్పిన తీరు అద్భుతం. అందాలరాముడు సినిమా-డబ్బు పిచ్చి,హోదాగల పెద్దమనిషికి ఆకలి,అమ్మప్రేమ తెలియజెప్పిన లాంచీ ప్రయాణం ఒక ప్రయోగమే.గోదావరి అందాలనూ,వెన్నెల్లో గదారి అందాలను చూపిస్తూ అద్భుతమైన పాటల ద్రుశ్యకావ్యం అంటే అతిశయోక్తి కాదు. రాంబంటు డబ్బుకంటే-మంచితనం,ఔన్నత్యం చెప్తూ తెలుగుతనంయో బాటూ ఆయుర్వేదం,మూలిక వైద్యం గురించి కూడాచెప్పే విధానం చక్కని హాస్య ధోరణి లో కొనసాగుతుంది. వంశ వృక్షంలో భారతీయ ధర్మాన్ని చక్కగా విశ్లేషించే సంభాషణ,దర్సకత్వం ఆలోచింపజేస్తుంది. ఆఖరి సినిమాగా తీసిన శ్రీరామరాజ్యం కూడా అతని దర్సకత్వ ప్రతిభ,సీతపాత్ర ఔన్నత్యం ప్రతిబింబించింది. సినిమాని మధ్యలోనుంచి చూసినా డైలాగ్ డెలివరీని బట్టి పోల్చెంత విధంగా ఉంటాయి సంభాషణా విధానం.బాపు మార్క్ భంగిమలు-కధానాయిక కూర్చునే విధానం ఫోటో పోజ్ లా చిత్తరువై కూర్చోవడం,అందమైన శిల్పంలా వాలుజడ తో.ఇలాటి కొన్ని ప్రత్యెక శైలి బాపు స్వంతం. రాధాగోపాళం లో వాలుజడ పాట ప్రేక్షకుల మనసు దోచింది. బాపు గారు హిందీలో కూడా సినిమాలు తీసారు.ఆ వివరాలు ఇంకోసారి చూద్దాం. బాపుగారి గురించి తలుచుకుంటుంటే ఇంకో పేరు గుర్తురాక మానదు. వారె శ్రీ ముళ్ళపూడి వెంకటరమణగారు.బంగారానికి తావి అబ్బినట్టి వారి స్నేహం.ఈ తరానికి తెలిసిన చెలిమి బంధo .ఎన్ని చెప్పుకున్నా తనివితీరని తీరదు. కానీ బాపు అంటే వెంటనే గుర్తొచ్చే రమణ గారు ముందే వెళ్ళిపోవడం ఆయనకి తీరని బాదే కాదు-,శ్రీ రామరాజ్యం లో లోటు బాగా అనిపించిందట. చిన్నప్పటి సహపాఠీ కృష్ణ సుదాములు,కానీ చివరిదాకా కలిసున్న ఈ మిత్రుల మైత్రీ బంధం-మనందరికీ ఆదర్శం.స్నేహం అంటే ఒకర్నొకరు భరించడమే అని నవ్వుతూ చెప్పిన బాపు గారు.అన్ని సంవత్సరాల అనుబంధం ఎలా గడిపారో కూడా చెప్తే బాగుండేది. రమణ గారు ముందెళ్ళి అన్నీ చూసి స్వర్గంలో ఎదురుచూస్తున్నారని మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు.బాపు గారు,అయన గీసిన బొమ్మల్లో,తీసిన సినిమాలలో వాళ్లిదర్నీ తలుచుకోమని మనల్నివదిలి,వెళ్ళిపోయారు వారు. తెలుగు సినిమా ప్రేక్షకులున్నoత కలం బాపు రమణలు అజరామరం.మన మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న వీరి స్నేహద్వయానికి శ్రద్ధాంజలి. _/\_ ***********

No comments:

Post a Comment

Pages