అభిసారికోపాఖ్యానం - అచ్చంగా తెలుగు
అభిసారికోపాఖ్యానం
(మాజొన్నవాడ కధలు - 4)
టేకుమళ్ళ వెంకటప్పయ్య (9490400858)



"సారికా! టైం 11.30 దాటింది. రా! పెళ్ళి నడక నడవ్వాక. తొందరగా బయలుదేరాలి " అన్నాడు అభిమన్యు నెల్లూరు సినిమా ధియేటర్‌లో సెకండ్‌షో సినిమాహాల్ నుంచి బయటకు వస్తూ. "నాకూ నిద్రొస్తున్నాది. తొందరగా పడుకోవాలి! పదండి” అంటూ కారెక్కింది. కార్ స్టార్ట్ చేసి శరవేగంతో ముందుకురికించాడు. అరగంటలో బుచ్చిరెడ్డిపాళెం చేరిన కారు మలుపు తిరిగి సాల్మాన్‌పురం వైపు వెళ్తోంది. కారు ముందుసీట్లో మెల్లిగా నిద్రలోకి జారుకుంది సారిక. హమ్మయ్య! వచ్చేశాం! ఇంకో 15 నిముషాల్లో పెనుబల్లిలో ఉంటాం . ఊపిరిపీల్చుకున్నాడు అభి. కానుగచెట్టు సెంటరు సమీపంలోని చెల్లాయపాళెం డ్రైయిన్ దాటిన తరువాత మొదటి మలుపు తిరగబోతుండగా, గాలేరుగుంత ప్రక్కనున్న మర్రి చెట్టు క్రింద కారు అకస్మాత్తుగా ఆగింది.
"అభీ! వచ్చేశామా!" కారు కుదుపుకు లేచిన సారిక  ఒళ్ళిరుచుకుని ఆవలిస్తూ అడిగింది.
"లేదు సారికా! ఇంక 10 నిముషాల్లో చేరతాం.  ఇప్పుడే  కారుకు ఏదో తెల్లటి జంతువో యింకేందో అడ్డం బడింది. నేను బ్రేకువేశానా! లేకపోతే కారు అదే ఆగిందా! అర్ధం కావడం లేదు నాకు" "అదేందభీ! కారెట్టాగిందీ తెలవలేదా?  నిద్రబోతూ దోల్తున్నావా ఏంది?" "లేదు సారికా! చిన్న కన్‌ఫ్యూజన్ అంతే!" అంటూ దిగి కుడివైపు ముందు చక్రం క్రింద చూసి "ఏంలేదులే” అంటూ కారెక్కబోతుండగా "నేను ఈ పక్కన దిగి చూస్తా ఉండు " అంటూ కారు దిగంగానే "వద్దు సారికా! వద్దు దిగబాక...కూర్చో..ఈ చోటంత మంచిదికాదు" " అన్నాడు.  అప్పటికే సారిక కారు దిగి ఎడంవైపు చక్రం క్రింద చూడబోతూ... ఏదో శబ్దం విని పైకి చూసింది. చెట్టుపై గుడ్లగూబ ఒక్కసారిరెక్కలాడిస్తూ  వికృతంగా అరిచింది.  రోడ్డుమీద దూరంగా ఏదో జంతువు కనుగుడ్లు కారు హెడ్‌లైట్ల కాంతికి రెండు అగ్నికణాల్లా ఎఱ్ఱగా మెరుస్తున్నాయి. ఏదో తెలియని వణుకొచ్చింది. కారు వైపు అడుగేసింది. కాళ్ళ క్రింద ఏదో పరుపులాంటి మెత్తటి వస్తువు తగిలింది. ఒక్కసారి వళ్ళు జలదరించింది. ఆకాశంలో ఏదో తెల్లగా మెరిసింది. తెల్లటి ఆకారం ఒకటి తనను  కౌగలించుకున్న అనుభూతి. అంతే! అభీ! అభీ! అని ఎంత పిలవాలని ప్రయత్నించినా నోట్లో మాట నోట్లోనే ఉండిపోయింది. మాట ఎంతకీ పైకి  రావడంలేదు. "సారికా! కారెక్కు! ఏమీలేదులే పోదాం! ఎక్కు! " రెండు మూడు సార్లు అరిచినా సమాధానం లేదు. ఏమైందా?  అని ఎడంపక్కకొచ్చి సారికా! సారికా! ఏమైంది? కారెక్కమంటుంటే”  అనడిగాడు. నిలువు గుడ్లేసుకుని చూస్తోంది ఏదో నోట్లో గొణుగుతోంది తప్ప మాట రావడం లేదు.  అభిని ఏదో తెలియని భయం, వణుకు ఒకేసారి భయం ఆవరించింది. మొండిధైర్యం తెచ్చుకుని సారికను ఎత్తుకొని మెల్లిగా కార్లో వెనుక సీట్లో పడుకోబెట్టి, లాక్ చేసి కారును  పెనుబల్లి వైపు వేగంగా పోనిచ్చాడు.  ఇల్లు చేరింతర్వాత మెయిన్‌గేట్ తీసి సారికను రెండుసార్లు తట్టి పిలిచినా లేవకుండా ఏవో గొణుక్కుంటోంది. ఆ మాటలేమిటో అర్ధం కావడంలేదు. పిలిస్తే జవాబులేదు. ఇంతలో అమ్మా నాన్నా వచ్చి వరండాలో లైట్లు వేశారు. "అమ్మా! సారికకు వొంట్లో బాగున్నట్టు లేదు. కొంచెం సాయంపట్టు గదిలో పడుకోబెడదాం" అన్నాడు. "ఏమైందభీ!" భయంగా అడిగింది.  "అన్నీ తీరిగ్గా చెబ్తాగానీ లోపల పడుకోబెడదాం దా!" అని లోన పడుకోబెట్టారు. వాళ్ళ  నాన్న నిలువుగుడ్లేసుకుని చూస్తున్నాడు. సారికను పడుకోబెట్టి గడియ వేసి వచ్చి జరిగిన విషయమంతా పూసగ్రుచ్చినట్ట్టు చెప్పాడు. "ఒరే అభీ! నెల్లూరికి రెండో ఆటకు వద్దురా అంటే నా మాట నువ్వూ వినవు. ఆపిల్లా వినదు. ఇద్దరూ ఇద్దరే!  రేపేదన్నా అయితే వాళ్ళమ్మా వాళ్ళకు ఏం చెబ్దాం సమాధానం!" అంటూ ఏడ్చింది. "కారు దిగొద్దే అన్నా! వినిందా! వినకుండా వుబద్రగా దిగింది. సరేలే!  జరిగిందేదో జరిగింది. నన్ను రేపు పొద్దున ఐదింటికి లేపు డాక్టరుతో మాట్లాడుతాను. ఇంక పడుకోండి."

***
"తలుపులు తియ్యండిరా! ….నేను... ఆదెమ్మను… నన్నేమీ  చెయ్యలేరు మీరు" ఉదయాన్నే ఆరుగంటలకు తలుపులు దబదబ బాదుతూ ఇలాంటి  ఏవేవో అర్ధం కాని మాటలు మాట్లాడుతూ పెద్దగా అరుస్తోంది సారిక.
"ఈ సంగతి వాళ్ళమ్మ వాళ్ళకు చెబ్దామా వద్దా!" అని అమ్మ అడిగిన ప్రశ్నకు "ఒక రోజు చూద్దామమ్మా! వాళ్ళను గూడా భయపెట్టడం ఎందుకు? నువ్వు భయపడకుండా వుండు చాలు. డాక్టరుకు రింగ్ చేశాడు.
"చెప్పు!  అభీ…. నేనిప్పుడు చెన్నైలో ఉన్నా. ఒక బ్రెయిన్ ఆపరేషన్‌కు వచ్చా! ఎలా ఉన్నావు? ఎవరికేమైంది?"  
"డాక్టర్! సారికకు" అంటూ భయపడుతూ రాత్రి జరిగిన విషయం, ప్రస్తుతం పరిస్థితి చెప్పాడు.
"డోంట్ వర్రీ అభీ! భయపడి ఉంటుంది. సెంట్రల్ నెర్వస్ సిస్టం భయానికి ఇర్రిటేట్ అయింది అంతే!  నెర్వస్ ప్రాబ్లం. నీకు ఇంజెక్షన్, మందులు వాట్సాప్ లొ మెసేజ్ పెడ్తా. తెప్పించి లోకల్ డాక్టర్‌కు చేత ఇప్పించు. నేను నాలుగు రోజుల్లో వస్తా!"
"ఓకే డాక్టర్!" అని ఆర్.ఎం.పీ కి ఫోన్ చేసి ఇంజెక్షను తెప్పించాడు. నలుగురు మనుషులు గట్టిగా పట్టుకుంటేనే గానీ డాక్టర్ ఇంజెక్షన్ యివ్వలేని పరిస్థితి.  ఇంజక్షన్ ఇచ్చాక అరుపులు తగ్గి పడుకుంది. వెళ్తూ అభిని బయటకు రమ్మని సైగ చేశాడు. "చూడు అభీ! ఒక డాక్టరుగా నేను ఇలా చెప్పకూడదు. ఇంజెక్షన్లు ఇవ్వడం మంచిదే కాదన్ను. కానీ నువ్వు ఇంకో పని కూడా చెయ్! అమ్మాయి పరిస్థితి చూశాక ఉండలేక చెప్తున్నా! జాగ్రత్తగా విను. పంచేడుకు ఊరి చివర పోలేరమ్మదేవళం పక్కన భూతాల భూషయ్య అని ఒకాయన ఉన్నాడు. వెంటనే ఆయన్ను కలువు! ఆయన సలహా కూడా తీసుకో! ఎందుకైనా మంచిది. మనం కొన్నిటిని నమాల తప్పదు.  ఈ చుట్టుపక్కల వాళ్ళంతా ఇలాంటి యవ్వారాలన్నిటికి ఆయన్నే పిలుస్తారు" అన్నాడు. 

***
అభి పంచేడుకు చేరేసరికి సాయంత్రం ఐదు గంటలు కావొస్తోంది. ఊరి చివర దేవళం పక్కనే పెంకుటిల్లు. సులభంగానే గుర్తుపట్టాడు. కనీసం అర ఫర్లాంగు దాకా ఇళ్ళేమీ లేవు. జన సంచారం కూడా  ఏమీలేదు.  భయంకరమైన దిష్టిబొమ్మలు నాలుగు దిక్కులా నిలబెట్టి ఉన్నాయి. పెద్ద పెద్ద వేప తోరణాలు కట్టి ఉన్నాయి. ఇంటిముందు పెద్ద వేప చెట్టు. ఇదే భూషయ్య ఇల్లని నిర్ధారించుకొని లోనకు అడుగులేశాడు. ఒక్కసారి వళ్ళు జలదరించింది. గదిలో నాలుగుగోడల మీద అమ్మవారి విగ్రహాల పెయింటింగులు. జ్వాలాముఖి ఒకపక్క. బంగళాముఖి ఇంకోపక్క. మహిషాసురమర్దని, మలయాళ భగవతి.  భూషయ్యగారి గురువుగారైన గురులింగదేవర విగ్రహం ఒక మూల ఉంది. విగ్రహం క్రింద ఉన్న తలుపులులేని చెక్క బీరువాలో రెండు చీపురు కట్టలు, వేపబెత్తాల కట్టలు, విభూతిబస్తా, గట్టి బిరడాలుగల సీసాలు, ఇనుప పట్టుకార్లు లాంటివున్నాయి. ఎదురుగా అద్దాల బీరువాలో తాళపత్రగ్రంథాలు, ఏవో పాత పుస్తకాలున్నాయి. ముగ్గు ముందు కూర్చొని ఉన్నాడు భూషయ్య. భయంకరాకారం. పహిల్వాన్ నెల్లూరు కాంతారావును గుర్తుకు తెస్తున్నాడు.  కనుగుడ్లు అగ్ని గోళాల్లా వెలుగుతున్నాయి. నుదుట పెద్ద ఎర్రటి బొట్టు. వొళ్ళంతా విబూధి పట్టీలు. తలవెంట్రుకలు జడలుకట్టి ఉన్నాయ్. గోచీగుడ్డ తప్ప ఒంటిపై నూలుపోగులేదు. నిమ్మకాయలు, మధ్యలో అగ్నిహోత్రం ,  పసుపు కుంకుమలు అక్కడక్కడా కుప్పలు కుప్పలుగా పోసి ఉన్నాయి. రెండు గుడ్డలలో నూలుదారాల ముళ్ళు, పళ్ళెంలో తాటాకు ముక్కలు,  రెండు మూకుళ్ళతో బూడిద, మూతలేని దేవదారు పెట్టెలో కొన్ని చిన్నా పెద్దా రాగిరేకులు, రెండు ముంతలలో పసుపు, వెదురుగొట్టంలో ఎర్రని అక్షింతలు ఎదురుగా పెట్టున్నాయి. నన్ను చూడగానే సైగ చేసి కూర్చొమని చెప్పాడు.  విషయం క్లుప్తంగా చెప్పగానే అర్ధమైందన్నట్టుగా చేయి ఊపి ఐదునిముషాలు ఏవో బీజాక్షరాలు చదివాడు. అగ్నిహోత్రంలో నూనె పోసి ఆ జ్వాల వెలుగులో కరన్యాస అంగన్యాసాలు  చేశాడు. నిమ్మకాయకోసి కుంకుమ అద్ది అగ్నిలో వేశాడు. భూషయ్య చదివే మంత్రాలు మధ్య మధ్యలో “స్వాహా!” అని “ఆవాహయామి!” అనే మాటలు మాత్రమే అర్ధమౌతున్నాయి.  ఏం జరగబోతున్నది?  కొంచెం భయం కలిగింది అభికి.  "భయపడకు! అడిగిన ప్రశ్నకు అవునా కాదా చెప్పు చాలు! ఎదురు ప్రశ్నలు వేయ్యొద్దు! కొంచెం జటిలమైన సమస్యలా కనబడుతున్నాది. ” సరే అని తలూచాడు అభి. 
" నీ భార్య క్రింద పెదవి పైన పుట్టు మచ్చ ఉందా?"  - "అవును!" అన్నాడు.
" నీ భార్య  కుడి మోకాలిపై పెద్ద పుట్టు మచ్చ ఉందా?" -  "అవును" అన్నాడు.
"నీ భార్యకు ఇరవై మూడు ఏండ్ల వయసా?" - "అవును" అన్నాడు.
"హూ. గమ్మునుండు. మాట్లాడకు కాసేపు” నిశ్శబ్దంగా ఉండమని సైగ చేసి  ఏవో మంత్రాలు చదివి.. కాసేపటిదాకా కళ్ళు మూసుకుని ఏవేవో గొణుగుతూ ఉండిపోయాడు. పది నిముషాల అనంతరం బీరువాలో తాటాకు గ్రంధం తెరిచి కాసేపు చదివి మూసేసాడు. "ఆదెమ్మ దయ్యాన్ని వదిలించడానికి నా శక్తి చాలదయ్యా! అది సామాన్యమైన భూతం కాదు" అన్నాడు.  "మరి నేనేం చెయ్యాలి స్వామీ!" కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యాడు. “ఆదెమ్మకు నీ భార్యకు కొన్ని  పోలికలున్నాయి. అలా పోలికలు, ఒకే వయసు ఉంటే ఆ భూతం అంత తొందరగా వదలదు. దైవశక్తికి మాత్రమే లొంగుతుంది. రెండేళ్ళ క్రితం సాలిమాన్ దిబ్బల్లో ఆదెమ్మ హత్య జరిగింది. ఆమె ప్రియుడే ఆమెను ఘోరంగా గొంతుకోసి చంపాడు. ఒక సంవత్సరం క్రితం ఆదెమ్మ భూతం పాతూరులో ఉన్న బుజ్జమ్మను పట్టుకుంటే వదిలించాను. బుజ్జమ్మకు ఆదెమ్మకు పోలికలు లేవు. అందుకే నా మంత్రాలకు లొంగింది". "ఇప్పుడు నేనేం చెయ్యాలి" అని దండం పెట్టాడు. "భయపడకు! వెంటనే రేపు ఉదయమే జొన్నవాడ కామాక్షమ్మ సన్నిధికి తీసుకొని వెళ్ళు. వారం రోజుల్లో నీ సమస్య పరిష్కారమౌతుంది. అమ్మే ఇంక రక్ష మీకు. గురువారం అమావాశ్య రోజున పట్టింది కాబట్టి అష్టమి శుక్రవారం నాటికి ఆదెమ్మ దైవ శక్తికి భయపడి నీ భార్యను వదిలేసే అవకాశం ఉంది. లేదంటే అమ్మే ఆవిషయం స్వయంగా చూసుకుంటుంది. ఇక్కడ నుండి నేను చేయదగ్గ పూజ చేస్తాను. పూజారికి భూషయ్య పంపాడని చెప్పు చాలు. అన్నీ ఆయనకు అర్ధమౌతాయి. రోజూ అష్టోత్తరం చేయించి, నిమ్మకాయల మాల ఒకటి అమ్మణ్ణికి  వేయించండి. పూజారి చెప్పినట్టు చెయ్యండి చాలు. భయపడాల్సిన పనిలేదు" ఇక వెళ్ళొచ్చు అన్నట్టు సైగ చేశాడు. డబ్బులు ఇవ్వబోతే ఆ హుండీలో వెయ్యమన్నట్టు సైగ చేశాడు.

***
కారు దిగ్గానే వెంటనే అమ్మనాన్నలకు విషయం చెప్పి, వాళ్ళమ్మా నాన్నలను తోటపల్లి గూడూరు నుండి రేపు ఉదయం నేరుగా జొన్నవాడ రమ్మని ఫోన్ చేశారు. లోపల "ఏం చేస్తున్నార్రా! తలుపులు తియ్యండి" అని అరుస్తోంది సారిక. రాత్రికి మళ్ళీ డాక్టరు వచ్చి ఇంజెక్షన్ ఇచ్చాక నిద్రపోయింది. రేపు ఉదయం వచ్చి 7 గంటలకు ఇంజెక్షన్ ఇవ్వాలని చెప్పి పంపించారు డాక్టరును. ఇంజెక్షను ఇచ్చాక కారు బయలుదేరింది.

***
కారు దేవళం ముందు ఆపి లోనకెళ్ళి పూజారికి భూషయ్య చెప్పమన్న విషయాలు చెప్పి వచ్చాడు. సారిక వాళ్ళ అమ్మా, నాయనా సారికను చూసి భోరుమని ఏడుస్తూ ఏమైందని అడిగారు. విషయం చెప్పి వారంలో నయమౌతుందని చెప్పి వాళ్ళను సముదాయించాడు. ఇంతలో బ్రాహ్మడు పెద్ద గిన్నెతో పసుపునీళ్ళు వేపమండలు తెచ్చి సారిక పై చల్లాడు. అప్పటివరకూ ఊగిపోతూ అరుస్తున్న సారిక గొంతు ఒక్కసారిగా మూత పడిపోయింది. ఆ నీళ్ళు ఒక సీసాలో వాళ్ళకిచ్చి వేపమండలతో అప్పుడప్పుడూ చల్లమని చెప్పాడు. భయపడవద్దని త్వరలో యింటికి వెళ్ళొచ్చని అభయం ఇచ్చాడు. అక్కడే ఒకరూం తీసుకొని రోజూ అభిషేకాలు, పూజలు యధావిధి చేస్తున్నారు. లోకల్ డాక్టర్‌తో ఇంజక్షన్లు టైంకు ఇప్పిస్తున్నారు.  అనుకోకుండా ఒకరోజు బుచ్చిరెడ్డిపాళెం వెళ్ళిన అభికి అక్కడ మార్కెట్‌లో ఇన్స్పెక్టర్‌గా తిరుగుతూ హడావిడి చేస్తూ, రోడ్డుపై పండ్లు, పూలు, సెనక్కాయలు అమ్ముకుంటున్న వాళ్ళమీద కేసులు రాస్తున్న వి.ఆర్.హైస్కూల్ క్లాస్‌మేట్ యానాదయ్య కనపడ్డాడు. "ఓరే యానాదీ" అనగానే గుర్తుపట్టి "ఒరేయ్! అభీ నువ్వా!" అని కౌగలించుకొన్నాడు. హోటల్లో కాఫీ తాగుతూ మాటల మధ్యలో సారిక సంగతి చెప్పాడు. 
"పేరు ఏందన్నావ్?"
"ఆదెమ్మ అని చెప్పారు"
"హుం..అభీ! రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఘోరమైన హత్య అది. మా స్టేషనే డీల్ చేసింది ఆ కేసు. నేనమ్మలేకపోతునా! దయ్యాలున్నాయంటే!"
"యానాదీ! నువ్వు ఏమనుకోకపోతే నేను ఒకసారి ఆ కేస్ ఫైల్ చూడొచ్చా?"
"హైకోర్టుకు ఇచ్చాం. ఆ..మాదగ్గర కంప్యూటర్‌లో స్కాన్‌డ్ డాక్యుమెంట్స్ ఉంటాయిలే రా! చూద్దాం. "
కంప్యూటర్ ముందు కూచున్న స్టేషన్‌హవుజ్ ఆఫీసర్‌తో "ఆదిలక్ష్మి హత్య కేస్ ఎఫ్.ఐ.ఆర్ పేపర్లు, ఫొటోలు ఒక కాపీ ప్రింట్ తియ్యి" అన్నాడు యానాదయ్య.
"వాడికి జీవిత ఖైదు పడిందిగదా సార్! ఎప్పుడో ! ఇప్పుడెందుకు సార్… మళ్ళీ! " అన్నాడు. 
"చెప్తా తియ్యి" అన్నాడు. టెన్షన్‌గా చూస్తున్నాడు అభి. యానాదయ్య భుజం చెయ్యివేసి కూర్చో పెట్టాడు. ప్రింటవుట్లు చేతికి తీసుకున్న అభికి ఫొటోలు చూడగానే మతిపోయింది. సారికలాగే అచ్చు గుద్దినట్టుంది ఆదిలక్ష్మి. కొంచెం రంగు తప్ప, ముక్కు, పెదవులు, క్రిందపెదవిపై పుట్టుమచ్చ, వంకీల జుట్టు అన్నీ సారిక లాగే ఉంది. యానాదయ్య అభీ! అభీ! అని పిలవడంతో ఆశ్చర్యంలోంచి తేరుకుని, మెల్లిగా కార్‌లో జొన్నవాడ చేరుకున్నాడు.

***
అలా ఐదు రోజులు గడిచాయి.  ఆరోజు శుక్రవారం. సమయం ఉదయం 11.30 గంటలు దాటింది. అప్పటిదాకా పొర్లబడ్డ జనాల తాకిడి మెల్లి మెల్లిగా తగ్గుతోంది. దేవళంలో సారిక పక్కన వాళ్ళ అమ్మ మాత్రమే ఉంది. ఇంతలో పాతకాలం గజ్జెల చప్పుడు ఏదో  వినిపించింది. ఏమిటా అని చూసే సరికి ఒక పండు ముత్తైదువ మొగుడు ఇద్దరు పిల్లలతో కలిసి గబాగబా దేవళంలోకి పోతోంది. ఆమె హంసల డిజైనున్న ఎర్ర కుంకుమరంగుచీరె గోచిబోసి ధోవతిలా కట్టుకుంది. మొహానికి పసుపు పూసుకుంది. ఎవరో అరవవాళ్ళు అయుంటారు అనుకుంది సారిక వాళ్ళ అమ్మ. సారిక మాత్రం ఆమెనే చూస్తోంది. సారికనుదాటి నాలుగడుగులేశారు. వెంటనే ఆగి ఆమె వెనక్కు చూసింది. ఆమె కళ్ళు సారిక కళ్ళు ఒక్కసారి కలుసుకున్నాయి. ఆమె భర్త వెళ్ళు అన్నట్టుగా నవ్వుతూ సైగ చేశాడు. ఆమె వచ్చి వాళ్ళు కూర్చున్న ఈత చాపపై పసుపు కుంకుమ చల్లి సారిక ఎదురుగా కూర్చుంది. చేయి చాపగానే భర్త ఒక నిమ్మకాయ ఆమె చేతిలో ఉంచాడు. దాన్ని గోళ్ళతో  రెండు ముక్కలు చేసింది. పసుపు కుంకుమ చల్లి రెండు నిమ్మకాయ ముక్కలను సారిక మాడుపై పిండి, తలపై చెయ్యివేసింది. అంతే! ఒక్కసారి వెయ్యి వోల్టుల విద్యుద్ఘాతం తలిగినట్టు ఉలిక్కిపడి “అమ్మా!” అని పెద్దగా కేక పెట్టింది.  సారిక అమ్మకు అంతా కలలా ఉంది.  "భయపడకు మీ అమ్మ నీపక్కనే ఉంది గదా! ఎప్పుడూ నీకు తోడుంటుంది" అంది నవ్వుతూ . "అవును. నేనిక్కడున్నా నేంది? అభి ఏడీ! ఇది జొన్నవాడకదా? మనం జొన్నవాడ ఎప్పుడొచ్చాం? అని అడిగింది. పండు ముత్తైదువ పైకి లేచి సారిక అమ్మతో "ఇవాళ సాయంత్రం పూజలయింతర్వాత రేపు శనివారం ఊరికి పోండి" అని చెప్పి నవ్వుతూ దేవళంలోకి కుటుంబంతో వెళ్ళింది.  తర్వాత వచ్చి విషయం తెలుసుకున్న అభి, సారిక అత్త,  ఆ కుటుంబంకోసం దేవళం మొత్తం గాలించారు. ఎక్కడా లేదు. ఆమె కట్టుకున్న డిజైన్ చీర ఆరోజు కామాక్షీదేవికి కట్టి ఉండడం చూసి సారిక వాళ్ళ అమ్మ ఆవిషయం చెప్పగానే అంతా నివ్వెరపోయారు.  పూజారికి చెబితే నవ్వి ఊరుకున్నాడు తప్ప ఏమీ మాట్లాడలేదు.

***
ఆరోజు ఆదివారం. ఉదయాన్నే వంటింట్లో సారిక మాటలు పెద్ద పెద్దగా వినిపిస్తుంటే ఉలిక్కిపడి లేచాడు అభి. నాన్న బయట ఎవరితోనో మాట్లాడుతున్నాడు. అమ్మ కూరలమ్మి తెచ్చిన కూరలు తీసుకుంటోంది.  “టూత్‌బ్రష్ చేతిలోకి తీసుకోగానే “ఒసే! ఆదెమ్మా! నన్ను ఇలా పట్టుకున్నావేంటే.. వదలవే! పుణ్యం ఉంటుంది. ప్లీజ్!" అన్న సారిక అరుపులు విని మత్తొదిలిపోయింది.  క్షణాల్లో కిచెన్ చేరాడు.  ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్న సారిక ఫోను పెట్టేసి "అలా మిడిగుడ్లేసుకుని చూస్తున్నరేంది? నా చాయల?  నా ఫ్రెండ్ ఆదిలక్ష్మితో మాట్లాడుతున్నా. తుమ్మబంకే నయం అనుకో!  గంట నుంచి ఫోన్లో తెగ సతాయిస్తున్నదయ్యా సామీ! పట్టుకుంటే వదలది.” అనగానే "హమ్మయ్య! అని గుండెపై చేయివేసుకున్నాడు.
***

No comments:

Post a Comment

Pages