మానవత్వం - అచ్చంగా తెలుగు
 మానవత్వం
వై.ఎస్.ఆర్.లక్ష్మి 

          

“తేజా!అమ్మ రాలేదామ్మా” అంటూ పలకరించింది నిర్మలమ్మ.

            “ఇంకా హాస్పటల్ నుండి రాలేదు అమ్మమ్మా.నిన్న ,మొన్న కూడా బాగా లేట్ గా వచ్చింది.ఈ రోజు ఎప్పటికి వస్తుందో”అంది తేజ.

    “అయ్యో మా ఇంటికి రాకపోయావా?పొద్దున్నించీ ఒక్కదానివీ ఏం చేస్తున్నావు?”

      “పర్వాలేదు అమ్మమ్మా.కాసేపు టి.వి లో కార్టూన్ ఫిలిమ్స్ చూసాను.కొంచెంసేపు గేమ్స్ ఆడుకున్నాను.మాఫ్రెండ్స్ తో ఫోన్ లో మాట్లాడాను.ఒకరిని ఒకరు కలవద్దు అని అంటున్నారుగా అందుకే ఇంట్లోనే ఉండిపోయాను.”

  “మీకు సెల్ లు ,టి.విలు ఉంటే మనుషులతో పనే ఉండదు.అన్నం తిన్నావా?”

   “లేదు ఇందాకే ఆకలేస్తే స్నాక్స్ తిన్నాను.ఇప్పుడు ఆకలిగా లేదు.అమ్మ వచ్చినాక తింటారులే.”

   “సరేలే అమ్మా !అమ్మ రావడం ఆలస్యమైతే ఏదన్నాకావాలన్నా పిలువు. మొహమాట పడకు.”

   “అలాగే  అమ్మమ్మా”

    “ఏంటో ఈకాలం పిల్లలు”అని గొణుక్కుంటూ తన వాటాలోకి వెళ్లింది నిర్మలమ్మ.

   ******.         

                               తేజ వాళ్ళమ్మ సమీర హాస్పటల్ లో నర్సుగా పనిచేస్తుంది.నాన్న రమేష్ ఒక సంవత్సరం క్రితం దుబాయి వెళ్ళాడు.తల్లిదండ్రులు  పల్లెటూళ్ళో

    ఉంటారు.రమేష్ కి ఇద్దరు చెల్లెళ్ళు .వాళ్ళ చదువు పెళ్ళిళ్ళ బాధ్యత రమేష్ దే.అందుకే ఎక్కువ సంపాదించాలని ఫ్రెండు సహాయంతో దుబాయి వెళ్ళాడు.బాధ్యతలు తీరేవరకు కష్టపడితే తరువాత వచ్చేయవచ్చని అతని ఉద్దేశము.సమీరకు తండ్రి లేడు.తల్లి ఒక్కటే దూరాన పల్లెటూర్లో ఉంటుంది.సమీరకు  డ్యూటీలు ఉంటాయి.తేజ కి పది సంవత్సరాలు అయినా వయసుకు మించిన పెద్దరికంగా వ్యవహరిస్తుంది.నిర్మలమ్మ వాళ్ళ పక్క పోర్షను లో వీళ్ళు ఉంటారు.ఆవిడ

 ఆమె భర్త రామారావు ఉంటారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు.పిల్లలు ఇద్దరూ పెళ్ళిళ్ళు అయి వాళ్ళు కాపురాలు చేసుకుంటూ మంచి ఉద్యోగాలలో సెటిల్ అయ్యారు .పెద్దవాళ్ళు పక్కన తోడుగా ఉన్నారన్న ధైర్యంరమేష్ కి ఉంది.ఆ నమ్మకం వమ్ముకాకుండా నిర్మలమ్మ సమీర వాళ్ళ మంచీచెడ్డ అజ కనుక్కుంటూ ఉంటుంది.ఆమెకు ఇద్దరూ మగపిల్లలే అవ్వడంతో సమీరను తేజను ఎంతో ప్రేమగా చూస్తుంది.

                                ఉదయం ఆరుగంటలకు మెలుకువ వచ్చిన నిర్మలమ్మ వాకిట్లో ముగ్గు వేయడానికని వచ్చి సమీర ఇంటివైపు చూచి తలుపులు వేసి ఉండటం గమనించి రాత్రి ఎప్పుడు వచ్చిందో ఈ పిల్ల ఇంకా లేచినట్లు లేదు పాపం అనుకుంటూ పనిపూర్తి చేసుకొని లోపలికి వెళ్ళి పోయింది.ఇంటి పనులన్నీ ముగించుకొని

 వీళ్ళు ఏంచేస్తున్నారో అని పక్కింటి గుమ్మంలోకి తొంగి చూసింది.ఆ తలుపులు అలాగే వేసి ఉన్నాయి.ఎంత ఆలస్యంగా వచ్చినా ఇంతసేపు పడుకోదే అనుకుంటూ

 “సమీరా!సమీరా”అని పిలుస్తూ తలుపు కొట్టింది.తేజ తలుపు తీసి “రాత్రి అమ్మ ఇంటికి రాలేదు అమ్మమ్మా నాకు చాలా భయం వేసింది.”అంటూ భోరుమంది.

  “అయ్యో!అమ్మ రాకపోతే నన్ను పిలవవచ్చుకదా.నా కిదో మాయరోగం రాత్రి అయితే చాలు నిద్రకు ఆగలేను.మరి రాత్రి ఏం తిన్నావు”

   “బ్రెడ్డు ఉంటే తిన్నాను.ఇప్పుడు ఏంతినలేదు.ఇప్పుడే లేచాను.అమ్మ ఎప్పుడూ ఫోన్ చేసి లేట్ గా వస్తాను అమ్మమ్మ వాళ్ళింట్లో పడుకోమనో ధైర్యంగా ఉండమని

  చెప్పేది.కనీసం ఫోన్ కూడా చేయలేదు.నాకు చాలా భయంగా ఉంది.”కన్నీళ్ళు ధారాపాతంగా కారుతుండగా అంది పూజ.

 “ఏం కాదు నువ్వు ధైర్యం గా ఉండు.రెండు రోజుల నుండి కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి కదా.పనివత్తిడి లో ఫోన్ చేయడానికి కుదిరి ఉండదు.నువ్వు ఫ్రెష్ అయ్యి రా నేను వెళ్ళి టిఫిన్ తెస్తాను.”అని ఆమె వాళ్ళ ఇంటిలోక వెళ్లింది.ఆమె ఇంట్లోకి వెళ్ళేటప్పటికి ఫోన్ మోగుతోంది.ఎవరా ఈ టైములో అనుకుంటూ ఫోన్ తీసేటప్పటికి ఏడుపు వినిపించింది ఒక్కక్షణం ఏమీ అర్థం కాలేదు “సమీరా” అంది సందేహంగా

          “నేనే ఆంటీ”

       “ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు?”కంగారుగా అడిగింది.

    “నిన్న టెష్ట్ లో నాకు కరోనా పాజిటివ్ వచ్చింది ఆంటీ”

      “అయ్యో ! నువ్వు జాగ్రత్త గానే ఉంటావు కదా ! అలా ఎలా జరిగింది.”

      “ఏమో రెండు రోజుల నుండి కొంచెం తేడాగా వున్నా పట్టించుకోలేదు.వర్క్ ఎక్కువగా వుంటోందిగా అనుకున్నాను.నిన్న అనుమానం వచ్చి డాక్టర్ పరీక్ష చేస్తే బయట పడింది.పూజ కు ఫోన్ కూడా చేయలేదు.చేస్తే దానితో నిజం చెప్పాల్సి వస్తుంది. అది బెంబేలు పడిపోతుంది.నా పరిస్థితి ఏమౌతుందో? ఇంటి దగ్గర అది

  ఒక్కటే వుంది అదొక దిగులు.మానసికంగా నన్ను కుంగదీస్తున్నాయి.”

    “అలా అనకమ్మా నువ్వు ధైర్యంగా వుండాలి.నీకేం కాదు.పూజ గురించి దిగులు పడకు .నేను జాగ్రత్త గా చూసుకుంటాను.”

    “మీరు చూసుకుంటారన్న భరోసా మనసులో వున్నా నేను తిరిగి రాగలనో లేదో .మళ్ళా దాన్ని కళ్ళతో చూడగలనో లేదో.భయమేస్తోంది ఆంటీ”

    “నువ్వే అలా బెంబేలు పడితే ఇతరులకు ధైర్యంఎలా చెబుతావు.ఇన్నాళ్ళుగా మనస్ఫూర్తిగా చేసిన సేవ వృధాగాపోదు.పైన భగవంతుని దీవెనలు నీకు పుష్కలంగా వుంటాయి.నువ్వు తప్పకుండా తిరిగి వస్తావు.నీ కూతురుతో సంతోషంగా గడుపుతావు.నీ మనోధైర్యమే నిన్ను కాపాడుతుంది.పూజ గురించి దిగులు  పడకు తనకు మేమున్నాము.”అని చెప్పింది

   “మీ మాటలతో కొంచెం మనసుకు స్థిమితం చిక్కింది.మొన్నటి దాకా ఇంటికి వస్తూనే వున్నాను కదా!పూజ ఎలా వుందో గమనించండి.మీరు కూడా జాగ్రత్త.పూజకి

   కేసులు ఎక్కువ వుండటంతో హాస్పటల్ లోనే వున్నానని చెప్పండి.మధ్యలో ఫోన్ చేసి కనుక్కుంటూ వుంటాను.థ్యాంక్యూ ఆంటీ.”

    “అలాగేనమ్మా! నువ్వు జాగ్రత్త”అని ఫోన్ పెట్టేసింది.

           ఆమె ఫోన్ పెట్టీపెట్టటంతోనే  రామారావు “ఎవరే ఆఫోను ఏంటట”అని అడిగాడు.

     ఆమె జరిగిన విషయం అంతా చెప్పి “పూజను మేము చూసుకుంటాము.ధైర్యంగా వుండమని చెప్పాను.”అంది

    “నీకు బుద్ది లేదే.ఎలా చూస్తావు.ఒకరికి ఒకరు దూరంగా వుండాలని అందరూ చెబుతుంటే.ఒకపక్క సమీరకు పాజిటివ్ అని చెబుతూ ఆ పిల్లకు ఎలా వుందో.

    మనం 60 ఏళ్ళు దాటిన వాళ్ళం.మనకు ఏదన్నా జరిగితే ఎవరు చూస్తారు.పిల్లలు ఎక్కడో దూరాన వున్నారు.ఆ పిల్ల మానాన ఆ పిల్లను వదిలెయ్యి.”అన్నాడు .

    “మీరు మనుషులు కాదండీ.అది చిన్నపిల్ల.ఏం చూసుకుంటుంది.పసిది.ఇప్పటి వరకు వున్నదే ఎక్కువ.అది ధైర్యం గలది కాబట్టి ఆ మాత్రమన్నా వుండ గలిగంది.మీ లాగా నేను పట్టించుకోకుండా వుండలేను.నాది తల్లి హృదయమండీ.ఇప్పుడిలా అంటున్నారు కాని వాళ్ళు చేసిన సహాయం ముందు ఇదెంత”

   ఒక్కసారి గతం కళ్ళముందు కదలాడింది.రామారావు రాత్రి భోజనం చేసి పడుకున్న కాసేపటికే ఒళ్ళంతా చెమటలు పట్టి వూపిరాడనట్లుగా అయ్యింది.నిర్మలమ్మ

  కంగారు పడి అప్పుడే హాస్పటల్ నుంచి వచ్చిన సమీరను పిలుచుకు వచ్చింది.సమీర వచ్చీరావడమే రామారావు పరిస్థితి గమనించి పూజకు తలుపులు వేసుకొని

   జాగ్రత్తగా వుండమని చెప్పి బీరువాలో డబ్బులు బాగ్ లో వేసుకుని ఆటో తీసుకువచ్చింది.ఇదంతా చూసి నిర్మలమ్మ ఆదుర్దా పడుతుంటే”ఏం లేదాంటీ ఎందుకైనా మంచిదిఒకసారి హాస్పటల్ లో చూపిద్దామని తీసుకువెళుతున్నాను.మీరు ఇంట్లోనే వుండండి హాస్పటల్ లో వుండలేరు.నేను చూపించి తీసుకు వస్తాను. “అని చెప్పి తనని అతి కష్టంతో హాస్పటల్ కు తీసుకువెళ్ళింది.తను పని చేసే హాస్పటల్ అవడంతో వెంటనే యమర్జన్సీ లో జాయన్ చేసుకొని టెష్ట్ లన్నీ

 చేసి ట్రీట్మెంటు మొదలుపెట్టారు.ఆ రాత్రంతా సమీర బెడ్ పక్కనే వుండిపోయింది.తెల్లవారగానే “ఆంటీ కంగారు పడతారు అంకుల్ .నేను ఇంటికి వెళ్ళి నిదానంగా విషయం చెప్పి తీసుకువస్తాను.పూజను కూడ స్కూలుకు పంపించి వస్తాను.డ్యూటీ నర్సుకు చెప్పి వెళ్ళతాను.మేము వచ్చేవరకు తోడుగా వుంటుంది”

  అని చెప్పి వెళ్ళి గంటలో నిర్మలను తీసుకువచ్చింది.హాస్పటల్ లో వున్న వారం రోజులు కంటికి రెప్పలా చూసుకుంది.ఆ రోజు హాస్పటల్ లో వెంటనే చేర్చడం వల్లనే

 ప్రాణాలు దక్కాయని డాక్టర్ కూడా చెప్పారు.అది మరచిపోలేని సహాయమే కాని...

   “అదివేరు.ఇదివేరు.ఆ లక్షణాలు ఎవరికి వున్నా అంటుకుంటాయని చెబుతున్నారు కదే.అందుకని చెబుతున్నా”కాని ఇందాక అన్నంత గట్టిగా అనలేకపోయారు.

   “మీరు ఎన్నైనా చెప్పండి.పూజను చూసేది చూసేదే.తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ కనిపెట్టుకొని వుందాము.

    ఆమె ఇక వినదని తెలిసి”నీ చావు నీవు చావు”అన్నాడు కోపంగా.

            ఆమె బయటకు వచ్చి పూజను పిలిచి “అమ్మకు హాస్పటల్ లో పదిహేను రోజులు వరకు ఫుల్ డ్యూటీ వేసారట.ఇంటికి రావడం కుదరదట.నిన్ను జాగ్రత్తగా

  చూసుకోమని నాకు చేసింది.నువ్వు కంగారు పడతావని నీకు చేయలేదట.నీకేం కావాల్సినా నన్ను అడుగు.నీకు బోర్ కొట్టకుండా నేను కబుర్లు చెబుతాను.”

   రోజూ ఉదయం సాయంత్రం భోజనం టిఫిన్ పెడుతూ గుమ్మం బయటే కూర్చొని తన చిన్నప్పటివి,పిల్లల చిన్నప్పటి కబుర్లు చెబుతూ పూజ సంతోషంగా వుండేలా

   చూసేది.మాస్క్ ధరించడం,సానిటైజర్ వాడటం మాత్రం మరచిపోయేది కాదు.పూజ కూడా పాటించేల చూసేది.సమీర మధ్య మధ్య లో ఆమెకు ఫోన్ చేసి

    విషయాలు తెలుసుకుంటూ వుండేది.పూజ అమ్మను చూడాలి ఎప్పుడూఇన్ని రోజులు చూడకుండా లేని గొడవ చేసినా”మీ అమ్మ ఎంతోమందికి సేవ చేస్తోంది.

 అలాంటి అదృష్టం ఏ కొద్దిమందికో వస్తుంది.అది తలచుకొని గర్వపడాలి కాని మారాం చేయకూడదు.”అని నచ్చచెప్పేది. ఇలా దినచర్య తో ఇరవై రోజులు గడిపోయాయి.సమీర కు పూర్తిగా తగ్గి నెగిటివ్ రావడంతో ఇంటికి వచ్చింది.

                       నిర్మలమ్మ చేతులు పట్టుకొని కళ్ళనీళ్ళు పెట్టుకుంది “మీరే లేకపోతే మేము ఏమైపోయేవారమో.నాకు ధైర్యం చెప్పడమే కాక పూజను కంటి పాపలా

 కాపాడారు.ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలను.”

      “నేను చేసింది ఏముంది.పసి దానికి ఒక ముద్ద అన్నం పెట్టడమే కదా!కష్ట సమయంలో మనుషులుగా ఒకరికిమరొకరు తోడుండమే మానవత్వం.”

   “ఎంతమంది ఇలా ఆలోచించగలుగుతున్నారు ఆంటీ.మీరున్నారన్న ధైర్యంతో మహమ్మారి నుండి బయటపడగలిగాను నేను.కాని కరోనా మహమ్మారి వలయంలో చిక్కుకొని తను కన్నబిడ్డను చూసుకోకుండానే కళ్ళు మూసిన తల్లి,కన్నతల్లి కడసారి చూపులకు నోచుకోని పిల్లలు,ఎంతమంది బంధువులు వున్నా దిక్కులేని శవాల్లా

  స్మశానాన్ని చేరుతున్న మృతదేహాలు ఈ వార్తలన్నీ వింటుంటే మనసు కలచి వేస్తుంది.మీ మానవత్వపు పరిమళాలలో తడిసిన నేను నిజంగా అదృష్టవంతురాలిని.”అంటూ చేతులు జోడించింది సమీర.

  ****

No comments:

Post a Comment

Pages