బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య కీర్తనలు పల్లకి ఉత్సవం - అచ్చంగా తెలుగు

బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య కీర్తనలు పల్లకి ఉత్సవం

Share This
బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య  కీర్తనలు   పల్లకి ఉత్సవం
డా.తాడేపల్లి పతంజలి 



బ్రహ్మోత్సవాలలో తొమ్మిదవరోజు ఉదయం పల్లకి ఉత్సవం జరుగుతుంది.
అన్నమయ్య కీర్తనలలో పల్లకి ప్రస్తావన ఉన్న కీర్తనలు 12 కనిపిస్తున్నాయి.వీటిలో భావాలపల్లకీలలో అలమేలు మంగమ్మను ఊరేగించిన కులుకక నడవరో కీర్తన జగత్రసిద్ధమైనది.
కులుకక నడవరో కొమ్మ లాలా
జలజల రాలీని జాజులు మాయమ్మకు
1. ఒయ్యనే మేను గదలీ నొప్పుగా నడవరో
గయ్యాళి శ్రీ పాద తాకు కాంతలాలా
పయ్యెద చెఱగు జారీ భారపు గుబ్బల మీద
అయ్యో చెమరించె మా యమ్మకు నెన్నుదురు
2.చల్లెడి గందవొడి మై జారీ నిలువరో
పల్లకి వట్టిన ముద్దు బణతులాల
మొల్లమైన కుందనపు ముత్యాల కుచ్చులదర
గల్లనుచు గంకణాలు గదలీ మా యమ్మ కు
3.జమళి ముత్యాలతోడి చమ్మాళిగలిడరో
రమణికి మణుల నారతులెత్తరో
అమరించి కౌగిట నలమేలుమంగనిదె
సమకూడె వేంకటేశ్వరుడు మా యమ్మకు
కఠిన పదాలు
కొమ్మలాలా =పల్లకి మోసెడి స్త్రీ లారా!
శ్రీ పాద తాకుకాంతలు =లక్ష్మీ దేవి పాదాలు తాకే అధికారం ఉన్న స్త్రీలు
గందవొడి =గంధపుపొడి
పణతులాల =ఓపల్లకి మోసెడి స్త్రీ లారా!
మొల్లమైన =అధికమైన
కుందనపు =పరిశుద్ధమైన బంగారపు
జమళి =జంట
చమ్మాళిగ =పాదరక్ష
భావం:
అలమేలు మంగని క్రొత్త పెండ్లికూతురుగాఅలంకరించి, చెలికత్తెలు బోయీలుగా మారిపల్లకీలో ఊరేగిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షిగా ఆ దృశ్యాన్ని అన్నమయ్య చూస్తూ, చెలికత్తెలను ఈకీర్తన రెండు చరణాలలో హెచ్చరించాడు.చివరి చరణపు రెండు పాదాలలో ఆమె వేంకటేశ్వరునిచేరిన ఘట్టాన్ని చూస్తూ పరవశించాడు.

పల్లవి

అమ్మలారా! కులుకుతూ నడవకండి.మీరు అలా నడిచినందువల్ల -అమ్మ కొప్పునుండి జాజిపూలు జలజలా రాలి పోయాయి జాగ్రత్త !మీకే అమ్మ పాదాలు తాకే అధికారం ఉన్నదని ఆ గొప్పని నడకలో చూపకండి. అమ్మ శరీరము మెల్లమెల్లగా కదిలిపోయి,పైట జారిబరువైన స్తనాలు బైట పడుతున్నాయి. మీ కుదుపులకి ఆమె నుదుటి మీద చెమటలు

పడుతున్నాయి. కొంచెం నెమ్మదిగా నడవండి.

ఓ ముద్దు గుమ్మలారా! అమ్మ పరిశుద్ధమైనబంగారపు ముత్యాల జడ కుచ్చులు అదిరిపోతున్నాయి! కంకణాలు ఘల్లనికదులుతున్నాయి.చూసుకొని నడవండి. అమ్మ పాపటలో ఉన్న గంధపుతడి పొడి ఆమె ఒళ్లంతా పడుతోంది.అవసరమైనచోట్ల కొద్ది సేపు నిలబడండి.అదుగో! అమ్మ దిగుతోంది. అమ్మకు జంటముత్యాలతో కూడిన పాదరక్షలివ్వండి.ఆ అందాల రమణీమణికి మణుల కాంతులతోహారతులివ్వండి. ఆహా! వేంకటేశ్వరుడు అలమేలు మంగని దగ్గరికి తీసుకొన్నాడు.ఎంత చూడముచ్చటగా మా అమ్మకు వేంకటేశ్వరుడు లభించాడు.

విశేషాలు

కొమ్మలారా!అనటానికి అన్నమయ్య కొమ్మలాల అంటాడు. అలాగే బాలులాల అనిఇంకోచోట ప్రయోగిస్తాడు. ఇది మనం అన్నమయ్య భాషలో గమనించాలి. ఏమమ్మో ! పెండ్లినడకేంటి ..కులుకుతూ నడకేంటి... కొంచెంచూసుకొని నడవండి.. ఇవి తెలుగునాట వినిపించేజాతీయాలు.వీటిని తన కవిత్వంలో సందర్భ శుద్ధితో కలిపి అన్నమయ్య హృదయాలకుదగ్గరయ్యాడు.

గడుసుదనముగల స్త్రీకి గట్టి వాయి(నోటి బిరుసు తనము కలిగిన స్త్రీ),గయ్యాళి అనేపేర్లున్నాయని ఆంధ్రనామసంగ్రహం చెబుతోంది. అందువల్ల "గయ్యాళి శ్రీ పాద తాకు ''లోగయ్యాళి పదాన్ని అమ్మవారికి కాకుండా చెలికత్తెలకు అన్వయించుకోవాలి.

కొద్దిపాటి కష్టము చేసిన తర్వాత శరీరం మీద చెమటలు రావడం సహజం.శరీరతత్త్వాలను బట్టి ఈ చెమట బిందువుల సమ్మేళనం ఉంటుంది. అలమేలు మంగమ్మ సుకుమారి.ఆవిడ నడవటంలేదు.పల్లకీలో కూర్చుంది.కాని పల్లకీ మోసే చెలికత్తెలు కొంచెం అటు ఇటుగాఅడుగు వేస్తే అలమేలు మంగ శరీరం ఆ కొద్దిపాటి కుదుపులకు తట్టుకోలేక పోయింది.శరీరపుకష్టంతో ఆమె నుదుటి మీద చెమట కమ్మింది.ఇక్కడ అన్నమయ్య చెప్పదలచుకొన్న అంశం

-అలమేలు మంగ మహా సుకుమారి అని.

ఒక పూలమాల పైనుంచి తనమీద పడగానేపూర్వకాలపు నాయికలు ప్రాణాలు కూడా విడిచేసేవారు.వాళ్ళు అంతటి సుకుమార స్వభావలు .(రఘు 8వసర్గ)అందువలన వేంకటేశుడనే కథానాయకుని కలుసుకొనబోయే అలమేలు మంగఅనే కథానాయిక సుకుమారి అని పదే పదే అన్నమయ్య హెచ్చరిక.

అలమేలు మంగకొరకు విష్ణుమూర్తి 12సంవత్సరాలు తపస్సు చేసాడు.కార్తికమాసములో శుక్ల పక్ష పంచమీ శుక్రవారమునాడు ఉత్తరాషాఢ నక్షత్ర శుభదినాన మహాలక్ష్మిబంగారు కమలములో కూర్చుండి మహావిష్ణువునకు సాక్షాత్కరించింది. ఇటువంటి అలమేలుమంగను (మహాలక్ష్మిని) వేంకటేశుని కొరకు పెండ్లి కూతురుగా అందమైన మాటల పల్లకీలోఊరేగించాడు అన్నమయ్య.

మొదటిసారి తాను కొండకు వచ్చి అలసిపోయినప్పుడు అలమేలుమంగ పెట్టిన తియ్యటి ప్రసాదం అన్నమయ్య చేత ఇలాంటి తియ్యటి పాటలు పాడించింది. ఈకీర్తనకు చక్కటి సంగీతం, గాత్రం, నృత్యం కలిస్తే - ఏదో తెలియని ఆనందంతో

కులుకు తప్పనిసరిగా వస్తుంది. ఈ కులుకుకీర్తనలో అన్నమయ్య పలుకులు కండచక్కెరపలుకులు.

మిగిలిన పల్లకి కీర్తనలు ఇవి: 

  i.     అడుగడుగుకు నీ వాడగాను మా       (5-219)

  ii.     ఇట్టె నిన్ను రమ్మనె నేమమ్మ          (7-55)

  iii.     ఎరగరటే ఆతనినెందాకనే     (8-22)

  iv.     తనివారదిరువ నందలముసేవ నేడు 9-189

 v.     ఎవ్వరినైనా మన్నించి యింత సేసుకొంటివి(13-155)     

  vi.     ఏటికిగన్నులు మూసే వెరఁగనివానివలె(16-247)

 vii.     ఎటువంటి మచ్చికలో యిద్దరికిని      (17-172)

  viii.     ముంచిన సంతసమున మోహించు టింతే కాక  (17-318)

  ix.     చెలియా వేగువెట్టుక చెప్పవే యాతని రాక       (22-328)          

  x.     సిగ్గువడ నించుకంతా చెలరేగేవు నీవైతే           (23-529)

  xi.     ఎఱగనా నీ సుద్దులు ఇప్పడు మా ఇంట వచ్చి(28-313).

అన్నమయ్య కవిత్వపు పల్లకీలో ఊరేగిన వాని అదృష్టమే అదృష్టం. స్వస్తి.

***


No comments:

Post a Comment

Pages