శివానందలహరి 81 నుండి 100 వరకు - అచ్చంగా తెలుగు

శివానందలహరి 81 నుండి 100 వరకు

Share This
శివానందలహరి 81 నుండి 100 వరకు
మంత్రాల పూర్ణచంద్రరావు శ్లో: 81. కంచిత్కాలముమామహేశ భవతః పాదారవిందార్చనైః
కంచిద్ధ్యానసమాధిభిశ్చ నతిభిః కంచిత్క థాకర్ణనైః
కంచిత్కంచిదవేక్షణైశ్చ నుతిభిః కంచిద్దశామీదృశీం
యః ప్రాప్నోతి ముదాత్వదర్పితమనా జీవన్స ముక్తఃఖలు ll

తా: ఓ ఉమా మహేశ్వరా ! కొంత కాలము పద్మములవంటి నీ పాదములను పూజించుట, కొంత కాలము నీ నామము ధ్యానము చేయుట , నీకు నమస్కారము చేయుట యందును,నీ కధలను వినుచూ కొంత సమయమును, కొంత సమయము నీ దర్శనము చేసికొనుట యందును,కొంత తడవు స్తోత్రములతో స్తుతించుచూ సంతోషముతో నీకు మనస్సు అర్పించు చున్నాడో వాడు జీవన్ముక్తుడు కదా !

శ్లో: 82. బాణత్వం వృషభత్వ మర్ధవపుషా భార్యాత్వమార్యాపతే
ఘోణిత్వం సఖితా మృదంగవహతా చేత్యాదిరూపం దధౌ
త్వత్పాదే నయనార్పణం చ కృతవాంస్త్వద్దేహభాగో హరిః
పూజ్యాత్పూజ్యతరః స ఏవ హిన చేత్కోవాతదన్యోధికః ll

తా: గౌరీపతీ! ఏ కారణము చేత  విష్ణువు నీకు బాణముగా ఉండెనో, వరాహముగా ఉండుట , సగము శరీరముతో అర్ధాంగిగా ఉండుట,స్నేహితుడిగా ఉండుట, నీ తాండవము నందు మృదంగము వాయించు వాడుగా ఉండుట , ఇటువంటి రూపములు దాల్చి , నీ పాదమునందునేత్రమును అర్పించిన వాడు ,నీ దేహమునందు ఒక భాగమును అయ్యెనో అందువలననే అతడు పూజ్యులకంటే పూజ్యుడు కదా !

శ్లో: 83. జననమృతియుతానాం సేవయా దేవతానాం
న భవతి సుఖలేశః సంశయో నాస్తితత్ర
అజనిమమృతరూపం సాంబమీశం భజంతే
య ఇహ పరమసౌఖ్యం తే హి ధన్యా లభంతే ll

తా: పరమ శివా! మిగిలిన దేవతలు అందరూ జనన మరణములు గలవారు. అటువంటి వారిని పూజించుట వలన తాత్కాలిక సౌఖ్యము తప్ప ముక్తి రాదు కదా ! పార్వతీ సమేతుడు అయిన పరమ శివుడు మాత్రమే జనన మరణములు లేని వాడు కనుక మోక్షానందమును ఇచ్చును .

శ్లో: 84. శివ తవ పరిచర్యా సంనిధానాయ గౌర్యా
భవ మమ గుణధుర్యాం బుద్ధికన్యాం ప్రదాస్యే
సకలభువనబంధో సచ్చిదానందసింధో
సదయ హృదయ గేహే సర్వదా సంవస త్వమ్  ll

తా: శివా! గుణవతి అయిన నా బుద్ధి అనెడి కన్యను నీకు సమర్పించెదను, సకల లోకములకు బంధువు అయిన వాడా , సచ్చిదానంద సముద్రుడా , దయతో కూడిన వాడా నీ సేవా సాన్నిధ్యము కొఱకు పార్వతీ దేవితో కూడి నా హృదయము అనెడి గృహమున నివసింపుము.

శ్లో: 85. జలధిమథనదక్షో నైవ పాతాళభేదీ
న చ వనమృగయాయాం నైవ లుబ్ధః ప్రవీణః
అశన కుసుమ భూషా వస్త్రముఖ్యాం  సపర్యాం
కథయ కథమహం తే కల్పయానీందుమౌళే ll

తా: ఓ చంద్ర శేఖరా ! సముద్రమును మధించే సమర్దుడను కాను, పాతాళమును  బేధించే సామర్ధ్యము లేదు, అడవులలో వేటాడు బోయవాడిని కానే కాను, ఆహారము, పుష్పము,ఆభరణము, వస్త్రములు నేను ఎట్లు సమర్పించగలనో చెప్పుము.

శ్లో: 86. పూజాద్రవ్యసమృద్ధయో విరచితాః పూజాం కథం కుర్మహే
పక్షిత్వం న చ వా కిటిత్వమపి న ప్రాప్తం మయా దుర్లభమ్
జానే మస్తక మంఘ్రిపల్లవ ముమాజానే నతేహం విభో
న జ్ఞాతం హి పితామహేన హరిణా తత్త్వేన తద్రూపిణా ll

తా: ఓ పార్వతీపతి! పరమ శివా ! పూజ చేయుటకు పూజా ద్రవ్యము లను సమృద్ధిగా ఏర్పాటు చేసుకున్నాను. కానీ పూజ చేయుట కు నీ శిరస్సు గానీ పాదపద్మములు గానీ నేను కనిపెట్టలేకున్నాను. హంస రూపము ఎత్తిన బ్రహ్మ గానీ, వరాహ రూపము ఎత్తిన విష్ణుమూర్తి  గానీ  నీ యొక్క ఆద్యంతమును కనుగోనలేకపోయిరి. ఇక నేను ఎంతటి వాడను .

శ్లో: 87. అశనం గరళం ఫణీ కలాపో
వసనం చర్మచ వాహనం మహోక్షః
మమ దాస్యసి కిం కిమస్తి శంభో
తవ పాదాంబుజభక్తి మేవ దేహి ll

తా: శంకరా! నీవు భుజించేది విషము, ఆభరణము సర్పము, ధరించునది చర్మము, వాహనము ఒక ముసలి ఎద్దు.ఇక నీవద్ద ఏమి ఉన్నది నాకు ఇవ్వటానికి. నీ పాద పద్మముల యందు భక్తిని ప్రసాదింపుము స్వామి ! 

శ్లో: 88. యదా కృతాంభోనిధి సేతుబంధనః
కరస్థలాధః కృతపర్వతాధిపః
భవాని తే లంఘితపద్మసంభవ
స్తదా శివార్చా స్తవ భావనక్షమః

తా: శివా! నేను ఎప్పుడు సముద్రానికి వారధిని కట్టగలనో, చేతితో పర్వతరాజమును క్రిందకు అణచ గలనో,బ్రహ్మ దేవుని మించిన వాడను ఎప్పుడు అగుదునో అప్పుడు నిన్ను పూజించటానికి,స్తుతించుటకు, ధ్యానించుటకు అర్హుడను కాగలను.

శ్లో: 89. నతిభి ర్నుతిభి స్త్వమీశ పూజా
విధిభిర్ధ్యానసమాధిభి ర్న తుష్టః
ధనూషా ముసలేన చాశ్మభిర్వా
వద తే ప్రీతికరం తథా కరోమి ll

తా: శివా! నీవు పూజా విధానములచే గాని,స్తోత్రములచే గాని,నమస్కారములచే గాని సంతోషపడు వాడవుగా లేవు, అర్జునుడు మొదలగువారి  వలె బాణములువేసి, రోకళ్ళతోను, రాళ్ళతోనూ తృప్తి పడతావేమో తెలుపుము. అలాగే నిన్ను ప్రసన్నము చేసుకొనెదను.

శ్లో: 90. వచసా చరితం వదామి శంభో
రహముద్యోగవిధాసు తే ప్రసక్తః
మనసా  కృతిమీశ్వరస్య సేవే
శిరసా చైవ సదా శివం నమామి ll

తా: శివా! నీ యొక్క శివయోగములు నాకు పరిచయము లేదు , సుఖ కరుడవు అయిన నీ చరిత్రను మాటల ద్వారా పలికెదను.నీ ఆకృతిని మనస్సులో నిలుపుకొందును. సదాశివుడవు అయిన నిన్నే శిరస్సు వంచి నమస్కరించెదను.

శ్లో: 91. ఆద్యా  విద్యా హృద్గతా నిర్గతాసీ
ద్విద్వా హృద్యా హృద్గతా త్వత్ప్రసాదాత్
సేవే నిత్యం శ్రీకరం త్వత్పదాబ్జం
భావేముక్తేర్భాజనం రాజమౌళే ll

తా: ఓ చంద్రశేఖరా! నీ అనుగ్రహము వలన నా హృదయమున అనాదిగా ఉన్న అజ్ఞానము తొలగిపోయినది.మనోహరమయిన జ్ఞానము హృదయమున ప్రవేశించినది .అందువలన పద్మముల వంటి  నీ పాదములను పూజిస్తాను. అవియే ముక్తికి మార్గములు అని భావిస్తాను.

శ్లో: 92. దూరీకృతాని దురితాని దురక్షరాణి
దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి
సారం త్వదీయచరితం నితరాం పిబంతం
గౌరీశ మామిహ సముద్ధర సత్కటాక్షైః ll 

తా: ఓ పార్వతీపతీ ! శివా! పాపములతో కూడిన దుష్ట అక్షరములు కలిగిన దురదృష్టము,దుఃఖము, దురహంకారము వాటితో కూడినవి అగు దుర్వాక్యములు దూరము చేయబడ్డాయి.పవిత్రమైన వాక్కు , సర్వ శాస్త్ర సారము అయిన నీ చరిత్రను అధికముగా త్రాగుచున్న నన్ను నీ కటాక్ష వీక్షణములతో ఉద్ధరింపుము .

శ్లో: 93. సోమకళాధరమౌళౌ
కోమలఘనకంధరే మహామహసి
స్వామిని గిరిజానాథే
మామక హృదయం నిరంతరం రమతామ్ ll

తా: చంద్రకళ ను ధరించిన శిరము తో, సుందరమైన మేఘమువంటి కంఠము కలదియూ,గురుస్వామి యైనదియూ,పార్వతీపతి రూపముతో ఉన్నదియూ అగు మహాతేజమున నిరంతరము నా హృదయము రమించునుగాక. .

శ్లో: 94. సారసనా తే నయనే
తా వేవ కరౌ స ఏవ కృతకృత్యః
యా యే యౌ యోభర్గం
వదతీక్షేతే సదార్చతః స్మరతి ll

తా:  శివుని గురించి పలికెడి నాలుకే నాలుక,శివుని దర్శించెడి కన్నులే కన్నులు,శివుని పూజించెడి చేతులే చేతులు . శివుని ఎల్లప్పుడూ స్మరించునట్టివాడే కృతార్ధుడు .

శ్లో: 95. అతిమృదులౌ మమ చరణా
వతికఠినం తే మనో భవానీశ
ఇతి విచికిత్సాం సంత్యజ
శివ కథమాసీద్గిరౌ తథా వేశః ll

తా: ఓ పార్వతీపతీ! శివా! నీ పాదములు అత్యంత మృదువైనవి , నా మనస్సు అత్యంత కఠిన మైనది , అక్కడ నివశించటము ఎలా ? అనే సందేహాన్ని విడిచిపెట్టు. అలాంటి సందేహమే నీకు ఉన్నట్లయితే కఠిన మైన కైలాస పర్వతము నీకు ఎలా నివాసమయ్యేది? 

శ్లో: 96. ధైర్యాంకుశేన నిభృతం 
రభసా దాకృష్య భక్తిశృంఖలయా
పురహరచరణాలానే
హృదయమదేభం బధాన చింద్యంత్రైః ll

తా: పురహరుడవు అయిన ఓ మహాదేవా ! నా మనస్సు అనే మదగజాన్ని , ధైర్యాన్ని అంకుశంగా చేసుకొని శీఘ్రమే దాన్ని నీ వశం చేసుకొని భక్తి అనే సంకెళ్ళతో నీ మహత్య్వ జ్ఞానముతో ముడిపెట్టి బంధింపుము .

శ్లో: 97. ప్రచరత్యభితః ప్రగల్భవృత్త్యా
మదవానేష మనఃకరీ గరీయాన్
పరిగృహ్య నయేన భక్తిరజ్జ్వా
పరమ స్థాణుపదం దృఢం నయాముమ్ ll

తా: ఓ ఈశ్వరా ! నా మనస్సు అనే మదపుటేనుగు మదించి విచ్చలవిడిగా సంచరించుచున్నది.దీనిని యుక్తిగా పట్టుకొని భక్తి అనెడి త్రాటితో బంధించి శివుని పాదమునకు కట్టివేయుము .

శ్లో: 98. సర్వాలంకారయుక్తాం సరళపదయుతాం సాధువృత్తాం సువర్ణాం
సద్భిస్సంస్తూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యాం
ఉద్యద్భూషావిశేషా ముపగతవినయాం ద్యోతమానార్థరేఖాం
కళ్యాణీం దేవ గౌరీప్రియ మమ కవితాకన్యకాం త్వం గృహాణ ll

తా: ఓ గౌరీపతీ ! నా కవితాకన్య కళ్యాణమునకు తగి యున్నది. ఈమె సమస్తమైన అలంకారములు కలిగి ఉన్నది.సరళమైన పదములు,మంచి వృత్తము , మంచి వర్ణము కలది.సజ్జనులు ప్రశంచించునట్టిది, సరసురాలు, సలక్షణముగా ఉన్నది . దేదీప్యమానముగా ఉన్న అలంకార విశేషములు కలది. వినయ గుణము కలది.ప్రకాశించుచున్న అర్ధముల వరుస గలది .కల్యాణి. ఇటువంటి కవితాకన్యను నీకు ఇస్తాను స్వీకరింపుము . 

శ్లో:99. ఇదం తే యుక్తం వా పరమశివ కారుణ్యజలధే
గతౌ  తిర్యగ్రూపం తవ పదశిరోదర్శనధియా
హరిబ్రహ్మాణౌ తౌ దివి భువి చరంతౌ శ్రమయుతౌ
కథం శంభో స్వామిన్కథయ మమ వేద్యోసి పురతః .ll

తా: ఓ పరమశివా! నీ శిరస్సు పాదములు కనుగొనుటకు బ్రహ్మ, విష్ణుదేవులు పశు పక్ష్యాదుల రూపములు ధరించి , భూమి ఆకాశము లు తిరిగి కష్టపడినారు కదా. అటువంటి నీవు ఆపాదమస్తకము నాకు ఎలా దర్శనము ఇచ్చావు తెల్పుము. దయాసముద్రుడవు అయిన నీకు ఇది సాధ్యమే కదా.

శ్లో: 100. స్తోత్రేణాలమహం ప్రవచ్మిన మృషా దేవా విరించాదయః
స్సుత్యానాం గణనా ప్రసంగసమయే త్వా మగ్రగణ్యం విదుః
మాహాత్మ్యాగ్రవిచారణ ప్రకరణే ధానాతుషస్తోమవత్
ధూతాస్త్వాం విదురుత్తమోత్తమ ఫలం శంభో భవత్సేవకాః ll

తా: ఓ దేవా! బ్రహ్మ మొదలగు దేవతలు అందరూ స్తోత్రము చేయుటకు అర్హులు అయిన వారిని లెక్కించు సమయమునందు నిన్ను ప్రధముడిగా లెక్కించు చున్నారు.మహాత్యముచే అధికమైన వాడిగా చూసినప్పుడు మిగిలిన అందరూ ధాన్యపు పొట్టువలె కొట్టుకొని పోగా నిన్ను మాత్రమె సారవంతమైన ధాన్యము వలె  తెలుసుకున్నారు.ఇది వట్టి సుత్తి పాఠము కాదు .నిజముగా చెప్పుచున్నాను .

 ***

No comments:

Post a Comment

Pages