విశ్వవ్యాప్త రామాయణం - అచ్చంగా తెలుగు
విశ్వవ్యాప్త రామాయణం - 2
శ్రీరామభట్ల ఆదిత్య బౌద్ధంలో రామాయణం :

బౌద్ధ మతంలో కూడా రామాయణం ఉంది. బుద్ధుడు చెప్పిన జాతక కథల్లో దశరథుడు అయోధ్యకి కాకుండా వారణాసి రాజ్యానికి రాజు. కౌసల్య వలన రాముడు, సుమిత్ర వలన లక్ష్మణుడు, కౌకేయి వలన భరతుడు పుట్టారు. ఇందులో రాముడి పేరు 'రామ పండితుడు'  అయితే కైకేయి,భరతుల నుండి తన పుత్రులను రక్షించటానికి దశరథుడు సీతారామలక్ష్మణులను హిమాలయాలకి 12 సంవత్సరాల పాటు ఆశ్రమ వాసానికి పంపాడట.

అటుపిమ్మట తొమ్మిదేళ్ళకు దశరథుడు మరణించగా సీతాదేవి, లక్ష్మణుడు తిరిగి రాజ్యానికి వచ్చారు. కానీ రామపండితుడు ( రాముడు ) మాత్రం మరో రెండేళ్ల పాటు హిమాలయాలలోనే ఉన్నాడట.  ఈ రామాయణంలో సీతాపహరణం ఇంకా రామరావణ యుద్ధం అనే ఘట్టాలు లేవు. జాతక కథల్లో ఎలాగైతే బుద్ధుడు తన పూర్వ జన్మల గురించి చెప్తాడో ఈ కథలో కూడా రామపండితుడు ఎవరో బుద్ధడే... అదికూడా ఆయన పూర్వ జన్మే!!!

ఇక్కడ సీతాదేవిని యశోధరగా చెప్తారు. ఈ రామాయణంలో రావణుడి ప్రస్తావన లేదు, కానీ మహాయాన బౌద్ధశాఖలో మాత్రం 'లంకావతార సూత్ర' అనే గ్రంథం ఉన్నదట. ఈ గ్రంథం మహామతి అనే బౌద్ధ భిక్షువు మరియు గౌతమబుద్ధుడి మధ్య జరిగిన సంభాషణ గురించి చెబుతుంది. అయితే ఈ సంభాషణ అంతా లంకారాజ్యంలో జరిగిందట. ఆ సమయంలో రావణుడనే రాక్షసుడు ఆ రాజ్యానికి రాజు. ఈ గ్రంథం చైనా, జాపాన్ దేశాలలోని బౌద్ధులకు చాలా ముఖ్యమైనది. 

జైనమత రామాయణం:

చాలా జైనమత గ్రంథాలు, ఆగమాలు, పురాణాల్లో రామాయణ ప్రస్తావన ఉంది. ముఖ్యంగా జైన పద్మపురాణంలో సీతారాముల గురించి ఉన్నది. కాకపోతే జైనంలో సీతమ్మ పేరు 'పద్మజ'. జైన సిద్ధాంతాల ప్రకారం వాసుదేవుడు, బలరాముడు మరియు ప్రతివాసుదేవుడు అనే ముగ్గురు ప్రతీసారీ జన్మిస్తూనే ఉంటారు. వీరిలో వాసుదేవ బలరాములు ధర్మానికి, ప్రతివాసుదేవుడు అధర్మానికి ప్రతీక. ప్రతీ అర్థకాలచక్రాంలో తొమ్మిది మార్లు వాసుదేవబలరామ, ప్రతివాసుదేవులు భూమిపై జన్మిస్తారు. వీరిని 'శలాక పురుషులు'అని అంటారు.  అలా మొత్తం 63 సార్లు ఈ త్రయం భూమిపై జన్మిస్తారట. వీరి కథలను 'త్రిషష్టిశలాకపురుష చరిత్ర' అనే గ్రంథం వివరిస్తుంది. 

ఈ అర్థకాలచక్రంలో ఎనమిదివ త్రయంగా రామలక్ష్మణరావణులు జన్మించారు.  అయితే జైన రామాయణంలో లక్ష్మణుడు వాసుదేవుడిగా, రాముడు బలరాముడిగా మరియు రావణుడు ప్రతివాసుదేవుడిగా కనిపిస్తారు. యుద్ధకాండ వరకు దాదాపుగా మన రామాయణమే ఉంటుంది కానీ యుద్ధంలో మాత్రం రావణుడిని రాముడు కాకుండా లక్ష్మణుడు సంహరిస్తాడు, ఎందుకంటే లక్ష్మణుడు వాసుదేవుడు కాబట్టి ప్రతివాసుదేవుడి మరణం వాసుదేవుడి చేతిలోనే అవుతుంది. 

ఈ రామాయణంలో ఉన్న తేడాలేమిటంటే రామలక్ష్మణసుగ్రీవుల చేత ఓడబడ్డ 'వాలి' జైన సన్యాసిగా మారి మోక్షాన్ని పొందుతాడు. వాల్మీకి రామాయణంలో లాగా రాముడిక్కడ ఏకపత్నీ వ్రతుడు కాడు ఆయనకు ఎనిమిదివేలమంది భార్యలు, వారందరిలో సీతాదేవి (పద్మజ) మహారాణి.  లక్ష్మణుడికి పదహారువేలమంది భార్యలుండగా వారిలో 'పృథ్వీసుందరీ' అనే స్త్రీ ముఖ్యురాలు. లక్ష్మణుడు మరణం తరువాత రాముడు కూడా జైన సన్యాసిగా మారి మోక్షాన్ని పొందుతాడు. సీతాదేవి స్వర్గానికి, లక్ష్మణరావణులు నరకానికి వెళ్ళారట. 

జైనంలో మొత్తం 23రకాల రామాయణాలు ఉన్నాయి. అవన్నీ ప్రాకృత, సంస్కృత, అపభ్రంశ భాషలలో రాయబడ్డాయి. 


నీలాంబుజ శ్యామల కోమలాంగం,
సీతా సమారోపిత వామభాగం | 
పాణౌ మహా సాయక చారు చాపం,
నమామి రామమ్ రఘువంశ నాథం ||

( ఇంకా ఉంది..... )

No comments:

Post a Comment

Pages