శ్రీవేంకటరమణ శతకము - ప్రతాప రాఘవపాకయాజి - అచ్చంగా తెలుగు

శ్రీవేంకటరమణ శతకము - ప్రతాప రాఘవపాకయాజి

Share This
 శ్రీవేంకటరమణ శతకము - ప్రతాప రాఘవపాకయాజి
పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం


కవి పరిచయం:
శ్రీవేంకటరమణ శతకకర్త ప్రతాప రాఘవపాకయాజి విజయవాడ వాస్తవ్యుడు. తండ్రి బసవావధాని. తల్లి వరలక్ష్మి. రామయశాస్త్రి, సుబ్బావధాని అనువారలు ఇతని అన్నలు. ఈతని భార్య సరస్వతి. కుమారుడు రాధాకేష్ణశాస్త్రి. శతకాంతమున ఈ కవి తనను గురించి ఈ విధంగా చెప్పికొనినాడు.

సీ. శ్రీప్రతాపకులాబ్ధి శీతాంశుఁడగు నాదు, ప్రపితామహుండు సుబ్బనవధాని
వేదాదివేత్తయౌ వేంకటశాస్త్రి యు, ద్దాముండు నాదు పితామహుండు
బహుతపోధనుఁడగు బసవావధాని స, ద్ధర్మజ్ఞుఁడతఁడు నా తండ్రిగారు
ధవుఁడే తనకు ముఖ్య దైవతం బనియెంచు, సాద్వి శ్రీవరలక్ష్మి జనని నాకు
బ్రహ్మవిద్యాభోదపరుఁడు రామయశాస్త్రి, యఖిలార్థవేత్త నా యగ్రజుండు
పార్థివలింగ సపర్యా పరుండు సు, బ్బవధాని వేరొక్క యగ్రజుండు
అనఘ! రాఘవ పాకయాజి యనంబడు, వాఁడ నిన్నేవేళ వేడునాఁడ
భవదీయ కరుణకుఁ బాత్రుఁడు కొడుకు రా, ధాకృష్ణశాస్త్రి త్వద్భక్త వరుఁడు

గీ. భార్యనాకు సరస్వతి; యార్యులయిన
సరస తిరుపతి వేంకటేశ్వరులు గురులు
నీ వుపాస్యదైవతమవు నిగమవినుత!
వేంకటేశ్వర! కృతిగొమ్ము వినుతిఁజేతు!

అయితే ఈ పైని పద్యంలోని గురువులకు ఈ కవి ఏకలవ్య శిశ్యుడని పరిష్కర్త అయిన చళ్లాపిళ్ల వేంకట శాస్త్రిగారు తమ పరిచయ వాక్యాలలో పేర్కొన్నారు. ఈకవి విజయవాడ గృహంలో నిరంతర అన్నదానం జరుగుతుందని ఈకవి గురించి ఆతని అన్నదాన వ్రతంగురించి అప్పటిలో తెలియని వారులేరనికూడా చళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారు పేర్కొన్నారు. తిరుపతి వేంకటకవులు ఈకవి గురించి తమ ఖామేశ్వరీ శాతకంలో కూడా వారు ఒకటి రెండు పద్యాలలో పేర్కొన్న విషయం గమనార్హం.

ఈకవి ఇతర రచనల గురించి కానీ జీవితకాలాదుల గురించి కాని సమాచారం తెలియలేదు.

శతక పరిచయం:

"వేంకటరమణా" అనే మకుటంతో  వంద కంద పద్యాలలో రచింపబడిన ఈశతకం భక్తిరస నీతిరస ప్రధానమైనది. శ్రీకృష్ణుని బాల్య లీలా వర్ణనము, దశావతార వర్ణనము, మొదలైనవి ఈశతకంలో మనం చూడవచ్చును. అన్నమయ్య కీర్తనలలోని బావములను, ఇతరపురాణ శతక పద్యముల అనుకరణలు కూడా ఈ శతకంలో మనకు కనుపిస్తాయి. కొన్ని పద్యాలను చూద్దాం.

క. అన్నియుఁ దీర్థంబులు నీ
సన్నిధిలోఁ గలవు ముక్తిసంపత్తికినై
యెన్నొయొ తావుల గొందఱు
పిన్నలవలెఁ దిరుగుటేల వేంకటరమణా

క. ఉండవు వైకుంఠములో
నుండవు తిరుమలను నిలిచి యుండవు రవిలో
నుండెదవు భక్తిరసమున్
బిండెడి సద్భక్తులింట వేంకటరమణా

క. ఏటికి నీ సంసారము
దాఁటగఁ జాలఁగదా నేను దరిఁజేర్పుము నీ
బోటి మహాత్ముల నేనే
వీటను జూడంగఁబోను వేంకటరమణా

క. పల్కుకుఁ బల్కుకు నమృతముఁ
జిల్కఁగ సిరి కల్కిమిన్న సేవింపఁగడున్
గుల్కెడు రెండవ చెఱకున్
విల్కాఁడవు నీవు గావె వేంకటరమణా

క. అంతయు మిథయె తలఁపఁగ
నెంతురు నిక్కమని యెందరెందరొ మదిలో
సంతస మందుచు నుండుట
వింతగా నున్నది గదయ్య వేంకటరమణా

కొన్ని దశావతార పద్యాలను చూద్దాం

క. వేదమ్ములు దొంగిలి యీఁ
గాదని శఠియించు సోమకాసురు శిరమున్
చేదింప మీన మైతివి
వేదాంతశిరోవిభూష! వేంకటరమణా!

క. పుడమిని జాపగఁ జుట్టియుఁ
గడలినిఉ దా నుండ హేమకశిపుననుజునిన్
మడియింపవె! సూకరమై
విడనాడక జగతిఁ బ్రోవ వేంకటరమణా!

క. నరహరివై ప్రహ్లాదునుఁ
గరుణించితి వంత హేమకశిపు నసువులన్
హరియించి యెల్లజగముల
వెఱపింపవె రౌద్రమూర్తి! వేంకటరమణా!

క. దశరథరాముఁడ వవుచున్
బశుపతివిలు ద్రుంచి సీతఁ బరిణయమై యా
దశముఖుశిరములు ద్రుంపవె
విశృంఖల మహస్సహాయ!వేంకటరమణా!

ఇప్పుడు కొన్ని ప్రముఖ పద్యాలకు అనుకరణలను చూద్దాము.ఈక్రిందిపద్యాన్ని చదవగానే మనకు పోతన గారి "అరయన్ శాంతను పుత్రుపై, విదురుపై ... " అనేపద్యం గుర్తుకు రాకమానదు.

క. విదురునిపై నరుపైనను
గుదురుగ నక్రూరుపైన గోపికలపయిన్
వెదజల్లు నీదుకృప నొ
ప్పిదముగ నామీఁదఁ జూపు వేంకటరమణా

ఈ క్రిందిపద్యం చదవండి. అన్నమయ్య కీర్తన "ఎంతమాత్రమునను ఎవ్వరు తలచిన" మనకు జ్ఞాపకం వస్తుంది.

క. కొందఱు స్కందుం డనియును
గొందఱు శివుడనుచు~ందలఁచికొందురు; మఱియున్
గొందరు భక్తులు నిను గో
విందుం డని తలచుచుండ్రు వేంకటరమణా!

ఇదేవిధంగా భాగవతంలోని శ్రీకృష్ణ లీలలు, భాగవతంలోని ఘట్టాలు ఆధారంగా అనేక మధురమైన పద్యాలను ఈశతకంలో మనం చదుకొనవచ్చును. చక్కను సరళమైన భాషలో రచించిన ఈ శతకం అందరు చదవవలసిన శతకం.
మీరూ చదవండి. మీ మిత్రులచేత చదివించండి.

No comments:

Post a Comment

Pages