ఇడియట్స్ - అచ్చంగా తెలుగు
ఇడియట్స్
జైదాస్ 

 


             "యాభై ఏళ్ళు పైబడ్డాయి. ప్రిన్సిపల్ గా పనిచేస్తూ రిటైర్మెంట్ కు దగ్గర్లో ఉన్నారు. 'కాలేజీ బుల్లోడి'లా ఇప్పుడు 'పి హెచ్ డి' చేసి ఏం చేయబోతున్నారు?"  నవ్వుతూ అడిగారు డీఐఈవో గారు. 
"డాక్టరనిపించుకోవడం నా చిరకాల కోరిక సర్!" నసిగాడు శేఖరం. 
'స్లెట్', 'నెట్'  రెండూ  ఏకకాలంలో పాసై,యూని వర్సిటీ క్యాంపస్ లో పార్ట్ టైం పి హెచ్ డి సీటు రావడంతో పర్మిషన్ కోసం వచ్చాడతడు. 
'అయినా చదువుకు వయసుతో సంబంధం ఏంటో?'  "అన్నట్టు..మీ కాలేజీలో ఏదో 'ఇడియట్స్ క్లబ్' పెట్టారటగదా!ఏంటది?" ఆసక్తిగా ఆడిగారాయన. 
"ఎస్ సర్!  'చదువు కొనాలని' కోరుకొనే  'ఎడ్యుకేటెడ్ ఇడియట్స్' పేరెంట్స్ లో మార్పుతెచ్చి, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడం ద్వారా ఆత్మహత్యల ను నివారించాలని.."  
"అంటే.. పేరెంట్సే ఇడియట్స్ అంటారా?"  
"అవునుసర్! సోషల్ మీడియా పుణ్యమాని నేడు పబ్లిసిటీ పరిధిమించి పోవడంతో  'ఎగ్జిబిషనిజం'కు ఎల్లలు లేకుండా పోయాయి. చదువుల్లో తాము సాధించిన విజయాలను, ముఖ్యంగా కార్పొరేట్ కాలేజీలు ర్యాంకర్లను కూడా కొనుగోలు చేసి,అది తమ గొప్పతనంగా చెపుతూ  మాయ చేస్తున్నారు. ఆకాశానికి నిచ్చెనలేసే ప్రచారాలతో ఊదర గొడుతుండడంతో, మిగతా వారు తమ స్థాయి తెలుసుకోకుండా తామూ సాధించాలని  ఆశపడుతూ, సాధించ లేనప్పుడు నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. పోటీలో అందరూ గెలవడం ఎలా సాధ్యమో ఆలోచించని పేరెంట్స్,  డబ్బుతోనే అన్నీ కొనేయాలనే అత్యాశతో  చేస్తున్న ఒత్తిడి యువత పాలిట శాపంగా మారుతోంది. ఉన్నోళ్ళు, లేనోళ్ళు తేడాలేకుండా 'క్యాష్ తో కార్పొరేట్ చదువుకొని సంపాదించేద్దామ'ని ఆశపడుతున్నారు. పండ్లను కృత్రిమంగా పండించడానికి మందులేసినట్టు,  కార్పో'రేటు' మందులేసి తమ కలలు పండించుకోవాలను కుంటున్నారు. తెలివిని తూకంలో కొనలేమని తెలియక పోవడంతో ఆ కలలే కల్లలై పిల్లల పాలిట తలకొరివిగా మారుతున్నాయి. సామర్ధ్యాలు వేరయినా, ఫలితాలు మాత్రం అందరూ ఒకేలా ఉండాలను కుంటున్నారు. నాగరికత పుణ్యమాని ఇప్పుడన్నీ కృత్రిమం కావడం వల్ల, సమాజంలో సర్దుబాట్లు లేక ఎవరికీ ఏదీ సరిగా,సహజంగారాక, దేనిమీదా పూర్తి అవగాహనలేక, ప్రతిదీ ఆఖరుకు 'వ్యక్తిత్వాన్ని'కూడా డబ్బుతో 'కొని'వేసుకుంటున్నారు. ఈ వీక్ నెస్ వల్లే వ్యాపారులు యువతను చేతగాని వారిగా చేసి, తమపై ఆధార పడే పరిస్థితులు కల్పిస్తూ, మానసికంగా ఎదిగేవాళ్లను కూడా 'ఆర్థికదారి'కి మళ్లించి అన్నీ తామే నేర్పిస్తామని చెప్పి వ్యాపారం చేస్తున్నారు. 'నేర్పడం' తప్ప 'అలవర్చడం' రాని వీళ్లని వ్యక్తిత్వ వికాస నిపుణులనీ, విద్యావేత్తలనీ, మనమే నెత్తినెక్కించు కుంటున్నాం. 'పరుగెత్తి పాలుతాగేకంటే నిలబడి నీళ్లు తాగడం మిన్న' అని మన పెద్దలంటే, 'ఠాఠ్..! పరుగెత్తితేనే ఆరోగ్యం.ఆ పాలే సమతులా హారం' అనిచెప్పే వీళ్ళు, వాళ్లెవరో గొప్పవాళ్ళయ్యారని మీరూ కావాలని,కావొచ్చనీ రెచ్చగొట్టే రకాలు. నేడు సినీ రంగంతో సహా అన్నిరంగాలకు యువతను మించిన ఆదాయమార్గం మరోటిలేదు. అందరిదాడి యువత పైనే. ఇక చదువును చదువుగా చూడకుండా  అమ్మడానికో, కోనడానికో వాడటం,డబ్బుతోనే చదువులో గెలుపొందాలను కోవడం ఎంత అసంబద్ధం? ఇవన్నీ తెలిసికూడా వాటికే  విలువిస్తున్న పేరెంట్స్ ని 'ఇడియట్స్' అనక ఇంకేమనాలి?"
  "అలాగా..! మరి వీటిని మీరెలా సరిదిద్దుతారు?"  
"యువతలో ఈ విపరీత ధోరణికి కారణమైన మీడియాతో సహా, పైవారందర్నీ యువతకు దూరంగా ఉంచి, విద్యారంగాన్ని వేరుచేయాలి. యువతకు ఒత్తిడి లేకుండా చదువు పూర్తయ్యే వరకు బయటి ప్రపంచం తెలియని 'ఇడియట్స్' లా పెంచడమే మంచిది. ఇక చిన్న విషయాలక్కూడా ఆత్మహత్యలకు ప్రయత్నించే వారికి చరిత్ర గురించి  కొంత అవగాహన కల్పించాలి. ప్రయివేటు విద్యకానీ, మరే ప్రత్యామ్నాయాలు కానీ లేని మా కాలంలో ఫెయిలై ఏడాది ఖాళీగా ఉన్నా ఎవరూ జీవితంలో ఓడిపోలేదే? కోరినగ్రూపు కానీ, ఆఖరుకు రిజర్వేషన్ ఉన్నా పోటీవల్ల సీటు కానీ రాక కూలీలుగా మారిన వారెందరో. వీళ్ళేవరికిలేని నిరాశ కుప్ప తెప్పలు గా అవకాశాలుండి,  ఫెయిలైతే కేవలం ఒక్క నెలలోనే సరిదిద్దుకునే వీలున్న వీళ్ళకెందుకు? టెన్త్ ఫస్ట్ క్లాస్ లో పాసైనా ఇంటర్లో సీటురాక లారీడ్రైవర్ గా మారిన నాఫ్రెండ్ 'రాజు' కానీ, టెన్త్ ఫస్ట్ క్లాస్ లో పాసైనట్టు రిజల్ట్ చూసి, బ్రహ్మాండమైన పార్టీ ఇచ్చాక, 61 మార్కులు తిరగబడి ఫెయిల్ మెమో వచ్చిన 'రవి' కానీ జీవితం మీద విరక్తి చెంది 'స్వయంచావు' గురించి ఆలోచించలేదే? యువత చే ఇవన్నీ ఆలోచింపజేసి,వారికి జీవితంపై ఆశలు పెంచాలనే 'ఇడియట్స్ క్లబ్' పెట్టాం. పైరెండు రకాలవారిని మా 'క్లబ్' లో సభ్యులుగా చేర్చి అవసరమైన కౌన్సిలింగ్ ఇస్తాం.ఇక పరీక్షలు కూడా బుక్స్ చూసి రాసేపద్దతిలో ఉండాలి సర్." 
"బుక్స్ చూసి రాస్తే ఇప్పటివాళ్ళు అసలు చదవరేమో! స్టూడెంట్స్, లెక్చరర్స్ గైడ్స్ మీదే ఆధార పడతారుకదా?"  
"అందుకే సర్ గైడ్లను పూర్తిగా నిషేధించా లంటున్నాను. గైడ్స్ గా ఉండాల్సిన టీచర్లే గైడ్స్ చూసి చెప్పే చదువుకు అర్ధమేముంది?విద్యార్థులు పుస్తకం చదివి అర్ధం చేసుకోగలగాలి.దానికి టీచర్లు సహాయపడాలి.అప్పుడు తెలివైన వాడే తెలివిగలపనికి అర్హుడవుతాడు. ఎవరి స్థాయికి తగ్గట్టు వారు ఉపాధి పొందు తారు. డాక్టర్స్ లాంటి  వృత్తుల్లో అర్హులే వుంటారు. కాబట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటాలుండవు. ర్యాంకుల పోటీ  ప్రకటనలు, తల్లిదండ్రుల్లో ఆశలు రేకెత్తించడాలు, అనవసరమైన గొంతుకోత పోటీలు, ఫీజుల దోపిడీలు అసలే వుండవు."  
"ఇవన్నీ సాధ్యమే నంటారా?" ఆయనలో సందేహం. 
"విద్యను వ్యాపారంగా చూసే వారు, వ్యక్తిగత లాభాలిచ్చే వాటినితప్ప, సామాజిక ప్రయోజనాల్ని పట్టించుకోని వారు,సంపాదించాకే సమాజాన్ని గురించి ఆలోచించే వారూ మారితే సాధ్యమే సర్! సంపాదించాక సగమిచ్చి శ్రీమంతులనిపించుకోవడంకన్నా, సరైన విద్యకు వాళ్ళ సామర్ధ్యాల నుపయోగించి  'సమసమాజ శ్రేయోభిలాషుల'ని పించుకోవచ్చు కదా! ఖరీదైన మద్యం నుంచి కాస్మటిక్స్ దాకా రూపాయి, పది రూపాయల ప్యాకెట్లలో కుదించి సామాన్యులు కూడా కొనేలా తెలివిగా వ్యాపారం చేసేవాళ్ళు అత్యవసరమైన విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురాలేరా? నాయకులు, వ్యాపారులు వీళ్లంతా తలచుకుంటే  ఇదోకష్టం కాదనుకుంటా సర్" అంటూ ముగించాడు శేఖరం. 
అనాధగా పెరిగి చదువులో అడుగగుడునా అడ్డంకుల్ని అధిగమించి ఈ స్థాయికెదిగిన శేఖరం జీవితమే ఓ 'కష్టాలక్లబ్.' అదే ఇప్పటి విద్యార్థులైతే ఎప్పుడో ఆత్మహత్యకు పాల్పడి ఉండేవాళ్ళు. కష్టాలకు కుంగి పోయి తనూ ఏ అఘాయిత్యాని కో పాల్పడివుంటే తను యువతకు సహాయ పడగలిగేవాడా? అప్రయత్నంగా తన గతం గుర్తొచ్చిందతనికి.
  *    *    *
              'హై'టెక్కు' సిటీ గా మారిన హైదరాబాద్ మహానగరం. ఎలానడుస్తున్నాడో ఎటు పోతున్నాడో తెలీకుండా రోడ్డున పడి నడుస్తున్నాడు చంటిగాడు. ఇక ఒక్కరోజే ఉంది 'టర్మ్ ఫీ' కట్టడానికి. ఇష్టంగా చేస్తున్న 'ఎంబీఏ' కూడా ఏమౌతుందోనన్న దిగులు పట్టుకుంది. చిన్ననాటే తండ్రిని పోగొట్టుకున్న చంటిగాడి అసలు పేరు 'చంద్రశేఖర్. టంకశాల' సొంతూరు దక్షిణ కోస్తాలోని ఓ పాళెం. అప్పట్లో చంటిగాడు హీరో గా 'పూరీ' గారు  సిన్మా తీసి హిట్ కొట్టడంతో ఆ 'ఇడియట్' సిన్మా పుణ్యమాని 'చంటిగాడ'నే ఫేమస్సయ్యాడు. ఇంటి పేరులో 'ఖజానా' ఉన్నా ఇంట్లో దారిద్య్రం చేసే 'గానాబజానా' తప్పక పోవడంతో కష్టాలతో కసి పెంచుకున్న చంటిగాడు దాన్ని చదువుమీద చూపేవాడు.  'బోయ్...' మన్న హారన్ శబ్దానికి ఆలోచిస్తూన్న వాడల్లా ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు. బ్రేక్ వేయడం కొద్దిగా లేటయినా జీపు కింద పడిపోయేవాడే. డ్రైవర్ అర్ధం కాని భాష లో తిడుతున్నాడు. ఇదేమీ పట్టించుకోని చంటిగాడి దృష్టినాకర్షించింది జీపుకున్న బ్యానర్. దానిమీద తాటి కాయంత అక్షరాలతో 'చదువులు దండగ' అని రాసి ఉంది. కళ్ళు నులుముకుని మళ్లీ చూసేడు సందేహంలేదు. అది 'పండగే.' 'దండగ'ని తనే పొరపడ్డాడు. 'చదువుల పండగ' ప్రచారం తాలూకు బ్యానర్ అది.చిత్రంగా చదువు కోసం తపన పడే తను   ఆ 'చదువుల పండగ' ప్రచార వాహనం కిందేపడబోయాడు. ఒక్కసారిగా చంటిగాడికి తన పరిస్థితి  మీద తనకే జాలేసింది.  చదువు మీద ఎన్నో ఆశలున్నా, ఆర్థిక ఇబ్బందులతో  తనలా ఎందరో ఏడుస్తుంటే' వాళ్లను వదిలి, బ్రతకడానికేదో ఒక పని చేసుకుంటున్న పిల్లల్ని బలవంతంగా బడిలో వేస్తే వాళ్ళ గతేంకాను? చదువుకోవాలని ఉందో, లేదో  తెలుసుకోకుండా, ఆర్థికంగా ఆదుకోకుండా 'చదువుల పండగ' పేరుతో పన్లోంచి పీకి వాళ్ళ బ్రతుకులు 'దండగ' చేయడం వల్ల లాభం ఉంటుందా? దీనికన్నా ఏ బీహార్ కో వెళ్లడం నయమని పిస్తోంది చంటిగాడికి. ఎంచక్కా అక్కడైతే  యాదవ పిల్లలు పశువులు కాసే పచ్చిక బయళ్ళకే  పంతుళ్లువచ్చి పాఠాలు చెప్పే ఏర్పాట్లు చేశారట. 'తన కన్నా వాళ్ళ బ్రతుకులే నయం' అనుకున్నాడు చంటిగాడు. అయినా తన 'జాతకం'ఇలా తగలడుతుంటే ఎవరేం చేయగలరు? జాతకం అన్నమాట గుర్తుకు రాగానే చంటిగాడి బుర్ర  పాదరసంలా పనిచేసింది. 'ఈ వారం తన  రాశిఫలాలు చూసుకుంటే...?' ఈ థాట్ రాగానే  నేరుగా లైబ్రరీ కెళ్ళాడు. 'కర్కాటక రాశి'  లో 'ఆర్థిక ఇబ్బందులు తప్పవు. అయినా సమయానికి సొమ్ము చేతికందుతుంది. అనుకోని రీతిలో కార్యం చక్కపెట్టుకోగలరు. చేపట్టిన కార్యాల్లో జయం.'  అని ఉండటంతో చంటిగాడు ఎగిరి గంతేసాడు. నిజానికి చంటి గాడికి  వీటి మీద నమ్మకం లేదు. కానీ 'జాలయ్య' జాతకం నిజమయ్యాక నమ్మక తప్పలేదు. అప్పట్లో వాళ్ల ఊరి బస్టాండులో ఓ కూల్ డ్రింక్ షాపుండేది. దాని యజమానే 'జల్లి మూకుడు జాలయ్య'. ఆయనకి కాస్తో కూస్తో 'హస్తసాముద్రికం' తెలుసు. తనకు తెలిసిన దానికి 'చిలవలు పలవలు' కల్పించి తన షాపు దగ్గర కూర్చునే వారికి ఉచితంగా జ్యోతిష్యం చెబుతూ ఉండేవాడు.దాంతో 'జల్లిమూకుడు' పోయి 'జాతకాల జాలయ్య' గా మారిపోయేడు. ఓ రోజు చంటిగాడిని "అబ్బీ! ఇలా రా! ఏది నీ చెయ్యిలా చూపించు" అంటూ పిలిచాడు జాలయ్య. చంటిగాడు అయిష్టంగానే  చేయిచూపాడు. "విద్యారేఖ బెత్తెడు కన్నా ఎక్కువ లేదు. నీకు చదువబ్బేలా లేదురా అబ్బీ! ఒకవేళ అబ్బినా అరకొర చదువే. ఎప్పుడోసారి నీ చదువుకు గండి పడే లాగుంది" అన్నాడు. జాతకాలంటే నమ్మకం లేని  చంటిగాడు జాలయ్యను ఓ ఆటపట్టించాలనుకున్నాడు. 'ఏడ్చావులేరా డబ్బీ ! ముందు నీ గల్లాపెట్టెకు గండి పడుతుందేమో చూసుకో. నా చదువు సంగతెలా ఉన్నా, నీ సొల్లు జాతకాలకు మాత్రం గండి పడేది ఖాయం కాస్కో' అనుకుంటూ "ఆహా..!అబ్బ.. ఎంత కరెక్టుగా చెప్పారండీ. ఏడో తరగతే ఏడుసార్లు ఫెయిలయ్యాన్నేను" అన్నాడు. "చూసావా.. ఏది తప్పినా ఈ జాలయ్య జ్యోస్యం గురి తప్పదు. మరింతకూ నువ్వేంచేస్తున్నావ్?" అడిగాడు.  'ఆఁ..చూస్తా..నీ గుడ్డి జాతకాలు గురితప్పించి ఎదురు తిరిగి మాడదరగొట్టేలా చేస్తా చూస్కో..'  "ఇక చేసేదే ముందండీ? పగలంతా గేదెలు కాయడం, సాయంత్ర మయ్యేసరికి ఇలా తయారై బజార్లో తిరగడం చేస్తుంటాను" అన్నాడు బాధనటిస్తూ. "అయ్యో పాపం!" అంటూ జాలిగా చూశాడు జాలయ్య. చంటిగాడు "ఇక నాకు మీరే దిక్కు. నా జాతకం ప్రకారం నేను ఏం చేస్తే బాగు పడతానో మీరే చెప్పాల" నడంతో జాలయ్య మరింత రెచ్చిపోయాడు. 'నువ్వు బిజినెస్ చేస్తే బాగా కలిసొస్తుందోయ్. పెద్ద 'బిజినెస్ మేన్' అయ్యే సూచనలున్నాయ" న్నాడు. 'ఓర్ని సిగతరగ ఇదే మన్నా తాతాలు,అంబానీల కాలమ నుకున్నావా..? ఫుడ్డు కే దుడ్డు లేక నేనేడుస్తుంటే నీ జ్యోస్యం నన్ను  ఉన్నపళాన బిజినెస్ మేన్ ని చేస్తుందా..?' అనుకుంటూ లోలోపల నవ్వుకున్న చంటిగాడు ఆఖర్న   'జాలయ్య జ్యోస్యమంతా తప్పని, బీఈడీ చేసిన తను టీచర్ కాబోతున్నా'ననీ, అసలు విషయం చెప్పాడు.పాపం చంటి గాడికి ఆ సమయంలో తెలీదు నిజంగానే తన చదువుకు గండి పడబోతోందని. బీఈడీ పూర్త య్యాక 'పీజీ'కి అప్లై చేశాడు చంటిగాడు.కానీ తల్లికి ఆరోగ్యం పాడై హాస్పిటల్ లో చేర్చవడంతో ఫీజు కట్టేందుకు పైసా మిగల్లేదు. సర్టిఫికెట్లు కాలేజీలో ఇచ్చి ఓ వారం గడువడిగాడు. కానీ మర్నాడే ఎయిడెడ్ స్కూల్లో ఇంటర్వూకు కాల్ లెటర్ రావడంతో సర్టిఫికెట్ల కోసం మళ్లీ కాలేజీకెళ్లక తప్పలేదు. 'అసలే ఎయిడెడ్ పోస్టు. ఆపైన ఎయిడిచ్చుకోలేని  కేసు' గనక జాగ్రత్త కోసం తాను మళ్లీ వచ్చి ఫీజు కడతానని టి.సి ఉంచుకుని మిగతా సర్టిఫికెట్లు ఇవ్వమని క్లర్క్ ని ప్రాధేయపడ్డాడు. టి.సి ఉంచుతున్న విషయం రాయ కుండా 'రిసీవ్డ్ ఆల్ ఒరిజినల్స్' అని రాసి సైన్ చేసాడు. ఆ తర్వాత ఆ ఉద్యోగం ఉన్నవాళ్లకి పోగా, క్లర్క్ కాస్తా  అనారోగ్యంతో 'హరీ'మనడంతో చంటిగాడి టి.సి  అడ్రస్ లేకుండా పోయింది. అడిగితే సర్టిఫికెట్లన్ని తీసుకెళ్లే వంటూ సంతకం చూపి సీటులేదు పొమ్మన్నారు. ఇవి చాలవన్నట్టు  తల్లికూడా ఆరోగ్యం క్షిణించి చంటిగాడిని అనాథను చేసిపోవడంతో జాలయ్య జాతకమే దిక్కయింది. జాతకాల మీద నమ్మకమూ పెరిగిపోయింది. పెరగదూ మరి. మహామహా మేధావులే జ్యోతిష్యం గ్రేటంటూ  గ్రాడ్యుయేషన్ లెవల్లో గ్రాండ్ గా ప్రవేశపెట్టేస్తే, ఆఫ్టరాల్ అల్లాటప్ప చంటిగాడొక లెక్కా? ఆతరువాత ఎలాగోలా పీజీ పూర్తి చేసుకున్న చంటిగాడికి  లెక్చరర్ పోస్ట్ ఎగ్జామ్ రాయడాని కెళ్లినపుడు పరిచయమయ్యాడో 'పామిస్ట్రీ పాపారావు.' గొప్ప జ్యోతిష్య పండిత వంశానికి చెందిన పాపా రావు తన ఫ్రెండ్ చేయిచూసి 'నీకు లెక్చరర్ జాబ్ గ్యారంటీ' అని చెపుతుండడంతో తనూ చేయిచ్చాడు.పాపారావు చంటిగాడి చేతి గీతల్లోనే 'అనాధ' ని గుర్తించడమేగాక, 'నువ్వీపరీక్ష రాయడం కన్నా బిజినెస్ చేయడమే మిన్న" అనడంతో పామిస్ట్రీ పై విపరీతమైన గురి కుదిరి 'ఎంబీఏ' లో చేరిపోయాడు. కానీ 'జాలయ్య జాతకాల జిడ్డు' ఇంకా వదలక  కధమళ్ళీ మొదటకొచ్చింది. వారఫలాలు చూసాక కాస్త ధైర్యం వచ్చినా 'ఎలా సాధ్యమా'ని ఆలోచిస్తూ హాస్టల్లో టీవీ హాల్లోకి వచ్చిన చంటిగాడికి టీవీలో వస్తున్న ప్రోగ్రాం చూడగానే బ్రహ్మాండమైన  ఐడియా వచ్చింది. మర్నాడే దాన్ని అమల్లో పెట్టాడు. హుషారుగా ఈలేస్తూ 'మెస్' కు చేరిన చంటిగాడిని చూసి ఆరాలు తీసేరు మిత్ర బృందం. "నా ఖుషీకి కారణం అదేరా.. 'ఇడియట్ బాక్స్' అనే టీవీ..." అంటూండగా సత్తిగాడు అడ్డుపడి "వీడియోకాన్ కంపెనీ లాగా 'ఇడియట్ బాక్స్' అనే కంపెనీ కూడా టీవీలు తయారు చేస్తుందా? నువ్వందులో  చేరావా?" అడిగేడు గ్లోబలైజేషన్ పుణ్యమాని మరో కొత్త కంపెనీ వచ్చిందేమోనని. "అబ్బా..! అది కాదురా.. రోజూ మనం చూసే టీవీనే 'ఇడియట్ బాక్స్' అని కూడా అంటార్రా."  "ఎందుకని..?  "ఏదో ఒక ప్రోగ్రాం చూద్దామని సరదాగా దాని ముందు కూర్చుంటామా..! తర్వాత మరో ప్రోగ్రాం.. ఆ తర్వాత మరొకటి..అలా ఎంత చెత్త ప్రోగ్రాం వచ్చినా ఇడియట్స్ లా చూసుకుంటూ పోయి అలవాటు పడిపోతామన్న మాట.నేనా ఇడియట్ బాక్స్ వల్లే ఫీజు కట్టగలిగాను." "వ్వా..ట్..! కొంపదీసి హాస్టల్లో టీవీ గాని అమ్మేసుకున్నావా ఏంటి ?"   అడిగేరు." ఓరి అప్రాచ్యుల్లారా! అలాంటి పని ఈ ఒకటో నెంబర్ కుర్రాడెందుకు చేస్తాడ్రా..?"  అంటూ తను చేసింది చెప్ప సాగేడు. "ఇడియట్ బాక్స్ లో..ఐమీన్..అదే టీవీలో..ఈ మధ్యే ఓ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. అదేంటో తెలుసా మీకు..?" సూరిగాడు ఏదో చెప్పబోయాడు. కానీ అంతలోనే  చంటిగాడు "ష్.."  అని చెప్పాడు నోటిమీద వేలేసుకొని. అది ప్రోగ్రాం పేరని తెలియని సూరిగాడు  మాట్లాడ వద్ధంటున్నాడేమోననుకొని నోర్మూసుకున్నాడు. చంటిగాడు తిరిగి చెప్పడం ప్రారంభించాడు.  "అందులో కెమెరాను సీక్రెట్ గా ఉంచి ఏ రోడ్డు మీదో,పార్కులోనో ఉన్నజనం పైబడి వెర్రి మొర్రి చేష్టలతో రకరకాలు గా ఇబ్బంది పెడతారు. వాళ్ళు జడుసుకొని చస్తుంటే ఆఖర్న  ' ష్..' అంటూ కెమెరాను చూపి పైశాచి కానందం పొందుతారు.పాపం ఫూల్సయిన వాళ్ళు ఏడ్వలేక నవ్వుతూ 'ష్..' అంటారు. నేనూ అదే చేశాను."   "ఎలా చేసావు?"  " ఓ వీడియో గ్రాఫర్ ను ఒప్పించి నేను చేసేవన్నీ తీస్తున్నట్లు నటించమన్నాను. కాలేజీలో క్లర్క్ ని కాకాబట్టి పాత 'ఫీజు రిసీట్' బుక్కొకటి సంపాదించాను. పోలీసులు లేని రద్దీగా ఉండే సెంటర్ కు వెళ్లి పార్కింగ్ రూల్స్ పాటించని వాహన దారులపై కేసులు రాస్తానని చెప్పి ఇచ్చి నంత పుచ్చుకుని వదిలేసాను. ఫీజు పోను మిగిలింది క్లర్క్,వీడియో గ్రాఫర్లకిచ్చాను."  "ఎవరూ ఎదురుతిరగ లేదా..?" "తిరిగితే ఏమవుతుంది? 'ష్...!' అంటూ నోటి మీద వేలేసి చాటుగా ఉన్న కెమెరా చూపించాను. అంతే గప్ చుప్ ..! దిక్కులేని ప్రోగ్రామ్ లను ఆదరించడమే కాకుండా, ఐడియాలు కూడా పంపే ఈ దిక్కులేని జనానికి దిక్కెవరు?  సీక్రెట్ షూటింగ్ కు  కెమెరాతప్ప యాంకర్లెవరూ వుండరుగా, నిజమేననుకున్నారు." "ఒరేయ్ చంటిగా  ఇలాంటి 'ఇడియాటిక్ పని' నువ్వెలా చేసావురా" అన్నాడు అంతా విన్న సత్తిగాడు. చంటిగాడు కస్సున లేచాడు.  "ఏదిరా ఇడియాటిక్ పని. ఒకరు 'గడ్డితిని' కోట్లు సంపాదిస్తే, మరొకరు 'మట్టితిని' కోట్లు సంపాదిస్తున్నారు. కొందరు బ్యాంకుల్ని తింటే మరికొందరు పెట్రోలు బంకుల్నే తినేస్తున్నారు. 'స్టడీటూర్ల' పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ ప్రజలకే మాత్రం ఉపయోగపడని ప్రజా ప్రతినిధులు కొందరైతే, ఆధికారం కోసం ఏకంగా తమనే సంతపశువుల్లా అమ్ముకునే వాళ్ళింకొందరు.స్వదేశీ డబ్బుతో చదివి విదేశాలకు ఊడిగం చేస్తున్నవారెందరో. ఇక 'స్వాముల వేషం'లో, 'స్కాముల' రూపంలో దోచుకు తినే వారికి లెక్కేలేదు. ఇవేవీ ఇడియాటిక్ పనులు కానప్పుడు వీళ్ళెవరూ ఇడియట్స్ కానప్పుడు కేవలం చదువు కోవాలని ఆశతో నేను చేసిన ఈ పని వెధవ పని ఎలా అవుతుందిరా..? ' I Did Issh..Only for Termfee' దట్సాల్...." 'ఆఁ.."అంటూ నోరెళ్ళబెట్టారు మిత్ర బృందమంతా.     
 *    *    *
        కాలచక్రంతోపాటే జాతక చక్రమూ తిరిగిపోయింది. జాతక రీత్యా జాబ్ రావాల్సిన మిత్రుడు బిజినెస్ లో స్థిరపడ్డాడు. రాదనుకున్న లెక్చరర్ జాబ్  రావడంతో చంటిగాడు ఎం బి ఏ మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. ఇవన్నీ చూసాక జాతకాలకన్నా స్వశక్తిని నమ్ముకోవడమే మంచిదనే నిర్ణయానికొచ్చేసాడు చంటిగాడు.కానీజాలయ్య గతించినా జాతకాలజాడ మాత్రం నీడలా వెంటాడుతూనే ఉంది చంటిగాడు శేఖరంగామారి ప్రిన్సిపల్ అయ్యాక కూడా.తన ఏకైక కుమార్తెకు దూరప్రాంతంలో మెడిసిన్ సీటు రావడంతో  తను డాక్టర్ కావాలా? లేక కూతుర్ని డాక్టరు చేయాలా? అనే సందిగ్ధంలో పడ్డాడు శేఖరం.చివరకు కూతురున్న చోటుకు ట్రాన్సఫర్ చేయించు కోవడంతో పి హెచ్ డి పక్కన పెట్టాల్సి వచ్చింది. అయినా తనేమీ బాధపడలేదు. ఎందుకంటే అతనికి 'చదువంటే ఓ సరదా. అదో నాలెడ్జి గేమ్.అందులో ముందు వెనుకలు కావొచ్చేమో గాని ఓడిపోవడ మనేది ఉండదు. ఆడుకుంటూ గెలుచుకుంటూ పోవడమే. కాలాన్ని అలా పరుగెత్త నీయాలి.అది తప్పదుకూడా. కానీ మన మనసును కూడా కాలంతోపాటు పరుగెత్తించాలని చూస్తే మాత్రం భంగపాటు తప్పదు.కారణం కాలంతో పాటుమారగలిగినవాళ్ళు, పరుగెత్తగలిగినవాళ్ళూ కొందరే వుంటారు.మనం అలా చేయ లేనప్పుడు చేరుకోగలిగినంత వరకు చేరుకుని ఆగిపోవాలి. అంతేకానీ, ఎవరో ఎదో అయ్యారని మనం అలాగే కావాలనుకోవడం, అందులోనూ ఆశల్ని,ఆశయాలను కాకుండా అరువు తెచ్చుకున్న అత్యాశల్ని నెరవేర్చుకోవాలని చూస్తే ఉన్న సుఖాలక్కూడా దూరంకాక తప్పదనేది అతని అభిప్రాయం.
 ***
                                                                                                                                                                                                           

No comments:

Post a Comment

Pages