నువ్వెళ్ళే దారుల్లో... - అచ్చంగా తెలుగు

నువ్వెళ్ళే దారుల్లో...

Share This
నువ్వెళ్ళే దారుల్లో...
- సురేంద్ర రొడ్డ , తిరుపతి
9491523570నువ్వెళ్ళే దారుల్లో
ముళ్ళూరాళ్ళూ వుంటే ఏరేసిపో
వెనుకవచ్చే వారికి మంచిదారి ఏర్పడుతుంది !

నువ్వెళ్ళే దారుల్లో
దేవుళ్ళు కనిపిస్తారు దండం పెట్టు పెట్టకపో
దాహార్తులు కనిపిస్తే మాత్రం వారిగొంతు తడిపిపో !

నువ్వెళ్ళే దారుల్లో
నీడలుంటే చెట్లు నాటినవారికి కృతజ్ఞతలుగా
నీవూ ఓ మొక్క నాటిపో మరొకరికి నీడౌతుంది !

నువ్వెళ్ళే దారుల్లో
సైంధవరేఖలెన్నో అడ్డుపడినా అర్జునుడిలా సాగిపో
పాశుపతాస్త్రంలాంటి వీరులు ఎందరో వెంబడిస్తారు !

నువ్వెళ్ళే దారుల్లో 
విజయపతాకాల్ని  మైలురాళ్ళుగా పాతిపో
రాబోవుతరపు బాటసారులు నీలా విజేతలవుతారు !

నువ్వెళ్ళే దారుల్లో
ఎడారి ఎదురైనా గుండెని గోదారిలా పరచిపో
నీకోసం కురిసే కన్నీటికుసుమాలతో పూదారవుతుంది!

నువ్వెళ్ళే దారుల్లో
కారుచీకట్లున్నా  చిరుదివ్వెను వెలిగించిపో
పాదచారి కళ్ళల్లో  కోటికాగడాలు పుట్టుకొస్తాయి !

నువ్వెళ్ళే దారుల్లో
కొన్ని అక్షరాలగుత్తులను నీగుర్తుగా విత్తిపో
కలకాలం చరిత్రలో మనీషిగా నిలచిపోతావు !

****

No comments:

Post a Comment

Pages