బ్రహ్మోత్సవాలు - అన్నమయ్య కీర్తనలు - అచ్చంగా తెలుగు

బ్రహ్మోత్సవాలు - అన్నమయ్య కీర్తనలు

Share This
బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య కీర్తనలు అశ్వవాహనం
డా.తాడేపల్లి పతంజలి 


బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవ నాటి రాత్రి వేంకటేశ్వరస్వామి వారికి అశ్వవాహన సేవ జరుగుతుంది. స్వామివారికి ఆరోజు  శిరస్త్రాణాన్ని , ఖడ్గాన్ని ధరింపస్తారు. ఒక వీరునిలా  కనిపిస్తూ మనలను రక్షించటానికి స్వామి కనబడతారు..
విష్ణుదేవుని అవతారాలలో  చివరి అవతారమైన  కల్కి అవతారంలో  విష్ణుదేవుడు అశ్వవాహనం ఎక్కి వస్తారని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. దుష్టజన సంహారం, శిష్టజన సంరక్షణ చేసే ఆ కల్కి అవతారాన్ని  మనం ఈరోజు చూడవచ్చు.
అన్నమయ్య రచించిన  అశ్వవాహన  సంబంధ కీర్తనను చదివి స్వామిని సేవిద్దాం.
రేకు: 9058-01  సం: 04-569
పల్లవి: నీవు తురగముమీద నేర్పు మెరయ
వేవేలు రూపులై వెదచల్లితపుడు
చ.1: పదిలముగ నిరువంకబసిడి పింజల యంప
పొదల తరకసములొరపులు నెరపగా
గదయు శంఖంబు చక్రము ధనుః ఖడ్గములు
పదివేలు సూర్యబింబములైనవపుడు
చ.2: సొరిది శేషుని పెద్దచుట్టు పెనుగేవడము
సిరి దొలక నొకచేతజిత్తగించి
దురమునకుదొడవైన ధూమకేతువు చేత
ఇరవైనబల్లెమై యేచెనందవుడు
చ.3: కరకజడతో రమాకాంత జయలక్ష్మియై
తొరలి కౌగిట నిన్నుదొడికి పట్టి
చరచె వెను వేంకటస్వామి నిను గెలువుమని
మెరుగుగుచకుంభముల మిసిమితో నపుడు
భావం
పల్లవి:
వేంకటేశ్వరా !నీవు గుర్రము మీద నేర్పుతో అనేక రూపములను ప్రదర్శిస్తూ   ప్రకాశిస్తూ వెళ్ళావు. (కల్క్యావతారము)
చ.1:
 వేంకటేశా ! నీవు గుర్రము మీద ఎక్కినప్పుడు  రెండువైపులా బంగారపు బాణపు చివరలు అమ్ములపొదులు అందంగా మెరుస్తుండగా,గద,శంఖము, చక్రము, ధనుస్సు,  ఖడ్గములు అను నీ అయుధములు పదివేల సూర్యబింబముల కాంతిని ఒకేచోట ఇస్తున్నాయి.
చ.2:
వేంకటేశా ! నీవు గుర్రము మీద ఎక్కినప్పుడు  చుట్టబడిన ఆదిశేషుని యొక్క పెద్ద చుట్టు  పెద్ద జెండాలా   ప్రకాశిస్తున్నది.
యుగ నాశనానికి గుర్తయిన తోకచుక్క నీ చేతిలో పొడవైన బల్లెములా ప్రకాశిస్తున్నది.
చ.3:
వేంకటేశా ! నీవు గుర్రము మీద ఎక్కినప్పుడు నల్లని జడతో లక్ష్మీదేవి  జయలక్ష్మిగా నిన్ను సంతోషంతో ఎదుర్కొని(తొరలి) కౌగిలిలో ఒడిసిపట్టుకొంది.తనదయిన ప్రకాశించే కుండలవంటి స్తనముల  కాంతితో అపుడు ఆ లక్ష్మీదేవి నిను గెలువుమని వెంబడింఛింది.(వెనుచరచు)
వాగె బలువు … అను మరొక కీర్తనలో గుర్రము మీద ఎక్కిన స్వామిని అన్నమయ్య జాగ్రత్తలంటూ హెచ్చరించాడు.
దేవతలలోశ్రేష్ఠుడా !  వాగెను (గుఱ్ఱంనోటి కళ్లానికి తగిలించే పగ్గం) జాగ్రత్తగా చూసుకో. అదే  బలము.

 నీ రాగెను (గుఱ్ఱముకున్న జీను)  ప్రయత్నముతో చూసుకో.   హెచ్చరిక.. హెచ్చరిక

చ.1:

వేంకటేశా!మెరిసే గుర్రము  ఆకాశమును అంటగా, భక్త జనుల దగ్గరలో  నాట్యవిశేషములతో ఆడగా
అంతా చెల్లాచెదరగు విధముగా  వెంటనే తిరువీథులలో తోలితివి.
1. అరవిందము, 2. అశోకము, 3. చూతము, 4. నవమల్లిక, 5. నీలోత్పలము   అను అయిదు బాణములు కలిగిన మన్మథునికి తండ్రియైనవాడా !నీకు ఇదే  స్థిరమైన హెచ్చరిక.
చ.2:
వేంకటేశా!ఆధిక్యము కలిగిన మేలుజాతి గుఱ్ఱము ఈ విధముగా  పరుగెత్తగా,తొక్కనిచోట్లను తొక్కునట్లుగా , చుక్కలు తాకునట్లుగా అందముగా తోలితివి.
కష్టముల దేవర(ఆపద మొక్కులవాడా !) అలమేలుమంగదేవీ ! హెచ్చరిక.
చ.3:
వేంకటేశా!గుఱ్ఱము నెక్కుటకు ప్రక్కనమర్చిన మెట్టులో(రికాబులో) నీ పాద పద్మము పదిలముగా చూసుకో.
తిరుమల వీధులలో అనుమానము లేక శ్రీ లక్ష్మితో గుర్రము పైకి ఎక్కి సంతోషించు .
గుర్రపు బంధనము ఆలస్యము కావద్దు.  భళా! హెచ్చరిక.
ముగింపు
అశ్వశబ్దానికి అశ్నుతే వ్యాప్నోతి సర్వత్ర  అంతట వ్యాపించునది. అని అర్థం. ఈ అన్నమయ్య కీర్తనలు కూడా అంతటా వ్యాపించునవి. స్వస్తి. 
***

No comments:

Post a Comment

Pages