శ్రీమద్భగవద్గీత -31 - అచ్చంగా తెలుగు
ఓం శ్రీ సాయిరాం
శ్రీమద్భగవద్గీత -31
రెడ్లం రాజగోపాలరావు

గుణత్రయ విభాగ యోగము
14 వ అధ్యాయము


శ్రీ భగవానువాచ:

పరం భూయః ప్రపక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్

యజ్ఞాత్వామునయః సర్వే పరాంసిద్ధిమితోగతాః
- 1 వ శ్లోకం

భగవంతుడు చెప్పుచున్నాడు ఓ అర్జునా దేనిని తెలుసుకొని మునులందరును ఈ సంసారబంధము నుండీ విడివడి ఉత్తమమైన మోక్ష సిద్ధిని పొందినారో అట్టి పరమాత్మ విషయమైనదియు, జ్ఞానములలో కెల్ల ఉత్తమ జ్ఞానమును  జెప్పుచున్నాను.

ఈ శ్లోకము ద్వారా భగవంతుడు మనుజులపై తన అపార కరుణతో విషయమును మరలా మరలా చెప్పుచూ విశదీకరించుచున్నాడు. ప్రపంచములో అనేక జ్ఞానములున్నను (గణిత జ్ఞానము, సంగీత జ్ఞానము, శిల్పజ్ఞానము) వానియన్నింటిలోనూ ఆధ్యాత్మిక జ్ఞానమే సర్వ శ్రేష్టమైనది. ఈ విషయాన్ని గీతాచార్యుడు ఈ శ్లోకము ద్వారా స్పష్టము చేయుచున్నాడు.

పరాంసిద్ధిమ్  మోక్షస్థితి  అన్నిటికంటెను గొప్పదని చెప్పబడుటచే చిన్న చిన్న ప్రాపంచిక పదవులను , గతులను గొప్పవిగా తలచి మురిసిపోక వాటికంటే ఉన్నతమైనట్టి , ఆనందకరమైనట్టి పరమాత్మ పదమును జ్ఞానసముపార్జనము ద్వారా పొంది ధన్యులు కావలయును.

సర్వయోనిషు కౌంతేయా మూర్తయస్సంభవన్తియాః
తాసామ్ బ్రహ్మమహద్యోని రహంబీజ ప్రదః పితా
- 4వ శ్లోకం

ఈ శ్లోకము ద్వారా సమస్త ప్రాణులు భగవత్స్వరూపులేయని స్పష్టమగుచున్నది. వారికి ప్రకృతియే తల్లి, పరమాత్మయే తండ్రి, ప్రకృతి జడమైనది. పురుషుడైన పరమాత్మ బీజరూపమున ప్రాణుల  ఉత్పత్తికి  మూలమై తను తండ్రియగుచున్నాడు. ప్రకృతి నుండీ సత్వ , రజస్తమో గుణములు  ఆవిర్భవించుచు  జీవుని  బంధమునకు  అవియే  కారణమగుచున్నవి.
సత్వ, రజస్తమోగుణములు మూడును ప్రకృతి వలన కలిగినవి. అవి ఆత్మకు లేవు. ఆత్మ నిర్గుణుడు ఐనను జీవుడు తన యధార్థ స్వరూపమగు  ఆత్మను విస్మరించి, తాను గుణయుతుడనని భావించి ఆ గుణములతో తదాత్మ్యము నొందుచు,  దేహమునందు , సంసారమునందు  బంధితుడగుచున్నాడు. ఈ మూడు గుణములలో ఏ గుణమున్నప్పటికీ జీవుడింకను మాయయందే యున్నాడని , మాయాతీతుడగు ఆత్మనింకను చేరలేదనియు తెలిసికొనవలెను. జీవుని బంధించునవి ఈ మూడు గుణములేయని స్పస్టముగా చెప్పబడినందున వాని నుండీ త్వరగా విడుదలబొందుటకై అహర్నిశము ప్రయత్నము చేయవలసియున్నది. ఇచట రజస్తమస్సులతోపాటుగా సత్వగుణమును జీవుని మాయలో బంధించుచున్నది.  పూర్ణ నిస్సంకల్పస్థితియందు లేక నిర్వికల్పావస్థయందు ఏ గుణములు ఉండవు. అది నిర్వికారావస్థ అనగా సుద్ద సత్వగుణము. అట్టి స్థితిలో మనుజుడు గాఢమైన నిశ్శబ్ధాన్ని అనుభవించును.అట్టి ఆనందానుభూతియే మోక్షము.
దేహేదేహిన మవ్యయమ్ దేహమందని చెప్పినందువలన ఆత్మ భగవానుడైన ప్రత్యగాత్మ అతి సమీపమగు దేహమందే వసించు చున్నాడని  స్పష్టమగుచున్నది, కావున తీవ్ర పరిశోధనచే అతనిని ఈ దేహమందే కనుగొని తరింపవచ్చును,

సర్వద్వారేషు దేహేస్మిస్ప్రకాశ ఉపజాయతే
జ్ఞానం యదాతదా విద్యాద్వివృద్దం సత్త్వమిత్యుత
-11 వ శ్లోకం

ఎప్పుడు ఈ శరీరమునందు ఇంద్రియ ద్వారములన్నింటియందును ప్రకాశరూపమగు జ్ఞానము కలుగుచున్నదో అప్పుడు సత్వగుణము బాగుగా వృద్ధినొందియున్నదని తెలిసికొనవలెను. ఒక్కొక్క గుణము అధికముగా యున్నప్పుడు జీవుడొనర్చు కర్మములు దానికనుగుణముగనే యుండును. అతడు భుజించు ఆహారము , మాట్లాడు పద్దతి , నడత సమస్తము ఆ గుణముల ననుసరించియే యుండును. అనగా సత్వగుణము అభివృద్ధియొందినపుడు జీవునియొక్క సమస్త చర్యలు సాత్వికముగాను , ప్రకాశవంతముగాను , యుండును. ఒక ఫలము బాగుగా పండి యున్నప్పుడు అంతయూ మధురముగనే యుండును. సత్వగుణ సంపన్నుడగు  ప్రశాంతముగా మాటలాడును, భుజించునపుడు సాత్వికాహారమునే  భుజించును. చదువునపుడు ఉత్తమ గ్రంధములనే  చదువును. మనసులో చక్కని భావములనే  యోచించుచుండును. ఈ ప్రకారమగు ప్రశాంతత , జ్ఞానపరిపక్పత సమస్తేంద్రియముల నుండీ వెల్లివిరియునో  అపుడా వ్యక్తియందు  సత్వగుణము అధికముగానున్నదని గ్రహించవచ్చును.

యదాసత్త్వేప్రవృద్ధేతుప్రలయం యాతిదేహభృత్
తదోత్త మ విదాంలోకానమలాన్ ప్రతి పద్యతే
-14 వ శ్లోకం

ఎప్పుడైతే జీవుడు సత్త్వగుణాభివృద్ధిని పొందుచుండగా మరణించునో అప్పుడతడు ఉత్తమ జ్ఞానవంతులగు వారి యొక్క పరిశుద్ధములైన లోకములనే పొందును.

అంత్యకాలమున చిత్తమున సత్త్వరజస్తమోగుణములలో ఏ ఏ గుణములు వృద్ధినొందునో తదనుగుణ్యమైన లోకమే , జన్మమే జీవునకు కలుగును. అయితే సత్త్వగుణమను నదిగూడ ఒక క్షణములో నేర్పడునదిగాను, చిత్తమునందలి తమోగుణ రజోగుణ సంస్కారములు వృత్తులు తొలగి సత్త్వగుణ సంస్కారమేర్పడుటకు ఎంతయో సాధన , ప్రయత్నము అవసరము. జీవితకాలమంతయు అట్టి సత్ప్రయత్న మాచరించుచుండిననే అంత్యకాలమున చిత్తము సత్త్వగుణమయము కాగలదు.
దేహభృత్ అను పదముచే దేహమును ధరిచువాడని తెలియుచున్నది. ధరించబడునది ధరించువానికంటే వేరుగనేయుండును గదా వస్త్ర్రమును ధరించెను ఆభరణమును ధరించెను అనగా ఆ వస్త్రములు , ఆభరణములు మనుజునికంటే వేరుగానున్నవికదా అట్లే దేహమును ధరించు జీవుని కంటే దేహము వేరుగానున్నది. ఈ సత్యమును తెలిసికొని మనుజుడు దేహభావమును వీడి దేహ సాక్షియగు ఆత్మ భావనయే గలిగియుండవలెను. అట్టి సత్త్వగుణ సంపన్నుడు జ్ఞానవంతులుండు నిర్మలలోకములనే పొందునని స్పష్టమగుచున్నది. అట్టి నిర్మలవాతావరణము ఆతని ఆధ్యాత్మిక వికాశానికి , బంధ విముక్తికి సహాయకారిగానుండ గలదు.
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages