శివం - 61 - అచ్చంగా తెలుగు
 శివం - 61
హరసిద్ధుని కథ 
రాజ కార్తీక్ 


(హర సిద్ధుడు మరియు అతని తాత మాట్లాడుకుంటూ ఉండగా.. మధ్యలో విన వచ్చింది ఒక స్వరం) 
స్వరం " శివయ్య ఎవరిని మోసం చేశాడు? ఆయన ఎమన్నా చెప్పాడా నేను ఫలానా వాళ్ళని మోసం చేశాను అని ?"
హ . సి " శివయ్య మోసం --'' అని మాట్లాడలేక పోయాడు ....
తాత "ఏమి పేరు అయ్య నీది ..ఏ ఊరు ?"
అవి ఏవీ పట్టించు కోవట్లేదు ఇద్దరు .

హ సి "ఏమిటయ్యా నీ తర్కం చెప్పు?"
స్వరం "నా పేరు కుంభయ్య. నా ఊరు.. "
హ సి "ముందు నీ విషయం చెప్పు విశ్లేణాత్మకంగా."
వాదన జరిగితే గొడవ ఎందుకు అని తాత ఉద్దేశం. కానీ హర సిద్ధుడు తన వాగ్దాటి మొదలు పెట్టాడు.
కుంభయ్య "మాట మద్యలో నన్ను కదిలించకు .. పూర్తిగా విను. అప్పుడు నీ ప్రశ్న వెయ్యి అర్దం అయ్యిందా.."
హర సిద్ధుడు తల ఊపాడు. తాత బిత్తర పోయాడు. హర సిద్దు చేత ఊ ఊ కొట్టించాడు అని.
కుంభయ్యా "చూడు నాయనా ..ఆ శివయ్య అయినా విష్ణువు అయినా బ్రహ్మ దేవుడు అయినా, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు. అందుకే వారు ఎవరికి ఏ వరాలు ఇచ్చినా అవి నేర వెర్చారు. అదే మాట మీద నిల బడటం అంటే..అవునా కాదా ?"
హ సి "అవును " అన్నాడు ఆసక్తిగా. 
కుంభయ్య "మరి మహాదేవుడు అదే శివయ్య నీకు ఎమన్నా చెప్పాడా. నీకు ఎమన్నా చేస్తా అని .."
హ సి "చెప్పలేదుగా"
కుంభయ్య "మరి చెప్పనప్పుడూ నువ్వు ఎలా అంటావ్ శివుడు మోసం చేశాడు అని? "
హ సి "హ్మ్ " అని నిదానంగా  అలికిడి చేయకుండా విన్నాడు.
తాత కి  అర్దం అయ్యింది ..హర సిద్ధునికి కోపం ఎప్పుడూ వస్తుంది, తర్కం లేకుండా సరిఅయిన విశ్లేణా లేకుండా మొండిగా మాట్లాడితే! కానీ ఈ కుంభయ్య  తర్కంలో హరసిద్ధుని మెప్పిస్తున్నాడు.
కుంభయ్య" మరి మహాదేవుడిని ఎందుకు మోసం అని అంటున్నావు ? అది తప్పు కదా. నువ్వు ఆయన కోసం ఏమి చేశావు? ఏమి లేదు. 
ఏదో నీ పొట్ట కూటి కోసం చేస్తున్నావు. అవునా కాదా?"

హ సి " అంటే జరిగే ప్రతిదీ శివుని ఆజ్ఞ కదా "
కుంభయ్య "చెప్పింది చేయటాన్ని ఆజ్ఞ అంటారు. కృషికి గుర్తింపు గా ఇచ్చేది వరం అంటారు. మనకు కావాల్సిన దాన్ని కోరిక అంటారు. ఇందులో నువ్వనేది ఏమిటి?"
హ సి "మౌనమే సమాధానం."
కుంభయ్య " ఇక విధి వ్రాత, తలరాత అంటావా? ఎవరికయినా అది తప్పదు. ఆఖరికి దేవుడి అవతారానికి అయినా కూడా!"
హర సిద్దు వాదన అంతా అయిపోయింది. "ఒకే ఒక తర్కం తో అందరికీ  చుక్కలు చూపించే హర సిద్ధునికి పూర్తిగా అదే విధంగా సమాధానం చెప్పాడు కుంభయ్య. "అనుకున్నాడు తాత.
కుంభయ్య "ఇంకా చెప్పు నీ సందేహాలు ఉంటే తీరుస్తా "
కుంభయ్య వాదన ఆవేశ పడేవాడికి సమాధానంలా ఉంది. అందుకే హర సిద్ధుని మనసు కుదుట పడింది.
బాధతో హర సిద్దు "అంటే ఇంకా మాట ఇవ్వలేదు కాబట్టి ఏమి చేయకున్నా పర్లేదా? మహా దేవుడు తన భక్తుల మనసులో ఉండే వాడు అంటే ఇదేనా?"
కుంభయ్య "అయినా ఆయన భక్తుల కోసం ఏమేమి ఎలాచేస్తాడో నీకు ఏమి తెల్సు? నువ్వు ఎంత, నీ తెలివి ఎంత? నీ జీవనం ఎంత? ఈ భూమి ఎంత? ఆ సూర్యుడు ఎంత? ఈ పాలపుంత ఎంత? లక్షల పాల పుంతలు ఎంత? కనపడే నక్షత్రాలు ఎంత? ఇలాంటి  లక్షల విశ్వాలలో నువ్వు ఎంత?"
హర సిద్ధుని ఆలోచన పూర్తిగా మారుతోంది. అతని మనసు వాదన నుండి శోధన దిశగా మారుతోంది.
తాత "కుంభయ్య స్వామి, మీరు సరిగ్గా చెప్పారు. జీవుడి ఆలోచన ఎంత? కానీ బ్రతికి ఉన్నప్పుడు చచ్చే దాకా బ్రతకాలి కదా! మా హారసిద్దు శివుడ్ని  ప్రేమగా అడిగేవాడు,  ఒక తండ్రిని హక్కుగా అడిగినట్టు! అంతే తప్ప అతనికి ఎంతో భక్తి ఉంది."
కుంభయ్యా"అయినా దేవుడ్ని తయారు చేసి అందరికీ చూపే హర సిద్ధునికి  దేవుడిని తండ్రి గా భావించే  హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది. ఎందుకనీ అంటే ... హర సిద్ధుని మనసు నాకు తెల్సు. "
హ సి " నేను మీకు ఎలా తెల్సు?"
కుంభయ్య "నీవు ఒక  కనుచూపు లేని వానికి శిల్ప కళ అనుభూతి చెందించావ్ గుర్తు ఉందా?"
వారి ఇరువురికి గుర్తుకు వచ్చింది హర సిద్దు గ్రుడ్డి వాడికి శిల్పాలను దగ్గర ఉండి అతని చేతులు ఆ శిల్పాలకు తాకించి వివరించిన విధానం. అలాగే తాతకు కూడా తనను మోసుకుంటూ గుడిని అక్కడ శిల్పాలను చూపించిన సన్నివేశం.
కుంభయ్యా "అతను నాకు తెల్సు ..నేను నీకోసం వచ్చాను. నీతో నాకు పని ఉంది హర సిద్దు. నేను నీ ప్రతి శిల్పకళ పనిని పరిశీలించదల్చాను. ఎందుకు ఏమిటి అని అడగకు నన్ను .ఏదైనా నీ పనితనం చూసిన తర్వాత మాట్లాడతా."
కుంభయ్య " నేను నీకు అన్న లాంటి వాడ్ని హర సిద్దు. అందుకే నీ కోసం వచ్చాను. నీ జీవితాన్ని నువ్వు కోరిన విధంగా మారుద్దాం అనుకునే వాడ్ని . నువ్వు నన్ను పూర్తిగా నమ్మ వచ్చు."
ఎందుకో  తెలీదు హర సిద్దు మనసు కుంభయ్య మాటలకు కుదటపడింది. ఎన్నో జన్మల నుండి తెల్సిన వ్యక్తిలా అతని మాటలు అనిపించాయి.
హర సిద్దు మనసులో "ఎంతో మంది నన్ను మోసం చేశారు. మహా అయితే ఇతను మరోసారి మోసం చేస్తాడు, అంతకు మించి ఏముంది .." అనుకున్నాడు.
హర సిద్దు " అలాగే కుంభయ్యా. నువ్వు ఎలా అంటే అలా చేద్దాం. నీ నుండి నేను సరళంగా సూటిగా స్పష్టంగా మాటలాడటం నేర్చుకోవాలి. "
కుంభయ్యా " అవసరం లేదు హర సిద్ధు. నువ్వు నీలాగే ఉండు ఎవరో నిన్ను మోసం చేస్తే అది నీ తప్పు కాదు. నీ మంచితనం గాని, నిన్ను మోసం చేసిన వారిని నువ్వు దండించటం గుణ పాఠం నేర్పటం ఎంత సేపు? కానీ నువ్వు అవి ఏమీ చేయలేదు. దేవుడి పై భారం వేసి నీ పని నువ్వు చేసుకుంటున్న మంచి వాడివి. ఆ భారం దేవుడు మోసే సమయం అసన్నమయ్యింది. ఇక నీ ఇంట్లో వారి మీద కోపం అంటావా అది ప్రేమ వల్ల వచ్చేది. దానికి కాలమే సమాధానం, మన పరిస్తితి మెరుగు అవ్వడమే సమాధానం."
హ సి " కుంభయ్య నేను చెప్పలేదుగా నీకు మా కుటుంబంలో గొడవ ఉంది అని .నన్ను మోసం చేశారు అని..."
కుంభయ్య "నాకు చెప్పకున్నా  గ్రుడ్డివానికి అంతా చెప్పావ్ గా నీ బాధ. అలా నాకు తెల్సింది. "
హ సి "ఈ గ్రుడ్డి వాడు శిల్పంతో పాటు నా మాటలను కూడా అనుభూతి చెందాడన్నమాట, అన్నా నువ్వు మా తాత దగ్గర ఉండు. కొన్ని రోజులు పడుతుంది నా పనితనం మొత్తం చూపటానికి."
కుంభయ్య " అలాగే హర సిద్ధ, నీ ఇష్టం."
హర సిద్ధుని జీవితంలో జరగ బోయే మలుపులు ఇంకా మున్ముందు మీకు చెప్తాను.
***

No comments:

Post a Comment

Pages