నవ్వులరేడు రాజబాబు - అచ్చంగా తెలుగు
నవ్వులరేడు - రాజబాబు
డా. పోడూరి శ్రీనివాసరావు
9849422239.ఆయన ముఖం చూస్తే హాస్యం. ఆయన డైలాగ్ డెలివరీ హాస్యం. ఆయన టైమింగ్ హాస్యం. టోటల్ గా అయనరూపమే హాస్యం. తెరమీద కనిపిస్తే చాలు నవ్వులే నవ్వులు. ఆయన పాత్రలో నటించడు, జస్ట్ జీవిస్తాడంతే... ఇక్కడున్నన్నాళ్లూ మనలనందరినీ నవ్వులు సంద్రంలో ముంచెత్తించి….. చిన్న వయసులోనే...  అమరలోకానికేగి అక్కడ సురభూపాలురను దేవతాసమూహాన్ని నవ్వుల వానలో తడిపెయ్యడానికి స్వర్గలోకానికి తొందరపడి పరిగెత్తాడు. ఆయనే పుణ్యమూర్తులు అప్పల రాజు ఉరఫ్ రాజుబాబు.. నవ్వుల రారాజు.
1935 అక్టోబర్, 20 వతేదీన పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో శ్రీ పుణ్యమూర్తుల ఉమామహేశ్వరరావు, శ్రీమతి రవణమ్మ దంపతులకు జన్మించిన రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తులు అప్పల రాజు. బాల్యంలో నిడదవోలులోని పాఠశాల లో చదువుకుంటూనే, బుర్ర కథ నేర్చుకోవడానికి శ్రీ అచ్యుత రామయ్య గారి వద్ద చేరాడు.
ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఉపాధ్యాయ శిక్షణ కోర్సు ముగించి తెలుగు ఉపాధ్యాయుడిగా కొంతకాలం పని చేసారు. ఉపాధ్యాయునిగా పనిచేసేటప్పుడే నాటకాలలో అడపా తడపా నటిస్తూండేవాడు.
రాజబాబుకి 1965 డిసెంబరు 5వతేదీని, లక్ష్మీ అమ్ములుతో వివాహం జరిగింది. వారికి ఇరువురుకుమారులు - నాగేంద్రబాబు, మహేశ్ బాబు. మహాకవి శ్రీశ్రీకి రాజుబాబు తోడల్లుడు.
‘పుట్టిల్లు’ సినిమా దర్శకుడైన శ్రీ గరికిపాటి రాజారావు ఒకసారి నాటకంలో రాజబాబు నటనను చూసి, సినిమాలలో చేరమని ప్రోత్సహించాడు. దాంతో చెప్పాపెట్టకుండా ఫిబ్రవరి 7వతేదీ 1960న మద్రాసు చేరుకున్నాడు . రోజులు చాలా దుర్భరంగా ఉండడంతో, పూట గడవడానికి హాస్యనటుడైన అడ్డాల నారాయణ రావు పిల్లలకు ట్యూషన్ చెప్పేవాడు. కొద్దిరోజులు తర్వాత అడ్డాల నారాయణరావు రాజబాబుకి "సమాజం”  సినిమాలో అవకాశం కల్పించాడు. ఆ తర్వాత తండ్రులు - కొడుకులు, కులగోత్రాలు, స్వర్ణగౌరి, మంచి మనిషి మొదవైన చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. స్వర్ణగౌరి చిత్రానికి గాను తొలి పారితోషికంగా 350 రూపాయలు అందుకున్నాడు. తొలిచిత్రం విడుదలయ్యాక కూడా నాటకాలు వేయడం మానెయ్యలేదు. తరువాత వచ్చిన సినిమాల్లో చిన్నచిన్న పాత్రలలో నటిస్తూనే "కుక్కపిల్ల దొరికింది. నాలుగిళ్లచావిడి, అల్లూరి సీతారామ రాజు" మొదలైన నాటకాలలో నటించాడు. 
జగపతి ఫిలిస్ అధినేత వి.బి. రాజేంద్రప్రసాద్ చిత్రం "అంతస్తులు' చిత్రంలో నటించినందుకు మొట్ట మొదటి సారిగా 1300 రూసాయలు పారితోషికంగా తీసుకున్నాడు. అదే రాజబాబుకు తొలి పెద్దసంపాదన. ఆతరువాత వెనక్కు తిరిగి చూసుకోవలసిన అవసరం వేకుండా వరుసగా ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మించిన ఎన్నో ప్రములు చిత్రాలలో రాజబాబు నటించాడు.
ఆకాశరామన్న, భక్తశబరి, ప్రచండ భైరవి, సత్య హరిశ్చంద్ర, సంగీతలక్ష్మి, పరమానందయ్య శిష్యులు కథ, ఉమ్మడి కుటుంబం, విచిత్ర కుటుంబం, ఇద్దరు అమ్మాయిలు, ప్రేమనగర్, ఇల్లు-ఇల్లాలు, పల్లెటూరి బావ, సెక్రెటరీ, జీవనజ్యోతి, కార్తీక దీపం, అడవి రాముడు, సోగ్గాడు - ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించాడు రాజబాబు.
రాజబాబుకు జంటగా, లీలారాణి, మీనాకుమారి, ప్రసన్నరాణి, గీతాంజలి మొదలగు వారు నటించినా ప్రేక్షకాదరణ పొందిన జోడీ మాత్రం రమాప్రభ అనే చెప్పాలి రమాప్రభ- రాజబాబుల జోడీ  ఇద్దరు అమ్మాయిలు, ప్రేమనగర్, ఇల్లు-ఇల్లాలు, పల్లెటూరి బావ, సెక్రెటరీ, జీవనజ్యోతి, కార్తీకదీపం, అడవి రాముడు, సోగ్గాడు లాంటి చిత్రాలలో నటించి మంచి హాస్యంటుగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు.
రాజబాబు  తాతా మనవడు, పిచ్చోడి పెళ్లి, తిరుపతి, ఎవరికి వారే యమునాతీరే, మనిషి రోడ్డున పడ్డాడు - చిత్రాల్లో హీరోగా నటించారు. వీటిలో ఎవరికి వారే యమునా తీరే, మనిషి రోడ్డున పడ్డాడు అన్న చిత్రాలను మాత్రం తన స్వంత నిర్మాణ సంస్థ బాబ్ &బాబ్  ప్రొడక్షన్స్ అన్న జ్ఞానర్ పై నిర్మించారు.
చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో చిత్రాల్లో హాస్య నటునిగా తన అద్భుత నటనతో కడుపుబ్బ నవ్వించిన రాజబాబు నిజజీవితంలో గొప్ప తాత్మిక వేత్త గొప్ప మానవతా వాది, అడిగినవాడికి కాదనకుండా, అవసర
మైన వాళ్లకు ఆపదలో ఆదుకునేవాడు. ప్రతి సంవత్సరం తన పుట్టిన రోజు సందర్భంగా పాతతరం నటున్ని మరియు నటీమణులను సత్కరించే నాడు. ప్రత్యేకంగా హాస్యంలో తనకు స్పూర్తినిచ్చిన హాస్య నటుడు బాలకృష్ణను సత్కరించాడు . అలాగే రాజబాబుచే సత్కారం పొందిన వారిలో ఇంకా 
డా.శివరామకృష్ణయ్య, సూర్యకాంతం, సావిత్రి , రేలంగి మొదలైన ప్రముఖులు ఉన్నారు. ఎన్నో సంస్థలకు లెక్కలేనన్ని విరాళాలు ఇచ్చిన రాజబాబు, అంతటితో సంతృప్తి చెందక రాజమహేంద్రవరంలో చెత్తా చెదారం ఊడ్చిశుభ్రపరిచే వాళ్లకు అచ్చట గల దానవాయిపేటలో భూమి విరాళంగా ఇచ్చాడు . అంతేగాక కోరుకొండలో జూనియర్ కాలేజ్ కట్టించాడు. ఇప్పటికి రాజబాబు పేరు మీదే "రాజబాబు జూనియర్ కళాశాల”గా ఉంది.
మరే ఇతరహాస్యనటుడు పొందని గౌరవం రాజబాబుకు దక్కింది. వరుసగా ఏడుసార్లు ఫివింఫేర్ అవార్డ్ పొందిన మొట్ట మొదటి హాస్యనటుడు రాజబాబు. ఆయన సినీనటజీవితంలో మొత్తం తొమ్మిది ఫిలింఫేర్ అవార్డులు, మూడు నంది బహుమతులు, ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు పొందారు. “చెన్నై ఆంధ్రక్లబ్ "వారు వరుసగా 5 సంవత్సరాలు "రోలింగ్ షీల్డ్” ని ప్రధానం చేసారు. అంతేగాక శతాబ్దపు హాస్య నటుడిగా అవార్డు పొందాడు, “హస్యనట చక్రవర్తి” అనే బిరుదు పొందాడు.
రాజబాబుకు ఘంటసాల పాటలంటే ప్రాణం. మహాశివరాత్రి రోజు మరియు ఘంటసాల వర్థంతి అయిన ఫిబ్రవరి 11 వతేదీన మొత్తం ఘంటసాల పాటలు వింటూనే  ఉన్నారు. అదేరోజు రాత్రి గొంతులో ఇబ్బంది కలిగి హైదరాబాదులోని థెరెసా ఆసుపత్రిలో చేరాడు. ఆ ఆసుపత్రి లనే ఫిబ్రవరి 14 వతేదీ 1983 నాడు తెలుగు సినీ అభిమానుల్ని శోకసముద్రంలో ముంచి స్వర్గస్తుడయ్యాడు. అనుకరించడానికి అనితరసాధ్యమైన ప్రత్యేక శైలి రాజబాబుది. ఆయన మరణం తెలుగు చలన చిత్ర సీమకు కలిగినలోటు ఎప్పటికే తీరనిది.
 
***

No comments:

Post a Comment

Pages