మానసవీణ - 6 - అచ్చంగా తెలుగు
మానస వీణ-6 (గొలుసుకట్టు నవల )
కావలి. కోదండ రావు


(జరిగిన కథ: ఎవరూ లేని మానస చిన్నప్పటి నుంచి ఒక అనాథాశ్రమంలో పెరుగుతూ ఉంటుంది. సేవాభావానికి మారుపేరులా ఉండే మానస అంటే అందరికీ ఇష్టమే. ఒక బహుమతి ప్రదానోత్సవ సభలో మానసను చూసిన మంత్రి కృషీవలరావు, ఆ పాపలో తనకు తెలిసిన శ్రావణి అనే ఆవిడ పోలికలు ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు.)
ఇంతలో పదవ తరగతి రిసల్టు రానే వచ్చింది. అందరూ ఊహించినట్టుగానే మానస స్కూల్ ఫస్టుగా నిలిచింది. అనిరుద్ధ్ రెండవ స్థానంలో నిలిచాడు. మానస మార్కులు చూసిన ఎన్నో కార్పొరేట్ కాలేజీలు ఆమెని వారి కాలేజీల్లో జాయిన్ అవ్వాల్సిందిగా అభ్యర్దించారు. ఉచిత విద్యని అందిస్తామని,తన అడ్మిషన్ వారి కళాశాల గౌరవాన్ని పెంచుతుందని తెలియజేసారు. అయితే స్వతహాగా స్వతంత్ర్య నిర్ణయాలు తీసుకొనే మానస, ఎవ్వరికీ ఔనని గాని, కాదనిగాని చెప్పకుండా చిరునవ్వుతో నిర్ణయం తర్వాత తెలియజేస్తానని వారి అభ్యర్ధనని తిరస్కరించింది. ఇంతలో జి.టి.ఆర్. గారి ఇంటినుంచి మానసకి కబురొచ్చింది. కబురుతోపాటూ కారూ వచ్చింది. మానస ఉత్సాహంగా, ఆశ్రమం తోటలో తన పర్యవేక్షణలో పెంచుతున్న పూలు ఒక బుట్టనిండా తీసుకొని వారింటికి బయలుదేరింది. వారంటే మానసకి అపారమైన గౌరవం. తనని కన్నకూతురిలా ఆదరిస్తారని, సువర్చలగారిమీద మరింత ప్రేమ, అనురాగం. బహుశా చిన్నతనం నుంచి అమ్మ అన్న పదానికి దూరంగా ఉండడమే కారణమేమో. అంకుల్ ఎందుకు పిలిచి ఉంటారా అని ఆలోచిస్తూ ఉండగానే, కారు వారి ఇంటి గేటుముందు ఆగింది.
అనిరుద్ధ్ చిరునవ్వుతో ఎదురొచ్చాడు, 'హాయ్' అంటూ పలకరించాడు.
మానసకూడా చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది 'హాయ్' అంటూ... 'అంకుల్’ అంటూ ఇంకా ఏదో అనబోతూ ఉంటే,
ఇంతలో జి.టి.ఆర్. మేడమెట్లు దిగుతూ... 'ఎలా ఉన్నావమ్మా' అన్నారు పలకరింపుగా.
'వెరి ఫైన్ అంకుల్ అంది మానసా చిరునవ్వుతో.
'మొదటగా నీకు మై హార్టీ కంగ్రాట్శ్’ అన్నారు జి.టి.ఆర్.
'థాంక్స్ అంకుల్, అంతా మీలాంటి పెద్దవారి ఆశీర్వాదం' అన్నది మానస.
'రా, టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం' అన్నారాయన.
ఇంతలో సువర్చల టిఫిన్ సిద్ధం చేస్తూ... 'అబ్బో మానస వచ్చిందే, అంకుల్ పిలిస్తే గాని రావన్నమాట ' అన్నారు సరదాగా. 'అదేమీలేదు ఆంటీ పరీక్షలు కదా, అందుకే రాలేక పోయాను ' అంటూ... చేతిలోని పువ్వుల్ని ఆమెకు అందించింది.
“ఇంతకీ ఏం నిర్ణయించుకున్నరు, మీరిద్దరూ...” అన్నారు టిఫిన్ తినడం ప్రారంభిస్తూ. ఇంతలో ఆయనే, “అదే ఏ కాలేజీలో జాయిన్ అవుదామనుకుంటున్నారూ అని” అన్నారు.
“నేను మన ప్రభుత్వ కళాశాలలోనే జాయిన్ అవుదామని నిర్ణయించుకున్నాను అంకుల్” అన్నది మానస.
“అదేమిటమ్మ ఎన్నో జాగ్రత్తలు తీసుకునే ప్రైవేట్ కాలేజీల్లోనే యాసిడ్ దాడులని, మానభంగాలని పేపర్లో, టీవీల్లో చెబుతుంటే గవర్నమెంట్ కాలేజీ అంటున్నావ్? అసలే ఆడపిల్లవి కూడాను” అన్నారు సువర్చలగారు.
“ఎప్పుడూ ఏ వ్యవస్థ చెడ్డది కాదు ఆంటీ, అక్కడ ఉన్న మనుష్యులే బాధ్యులు మంచికైనా,చెడుకైనా... ప్రభుత్వ ధనంతో చదివే చదువు, మనకి తెలీకుండానే ఒక బాధ్యతని మనకి అప్పగిస్తుంది. ఆ చదువు మన దేశ పురోభివృద్ధికే వినియోగించాలని” అన్నది మానస.
వెంటనే ఆమె మనోభావాన్ని అర్ధం చేసుకున్న జి.టి.ఆర్. “వెల్ మై డియర్ యంగ్, బ్రేవ్ లేడీ... నీ నిర్ణయాన్ని నేను అభినందిస్తున్నాను. ఆల్ ది బెస్ట్” అన్నారు.
కాసేపు కబుర్లతో కాలక్షేపం చేసి అక్కడనుండి బయలుదేరింది మానస. ఆమెకోసం కొన్న డ్రెస్ మెటీరియల్, ఒక కొత్త వాచ్ ఆమె చేతికి పసుపు,కుంకుమలతో అందజేసారు సువర్చల.
సుదీర్ఘ వేసవి సెలవుల తర్వాత, కాలేజీ తెరిచారు. అది చరిత్ర గల్గిన కళాశాల, ఎందరో చరిత్ర మాన్యులు అదే కాలేజీలో చదువుకున్నారు. జూనియర్ కళాశాల మాత్రమే కాదు, డిగ్రీ, పీ.జీ కళాశాల కూడా. మానస తొలిరోజు అడుగు పెడుతుంటే ఏదో భక్తి భావం ఆమె మనస్సులో తొంగి చూసింది. చుట్టూ ప్రహారీ గోడ, గోడ చుట్టూ పెద్ద,పెద్ద చెట్లు... మూడంతస్థుల పెద్ద భవనం. దాని వెనకనే మరొక చిన్న భవనం. అంతా రాతి కట్టడం, చెక్క మెట్లు. ప్రిన్సిపాల్ గారి రూం ఎక్కడుందోనని వెదకడం ప్రారంభించింది. బహుశా ఆ వెనకనున్న భవనం జూనియర్ కలాశాల కావచ్చుననుకొని అటుగా అడుగులు వేయడం ప్రారంభించింది మానస. ఇంతలో అక్కడ ఒక అల్లరిమూక కొందరిచేత డాన్సులు వేయిస్తున్నారు. కొందరు మగవారు చొక్కాలు విప్పేసి, వారిముందు నిలబడ్డారు. మరికొందరు కర్రతో ఆ భవన విస్తీర్ణాన్ని కొలుస్తున్నారు, ఇంకొందరు కప్ప గెంతులు వేస్తూ అటూ,ఇటూ తిరుగుతున్నారు. ఇదే మన కాలేజీల్లో అనాదిగా వస్తున్న దౌర్భాగ్య సంస్కృతి ర్యాగింగ్ అని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు మానసకి. ఇలా ఆలోచిస్తు ఉండగానే,
వెనకనించి ఒక పిలుపు వినిపించింది ' ఎక్స్ క్యూస్ మి ' అంటూ... “నా పేరు మాధవి, ప్రిన్సిపాల్ రూం కి ఎలా వెళ్లాలో చెబుతారా” అని అడిగింది ఆమె.
“ మీరూ కొత్తగా జాయిన్ అయ్యారా? నేనూ అదే వెదుకుతున్నా, పదండి అలా వెనక బిల్డింగ్ వైపు వెళదాం” అన్నది మానస.
“బై ది వే నా పేరు మానస... సి.ఇ.సి ఫస్ట్ ఇయర్”.
“ ఓ మై గాడ్, నేను కూడా “ అంటూ మాధవి కూడా చెయ్యి కలిపింది.
“ఇక మన మద్య ఈ అండి బిసినెస్ వద్దు, పేర్లు పెట్టే పిలుచుకుందాం అని అన్నదో, లేదో…
“ అలాగే మనూ” అన్నది మాధవి. “నన్ను మా ఫెండ్స్ అంతా మధూ అంటారు,” అన్నది చిరునవ్వుతో...
మానస కూడా శృతి కలిపింది ఆ నవ్వుతో... ఇద్దరూ ప్రిన్సిపల్ రూం చేరుకున్నారు, అక్కడనుంచి అడ్మినిస్టేషన్ రూం కి చేరుకుని, జాయినిoగ్ ఫార్మాలిటీస్ ముగించారు. లంచ్ అవర్ కావడంతో ఇద్దరూ కాలేజీ బయటకి అడుగులు వేస్తూ, చెట్ల నీడకి చేరుకొనే ప్రయత్నం చేస్తున్నారు... వారి పరిచయాన్ని పెంచుకొనే ప్రయత్నంలోనూ పడ్డారు.
ఇంతలో ఒక అల్లరిమూక వారిముందు సాక్షాత్కరించింది. నాలుగైదు బైకులు, అందులో ఒకడు
“పాప నీ పేరు ఏమిటి” అడిగాడు మాధవిని.
“ మధు... మాధవి... అన్నది” తను.
“అక్కడ మా బాసు కూర్చొని ఉన్నాడు చూసావా. మూడు సంవత్సరాలనుంచి మా బాసే ఇక్కడ స్టూడెంటు యూనియన్ ప్రెసిడెంటు. అంటే ఈ ప్రాంతానికి చక్రవర్తి అన్నమాట. చక్రవర్తికి దాహం వేస్తే, మధువేగా తాగేది. అందుకే గట్టిగా ఒక కిస్ కొట్టించుకో. మా సామ్రాజ్యంలో ఒక దేవదాసిగా స్వర్గ సుఖాలందుకో” అన్నాడు వెకిలిగా నవ్వుతూ...
మాధవి నోటి తడి ఆరిపోయింది, భయంగా దిక్కులు చూడటం మొదలెట్టింది. అంతలోనే... వెనకనించి మరొకడు,
“ఫూల్ అలా పిలిస్తే వచ్చేస్తారేంట్రా... చెయ్యి పట్టుకొని అందంగా తీసుకు రావాలి” అని అంటూ ఆమె చెయ్యి అందుకునే ప్రయత్నం చేసాడు. ఇంతలో మానస కలగజేసుకొని
"చూడు మిస్టర్,ఇంటికెళ్లి ముందు, మీ నాన్నతో పెళ్లి చేసేయ్యమని చెప్పండి. మీకు చదువులకన్నా, దాని అవసరమే ఎక్కువలా ఉంది" అన్నది.
ఇంతలో ఆ చక్రవర్తి దూకుడుగా కిందకి దిగబోయాడు. పక్కనే ఉన్న మరో మనిషి
" ప్రిన్సీ వస్తున్నాడు, ఇప్పుడొద్దురా... తర్వాత చూసుకుందాం పద" అని అక్కడనుంచి తీసుకెళ్లిపోయాడు.
బ్రతుకు జీవుడా అనుకుంది మాధవి. సీరియస్ గా ఆలోచించడం మొదలెట్టింది మానస. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ఈ కాలేజీనుంచి, ఒక్క సైంటిస్ట్ తయారవ్వడం లేదెందుకు? ఒక విద్యావేత్త, వ్యాపారవేత్త తయరవ్వడం లేదెందుకు? ఇలా ఎన్నో ప్రశ్నలు మానసని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. అలా ఒక నెల గడిచింది. అంతా ఒక గుంపుగా కాలేజీకి రావడం, పోవడం జరుగుతోంది. ఆ చక్రవర్తి పేరు రాజేష్ అని, లొకల్ ఎం.ఎల్.ఏ. గారి కొడుకని తెలుసుకుంది. నగరంలో జరిగే అల్లర్లకి, ఇక్కడ పేద విధ్యార్దులని తీసుకువెళ్లి రాళ్లు రువ్వడం, బస్సులు తగలబెట్టడంలాంటి సంఘ విద్రోహచర్యలు చేయిస్తుంటాడని తెలుకుంది. అంతే కాకుండా కాలేజీలో మత్తు పదార్ధాల వ్యాపారానికి అతడే పెట్టుబడిదారు అని తెలుసుకుంది. నెల గడిచినా, సరిగ్గా క్లాస్ రూం లో పాఠం రెండు, మూడు రోజులే జరగడం మానసని మరింత బాధించింది. ఎప్పుడూ ఏవో స్ట్రైకులు, బందులు జరుగుతూనే ఉన్నాయి.
ఒక రోజు క్లాసురూములో పాఠం జరుగుతుండగా... ఆ అల్లరిమూకలో కొందరు జొరబడ్డారు.
“ఇవ్వాళ, దిల్కుష్ బార్ ఓనర్ చచ్చిపోయాడు. అందుకే స్టూడెంటు యూనియన్ బంద్ ప్రకటించింది. అంతా క్లాసురూం లోంచి బయటకి వచ్చేయండి" అని బిగ్గరగా అరవడం ప్రారంభించారు. అందరూ లేవడం ప్రారంభించారు. లెక్చరర్ కూడా స్టాఫ్ రూం వైపు అడుగులెయ్యదం ప్రారంభించాడు. ఇంతలో మానస చివాలున లేచింది.
"ఎవ్వరూ కదలొద్దు" అని అరిచింది మానస. లెక్చరర్ని చూస్తూ "సార్, మీరు కూడా...
ఇవ్వాళ ఇక్కడ పాఠం జరిగి తీరాలి. మేము ఫీజులు కట్టి కాలేజీకొచ్చేది ఇలా రోజుకో బంద్ చెయ్యడానికి కాదు. మీరు జీతం తీసుకునేది, ఇలా కాలక్షేపం చెయ్యడానికి కాదు." అని కాస్త గట్టిగా అన్నది మానస.
“వాళ్లతో గొడవెందుకమ్మా మనకి, పాఠందేముంది రేపు చెప్పుకుందాం” అన్నడు సివిక్స్ లెక్చరర్.
"లేదు సార్, ఈ బందులకు ఇవ్వాళే మనం బంద్ ప్రకటించాలి. ఈ క్లాసురూంలో కుదరకపోతే, ఆ చెట్లకింద చెప్పండి. మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం" అన్నది మానస సీరియస్గా...
అంతే మిగిలిన క్లాస్ మొత్తం ముక్త కంఠంతో అవును,అవును అని నినాదాలు ఇచ్చారు. తప్పేదిలేక లెక్చరర్ పాఠాన్ని, ఒక చెట్టుకింద ప్రారంభించాడు. అది చూసి మిగతా గ్రూపులైన, ఎం.పి.సి.,బై.పి.సి విధ్యార్దులు చెట్లకింద చేరారు. డిగ్రీ విధ్యార్దులుకూడా చెట్లకింద చేరారు. లెక్చరర్లకి మాత్రం సిమెంటు కుర్చీలు ఉండేలా చేరి, అంతా కింద కూర్చొని క్లాస్ కొనసాగించారు. ఆరోజు, మొత్తం అన్ని పీరియడ్లు సక్రమంగా నడిచాయి. ఇంత మార్పుని సాధించిన, మానసపై విధ్యార్దులందరికీ అంతులేని ప్రేమ, అనురాగం ఏర్పడ్డాయి. అంతకుమించి ఏదో నమ్మకం ఏర్పడ్డాయి. తను ఏం చేసినా, అందరి మంచికోసమే అనే భావం ఏర్పడింది.
మర్నాడు, రాజేష్ గ్యాంగులో ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి,
“గురూ! ఈ సాయంత్రం అందరినీ సమావేశం కావాల్సిందిగా ఆ మానస స్టూడెంటులందరికీ చెప్పిందంట. అదే జరిగిందో... ఇక మన పని గోవింద" అన్నాడు.
“పోరా ఫూల్, డబ్బులిస్తేనే పెద్ద,పెద్ద పార్టీల సమావేశాలే అంతంత మాత్రంగా జరుగుతున్నాయి. ఇదెంత? దీని మీటింగ్ ఎంత? నాన్సెన్స్, అందరూ టీ.వీ చూసే టైమురా అది, మనకేమో బారుకెల్లే టైము. అనవసరంగా వాగి మూడ్ పాడుజెయ్యకురా వెధవ" అని తేలిగ్గా కొట్టిపారేసాడు రాజేష్.
కానీ వాళ్ల అంచనాలు తారు, మారు చేస్తూ... సుమారు రెండు వేలకి పైగా కాలేజీ ఆడిటోరియం చేరారు. ప్యూన్ రాజన్న మైకు ఎరేంజ్ చేసాడు. అందరూ మెల్ల,మెల్లగా సర్ధుకుని కూర్చున్నారు. జాగ సరిపోనివారు, నిలబడ్డారు. అంతమంది వస్తారని ఊహించని మధు, నిర్ఘాంతపోయింది. ఒక ఇంటర్మీడియట్ ఫస్టియర్ అమ్మాయి, ఏదో చెబుతానంటే వినడానికి డిగ్రీ విధ్యార్దులు సైతం రావడం లెక్చరర్లకి కూడా ఆశ్చర్యం కలిగించింది. ముందుగానే నిర్ణయించుకున్న డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్, ఒక మైకుని స్టాఫ్ రూములో ఉండేలా రాజన్నకి ఆదేశాలిచ్చాడు. అందరూ ఆశక్తిగా మానస ఏం చెబుతుందో విందామని ఎదురుచూస్తున్నారు. సూదిజారినా, వినిపిస్తుందేమో అనే అంత నిశ్శబ్ధం. అంతలో మానస తన ప్రసంగాన్ని ప్రారంభించింది.
“డియర్ ఫెండ్స్, ఈ కళాశాల చరిత్ర మనకి తెలిసిందే. ఎందరో మహానుభావులు ఇవ్వాళ, మనం కూర్చున్న బెంచీలపై కూర్చొని చదువుకున్నారు. ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. మరి ఇప్పుడెందుకు మనమద్యలో అలాంటి గొప్పవారు లేరు? మనలో అంత శక్తి లేదా లేక లెక్చరర్లు అంత విధ్యావేత్తలు కారా? కాదు... కొందరి స్వార్ధానికి బలై పోతున్నారు. లెక్చరర్లంతా ఆనాటి తరంవారే, చదువుమీద, దేశమ్మీద ఆ భక్తి శ్రద్ధలు వారికెప్పుడూ ఉన్నాయి. మనమంతా ఒకేమాటమీద ఉంటే నిన్న జరిగిన క్లాసులే ఒక ఉదాహరణ. డబ్బున్నవారు, ట్యూషన్లు చదువుతారు. లేని వారి సంగతేమిటి? చెప్పడం వారి బాధ్యత, నేర్చుకోవడం మన హక్కు. దీన్నెవ్వరూ ఆపలేరు." అనగానే ఆడిటోరియం మొత్తం కరతాళ ధ్వనులతో నిండీపోయింది.
మళ్లీ తనే ప్రారంభిస్తూ "కాలేజీ, ఫర్నిచర్ పాడయ్యింది. మనమంతా తలా ఒక చెయ్యివేస్తే మొత్తం స్టూడెంట్లు కూర్చోవచ్చు, లైబ్రరీ పుస్తకాలు సరైన పద్ధతిలో అమర్చాలి. టాయిలెట్లు సరిచెయ్యాలి. పాడైన లైట్లు బాగు చెయ్యాలి. ఎలక్షన్లంటూ కాలేజీ గోడలు పాడుజేసారు, వాటిని తిరిగి బాగు చెయ్యాలి. సైన్స్ స్టూడెంట్లు, లాబొరేటరీని సరైన పద్దతిలో వినియోగించుకొనే స్థాయికి తేవాలి. ఇలా ఎన్నో పనులు మనం చెయ్యాలి. సరదాగా మొదలైన ర్యాగింగ్ అనే మహమ్మారి, ఇప్పుడు ఎంతోమంది జీవితాలని బలిగొంటోంది. బిడియం వదిలి, పరిచయం పెరుగుతుందని చెప్పబడే ఈ ర్యాగింగు... ఇవ్వాళ ఒక వెకిలి చేష్టగా మారిపోయింది. ర్యాగింగ్ అనే విషసంస్కృతిని తరిమి కొట్టిన మొదటి కళాశాలగా నిరూపిద్దాం. ముఖ్యంగా మత్తు పదార్ధాల అమ్మకాన్ని కాలేజీ క్యాంపస్లో జరగకుండా చెయ్యాలి.(అది వినగానే ప్రిన్సిపాల్ నిర్ఘాంతపోయాడు). కాలేజీ ఎలక్షన్లు అనేవి ప్రజాస్వామ్యం పట్ల ఒక అవగాహనకోసం ఏర్పరచబడ్డవే తప్ప, ప్రెసిడెంట్ అయినంతమాత్రాన కొమ్ములు మొలవవని మీరంతా తెలుసుకోవాలి. మనం ఒక్కటిగా ముందడుగేస్తే... మన కాలేజీనుంచే ఒక అమర్త్య సేన్, ఒక జగదీష్ చంద్ర బోస్ తయారవుతారని సవినయంగా తెలియజేస్తున్నాను. అల్లరిమూకల ఆట కట్టించే రోజు వచ్చింది. ఇంతమందిని దాటి వారు ఒక్క అడుగుకూడా వెయ్యలేరు. కలిసి నడుద్దాం. నవజీవన పోరాటానికి నాందీ గీతం పాడుదాం." అని అందరి కరతాళ ధ్వనుల మద్య తన ప్రసంగాన్ని ముగించింది. స్టూడెంటులంతా ముక్త కంఠంతో "ప్రభుత్వ కళాశాల విధ్యార్ధుల ఐక్యత వర్ధిల్లాలి. మానస నాయకత్వం జిందాబాద్" అని నినాదాలు చేసారు.
మరుసటి రోజునుంచే జన్మభూమి కార్యక్రమమం మొదలయ్యింది. రోజూ ఒక గంట కాలేజీ మరమ్మత్తు చేపట్టాలని అంతా నిర్ణయించారు. ఇంతలో ఎలక్షన్ల నోటిఫికేషన్ విడుదలయ్యింది. అప్పుడు....
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages