నెత్తుటి పువ్వు - 18 - అచ్చంగా తెలుగు
నెత్తుటి పువ్వు - 18
మహీధర శేషారత్నం(జరిగిన కధ : రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో బాగా తాగి, స్పృహ తప్పి పడిపోయిన సరోజ అనే అమ్మాయిని తన స్నేహితుడి గదికి తీసుకువస్తాడు రాజు. మాట వినకుండా మొరాయిస్తున్న ఆమెను, వెనక్కి దింపేస్తానని బెదిరిస్తాడు. రాజు ఆ అమ్మాయిని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తారు  అతడి శ్రేయోభిలాషులు. ఆమెను బట్టల కోటలో పనిలో పెడతాడు రాజు. రాజు చెల్లెలు వసంత అతని ఇంటికి వచ్చి వెళ్తుంది. జ్వరంతో ఉన్న సరోజకు సపర్యలు చేస్తాడు రాజు. బట్టల కొట్లో పనిచెయ్యనని చెప్పేస్తుంది సరోజ. ) 
ఆరోజు పొద్దున్నే శంకరం ఫోన్ చేసాడు నాగరాజుకి. శంకరం భార్య పేరు పార్వతి. ఆ అమ్మాయికి ఎందుకో గర్భం నిలవడంలేదు. ఇది రెండోసారి మూడవనెల అని సంబరపడ్డంత సేపులేదు. హెవీ బ్లీడింగ్ శంకరం పార్వతిని హాస్పటల్లో చేర్చి రాజుకి ఫోన్ చేసాడు. లక్ష్మి ఇంట్లో లేదు. అన్నగారింటికి వెళ్ళింది. నాగరాజు సరోజ దగ్గరకి వెళ్ళి అడిగాడు, కాస్త శంకరం భార్యకి ఆడతోడు కావాలి, ఉంటావా అని, సరోజ కేసప్పుడు శంకరాన్ని చూసింది కాని ఆగోల, భయంలో సరిగా చూడలేదు. నిజం మాట్లాడితే రాజు పక్కన లేకపోతే గుర్తుపట్టలేదు కూడా.
“నీకు మంచి ఫ్రెండా!”
“చాలా! చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నాం. కలిసి పని చేస్తున్నాం, లక్ష్మి అంటే నా భార్య ఉంటే తనను పంపేవాడిని. ఆవిడకు పెద్దగా పుట్టింటి అండా దండా లేదు. ఎక్కడో దూరాన ఉన్నారు. ఫోన్ చేసినా రావడానికి టైము పడుతుంది. ఉంటావా హాస్పటల్లో” ఆరాటంగా అడిగాడు.
“నువ్వు ఉండమంటే ఎందుకుండను? మళ్ళీ ఏం చెప్పాల్సి వస్తుందో అని” సాలోచనగా అంది.
“ఏం ఫరవాలేదు, నేనేదో చెప్తాను, సంచీలో ఒక జత బట్టలు పేస్ట్, బ్రష అవీ పెట్టుకో, రెండు రోజులుండేట్టు, సరేనా?” ఆత్రంగా అడిగేడు.
సరోజ “సరే! అయితే నేనొక పనిచేస్తా, కోపం తెచ్చుకోకుంటే .....” అంది.
“సరే! సరే! నీ ఇష్టం నువ్వేం చేసినా నాకిష్టమే. కోపం తెచ్చుకోను.
“నిజంగా!”
“అబ్బ! వెధవ యక్షప్రశ్నలూ నువ్వూ!” విసుక్కున్నాడు.
“యక్షప్రశ్నలా? అంటే“
ఇవే...... కోపంగా చూసాడు.
సరే! ఏ ప్రశ్నలైతే నాకెందుకు గాని, కళ్ళు మూసుకో!
.... తాపీగా అంది.
“ఊఁ! దెయ్యం, రాక్షసి....” గొణుక్కున్నాడు.
రెండు చేతుల్తో అతని తలపట్టుకుని దగ్గరకు తీసుకుని నుదిటిమీద గాఢంగా ముద్దు పెట్టుకుంది. “ఏయ్! ఏమిటిది? నీకు మతిపోయింది.” విసురుగా లేచాడు.
“కోపం తెచ్చుకుంటే నేనురాను.” హఠంచేసింది.
“సరే! సరే! రెడీ అవు. ఆటోతెస్తాను.” వెళ్ళిపోయాడు. సరోజ అన్నయ్యా! అన్నయ్యా! అంటూ శంకరాన్ని అదీ ఇదీ అడుగుతూ అసహ్యించుకోకుండా పార్వతికి చేసిన సర్వీసు చూసి శంకరం ఆశ్చర్యపోయాడు. ఎంతమంచి అమ్మాయి అనుకోకుండా ఉండలేక పోయాడు. కానీ... ఇది... ఎలా? దేనికి దారి తీస్తుందో అనుకున్నాడు. ఆ రాత్రి, శంకరం, నాగరాజు ఆరు బయట వెన్నల్లో కూర్చున్నారు హాస్పటల్ ఆవరణలో. సరోజ పార్వతి మంచం దగ్గరే పడుక్కుంది.
మూడు రోజుల తరువాత పార్వతి గుండెనిండా దుఃఖం నింపుకొని ఇంటికి తిరిగి వెళ్ళింది. శంకరం ఏమీ అనుకోకపోతే సరోజనే ఉంచమన్నాడు, వాళ్ళ వాళ్ళు రావడం, అక్కర్లేని సలహాలూ! అవీ నే భరించలేనురా! కాస్త నాలుగురోజులు ఉంచరా! అన్నాడు. నాగరాజు ముఖమాటపడ్డాడు ఎలా తీసుకుంటుందోనని. కాని సరోజ అడగక్కర్లేకుండానే తన సంచీతోపాటు ఆటో ఎక్కేసింది.
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages